- ప్రొఫెసర్ తో చర్చలు జరిపిన ప్రిజన్స్ డీఐజీ
- అన్ని డిమాండ్లకూ అంగీకారం
- కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సాయిబాబా
- డీఐజీ ఆదేశాల అమలులో జైలు అధికారుల జాప్యం
నాగపూర్: నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి గురువారం మూడు గంటలకు ప్రొఫెసర్ సాయిబాబా తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. అడిషనల్ డీఐజీ (ప్రిజన్స) తనను జైలులో 20 అక్టోబర్ 2020న కలుసుకున్నారనీ, తనతో చర్చలు జరిపిన అనంతరం తన డిమాండ్లను ఆమోదించారనీ తెలిపారు. సాయిబాబా డిమాండ్లను ఆమోదించిన డీఐజీ జైలు అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఇవి:
- డాక్టర్ సాయిబాబాకు ఆయన భార్య, కుటుంబ సభ్యులూ, ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాదీ రాసిన లేఖలను జైలు అధికారులు ఆయనకు అందించకుండా తమ వద్దే దాచి ఉంచారు. వాటన్నిటినీ ప్రొ. సాయిబాబాకు ఇవ్వవలసిందిగా డీఐజీ ఆదేశించారు.
- భార్య, అడ్వకేట్ ఇచ్చిన మందులను వెంటనే సాయిబాబాకు అందించాలి.
- కడచిన రెండు మాసాలుగా తనకు కనీస అవసరాలు లేకుండా చేసి తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ పుణెలోని ఏడీజీ (ప్రిజన్స్)కి రాసిన లేఖలను జైలు అధికారులు పుణె కు పంపకుండా తమ దగ్గరే ఉంచుకున్నారు. వాటిని వెంటనే పుణె పంపించవలసిందిగా అధికారులను డీఐజీ ఆదేశించారు.
- కుటుంబ సభ్యులు పోస్ట్ ద్వారా పంపించిన పేపర్ క్లిప్పింగ్ లను జైలు అధికారులు సాయిబాబాకు ఇవ్వకుండా తమ దగ్గరే పెట్టుకున్నారు. వాటిని తక్షణం ఇచ్చివేయాలనీ, ఇకమీదట పేపర్ క్లిప్పింగ్ లను అడ్డుకోరాదనీ డీఐజీ చెప్పారు.
- కుటుంబ సభ్యులు పంపిన పుస్తకాలను కూడా ప్రొ. సాయిబాబాకు అందజేయాలని ఆదేశించారు.
తన డిమాండ్లకు డీఐజీ అంగీకరించారు కనుక ముందుగా అనుకున్నట్టు 21 అక్టోబర్ ఉదయం నిరాహారదీక్ష ఆరంభించలేదని కమిటీ ఫర్ డిఫెన్స్ అండ్ రిలీజ్ ఆఫ్ డాక్టర్ జిఎన్ సాయిబాబా కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ఒక పత్రికా ప్రకటనలో గురువారం తెలియజేశారు. కానీ ఈ రోజున ఫోన్ లో సాయిబాబా చెప్పినదాని ప్రకారం ఆయన డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేరలేదనీ, డీఐజీ ఆదేశించినప్పటికీ జైలు అధికారులు అమలు చేయలేదనీ ప్రకటన తెలియజేసింది. సాయిబాబా ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ విషయంలో జైలు అధికారులు సత్వరం స్పందిస్తారనే ఆశాభావాన్ని ప్రొ. హరగోపాల్ వెలిబుచ్చారు.
సాయిబాబా సోదరుడు రాందేవుడు దాఖలు చేసిన రెండో పెరోల్ దరఖాస్తున్న తిరస్కరించినట్టు జైలు అధికారులు బుధవారంనాడు తెలియజేశారు. దరఖాస్తును ఎందుకు తిరస్కరించారో, దానికి కారణం ఏమిటో చెప్పలేదు. దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వు కాపీ సైతం సాయిబాబాకు అందజేయలేదు. తిరస్కరణ ఉత్తర్వులో కొన్ని భాగాలను చదివి వినిపించారు కానీ సరైన సమాధానం సాయిబాబాకు ఇవ్వలేదు. ఆయన కుటుంబానికి కూడా ఈ తిరస్కరణ ఉత్తర్వు నకలు రాలేదు. సాయిబాబా డిమాండ్లకు అంగీకరించేందుకు జైలు అధికారులపైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చినందుకు హక్కుల సంస్థలకూ, మేధావులకూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకూ సంస్థ కన్వీనర్, సంస్థ ప్రతినిధులూ, సాయిబాబా కుటుంబ సభ్యులూ ధన్యవాదాలు చెప్పారు.