Thursday, November 21, 2024

హిజాబ్ వివాదం అనర్థదాయకం

  • అన్ని మతాలనూ గౌరవించాలని రాజ్యాంగం చెబుతోంది
  • యూనిఫాం తప్పక ధరించాలని కేంద్రమంత్రి అంటున్నారు
  • నువ్వా-నేనా అనుకుంటూ విద్యార్థులు రాళ్ళు రువ్వుకుంటున్నారు
  • హిజాబ్ పై తీర్పు ఇవ్వవలసిన హైకోర్టులో కాలయాపన జరుగుతోంది
  • ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు విజ్ఞప్తులు చేస్తున్నాయి

కర్ణాటకను హిజాబ్ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణ అంశం ఇంతటి తీవ్రరూపం దాల్చడం, విద్యార్థిలోకంలో అలజడిని సృష్టించడం అత్యంత విషాదకరం. పోటాపోటీగా విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోవడం, దాడులకు దిగడం, రాళ్లు రువ్వుకోవడం, గాయాల పాలవ్వడం చాలా బాధాకరం. ఈ ఘటనలో కొందరు బయటవ్యక్తులు విద్యార్థుల ముసుగులో జొరబడి, ఆందోళనలు సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మరీ విపరీత పరిణామం.

రాజకీయ రణరంగం

ఈ ఘటనలో మతం రంగులు ముదిరిపోయి రాజకీయ రంగస్థలమై రణరంగంగా మారడం పట్ల మేధావులు, సాధారణ ప్రజలు కూడా వేదన చెందుతున్నారు. మొన్న జనవరిలో ఉడుపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు హిజాబ్ ధరించి హాజరయ్యారు. దీంతో వారిని కాలేజీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీనికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు కట్టుకొని కాలేజీకి వచ్చారు. కాలేజీ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు కేటాయించిన ప్రత్యేక స్థంభంపై కాషాయ జెండా ఎగురవేసి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు కూడా చేశారు. దానికి ప్రతిగా ఒక విద్యార్థిని ‘ అల్లాహు అక్బర్ ‘ అంటూ పెద్దఎత్తున నినదించారు. అలా ఇరువర్గాల మధ్య వివాదం పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హిజాబ్ ధరించిన విద్యార్ధునులను కాలేజీలోకి అనుమతించకపోవడం ఈ వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. తదనంతర ఘటనలు మతం చుట్టూ రాజకీయ మలుపులు తీసుకున్నాయి. కర్ణాటకలోని

Quranic verses, Hadiths, pigs: Arguments made in Karnataka HC over hijab row
కర్ణాటక హైకోర్టు

ఉడుపి, బాగల్ కోటే, దావణగెరె, మండ్య, బెళగావి, శివమొగ్గ, చిక్కమగుళూరు, రాయచూరు, కలబురగి, కోలారు మొదలైన ప్రాంతాల్లోని విద్యార్థులంతా రెండు వర్గాలుగా ఏర్పడి ఆందోళనల బాట పట్టారు.ఇది ప్రస్తుతం మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది. తీర్పు వెలువడాల్సి ఉంది.హిజాబ్ ధరిస్తే విద్యాశాలలకు అనుమతించకపోవడంపై ఐదుగురు విద్యార్థునులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు తమ నమ్మకాలను పాటిస్తూనే విద్యాశాలలకు వెళ్లేలా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని పిటీషనర్ల తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. ప్రభుత్వం దీనికి ఒప్పుకోవడం లేదు. విద్యార్థులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం నిబంధనలను విధించింది. విద్యాసంస్థల దగ్గర ఆందోళనలపై నిషేధం విధించింది. సంయమనం పాటించండంటూ కర్ణాటక హైకోర్టు సూచించింది. అత్యంత సున్నితమైన అంశం కాబట్టి ఎటువంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందో అనే భయం అన్ని దిక్కుల్లో వ్యాపించింది. హిజాబ్ అంశంపై గతంలో కేరళ, తమిళనాడులో ఇచ్చిన తీర్పులను కర్ణాటక న్యాయస్థానం పరిశీలిస్తోంది. కర్ణాటకలో మొదలైన ఈ రగడ లోక్ సభలోనూ ప్రతిధ్వనిస్తోంది. విపక్షాలన్నీ వాకౌట్ కూడా చేశాయి.

ఇంతవరకూ లేని గొడవ ఇప్పుడెందుకు?

Karnataka Chief Minister Basavaraj Bommai: Follow State's Order On Uniform  Till...: Karnataka Chief Minister Amid Hijab Row
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై

విద్యార్ధులంతా కాలేజీ యాజమాన్యం సూచించిన యూనిఫార్మ్స్ నే వాడాలని పార్లమెంట్  వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న కర్ణాటక విద్యార్ధునులు విజయం సాధించాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంది, వివిధ సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా ఇవి ఆచరణలో ఉన్నాయి. ఈ ఆధునిక యుగంలోనూ  సంప్రదాయాలు నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలకు సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా వ్యవహరించడం మన సంస్కారం కూడా. వస్త్రధారణ అనేది  రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కును దుర్వినియోగం చేసుకోకుండా సభ్యతగా మెలగండని పెద్దలు చెబుతూనే ఉన్నారు. యూనిఫార్మ్ ను విధించడం తప్పేమీ కాదు. క్రమశిక్షణలో భాగంగా దానిని తీసుకువచ్చారు. అదే సమయంలో, మతపరమైన వర్గ సంప్రదాయాలను ( రిలిజియస్ డినామినేషన్స్ ) అడ్డుకొనే హక్కు ఎవ్వరికీ లేదని రాజ్యాంగం చెబుతోంది. భారతదేశం భిన్న మతాల, శాఖల,సామాజిక వర్గాల, సంస్కృతీ సంప్రదాయాల, ఆచార వ్యవహారాల సంగమం. పరమత సహనం, శాంతి సందేశం, ఐక్యత మన జీవనాడులు. రాజకీయ స్వార్ధాలకు ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాం. భావిభారత నిర్మాతలైన విద్యార్థుల విషయంలో మనం వేసే ప్రతి అడుగూ ఎంతో విలువైనది. మాతృమూర్తులైన మహిళల అంశంలో  ఉన్నతంగా ప్రవర్తించడం మన సంస్కృతి. రాజ్యాంగ హక్కులను కాపాడడం అందరి విధి. కర్ణాటకలో హిజాబ్ వివాదం త్వరలో ముగిసిపోవాలని ఆకాంక్షిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles