Thursday, November 21, 2024

‘మన ఊరు – మన బడి’లో ఎన్నారైలు భాగస్వాములు కావాలి – కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి

ఎన్నారై లతో వర్చువల్ సమావేశం నిర్వహించిన మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటిఆర్ పిలుపునిచ్చారు.  వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేటిఆర్  ఎన్నారైలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని  మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పైన అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే ఒక  రోల్ మోడల్ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గదర్శనం, నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో తనదైన మార్కును చాటుతూ అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ మేరకు భారీ ప్రాజెక్టులతో మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ విప్లవాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని, వాటికి సంబంధించిన ఫలాలు అందుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, వాటి ద్వారా విద్యార్థులు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కొత్త బడులతో పాటు ఉన్న బడులు బాగుచేస్తాం

నూతన విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సైతం బలోపేతం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం చేపట్టిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 7289 కోట్ల రూపాయలతో, దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని ఈ విషయంలో కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అందరూ ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే కోటి రూపాయలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే వారు సూచించిన పేరును ఆ పాఠశాలకు పెడతామని లేదా పది లక్షల రూపాయలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే ఆయా క్లాస్ రూమ్ కి వారు సూచించిన పేరు పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దీంతోపాటు తమకు తోచినంత మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముందుకు వచ్చే వారందరికీ కూడా ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిన తద్వారా డొనేషన్లు తీసుకోనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యావ్యవస్థలో మార్పులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు కలిసిరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాలు లేదా తాము ఎంచుకున్న ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు లేదా వాటి అభివృద్ధికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చే ఎన్నారైల అందరికీ విద్య శాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన వందలాది మంది ఎన్నారైల తోపాటు టిఆర్ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధి అనిల్ కూర్మాచలం మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా , దేవసేన తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles