Thursday, November 21, 2024

సామాజిక సమతా సూత్రానికి తెలంగాణ వేదిక కావడం గొప్పవిషయం: కేసీఆర్

  • ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనగర్ సందర్శన
  • ఆంధ్రప్రదేశ్ నుంచి రోజా, చెవిరెడ్డి
  • ఆశ్రమం అంతటా కలియదిరిగిన కేసీఆర్
  • ప్రధాని రాక సందర్భంగా బందోబస్తుపై ఆరా
కార్యస్థలిని సందర్శించిన కేసీఆర్, చిన్నజీయర్ స్వామి,, తదితరులు

మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచానికి సమతా దార్శనికుడైన శ్రీ రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాదులో స్థాపించడం అద్భుతమని అన్నారు.  చినజీయర్ స్వామి, వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకు సంబంధించి మహా అద్భుతమైన కృషి చేశారని సీఎం కొనియాడారు. ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమరోహ కార్యక్రమాల సందర్భంగా సీఎం కార్యస్థలిని ఈ రోజు సతీ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి తన కుటీరంలోకి సీఎం దంపతులను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాల ఏర్పాట్ల గురించి జీయర్ స్వామిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

భక్తి ఉద్యమంలో విప్లవం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శ్రీ రామానుజాచార్యుల వారు భక్తి ఉద్యమంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, మానవులు అందరూ సమానమని, సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేసారని సీఎం అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఇది ప్రశాంత నిలయంగా మారుతుందనీ సీఎం అన్నారు.

సమతా మూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగిన గొప్ప నిర్మాణానమని అన్నారు. సమానత్వం కోసం శ్రీ రామానుజాచార్యులు తెలిపిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని సీఎం అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహామూర్తి బోధనలు మళ్లీ మరింత ప్రాచుర్యంలోకి రావడం అవి మరో వెయ్యేండ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

దివ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం

రామేశ్వరరావు, చిన్నజీయర్ స్వామి, కేసీఆర్, తదితరులు

హిందూ ధర్మాన్ని అనుసరించే ఆధ్యాత్మిక భక్తులకు, ధార్మికులకు ముచ్చింతల్ లో సకల వసతులను సమకూర్చడం సంతోషకరమని, ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో మరింత సుందర మనోహర భక్తిపారవశ్యం నింపే దివ్యక్షేత్రంగా అలరారనున్నదని సీఎం అన్నారు. అనతికాలంలోనే ఈ సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందనున్నదని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీ రామానుజాచార్యులవారికి ఉన్న కోట్లాది మంది భక్తులకు భారతదేశంలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతం వర్థిల్లనున్నదని సీఎం అన్నారు.స్ఫూర్తిస్థలి అయిన తెలంగాణ గడ్డ మీద ఆరంభమవుతున్న శ్రీ రామానుజుల వారి సమతా స్ఫూర్తిని అందుకొని తెలంగాణ ముందుకు సాగుతుందని సీఎం అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సాంస్కృతిక, సాంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను తాము కొనసాగిస్తామని అన్నారు.

చినజీయర్ స్వామికి వందనాలు

రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపనకైన మొత్తం ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, అన్ని రకాల ఏర్పాట్లను స్వయంగా జీయర్ స్వామివారే దగ్గరుండి చూసుకోవడం  గొప్ప విషయమని సీఎం అన్నారు. ఈ మహాకార్యంలో తమ శక్తివంచన లేకుండా పనిచేస్తున్న చినజీయర్ స్వామి వారి మిషన్ కు శతసహస్ర వందనాలు తెలుపుతున్నానని సీఎం అన్నారు.సమారోహ కార్యక్రమ సందర్భంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి చూసుకుంటున్నదని చినజీయర్ స్వామికి మరోమారు సీఎం తెలిపారు. సమరోహనికి హాజరైతున్న ముఖ్య అతిథులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుందని సీఎం అన్నారు. తమ కుటుంబం తరపున ఈ మహా ఉత్సవానికి వచ్చే పండితులు భక్తుల కోసం  ఫలాలు ప్రసాదాన్ని పండ్లను అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీ రామానుజ సహస్రాబ్ధి సమారోహాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా సమకూరుస్తుండడం పట్ల చినజీయర్ స్వామి సంతోషం వ్యక్తం చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు

సందర్శనకు వచ్చిన సీఎం దంపతులను తన కుటీరానికి సాదరంగా ఆహ్వానించిన శ్రీ చినజీయర్ స్వామి సహస్రాబ్ధి ఉత్సవాల కార్యక్రమాలను సీఎంకు వివరించారు. యాగాలు నిర్వహించడానికి తమిళనాడు, కర్నాటక, తిరుపతి నుంచే కాకుండా నేపాల్ తదితర దేశాల నుండి, దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాల నుంచి కూడా వేద పండితులు తరలివస్తున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ప్రభుత్వం రవాణా లోటు లేకుండా చేయడం సంతోషకరమన్నారు. సమారోహానికి తరలివస్తున్న భక్తుల కోసం స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయన్నాయని శ్రీ చినజీయర్ స్వామి ఆనందం వ్యక్తం చేసారు.. అన్నీ పద్ధతి ప్రకారం సాగుతున్నాయని రెవెన్యూ, పోలీసు, విద్యుత్, నీరు, సానిటైజేషన్ తదితర అన్ని శాఖలు సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఈ పది రోజుల పాటు నిర్వహించునున్న కార్యక్రమాలను సీఎంకు శ్రీ చినజీయర్ స్వామి స్వయంగా వివరించారు.

ప్రాంగణ విశేషాలను ముఖ్యమంత్రికి వివరిస్తున్న చిన్న జీయర్ స్వామి

భద్రవేదికపై రామానుజుల విరాట్ సమతామూర్తి

భద్ర వేదికపైన ఆసీనులైన భగవత్ రామానుజుల వారి విరాట్ సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. శ్రీ చినజీయర్ స్వామితో కలిసి సీఎం ప్రదక్షిణ చేశారు. బుధవారం నుంచి అగ్ని ప్రతిష్ట, హోమాలు ప్రారంభమైన నేపథ్యంలో అగ్నిప్రతిష్ట ప్రారంభ సూచికగా 1260 కిలోల బరువుతో, నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహా గంటను మోగించి, గంటా నాదం చేశారు.  రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ఠ స్థలాన్ని పరిశీలించి, రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను తెలియజేసే పెయింటింగ్స్ ను సీఎం తిలకించారు. 108 ఆలయాలతో నిర్మించిన దివ్యదేశ ఆలయాల సమూహాన్ని శ్రీ చినజీయర్ స్వామితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల విశిష్టతను సీఎంకు శ్రీ చినజీయర్ స్వామి వివరించారు. అనంతరం అక్కడ సుందరంగా తీర్చి దిద్దిన ఉద్యానవనాన్ని సీఎం పరిశీలించారు. శ్రీ రామానుజుల వారి జీవిత చరిత్రను తెలియజేస్తూ రూపొందించిన లఘు చిత్రాన్ని సీఎం తిలకించారు. రాష్ట్రపతి, ప్రధాని రాకల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతకై పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల గురించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సీఎం శ్రీ కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ,  మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles