సమ్మె ఆపండి …… ఉద్యోగులకు ఉండవల్లి బహిరంగ లేఖ
వోలేటి దివాకర్
ఒక పక్క కరోనా భీభత్సం … మరో పక్క కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఉద్యోగ సంఘాలను కోరారు . ప్రభుత్వం , ఉద్యోగ సంఘాలు పట్టుదల కు పోకుండా ఈవిషయంలో సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కొత్త పిఆర్సీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ . 10 వేల 247 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోందని గుర్తుచేశారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు కొత్త జీతాలువద్దు … పాత జీతాలు చెల్లించండి చాలు అంటూ సమ్మె నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కావచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు చూడలేదని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఉండవల్లి ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ , ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లి ప్రస్తుతం రాజకీయంగా తటస్తంగా ఉన్నారు . పైపెచ్చు ఈమధ్య జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాజకీయ, ఆర్థిక అంశాల్లో విశేష అవగాహన ఉన్న ఉండవల్లి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగ సంఘాలకు సమ్మె విరమించుకోవాలని లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉండవల్లి విజ్ఞప్తి పై ఉద్యోగ సంఘాలు ఆలోచిస్తాయా అన్నది వేచి చూడాలి.
Also read: 1986 ఎన్జీఓల సమ్మె గుర్తుందా?!