వోలేటి దివాకర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానటుడు ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో 1986 నవంబర్ – డిసెంబర్ మధ్య ఎన్జీఓలు పిఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం 53 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ తరువాత 1989 లో సమ్మె కాలంలో జీతాలకు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఆసమయంలో ప్రస్తుత టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీలోనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బద్దకస్తులని, అవినీతిపరులని ఎన్టీ రామారావు అభిప్రాయపడేవారని నాటి టిడిపి నేతలు గుర్తు చేసుకుంటారు. దీంతో సెక్రటేరియట్ ఉద్యోగులపై ఆంక్షలు విధించారు. ఇది సహించలేని ఉద్యోగులు ఎన్టీఆర్ చాంబర్లోకి దూసుకెళ్లారు. ఉద్యోగులు క్రమశిక్షణతో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ఎన్టీఆర్ హితవు పలికారు. ఆ వెంటనే ఎన్టీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 55 కు తగ్గించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెకు దిగారు. రాష్ట్ర రాబడిలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే 48 శాతం సొమ్ము ఖర్చు అవుతోందని, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఎపిలోనే జీతాలు ఎక్కువని ఎన్టీఆర్ భావించారు. ఈ మేరకు ఆనాటి పత్రికల్లో భారీ ప్రకటనలు కూడా జారీ చేశారు. అయినా ఉద్యోగులు వెనక్కి తగ్గకపోవడంతో ఆర్టికల్ 312 ను వినియోగించి, నలుగురు ఉద్యోగ సంఘ నాయకులను బర్తరఫ్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మెకాలంలో జీతాలు చెల్లించేందుకు ఎన్టీఆర్ అంగీకరించలేదు. పని చేయకపోతే జీతం లేదు అన్న సిద్ధాంతానికి ఎన్టీఆర్ కట్టుబడ్డారు. సమ్మె కాలంలో జీతాల కోసం 1989 లో మరోసారి ఉద్యోగులు సమ్మె నోటీసు జారీ చేశారు. 1989 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ఉద్యోగుల విషయంలో కాస్త మెత్తబడ్డారు.
Also read: యుూపిీలో మండల్ వర్సెస్ కమండల్!
ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చిందా?
అప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అంటే అవుననే చెప్పాలి . ఉద్యోగుల వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. 1986 లో రాష్ట్రం సమైక్యంగా ఉండేది. రాష్ట్ర ఖజానా కూడా నిండుగా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఎపి ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీనికి తోడు గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలు, అదే సమయంలో వైద్యరంగానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువే. అయినా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఉదారంగా పిఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు గతంలోనే 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించారు. తాజాగా 23 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు . దీనిపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించడం నాటి పరిస్థితులను గుర్తుకు తేక మానవు.
Also read: ఏమిటి చీప్ గా … ఎపి బిజెపి లిక్కర్ పాలసీ!
చంద్రబాబు సమాధానం చెప్పాలి
1986 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగుల సమ్మెతో కాంగ్రెస్ సంబరపడగా…. నేడు చంద్రబాబునాయుడు సంబరపడుతున్నారు. ప్రభుత్వశాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వైరుధ్యాలను పెంచేందుకు తనదైన శైలిలో కృషిచేస్తున్నారు. అయితే ఈసందర్భంగా చంద్రబాబునాయుడు ఆనాటి పరిస్థితులు, నేటి పరిస్థితులకు మధ్య తేడా ఏమిటన్నదానిపై ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది .
Also read: స్వపక్షంలో విపక్షం, గోదావరి తీరంలో.. అధికార పార్టీలో ఆధిపత్యపోరు!