Sunday, December 22, 2024

తన అందమె తన శత్రువు

  • స్వరానికి  కాకుండా స్వరూపానికి ప్రాధాన్యం ఇచ్చిన సమాజం
  • మానవ మృగాల వికృత చేష్టలు
  • అంజనీ బాయి మాల్పేకర్ నరకయాతన

అంజనీ బాయి మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిధ్ధ హిందూస్థానీ గాయని. ఆమె పాడుతుంటే ప్రేక్షకులు ఆమె గానానికీ, ఆమె సౌందర్యానికీ కూడా పరవశులయ్యే వారు. పెద్ద పెద్ద సంస్థానాధీశులూ, రాజులూ, యువరాజులూ ఆమె సాన్నిహిత్యం కోసం తహతహలాడిపోయే వాళ్లు. అంతే కాదు రాజా రవివర్మ ,యం. వి ధురంధర్ లాంటి చిత్రకారులు ఆమెను మోడల్ గా పెట్టుకుని చిత్రాలు రూపొందించారు. ఆమె గానంలో వున్న విశిష్టత యేమంటే విలంబిత లయలో అలలు అలలుగా శ్రుతి శుధ్ధంగా వినే వాళ్ల మనసులను ఉయ్యాలలూపడం. అసలు “భేండీ బజార్ ఘరానా”కు చెందిన ప్రత్యేక లక్షణమే అది అంటారు. ఇంతకీ అంజనీ బాయ్ “భేండీబజార్ ఘరానా”కు చెందిన ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు మరి. ఈ ఘరానాకు ఆ  పేరు సెంట్రల్ బొంబాయిలోని భేండీబజార్ వలన వచ్చింది. ఈ ఘరానా స్థాపకులలో ఒకరూ ,అంజనీ బాయ్ గురువూ అయిన ఉస్తాద్  నజీర్ ఖాన్ ఇక్కడే నివసించే వారు.

అంజలి వృత్తాంతం

అంజనీ బాయ్ మాల్పేకర్  ఎవరు? ఆమె నేపథ్యం యెలాంటిది? సంగీతంలో ఇంత పట్టు యెలా సాధించింది? ఆమె జీవన ప్రయాణం యెంత విచిత్రంగా సాగిందీ  పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంజనీ బాయ్ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్ అనే గ్రామంలో కళావంతుల కుటుంబంలో జన్మించింది. తల్లి నబూబాయ్ కీ, అమ్మమ్మకీకూడా సంగీతంలో మంచి ప్రవేశం వుంది. ఆమె తాత వాసుదేవ్ మాల్పేకర్ కూడా సంగీతంలో నిష్ణాతుడే. ఈ కళావంతుల కుటుంబాలన్నీ నృత్యంలోనూ, సంగీతంలోనూ మంచి ప్రతిభ చూపుతూ, గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబాలు నిర్మించిన దేవాలయాలలో దేవదాసీలుగా జీవనం గడుపుతూ వుండేవారు. పందొమ్మిదో శతాబ్దం చివరలో చాలా గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబాలు బొంబాయి చేరడంతో, వారిమీద ఆధారపడ్డ వారందరూ కూడా బొంబాయి చేరుకున్నారు. అలా చేరుకున్న వారిలో అంజనీబాయి కుటుంబం కూడా వుంది.

ఎనిమిదేళ్ళ నుంచీ శిక్షణ

సుమారు యెనిమిదేళ్ల వయసులో(1891) అంజనీ బాయి ఉస్తాద్ నజీర్ ఖాన్ వద్ద  గండా బంధనం చేసి శిష్యురాలిగా చేరింది. అప్పటి నుండీ రోజుకు దాదాపు పది పన్నెండు గంటలు నిష్టగా సాధన చేసేది. దాదాపు మూడున్నర సంవత్సరాలు రాగ్ యమన్ నేర్చుకుంటే, ఒకటిన్నర సంవత్సరాలు రాగ్ భైరవి నేర్చుకుంది తర్వాత వరసగా మిగతా రాగాలూ,ఇతర విషయాలూ నేర్చుకుంది. అలా యెనిమిది సంవత్సరాల కఠిన సాధన తర్వాత తన పదహారవ యేట 1899లో మొట్టమొదట కచేరీ  చేసింది. ఆమె గాన ప్రతిభా, ఆమె రూపలావణ్యమూ సంగీతాభిమానులనే కాదు, సంస్థానాధీశులనూ, వ్యాపారప్రపంచాన్నీ కూడా ఆకర్షించింది. మొదటి కచేరీలో వచ్చిన సంపాదన అయిదువేల రూపాయలూ గురువు నజీర్ ఖాన్ కి సమర్పించి నమస్కరించింది.

దేశవ్యాప్తంగా కచేరీలు

ఆమె అనేక ప్రాంతాలలో కచేరీలు చేయసాగింది, ఆమె కీర్తి దేశమంతటా వ్యాపించింది. పెద్ద పెద్ద వ్యాపారస్తులూ, సంస్థానాధీశులూ, కళాపోషకులూ  ఆమె సాన్నిహిత్యం కోసం పరితపించ సాగారు. 1899లోనే ఆమె ప్రముఖ వ్యాపారస్తుడూ, తన అభిమానీ అయిన సేట్ వాసన్ జీ భగవాన్ దాస్ వేద్ అనే ఆయనని పెళ్లాడింది. 1901-1904 సంవత్సరాలలో చిత్రకారులు యం.వి. దురంధర్, రాజా రవివర్మలు ఆమెను మోడల్ గా పెట్టుకుని చిత్రాలను రూపొందించారు. ధురంధర్ ఒక తైలవర్ణ చిత్రాన్ని చిత్రిస్తే, రవివర్మ “లేడీ ఇన్ ద మూన్ లైట్, లేడీ ప్లేయింగ్ స్వరబత్, మోహినీ ఆన్ ఎ స్వింగ్, ది హార్ట్ బ్రోకెన్” అనే చిత్రాలను చిత్రించారు. 1904ప్రాంతంలో అసూయా పరులెవరో ఆమెమీద విషప్రయోగం చేశారు, తమలపాకులో విషంపెట్టి చుట్టి ఇచ్చారు. ఆమెకు అనుమానం వచ్చి ఉమ్మేసింది. .ప్రాణాపాయం తప్పింది గానీ గొంతు పోయింది. సంవత్సరంపాటు పాడలేకపోయింది,ఎన్నో గుళ్లూ గోపురాలూ తిరిగింది, ఎంతో మందికి మొక్కింది. చివరికి ఆధ్యాత్మిక గురువు నారాయణ మహరాజ్ కెడగావ్ ఇచ్చిన ప్రసాదం తిన్నాక ఆమె తిరిగి పాడగలిగింది. అప్పటినుండీ ఆయన్ను తన ఆధ్యాత్మిక గురువుగా యెంచుకుంది.

వాగ్గేయకారులతో భేటీ

ఆమె కేవలం కచేరీలకే పరిమితం కాకుండా పండితులైన కళాకారులతోనూ, వాగ్గేయకారులతోనూ జరిగే చర్చలలో పాల్గొని తాను నేర్చుకున్న విద్యలో లోతునీ గాఢతనీ సాధించింది. అందుకే పండిట్ విష్ణునారాయణ్ భాత్కండే యేదైనా అరుదైన రాగాలలో రచనలు చేసేటప్పుడు ఈమెను సంప్రదించే వారట. అయితే ఆమె అందమే ఆమెకు శాపమైంది. కచేరీ చేసిన చోటల్లా  కొంతమంది మగవారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించడం  మానసికంగా ఆమెను క్రుంగదీసింది. సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలనీ ,హుందాగా ప్రవర్తించాలనీ ఆమె కోరుకునేది. ఒకసారి ఒక గవర్నర్ కొడుకు తాగి మీదబడితే తెలివిగా తప్పించుకుంది. ఒక యువరాజా పదివేలు పారితోషికం ఇస్తూ చెయ్యిపట్టుకున్నాడు. కిటికీలోంచి దూకి పారిపోయింది. ఇంకోసారి ఒకపెద్ద వ్యాపారవేత్త, కచేరీ ముగియగానే, లేచి వెళ్లే దోవకడ్డంగా నిలబడ్డాడు, ఆమె లొంగకపోయే సరికి పిస్తోలు చూపి బెదిరించబోయాడు, ఈ లోగా ఆమె పరిజనం సమయస్ఫూర్తిగా “పాము పాము” అని అరవడంతో, జనం పోగయ్యారు. అతని డబ్బు అతని మొఖాన కొట్టి తప్పించుకుంది.

కచేరీలకు స్వస్తి

బొంబాయిలోని మాతుంగా లో జరిగిన ఒక పెద్ద పార్టీలో రాజులూ,యువరాజులూ అందరూ చూస్తుండగానే, కచేరీ ముగింపుకు వచ్చే సమయంలో అతిథుల్లో ఒకరు ఆమె చేయి పట్టుకున్నారు. ఆమె గట్టిగా “ఇది నీ రాజ్యం కాదు బొంబాయి గుర్తు పెట్టుకో ,నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఫలితం అనుభవిస్తావు” అని లేచి చక్కా వచ్చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక చాలా బాధపడి,యేడ్చి ,తన భర్త పాదాలంటి ప్రమాణం చేసింది “ఇకపై ప్రజల సమక్షంలో కచేరీలు చేయను” అని. 1920ప్రాంతాలలో తన గురువు నజీర్ ఖాన్ మరణం కూడా ఆమెను కుంగదీసింది, కచేరీలు చేయాలనే ఉత్సాహం నశించింది. 1923లో బొంబాయి టౌన్ హాలులో  పాడినదే ఆమె చివరి కచేరీ. అలా తన నలభయ్యవ యేట ఆమె తన సంగీత కచేరీలకు స్వస్తి చెప్పింది. భర్త చాటు భార్యగా, దేవాలయాలలో పాడుకుంటూ ప్రశాంత జీవనం గడపాలనుకుంది, కానీ విధి వేరుగా తలచింది.

సంగీత బోధకురాలుగా…

1928లో ఆమె భర్త వాసన్ జీ కాలంచేశాడు. ఆయనకి వ్యాపారంలో చాలా నష్టాలు రావడంతో వున్న ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీర్చవలసి వచ్చింది. అప్పుడు మళ్లీ సంగీతాన్ని ఆశ్రయించింది. అయితే, ఈ సారి సంగీత ప్రదర్శకురాలిగా కాదు సంగీత బోధకురాలిగా ప్రయాణం ప్రారంభించింది. ఎలాంటి శిష్యులని తయారు చేసిందనీ! ఒక్కొక్కరూ ఒక్కో వజ్రం. కూమార్ గంధర్వ, కిషోరి అమన్ కర్ ,”గజల్ క్వీన్ “అని పిలవబడే బేగం అఖ్తర్ , నైనా దేవి ,లతా మంగేష్కర్ వీరందరూ ఆమె శిష్యులే. కుమార్ గంధర్వ తన సంగీత ప్రతిభ అంతా ఆమె భిక్షే నంటాడు. కిషోరి అమన్ కర్  తన కంఠంలో పలికే మీండ్ లకి కారణం ఆమేనంటుంది. బేగం అఖ్తర్ తన గజల్ గాయనంలో పదాలను యెలా పలకాలో నేర్పిందామే అని తలుచుకుంటుంది.

సంగీత, నాటక అకాడెమీ ఫెలోషిప్

1958లో హిందూస్థానీ సంగీతానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీ ఫెలోషిప్ ని ఇచ్చి సత్కరించింది. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి స్త్రీ అంజనీ బాయ్ మాల్పేకర్ . అలా హిందూస్థానీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఆమె ఆగస్టు 7 ,1974లో తన తొంభై ఒకటో యేట తనువు చాలించింది. ఆమె యవ్వనంలో వుండగా పాడిన పాటలేవీ అందుబాటులో లేవు ,ఆమె శిష్యులు పాడినవి విని ఆమె గాన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం ఒక్కటే మార్గం. దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని యెదుర్కొని, నిలబడి తన లక్ష్యాన్ని సాధించిన  ధీర మహిళ అంజనీబాయ్ మాల్పేకర్ గురించి,ఈ నాటి తరం తెలుసుకోవాలిసిన అవసరం వుందని నా అభిప్రాయం. ఆమె కు నా నివాళి

-భార్గవి

Dr Rompicherla Bhargavi
Dr Rompicherla Bhargavi
డాక్టర్ మాధవి తాను పుట్టిపెరిగిన పామర్రులో నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. సంగీతం, సాహిత్యం అంటే అభిరుచి. ప్రముఖ సంగీత విమర్శకుడు విఎకె రంగారావుని సుదీర్ఘంగా ఇంటర్యూ చేశారు. టాగూర్ గీతాంజలి తెలుగులోకి అనువదించి ప్రచురించారు. వ్యాస సంకలనం ప్రచురించారు. గుజరాత్, అమెరికా యాత్రా చరిత్రలు రాశారు. ‘చలం లేఖలు తారకానికి’ తాజా ప్రచురణ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles