కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేశాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. శాంతపర్వంలోని శ్లోకం లోకస్సమస్తాం సుఖినోభవన్తు అంటూ ధర్మపన్నాలతో మొదలు పెట్టిన ఆర్థికమంత్రి ప్రసంగం అధర్మంగా, అబద్ధాలతో సాగిందనీ, అంతా గోల్ మాల్ గోవిందం అని దుయ్యపట్టారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనేంటంటే నమ్మిన ప్రజలను ముంచుడు, ప్రజల ఆస్తులను అమ్ముడు, మతపిచ్చి రేపుడు, ఓట్లు దండుకొనుడు మాత్రమేనని చెప్పారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం మంగళవారంనాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్…దశ దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి వున్నదని అని సిఎం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సిఎం పేర్కొన్నారు. ‘ఊపర్ షేర్వాణీ, అందర్ పర్యషానీ‘ అన్నట్టు పైన పటారం లోన లొటారం అన్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయంటూ విమర్శించారు.
దేశంలో సుమారు 35 నుంచి 40 కోట్ల మంది దళితులూ, ఆదివాసులూ ఉంటే వారి సంక్షేమానికి కేంద్రం కేటాయించింది తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన మొత్తంలో మూడో వంతు కూడా లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్నది తెలివిలేని ప్రభుత్వమనీ, బుర్రలేని ప్రభుత్వమనీ ఆయన అభివర్ణించారు.
వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సిఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సిఎం స్పష్టం చేశారు. పరుష పదజాలంతో సాగిన కేసీఆర్ ప్రసంగం సుమారు రెండు గంటల పాటు సాగింది.
దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సిఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు.
వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు.
‘‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే..ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమ’’ని సిఎం అన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సిఎం ఆశ్యర్యం వ్యక్తం చేశారు.