Thursday, November 21, 2024

రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’

తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 3వ భాగం

ఆద‌ర్శ భావాల‌ను లేదా అభ్యుద‌య (ప్ర‌గ‌తి) భావాల‌ను ప్ర‌భోదించ‌డం వేరు, వాటిని జ‌న సామాన్యంలోకి తీసుకువెళ్ల‌డం వేరు. ఒక సిద్ధాంతాన్నిగానీ, విధానాన్ని గానీ, నినాదాన్ని గానీ ప్ర‌జ‌ల‌లో బ‌లంగా నిల‌ప‌డానికి, మంచి మాధ్య‌మం, అప్ప‌టికీ ఇప్ప‌టికీ చిత్ర రంగ‌మే! దృశ్య మాధ్య‌మానికున్న బ‌లీయ‌మైన శ‌క్తి అది! ఆ శ‌క్తిని స‌మ‌ర్ధంగా ఉప‌యోగించుకుంటూ, అందుకు త‌గిన ఇతివృత్తాలను ఎన్నుకోవ‌డం విజ్ఞులైన ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు చేసే ప‌ని.

చిత్రదర్శకుడు తాపీ చాణక్య

త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న మూఢన‌మ్మ‌కాల‌నూ, సంఘంలో పాతుకుపోయిన పెట్టుబ‌డిదారీ శ‌క్తుల‌నూ, శ్ర‌మ దోపిడీనీ  ఎండ‌గ‌డుతూ నైతిక  విలువ‌ల‌ను పాత‌ర వేస్తున్న వికృత విధానాల‌ను పార‌దోలాల‌ని, అప్పుడే స‌మాజంలో, స‌మ‌న్యాయం – స‌మ‌ధ‌ర్మం ఏర్ప‌డ‌టానికి అవ‌కాశం వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని క‌ల‌గ‌జేసి చైత‌న్య‌వంత‌మైన చిత్రాలు రావ‌డం, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌చ్చిన ఆహ్వానించ‌ద‌గిన మార్పు అని చెప్పాలి.

Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు

మ‌రో సంచ‌ల‌న అభ్యుద‌య చిత్రం

ఆ ప‌రిణామ క్ర‌మంలో వ‌చ్చిన మ‌రో ప్ర‌గ‌తిశీల భావాల చిత్రం, మ‌రోసారి రైతు స‌మ‌స్య‌ల‌ను స్పృశిస్తూ వ‌చ్చి అఖండ విజ‌యం సాధించిన చిత్రం రోజులు మారాయి! 1955వ సంవ‌త్స‌రంలో విడుద‌లైన “రోజులు మారాయి“ చిత్రం సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. అంత‌కు ముందు వ‌చ్చిన “రైతుబిడ్డ‌“  చిత్రం అప్ప‌టికి సంచ‌ల‌న‌మైతే దాదాపు ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం త‌రువాత వ‌చ్చిన “రోజులు మారాయి“ చిత్రం అప్ప‌టికి మారిన సాంఘిక ప‌రిస్థితుల‌లో, పెను సంచ‌ల‌నం సృష్టించింది అని చెప్పాలి.

ఇక్క‌డ ఒక ప్ర‌శ్న వేసుకోవాలి. ఎందుక‌ని ఈ ‘రైతు స‌మ‌స్య‌ల‌’ మీద చిత్రాలు నిర్మించాల‌నే ఆలోచ‌న‌లు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వ‌స్తున్నాయి?

Also read: తెలుగు చ‌ల‌న‌చిత్రాల‌లో ప్ర‌గ‌తి కిర‌ణాలు!

అద్భుతమైన పాట రాసిన కొసరాజు రాఘవయ్య చౌదరి

భార‌త‌దేశం ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ‌క దేశం. దేశంలో ఏ రాష్ట్ర‌మైనా, వ్య‌వ‌సాయ ఆధారిత ప‌ల్లెలున్న ప్ర‌దేశాలే ఎక్కువ‌! ఎక్క‌డైనా రైతు స‌మ‌స్య‌లు అవే. క‌ర్ష‌క శ్ర‌మ దోపిడీ అనేది భాషాభేదం లేకుండా జ‌రుగుతున్న‌దే. భూస్వాముల అజ‌మాయిషీ, ఆగ‌డాలు, నిత్యం అన్నిచోట్ల విశృంఖ‌లంగా సంభ‌విస్తున్న‌వే. అందుకే అభ్యుద‌య భావంతో స‌మాజంలో ముఖ్యంగా రైతు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జాక్షేత్ర దృష్టికి తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌తో, ఆశయంతో కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ ర‌క‌మైన చిత్రాలు తీయ‌డానికి ముందుకు రావ‌డం జ‌రిగింది.

అందుకే “రోజులు మారాయి“ త‌రువాత రైతు స‌మ‌స్య‌ల మీద “ఎత్తుకు పైఎత్తు“ “కాడెద్దులు ఎక‌రం నేల‌“, “న‌మ్మిన‌బంటు“, “క‌మ‌ల‌మ్మ క‌మ‌తం“ రైతుబిడ్డ (ఎన్‌టిఆర్‌)’’ “పాడిపంట‌లు“ మొద‌లైన చిత్రాలు వ‌చ్చాయి. (రైతు భార‌తం – రైతు కుటుంబం – రైతు పోరాటం)

మ‌ళ్ళీ నాటి సంచ‌ల‌న చిత్రం ‘రోజులు మారాయి‘ విష‌యానికొస్తే చిత్ర ఇతివృత్తం సంపూర్ణంగా రైతు జీవితం గురించి విశ్లేషించేదే. అంతేకాదు  త‌రువాతి రోజుల్లో బాగా వ్యాప్తిలోకి వ‌చ్చిన “స‌మ‌ష్టి వ్య‌వ‌సాయం“ గురించి ఈ చిత్రంలో చిత్రీక‌రించ‌డం విశేషం.

ఈ గీతం అజరామరం

ఈ చిత్రం గురించిన మ‌రో ముఖ్య‌మైన ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తి చిత్రంలోని గీతాల‌న్నీ రైతు జీవ‌నాన్ని అర్ధ‌వంతంగా తెలుపుతూ సాగే విధంగా ఉంటాయి. ముఖ్యంగా రైతులు వారి నిత్య జీవితంలో ఉప‌యోగించే వ్య‌వ‌సాయ‌క ప‌ద‌సంప‌ద ఆ గీతాల్లో ఉండ‌టం వ‌ల‌న పాట‌ల‌లో రైతు ముఖ‌చిత్రం ప్ర‌తి ప‌దంలో ప్ర‌తిబింబిస్తుంది! క‌ర్ష‌కుల జీవ‌న విధానం తొణికిస‌లాడుతుంది!

ఉదాహ‌ర‌ణ‌కు ఎంతో ప్ర‌సిద్ధి చెందిన ఈ గీతం ప‌రిశీలిద్దాం.

‘‘క‌ల్లా క‌ప‌టం కాన‌ని వాడా – లోకం పోక‌డ తెలియ‌నివాడా

ఏరువాకా సాగారోర‌న్నో చిన్న‌న్నా!

నీ క‌ష్ట‌మంతా తీరునురోర‌న్నో చిన్న‌న్నా!

న‌వ‌ధాన్యాల‌ను గంప‌కెత్తుకుని,

చ‌ద్దియ‌న్న‌మును మూట‌గ‌ట్టుకుని

ముల్లుగ‌ర్ర‌ను చేత‌బ‌ట్టుకుని

ఇల్లాలును వెంట‌బెట్టుకుని                ‘ఏరువాకా

ప‌డ‌మ‌ట దిక్కున వ‌ర‌ద‌గుడేసే,

ఉరుముల మెరుపుల వాన‌లు గురిసే

వాగులు వంక‌లు ఉర‌వ‌డిజేసే

ఎండిన బీళ్ళూ యిగుళ్ళు వేసే          ‘ఏరువాకా’

కోటేరును స‌రిజూచి ప‌న్నుకో,

ఎల‌ప‌ట దాప‌ట ఎడ్ల‌దోలుకో

చాలుద‌ప్ప‌క కొండ్ర వేసుకో

విత్త‌న‌ము విసిరిసిరి చ‌ల్లుకో                       ‘ఏరువాకా

బ్యాంకులో డ‌బ్బు దాచేవారు

నీ శ‌క్తిని గ‌మ‌నించ‌రు వారూ             ‘ఏరువాకా

ప‌ల్లెటూళ్ళ‌లో చెల్ల‌నివాళ్ళు

పాలిటిక్సుతో బ్ర‌తికేవాళ్ళు

ప్ర‌జాసేవ‌య‌ని అరిచేవాళ్ళు,

ఒళ్ళువంచి చాకిరికి మ‌ళ్ళ‌రు            ‘ఏరువాకా

ప‌ద‌వులు స్థిర‌మ‌ని భ్ర‌మిసేవాళ్ళు

ఓట్లు గుంజి నిను మ‌రిచేవాళ్ళే

నీవే దిక్క‌ని వ‌త్తురు ప‌ద‌వోయ్‌

రోజులు మారాయ్‌! రోజులు మారాయ్‌!          ‘ఏరువాకా’

రోజులుమారాయి చిత్వరంలో హీదా రెహమాన్ నృత్యం

ఈ గీతం రైతు ప్ర‌భోదాత్మ‌క గీత‌మే కాదు, స‌మాజంలోని అవ‌ల‌క్ష‌ణాల‌ను బొమ్మ క‌ట్టిన‌ట్టు చూపిన గేయ‌మ‌నీ చెప్ప‌వ‌చ్చు. ప‌ది పేజీల సంభాష‌ణ‌ల‌క‌న్నా ఒక్కోసారి అర్ధ‌వంత‌మైన పాట ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అందుకే ఆనాటి ఈ గీతం నేటికీ అజ‌రామ‌రంగా నిలిచింది. అందుకు అనేక కార‌ణాలున్నాయి. రైతు జీవితంతో పాటు రైతును మేలుకొలిపే సందేశం కూడా ఈ గీతంలో ఉండ‌టం, విశేషం అయితే – స‌మాజానికి  అన్నం పెట్టే రైతు పాత్ర ఎంత ముఖ్య‌మైన‌దో కూడా ఈ గీతం తెలియ‌జేస్తుంది.

వహీదా అరంగేట్రం, అగ్రస్థాయి నటిగా పురోగతి

నాటి వహీదా రెహమాన్ నేడు ఇట్లా ఉన్నారు

‘రోజులు మారాయి’ చిత్రంతో తొలిసారి సినీరంగ ప్ర‌వేశంచేసి, పైన పేర్కొన్న పాట‌లో న‌ర్తించిన న‌టి వ‌హీదా రెహ‌మాన్ ఆ త‌రువాతి కాలంలో బాలీవుడ్‌లో అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌గా రాణించ‌డం విశేషంగా చెప్పుకోవాలి. చిత్రం పేరును సార్ధ‌కం చేసిన‌ట్టుగా న‌ట‌నా రంగంలో వ‌హీదా ర‌హ‌మాన్  రోజులు మారాయి ప్ర‌సిద్ధ న‌టి అయింది. అటువంటి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గీత‌క‌ర్త జాన‌ప‌ద క‌వి సార్వ‌భౌమ శ్రీ కొస‌రాజు రాఘ‌వ‌య్య చౌద‌రి, మ‌రి స్వ‌ర‌క‌ర్త మాస్ట‌ర్ వేణు. ఇంత‌టి గొప్ప చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ తాపీ చాణ‌క్య‌.

‘రోజులు మారాయి’ చిత్రంలో రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌రిపూర్ణంగా చ‌ర్చించ‌డం జ‌రిగింది. కుటుంబ స‌మ‌స్య‌లున్న సాంఘిక చిత్రాలు క్ర‌మంగా ఎక్కువ సంఖ్య‌లో వ‌స్తున్న స‌మ‌యంలో రైతు జీవితాన్ని, వారి క‌డ‌గండ్ల‌ను అన్నివ‌ర్గాల వారు ఆద‌రించే విధంగా నిర్మించిన చిత్రం “రోజులు మారాయి“ ఆనాటికి వ్యాపార కోణంలో ఏటికి ఎదురీదిన చిత్రం. అభ్యుద‌య భావాల‌కు స‌జీవ రూప‌క‌ల్ప‌న. ప్ర‌గ‌తిశీల దృక్ప‌థంతో నిర్మించిన ప్ర‌యోజ‌నాత్మ‌క చిత్రం.

ఆ ధోర‌ణిలో “ప్ర‌గ‌తి“ అన్న‌ది ఒక్క రైతు జీవితాలో్ల‌నే కాదు స‌మాజంలోని అన్ని వ‌ర్గాల వారికి చెందేదిగా ఉండాలి. వారి జీవితాల్లోనూ క్రాంతి క‌నిపించాలి. అదే అస‌లైన ప్ర‌గ‌తి అవుతుంది.

Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు

Yadavalli
Yadavalli
Yadavalli is a versatile writer in Telugu. He has been writing lyrics, script, screenplay for South Indian films and also directed a few of them.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles