Sunday, November 24, 2024

దక్కన్ పీఠభూమి నుంచి దేశ ప్రజలకు రెండు పరస్పర విరుద్ధమైన సందేశాలు, సంకేతాలు

ఆర్యావర్త నుంచి స్వల్పమైన సందేశాన్ని సైతం గమనించకుండా ఉండలేము. అదే విధంగా దక్కన్ నుంచి బిగ్గరగా వినిపించిన సందేశాన్ని గమనించకపోవచ్చు. మన రాజకీయ భౌగోళికం, వార్తావరణం అటువంటిది. కడచిన వారం దక్కన్ నుంచి రెండు విభిన్నమైన సందేశాలు వచ్చాయి. ఒకటి ప్రధాని నుంచీ, ఆయన సందర్భానికి తగిన వేషధారణతో పాల్గొన్న కార్యక్రమం నుంచీ వచ్చినది. మరొకటి ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి అందిన సందేశం. ప్రధాని తన సందేశాన్ని హైదరాబాద్ శివార్లలో ఉన్న ఆశ్రమం నుంచి పంపించారు. ముఖ్యమంత్రి సందేశం రాష్ట్ర రాజధాని నుంచి వచ్చింది. మనం కాస్త ఆగి ఈ సందేశాలను గమనించాలని నా భావన. వాటి గుట్టు విప్పాలి. వాటిని అన్వయించాలి. నేను ఈ సందేశాలను జాగ్రత్తగా విన్నాను. ఇండియా అనే ఐడియాపై (ఆలోచనపై) వాటి ప్రభావం ఏమిటో అర్థం చేసుకున్నాను. వాటికి సంబంధించిన నా ఆలోచనలను మీతో ఈ రోజు పంచుకోవాలని అనుకుంటున్నాను.

Chinna Jeeyar to bring Modi, KCR together on Feb. 5!

కిందటివారం ప్రధాని దక్కన్ ను సందర్శించారు.  పదకొండవ శతాబ్దికి చెందిన వైష్ణవాచార్యుల, విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీరామానుజాచార్య భారీ విగ్రహాన్ని లోకార్పణం చేశారు ప్రధాని. ఆ విగ్రహాన్ని సమతామూర్తి విగ్రహం అని అన్నారు. ప్రధాని, ఆ బ్రహ్మాండమైన విగ్రహాన్ని అంత ఎత్తున ప్రతిష్ఠించేందుకు బహుముఖీనమైన కార్యకలాపాలను పర్యవేక్షించిన స్వామి తమతమ సందేశాలు ఇచ్చారు. వారి సందేశాలు ఒక దాన్ని మరొకటి బలపరిచే విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే, నేలకు చెవులు ఆనించి వింటే ఈ కార్యక్రమంలో సందేశంతో కూడిన సంకేతం కనిపిస్తుంది.

Also read: స్వాతంత్ర్య సమరయోధులను కాజేయడం నయాభారత్ కు అనివార్యం

దానికి కొద్ది రోజుల కిందటే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సందేశం పంపించారు. సరికొత్త రాజ్యాంగాన్ని రచించుకోవలసిన అవసరం ఉన్నదనే పిలుపునిచ్చారు. చాలా మందికి ఆయన ఏదో ఆవేశానికి లోనై మాట జారారని అనిపించింది. కానీ తనది ఆవేశం కాదనీ, ఆలోచించి చేసిన పనేనని నిరూపించేందుకు ముఖ్యమంత్రి  చాలాకాలంగా అమలు జరుగుతూ వస్తున్న సంప్రదాయానికి ఎగనామం పెట్టారు. సమతామూర్తి విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేయడానికి వచ్చిన ప్రధానికి స్వాగతం చెప్పడం కోసం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వెళ్ళలేదు. ప్రధానికి స్వాగతం చెప్పడానికీ, ప్రధాని అవసరాలు చూడటానికీ రాష్ట్రమంత్రిని ఒకరిని నియమించారు. అట్టహాసంగా జరిగిన బ్రహ్మాండమైన విగ్రహావిష్కరణ సభకు కూడా ముఖ్యమంత్రి హాజరు కాలేదు. సభానిర్వాహకులతో ముఖ్యమంత్రి చాలా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సభకు దూరంగానే ఉన్నారు.

Also read: భారత భవితవ్యాన్ని నిగ్గు తేల్చే యూపీ ఎన్నికలు

ఇప్పుడు వివరాలలోకి వెడదాం:

मोदी ने रामानुजाचार्य की 216 फुट ऊँची 'समता की प्रतिमा' का लोकार्पण किया

రామానుజాచార్య 216 అడుగుల విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. దాన్ని 54 అడుగుల ఎత్తున్న వేదికపైన కూర్చోబెట్టారు. మొత్తం భవన సముదాయం అంతా 34 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది చాలా ధనం, సుమారు వెయ్యి కోట్ల రూపాయలు, వెచ్చించి నిర్మించిన కళ్ళు చెదిరే ప్రాజెక్టు. ఇది దేవుడికోసం నిర్మించిన దేవాలయం కాదు. వేయి సంవత్సరాల కిందట జన్మించిన ఒక  ఆచార్యుడి కోసం సహస్దాబ్ది సందర్భంగా నిర్మించిన స్మారక చిహ్నం. సాంఘిక అసమానతలను రామానుజాచార్య వ్యతిరేకించారు కనుక ఆయనను సమతామూర్తి అని పిలుస్తూ ఆయన విగ్రహానికి సమతామూర్తి విగ్రహం అని పేరు పెట్టారు. ఆయన తిరుగుబాటు స్వభావం కలిగిన ఆచార్యుడు. ద్విజులు కాని వారికి కూడా పవిత్రమైన మంత్రాల రహస్యాలను చెప్పాడు. కానీ ఆ విగ్రహం ఎత్తు, ఆవరణంలో కనిపించే సంపద్వంతమైన శిల్పకళావైభవం, విశాలమైన ఆవరణం తిలకించినవారికి భక్తిభావం కంటే బాపురే అనిపించేంత ఆశ్చర్యం కలుగుతుంది. అది ఆధ్యాత్మికం కంటే భౌతికమైనది. బలాన్నీ, మనోహరమైన ప్రభావాన్నీ, గర్వాన్నీ అది ప్రదర్శిస్తుంది. అది శక్తిమంతమైనది – అయోధ్యలో రామాలయం రూపకల్పనలాగానే. తన మిషన్ కు (లక్ష్యానికి) ఇటువంటి బలప్రదర్శన ఉపయోగిస్తుందని రామానుజాచార్య అనుకుంటారా అని జనం విస్తుపోతున్నారు.  ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే సందేశంలో ఏ మాత్రం సందేహం లేదు. హిందూదర్పాన్ని చాటుకోవడమే పరమావధి.

Also read: రైతులు, ఆర్థికప్రవీణులూ, ప్రజాస్వామ్యం

ప్రథాని ప్రసంగం సాగిన తీరు

 అక్కడ ప్రధాని చేసిన ప్రసంగం ఉద్దేశం ఒక విశ్వాసాన్ని నొక్కిచెప్పడం, అదే సమయంలో ఒక ఆలోచనను తిరస్కరించడం. సమాజాన్ని సంస్కరించేందుకు మనం మన ప్రాచీన రుషులూ, సాధువులను గౌరవించుకుంటే చాలంటూ ఉద్ఘాటించడం. సామాజిక సమానత్వంకోసం పని చేసేందుకు ఆధునిక సామాజికార్థిక, రాజకీయ సిద్ధాంతాలను ఉపయోగించుకోవాలనీ, మన గతంలో కాకుండా మరెక్కడో అన్వేషించాలనే అభిప్రాయాన్ని తిరస్కరించడం. భవిష్యత్తులోకి ప్రయాణం చేసేందుకు ముందడుగు వేయాలంటే గతంలోకి తొంగిచూస్తే సరిపోతుందని ప్రధాని వాదించారు. సమాజాన్ని సంస్కరించాలంటే మన మూలాలను తెలుసుకోవాలంటూ ఉద్బోధించారు. సంప్రదాయం, ప్రాచీనత, పురోగతి, ప్రగతిశీలం అనే వాటిలో పరస్పర వైరుధ్యం ఏమీ లేదని ఉద్ఘాటించారు. నవభారత నిర్మాణానికి ప్రేరణను యూరోప్ పునరుజ్జీవనం నుంచీ, ఫ్రెంచి, అమెరికన్ విప్లవాల నుంచీ పొందాలని కోరుకునేవారిపైన పరోక్షంగా దాడి చేశారు ప్రధాని. అటువంటి పనులు చేయనక్కరలేదని దక్కన్ నుంచి ప్రధాని సందేశం.

Also read: నవభారతం: మతి పోకుండా ఉండటం ఎట్లా?

నరేంద్రుడే రాముడు 

ప్రారంభోపన్యాసంలోనే ఈ కార్యక్రమాన్ని (ప్రాజెక్టును) నిర్వహిస్తున్న స్వామి విశేషమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. మనం హిందువులమని గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించింది నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతేనని చెప్పారు. భారతమాత శిరస్సును కశ్మీర్ తో పోల్చుతూ ఇప్పుడు భరతమాత సగర్వంగా తలెత్తుకొని చిరునవ్వులు చిందించగలుగుతోందని చెప్పారు. శ్రీరాముడికి ఏయే లక్షణాలు ఉన్నాయని వాల్మీకి మహర్షి చెప్పాడో ఆ లక్షణాలన్నీ మోదీ పుణికి పుచ్చుకున్నారని అన్నారు. శ్రీరాముడిని వ్రతసంపన్నుడుగా వాల్మీకి అభివర్ణించాడు. రాముడిలాగానే మోదీ కూడా వ్రతసంపన్నుడని స్వామి కితాబు ఇచ్చారు. అంతటితో ఆగలేదు స్వామి. ప్రపంచంలో భారత దేశం తలెత్తుకొని నిలబడటానికి ఏమేమి చేయాలో అవన్నీమోదీ చేసేశారని  సెలవిచ్చారు. ముఖ్యఅతిథి గురించి రెండు మంచి మాటలు చెప్పడం అభ్యాగతి ధర్మం అనుకునే దేశం మనది. కానీ మోతాదును మించిపోయాయి స్వామి వ్యాఖ్యలు. స్వామి తన సందేశం ఏదో ఇవ్వడానికి తంటాలు పడ్డారు.

సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ జరగడానికి కొద్ది రోజుల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగించిన తీరు ఒక రాష్ట్రం కేంద్రంపైన తిరుగుబాటు చేసినట్టు అనిపించింది. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ఆయన అన్నారు. ప్రస్తుత రాజ్యాంగం గత ఏడు దశాబ్దాలలో దేశానికి ఉపకారం చేయలేదని చెబుతూ, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నదని ఆరోపించారు. ‘కొత్త ఆలోచనావిధానం, కొత్త దిశానిర్దేశం, కొత్త రాజ్యాంగం’ అనేది తన నినాదం కాబోతున్నదని అన్నారు. ఆయన మాటలు ఆలకిస్తే ఆయన ఎంత ధీమాగా విషయం చెప్పారో గ్రహించగలుగుతారు. ఇప్పుడు నేను ఆయనను ఉటంకిస్తాను:

‘భారతీయులు మేల్కొనాలి. యువజనులు కళ్ళు తెరవాలి. ఇటువంటి (బీజేపీ లేదా ప్రధాని చెప్పే) దొంగమాటలు, మతం గురించిన ప్రచారం అల్లర్లకు దారి తీస్తాయి. ఇటువంటి మాటలు మిమ్మల్ని ఒకట్రెండు రోజులు సంతోషపెట్టవచ్చునేమో కానీ మీ సమస్యలను పరిష్కరించజాలవు. దేశంలో అభివృద్ధి తీసుకొని రాజాలవు….దేశంలో పెనుమార్పునకూ, విప్లవానికీ సమయం ఆసన్నమైంది.’’

Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం

రాజ్యాంగాన్ని తిరగరాసుకోవలసిన సమయం ఇండియాకు వచ్చింది

తమ రాజ్యాంగాలను తిరగరాసుకున్నదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ఇండియా కూడా ఆ పని చేయవలసిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయం. ఆయన ఏదో ఆచరణయోగ్యమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. సహకార సమాఖ్య విధానాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైదని చెబుతూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను అపహరిస్తోందని ఆరోపించారు. ఐఏఎస్ అధికారుల, ఇతర జాతీయ సర్వీసుల అధికారుల నియామకం, బదిలీలూ, డిప్యుటేషన్లూ తదితర అంశాలన్నీ కేంద్రమే చేయాలంటూ ఇటీవల మొదలైన ఆలోచన, ఒక దేశం-ఒక రిజిస్ట్రేషన్ అనే కొత్త విధానం రాష్ట్రాలపైన కుట్రేనని అన్నారు. ప్రజాస్వామ్యం పరిపక్వత చెందిన కొద్దీ కేంద్రం రాష్ట్రాలకూ, రాష్ట్రాలు స్థానిక సంస్థలకూ అధికారాలను బదిలీ చేయాలని ఆయన అన్నారు. కానీ కేంద్రం, రాష్ట్రాల విషయంలో దీనికి వ్యతిరేకంగా వ్యవహారం జరుగుతోంది. దేశానికి ఒక కొత్త అజెండాను తయారు చేసి దేశ ప్రజల ముందు ఉంచేందుకు ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సమావేశాన్ని త్వరాలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రధానికీ, బీజేపీకీ ప్రత్యర్థిగా తాను నిలబడి తన పార్టీని నిలబెట్టారు. బీజేపీని బంగాళాఖాతంలోకి విసిరి వేయకపోతే (ఇవి ఆయన మాటలే సుమా!) దేశం పురోగమించజాలదని అన్నారు. ఆచరణ యోగ్యమైన కార్యక్రమాన్ని రూపొందించేందుకు తాను త్వరలోనే మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులతో సహా పలువురు నాయకులను కలవబోతున్నట్టు విలేఖరుల గోష్ఠిలో వెల్లడించారు. తన ధిక్కార వైఖరిని స్పష్టంగా ప్రకటించడం కోసం ఆయన సంప్రదాయాన్నీ, ప్రోటోకాల్ నూ తోసిరాజన్నారు. ప్రధాని హైదరాబాద్ లో విమానం దిగినప్పుడు స్వాగతం చెప్పడానికి విమానాశ్రయానికి వెళ్ళలేదు. అసలు ఆయనను కలుసుకోనేలేదు. ప్రధాని హైదరాబాద్ లో పాల్గొన్న రెండు ప్రధాన కార్యక్రమాలకూ ఆయన హాజరు కాలేదు. ఆశ్రమంలో బృహత్కార్యక్రమాన్ని నిర్వహించిన వైష్ణవాచార్యుడితోనూ, విగ్రహం ప్రాజెక్టుకు స్థలం దానమిచ్చి, అన్ని విధాలా సహకరించిన ప్రముఖ వ్యాపారితోనూ చాలా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ సభకు దూరంగానే ఉన్నారు.

Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?

ఇప్పుడు ఈ రెండు వైఖరులనూ ఒక చోట ఉంచి దక్కన్ లో జరిగిన ఈ రెండు ఘటనల పర్యవసానం ఎట్లా  ఉండవచ్చునో చూద్దాం.

సవాలు చేసేవారి శక్తి ఏపాటిది?

సతీసమేతంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ పైనే చర్చ? |  Telangana CM KCR Visits Chinna Jeeyar Swamy Ashram at Shamshabad
ప్రధాని పర్యటనకంటే ఒక రోజు ముందు శ్రీరామనగరం ఆశ్రమానికి వెళ్ళిన కేసీఆర్

సమతా విగ్రహం, దాని ప్రాజెక్టు భారీతనం, దాని శిల్పకళావైభవం, విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ జరిగిన ప్రసంగాలూ ఆధిపత్య నిర్ధారణకు ఉద్దేశించిన సందేశం ఇచ్చాయి. హిందూ ఉనికినీ, సంఖ్యాధిక్య సిద్ధాంతాన్నీ నొక్కి చెప్పడం లక్ష్యం. ఈ సిద్ధాంతానికి మూర్తిమత్వం, దీన్ని నొక్కి చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అనే సంకేతం అన్యాపదేశంగా ఉండనే ఉన్నది. తన శరీరంపైన తిరునామం, సిల్కు దుస్తులూ, నెమలి ఈకలతో తయారు చేసిన దండ, తులసీమాల మొదలైన మతప్రతీకలన్నీ ధరించి తమ మతధర్మాన్ని, ఆదిక్యాన్నని చాటిచెప్పుకోవడం, ఆ విధంగా చెప్పుకోవడాన్ని ఆమోదించడం ప్రధాని నిర్వహించిన పనులు. ఈ విధంగా చెప్పుకోవడాన్ని తిరస్కరిస్తూ సంఖ్యాధిపత్యాన్ని(మెజారిటేరియానిజం) సవాలు చేసే

Why a government order is haunting KCR - India Today Insight News
బీజేపీని బంగాళాఖాతంలో వేయాలంటున్న కేసీఆర్, పక్కన హరీష్ రావు

సిద్దాంతాలతో కూడిన అజెండా దేశంలో రాజకీయంగా ఆధిక్యం సంపాదిస్తుందనే సందేశం కూడా దక్కన్ నుంచే వచ్చింది. మొదటిది, సంఖ్యాధిక్యం, ఉనికి తాలూకు ప్రతిపత్తి ఇప్పటికే వేళ్ళూనుకున్నది. ఇప్పుడిది వ్యూహాత్మకంగా బలీయంగా, ఉచ్ఛదశలో ఉంది. దీన్ని సవాలు చేసి వెనక్కు పరుగు పెట్టిస్తామంటున్న శక్తులు ఇప్పుడు కృత్యాద్యదశలోనే ఉన్నాయి. బలంగా అడుగులు ముందుకు వేసి ప్రత్యర్థులను ఢీకొనే పరిస్థితి లేదు. సవాలు చేసిన వ్యక్తిది తాత్కాలికమైన ఆవేశ ప్రదర్శనా లేక ప్రతిపత్తి చాటుకునేందుకూ,  సంఖ్యాధిక్య భావాన్ని చాటుకునేందుకు చేసే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవడానికి అవసరమైన ప్రణాళికా, వ్యూహం సిద్ధంగా ఉన్నాయా అన్నది తెలియదు. ఈ సవాలు చేసే వారు దేశంలో అధిక శక్తులను కూడగట్టుకోగలరా అన్న ప్రశ్నకు సమాధానం కూడా స్పష్టంగా తెలియదు. అయిదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలపైన సవాలు చేసేవారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో తిరిగి విజయం సాధించడంలో బీజేపీ విఫలమైతే సవాలుకూ, సవాలు విసిరేవారికీ గాండ్రించే శక్తి వస్తుంది. మరికొన్ని రాష్ట్రాలూ, రాజకీయనాయకులూ , రాజకీయ పార్టీలూ వచ్చి సవాలు చేస్తున్నవారితో భుజం కలిపే అవకాశం ఉంటుంది. యూపీలో తిరిగి బీజేపీనే ప్రజలు గెలిపిస్తే సంఖ్యాధిక్యరథం వ్యవస్థీకృతం కాని సవాలు చేసేవారిని తొక్కుకుంటూ వేగంగా ముందుకు సాగిపోతుంది.

Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు

(MwM-45వ ఎపిసోడ్ కి స్వేచ్ఛానువాదం)

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

1 COMMENT

  1. ఒక పేద దేశంలో మతపరమైన చిహ్నాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టటం అసంబద్ధంగా అనిపించింది. ఇది పటేల్ విగ్రహంతో మొదలైంది. మీరన్నట్లు, ఇక్కడ పటేల్ కానీ, రామానుజులవారు కానీ ఇలాటి ఆర్భాటాలకి వ్యతిరేకం అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ వారి గొంతు బలహీనమైపోయింది గత 7 సంవత్సరాల పైగా. మాట స్థానంలో భయం ప్రవేశించింది. అధిక శాతం ప్రజలు కొత్తగా నేర్పబడిన భక్తి మత్తులో జోగుతుంటే, మరికొంత మంది మనకెందుకొచ్చింది అనే ధోరణిలో వున్నారు. విగ్రహాలనే కాదు, ఏ అన్యాయాన్నైనా ప్రశ్నించే గొంతును భారత ప్రజలు వేగంగా కోల్పోతున్నారు. ఇదిలా ఉంటె, అద్వైతాచార్యులు, సన్యాసాశ్రమానికి ప్రతీకగా భావించే ఆది శంకరుల 100 అడుగుల విగ్రహాన్ని, ఒక కాంప్లెక్స్ ను, 1000 కోట్ల ఖర్చుతో ఓంకారేశ్వర్ లో నర్మదా నది ఒడ్డున కట్టిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సెలవిచ్చారు. ఈ విగ్రహాల గోలకు అంతులేకుండా పోతున్నది. రేపు జీసస్ క్రెస్టు విగ్రహము, మహమ్మద్ ప్రవక్త విగ్రహము, ఆయా మతాలవారు పెడతామంటే 80-20 విశ్వాసం బలంగా నాటుకుపోయిన ప్రజలు వింటారా? చిన్న హిజాబ్ వంటి విషయంలోనే ఎన్నడూ లేనివిధంగా ఇంత మంటలు చెలరేగుతున్నాయి కదా.
    ఇక డెక్కన్ ప్రభువు మాటలు ఎప్పుడూ చందమామ కథల్లాగే వుంటాయి. ఆయన మాటల్లో ఆవేశం తప్ప ఆచరణ ఉండదు, సామాన్యంగా. కొత్త
    రాజ్యాంగం కావాలనటం–బట్టతల అవుతోందని తల తీసేయాలనుకోవటం లాటిది. ముందు ఆయన రాజ్యాంగాన్ని సక్రమంగా పాటిస్తే, అప్పుడు ఆలోచించచ్చు. ఆయన అసలు సెక్రటేరియట్ కి వచ్చి పని చేస్తే కదా. ఇవాళ చెప్పిన మాట రేపు తూచ్ అయిపోతుంది.
    ఏతావత్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పటానికి నేను సందేహించను. కాకపోతే కొన్ని డిగ్రీలు వెనుకా, ముందూ-అంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles