సభలో ప్రసంగిస్తున్న పింగళి నాగేంద్రరావు, వేదికపైన ఎన్ టి రామారావు
మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు.
ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు.
శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు.
తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు.
అయినా పూర్తిగా నిద్ర వదలదు …
సరిగ్గా అలాంటి సమయంలో ఓ చెలికత్తె … మీ అమ్మగారు వస్తున్నారమ్మా అని చెప్తుంది. శశిరేఖ రూపంలో ఉన్న ఘటోత్కచుడు అప్రయత్నంగానే అమ్మో అమ్మే అని ఒక్కసారి ఉలిక్కిపడతాడు.
ఇంతలో శ్రీ కృష్ణ, రుక్మిణీ సమేతంగా శయ్యాగృహంలోకి ప్రవేశించిన రేవతీదేవి పాదాలకు నమస్కారం పెట్టి నమో మాత నమో అనేస్తాడు. ఇది చూసి రేవతి మురిసిపోతుందిగానీ జరిగింది గ్రహించదు. అంటే అంతటి ఘతోత్కచుడికీ … అమ్మంటే భయమే …
అసలు మాయాబజార్ సినిమా నలుగురు అమ్మల ముగ్గురు పిల్లల కథ.
ఒక తల్లి సుభద్ర అభిమన్యుడి తల్లి. మరో తల్లి హిడింబి ఘతోత్కచుడి అమ్మ. రేవతీదేవి శశిరేఖ తల్లి. ఇక నాలుగో అమ్మ రుక్మిణి. రుక్కిణి కూడా ఒక రకంగా శశిరేఖ తల్లే.
శశిరేఖకు ఇద్దరు అమ్మలన్నమాట. ఒక అమ్మేమో … కూతురికేం తెలియదనీ … తానే అంతా చూసుకోవాలనీ … లేకపోతే జీవితంలో చాలా కష్టాలు పడుతుందనీ అనేసుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ …
కూతుర్ని ఓ గొప్ప చోట ఇవ్వాలనీ … తన జీవితం ఎప్పటికీ ఏ ఇబ్బందీ పడనంత గొప్పగా నడిచేందుకు తగ్గ ఏర్పాట్లు తనే చేయాలనీ భావిస్తుంది.
తన జీవితం గురించి కూతురుకి ఆలోచించుకునే అవకాశమే ఇవ్వదు. అంతా తానే అయి కూతురు జీవితాన్ని ముందుకు నడిపించాలనుకుంటుంది.
ఇప్పుడు రుక్మిణి విషయానికి వస్తే … శశిరేఖ తన కడుపున పుట్టిన పిల్ల కాకపోయినా … పిన్నిగా … కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది.
ఎదిగిన కూతురు అభిప్రాయాలను గౌరవిస్తూ … కూతురుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అమ్మకు తన ఆలోచనలు సమస్యలూ అన్నీ చెప్పుకుని అమ్మ తన అనుభవంతో చెప్పిన సలహాలు పాటిస్తూ జీవితాన్ని దిద్దుకునే వెసులుబాటు కల్పించే అమ్మ రుక్మిణి.
Also read: మిసెస్ తేడాసింగ్ లెక్చర్ ఆన్ యాప్ వరల్డ్
అందుకే శశిరేఖ రుక్మిణి దగ్గర చాలా గారం పోతుంది. తన మనసులో మాటను ధైర్యంగా చెప్పేస్తుంది. ఇది పిల్లల పెంపకంలో ప్రతి అమ్మా పాటించాల్సిన రీతి. పిల్లలు తమ సమస్యలు హాయిగా చెప్పుకునే ‘స్పేసు’ అమ్మలు కల్పించాలి … అమ్మకు చెప్పుకుంటే చాలు తనకు ఓ మంచి సలహా చెప్పి ముందుకు నడిపిస్తుందనే భరోసా పిల్లలకు కల్పించాలి …
ఇప్పుడు మరో తల్లి దగ్గరకు వెళ్దాం …
ఈ సినిమాలో … అభిమన్యుడు కూడా తల్లిచాటు పిల్లాడుగానే కనిపిస్తాడు … భర్త రాజ్యం కోల్పోయి అడవుల పాలైన సందర్భంలో తలదాచుకోడానికి పుట్టింటికి చేరిన సుభద్ర …
అధైర్య పడదు. అలాగే కొడుకునీ అధైర్య పడనివ్వదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ధైర్యంగా ఆత్మగౌరవంతో ముందుకు నడవడం ఎలాగో కొడుక్కి నేర్పాలనుకుంటుంది. నేర్పుతుంది.
ఎటుంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే మనో నిబ్బరం ఇస్తే చాలు కొడుకు తన బతుకు తాను బతికేస్తాడు అనే అవగాహన పుష్కలంగా ఉన్న తల్లి సుభద్ర.
కొడుకుకు ఏదైనా ఆపద సంభవిస్తే మాత్రం తానే రంగంలోకి దిగుతుంది తప్ప కొడుకు చొరవను కాదనదు.. తప్పట్టదు. నిజంగా పిల్లలను పెంచాల్సిన కొన్ని పద్దతులు సుభద్ర పాత్ర ద్వారా ప్రపంచానికి చెప్పారు మాయాబజార్ రూపకర్తలు.
ఇప్పుడు ఘటోత్కచుడి పాత్ర దగ్గరకు వద్దాం … ఘటోత్కచుడి పాత్ర ఎందుకు మనకి అంతగా కనక్ట్ అయ్యిందంటే … ఆ పాత్రను అంతటి ఎస్వీఆర్ చేసినా సరే … మనకి కొంచెం దుడుకుతనం, చిలిపితనం కలగలసిన కుర్రాడుగానే కనిపిస్తాడు.
ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఇట్టాంటి కుర్రాడొకడు ఉండేవాడు. ఇంట్లో కాస్త బలమైన పనులన్నీ వాడే చేస్తాడు … కానీ అమ్మంటే మాత్రం విపరీతమైన భయం. గౌరవం. మాయాబజార్ లో ఘటోత్కచుడు వ్యవహారానికి వస్తే అమ్మకు తప్ప ఈ ప్రపంచంలో మరింక దేనికీ ‘సరండర్’ అయ్యే ప్రసక్తే ఉండదు. అంతగా అమ్మకు ఎందుకు సరండర్ అయి ఉంటాడు ఆ కొడుకు అంటే … కొడుకు దుడుకుతనం బాగా తెల్సి ఉండడం చేత ఎప్పటికప్పుడు కనిపెట్టుకునే ఉంటుంది ఆ తల్లి. కొడుకు ఏం పీకల మీదకు తెచ్చుకుంటాడో అనే ఆందోళనే ఎప్పుడూ ఆ పిచ్చితల్లికి. అలాగని తన మీద రైడ్ చేసే పని పెట్టుకోదు …
వీధిలో ఎవర్నో నిలబెట్టి వాయించేస్తున్నాడని తెల్సి … కాస్త ముందూ వెనకా కనుక్కుని కొడుతున్నాడా లేక తప్పు చేసేస్తున్నాడా అని చూసుకోడానికి వస్తూ కూడా … సుపుత్రా సుపుత్రా అనే పిలుస్తుంది … ఒరే … ఏం చేస్తున్నావురా గాడిదా … కొంప మీదకు మళ్లీ ఏం తెస్తున్నావ్ అని అనదు …
కొడుకు తనకు బాగా తెల్సు. వాడు తప్పు చేయడు. కాకపోతే దుడుకుతనంతో పొరపాటు చేస్తాడేమో అని … అది ఎక్కడ తప్పుగా పరిణమించి కొడుకు నిందల పాలౌతాడో అనే ఆందోళనే ఎప్పుడూ పాపం హిడింబికి.
అందుకే … ఎప్పటికప్పుడు కొడుకును ఓ కంట కనిపెట్టే ఉంటుంది. కొడుక్కీ తెల్సు … తను ఏం చేసినా అమ్మకు తెల్సిపోతుందని … అందుకే … అమ్మ వస్తోందనగానే అంత ఖంగారు పడిపోతాడు … తానేమైనా తప్పు చేసేసానా అని ఆలోచనలోనూ ఆందోళనలోనూ పడిపోతాడు …
మరో వైపు శశిరేఖ పాత్రలో రక్తికట్టించాలి. ఈ గందరగోళాన్నంతా సావిత్రి గారు అద్భుతంగా అభినయించేశారు.
సుభద్ర … కొడుకును వీరుడుగా పెంచడమే కాదు … స్వాభిమానంతో .. కొడుకు ఎవరి ముందూ తలొంచాల్సిన పరిస్థితి రాకుండా కంటికి రెప్పగా చూసుకుంటుంది. కొడుకు మీద వల్లమాలిన నమ్మకం.
తన పెంపకం మీద నమ్మకం అది. నా కొడుకు బాణం గురి తప్పదొదినా అని చెప్తున్నప్పుడు రుష్యేంద్రమణి కళ్లల్లో కనిపించే ధీమా చూసి తీరాల్సిందే. ఈ నలుగురు అమ్మల పాత్రల రూపకల్పన అంత గొప్పగా రావడానికి కారణం రచయిత పింగళి నాగేంద్రరావు నేపధ్యం.
రావూరి వారు రాసిన నూరు చందమామలు పుస్తకం ప్రకారం … పింగళి నాగేంద్రరావుగారికి తల్లితో విపరీతమైన ‘అటాచ్మెంటు.’ అలాగే తల్లిని జాగ్రత్తగా చూసుకోడానికే నెల్లూరు నుంచీ వంటమనిషిని తెప్పించి మరీ ఇంట్లో పెట్టుకున్నారు. నాగేంద్రరావుగారి అమ్మ పేరు మహాలక్ష్మమ్మ. ఆవిడకీ కొడుకంటే విపరీతమైన అపేక్ష. కొడుకు వెండి కంచంలో భోజనం చేస్తే చూడాలనేది ఆవిడ కోరిక. అది రావూరి లాంటి కృష్ణాపత్రికలో పింగళివారి కొలీగ్స్ దగ్గర చెప్పుకుని బాధపడేదట ఆవిడ.
ఆ విషయం కూడా రావూరి రాశారు. నాటక సమాజాల వాళ్లు ఇతర సంస్ధల వాళ్లూ సన్మానించి ఇచ్చిన మెడల్సూ షీల్డులూ అవీ చూపించి వీటన్నింటినీ చూసినా నాకు తృప్తికలగదు .. వాడు పెళ్లి చేసుకుంటే వాళ్ల అత్తగారు వెండికంచం పెడితే అందులో వాడు భోం చేస్తుంటే చూడాలని నా కోరిక అనేదట ఆవిడ.
అదీ లింకు …
ఫైనల్ గా పింగళితో పాటు రావూరి కూడా మద్రాసు సినిమా రంగంలోకి చేరారు. భరణీ వారి సినిమాలకు పనిచేస్తూండేవారు. అప్పుడూ మహాలక్ష్మమ్మగారు రావూరి తో వెండికంచం ముచ్చట మాత్రం చెప్పకుండా వదిలేవారు కాదట.
ఇక లాభం లేదని పింగళి నాగేంద్రరావుగారిని కూచోపెట్టి మీ అమ్మగారిలా వెండికంచం విషయంలో బాధపడుతున్నారని చెప్పేశారట రావూరి.
దానికి పెళ్లితో పనేంటి … ఇవాళ్లే వెళ్లి ఓ కంచం తెస్తే సరిపోలా అననారట నాగేంద్రరావుగారు.
తనకు పెళ్లి కాలేదు… చేసుకోలేదు … వెనక ఎవరూ లేకపోయినా తల్లి కోసమే స్వంత ఇల్లు అమర్చుకున్నారు మద్రాసులో … ఆయన చనిపోయే ముందు ఆ ఇల్లు ఘంటసాల కొనుక్కున్నారు. నాగేంద్రరావుగారిలో కనిపించే ఈ ‘మదర్ అటాచ్మెంటు’ … తల్లిని అర్ధం చేసుకునే పద్దతి ‘మాయాబజార్’ సినిమాలోనే కాదు ‘పాతాళభైరవి’లోనూ కనిపిస్తుంది. ‘ఓ కొడుకునివ్వమంటే ఈ రాక్షసుణ్ణిచ్చావేంటి దేవుడా’ అని తోటరాముడి తల్లి బాధపడే సీను చూస్తే జనాలకు నవ్వొచ్చేస్తుంది.
రేవతీదేవి మాయాబజార్ లో గయ్యాళిగా విలనిష్ షేడ్స్ తో కనిపించినప్పటికీ కూడా కూతుర్ని ఓ మంచి ఇంట్లో ఇచ్చుకోవాలనే అందరు తల్లులకూ ఉండే పిచ్చతోనే అలా ‘బిహేవ్’ చేస్తుంది తప్ప కూతురంటే ప్రేమ లేక కాదు …
సినిమా చివరాకరిలో … ఘటోత్కచుడి మాయలకు తెరమీద నటులూ థియేటర్లో ఆడియన్సూ కూడా డంగై నోళ్లు తెరిచేసిన సమయంలో … అవునూ ఇంతకీ నా కూతురేమైనట్టు అంటుంది రేవతి. ఆ ఒక్క డైలాగుతో ఆ రేవతిలోని అమ్మతనాన్ని మొత్తానికి మొత్తం మన కళ్లెదుట నిలబెడతాడు రచయిత పింగళి.
ఆయన రాసిన అన్ని సినిమాల్లోనూ నాటకాల్లోనూ కూడా తల్లి పాత్రలు కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలా మాయాబజార్ సినిమా మీద తెలుగువారికి మమకారం రోజురోజుకీ పెరుగుతూండడం వెనకాల … ఈ అమ్మతనం కూడా ఒక కారణం …
Also read: బాపు రమణలు ఎంతటి దుర్మార్గులో తెలిస్తే అవాక్కవుతారు!
Very Nice