Sunday, December 22, 2024

వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఆ రోజు పాపపురుషుడెక్కడ ఉంటాడు?

మాడభూషి శ్రీధర్

పుష్యమాసం తొలి పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. విగత కుంఠాద్ యస్మద్ ఇతి వైకుంఠ, అంటే నాశములేనిది, వైకుంఠమంటే కుంఠములు లేని చోటు. కుంఠము అంటే నాశము, కొరత, ముళ్లు, ప్రతిబంధకాలు, ప్రమాదం, అడ్డు, ఆపద,బంధాలు, ఆందోళనలు, సమస్యలు. అవేవీ లేకుండా అవధులులేని ఆనందం; ఆందోళనలు లేని స్వేచ్ఛ ఉండే చోటు వైకుంఠం. ఈ విశ్వమంతా లీలా విభూతి అయితే వైకుంఠం నిత్యవిభూతి. అక్కడ కాలం కూడా పనిచేయదు. కాలం గడవదు. కాలం చేత ఏదీ నాశనం కాదు. అక్కడ సరోవరాలు నదులు, చెట్లు పూలు, ఫలాలు వస్త్రాలు నిత్యసూరులు ఎవరూ నాశనం కారు. ప్రళయం వచ్చి బ్రహ్మాండాలన్నీ నశించినా వైకుంఠం ఆ విధంగా నశించదు. కాలం సమర్థంకాదు పనిచేయదు. ఆ వైకుంఠంలో తన ద్వారం తెరచి దేవతలకు దర్శనంఇచ్చిన రోజు.

ఆషాడ మాసం శుద్దఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి కార్తీకంలో ప్రబోధనం చెందుతారు (లేవడం), ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు పరివర్తన – అటునుంచి ఇటు తిరుగుతారు. మార్గశిరం- శుద్ధ ఏకాదశి (ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంది) నాడు మేలుకొంటారు. అందుకే ఈ రోజును ఉత్థాన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు లేచీ లేవగానే భగవంతుడికి మనం కనబడడం కోసం తెల్లవారుఝామున ఆలయాలకు వెళ్తారు.  పరమాత్మను మనం చూడడం సరే, పరమాత్మమనలనుచూసేట్టు ఉండాలి.

మార్గళి రెండో పక్ష ఏకాదశి లేదా పుష్యం మాసం శుక్ల పక్ష (తొలి పక్షం) ఏకాదశినాడు యోగనిద్రనుండి మేల్కొంటాడు కనుక వెంటనే ఆయనను దర్శించుకొనే వైకుంఠ ఏకాదశి ఇది.

వైకుంఠ ఏకాదశి

సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన మాసం ధనుర్మాసం, ఆ తరువాత మకర రాశిలోకి సంక్రమణం వరకు జరిగే ‘మార్గం‘ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం బయట భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి.

మన పండుగలన్నీ చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకోవడం ఆనవాయితి. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ముక్కోటి ఏకాదశి! సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత (సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు.

క్షీర సాగర మధనం జరిపినప్పుడు ఈ రోజునే హాలాహలం అమృతం పుట్టినాయని.లోక క్షేమం కోసం శివుడు హాలాహలాన్ని మింగి గొంతులోనే ఆపి నీలకంఠుడవుతాడనీ పురాణాలు చెబుతున్నాయి. సాగర మథనం జరగానికి వీలుగా కూర్మమై మంధర పర్వతాన్ని ఎత్తి నిలపడమే కాకుండా, అమృతం దుర్మార్గుల చేతిలో పడకుండా మోహిని అవతారం ద్వారా కాపాడతాడు హరి.

స్వర్గవాతిల్ఏకాదశి

కేరళలో స్వర్గవాతిల్ ఏకాదశి అంటారు. క్షీరసాగరంలో మూడు మడతలు వేసి పడుకున్న ఆదిశేషుడిపైన నారాయణుడు తన ద్వారం తెరిచి దర్శనం ఇచ్చే రోజు ఇది. అహంకారాన్ని విడిచి విష్ణువును ఆరాధించే జీవి వైకుంఠానికి చేరుకుంటాడు.

మోక్ష ఏకాదశి

వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాగా ఆచరించాడట. ఆతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.ఈ రోజు ఉపవసించి నారాయణ జపం చేసిన వారికి పాపపుణ్యాల ద్వారా ఏర్పడే బంధాలు తొలగి మోక్షం లభిస్తుందని పద్మపురాణం వివరిస్తున్నది.

ముక్కోటి ఏకాదశి

ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.ఈ రోజు వైకుంఠంలో హరిద్వారం తెరుచుకుంటుందని నమ్ముతారు. దక్షిణ రాష్ట్రాలలో మార్గళి మాసం చివరిలో వచ్చే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.

కాదు కాదు దేవతలు 33 కోట్లు కదా, మూడు కోట్లు అని ఎందుకు తగ్గిస్తారు? ఈ రోజు ఎంత గొప్పరోజు అంటే ఏకాదశి వ్రతం ఈ ఒక్క రోజు చేస్తే మూడుకోట్ల ఏకాదశి వ్రతాలు చేసిన ఫలందక్కుతుంది కనుక ముక్కోటి ఏకాదశి అని పిలుస్తున్నారని పెద్దలు అంటున్నారు.

శ్రీకృష్ణుడు అర్జునునికి గీత బోధించిన ఏకాదశి

మహాభారత యుద్ధ ఆరంభ సమయంలో అర్జునుడు నిస్పృహ చెంది విల్లంబులు వదిలేస్తే కర్తవ్యబోధ చేస్తూ శ్రీ కృష్ణుడు భగవద్గీత చెప్పినరోజు ఈ ఏకాదశి అని కనుక ఈ రోజు తప్పనిసరిగా గీతాపారాయణ చేయాలని అంటారు. ఆ లెక్కన ఇదే గీతా జయంతి. మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి అంటారు. మార్గశీర్షము పుష్య మాసాల మధ్య రోజులను మార్గళి మాసం అంటారు. ఆ విధంగా అనుకున్నా మార్గళి బహుళ ఏకాదశి గీతా జయంతి అవుతుంది. పుష్యమాసంఅని లెక్కిస్తే పుష్య శుద్ధ ఏకాదశి నాడు గీతాజయంతి అంటారు. 

వేదాలన్నీ వెతికినా హరే కృష్ణ మంత్రాన్ని మించిన మంత్రం కనిపించలేదు. ‘‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..’’ అనే మంత్రాన్ని వైకుంఠ ఏకాదశి నాడు జపించండి అని ఇస్కాన్ పెద్దలు వివరిస్తున్నారు. ఈ మంత్ర జపం మనసును తేలిక పరచి ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించడనికవ ఉపయోగిస్తుంది.

ఇస్కాన్ వారు ఈ ఏకాదశి నాడు ప్రతివ్యక్తీ చేయవలసిన అయిదు తప్పనిసరి అంశాలు ఇవి అని చెప్పారు.

  1. ఈ రోజు ఉదయాన్నే దేవాలయానికి వెళ్లడం లేదా ఇంట్లో హరిపూజ చేయడం అవసరం
  2. ధ్యానం చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి.
  3. భగవద్గీత పారాయణం చేయండి.
  4. మనసు శరీరాలనుంచి మలినాలను తొలగించేందుకు ఉపవాసం చేయండి.
  5. దేవాలయాల్లో ప్రసాదం పంచడమో లేక మరేదైనా సేవనో చేయండి.

దీన్నే పుత్రద ఏకాదశి అనికూడా పిలుస్తారు. ఈరోజు ఏకాదశి వ్రతం పాటిస్తే పుత్రులు కలుగుతారంటారు. శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి అంటే ఇష్టం.  ముక్కోటి ఏకాదశి అంటే మరీ ఇష్టం. ఈ ఏకాదశి నాడు దేవతలు ఉత్తరద్వారం నుంచి వెళ్లి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిని దర్శిస్తారు. శ్రీమన్నారాయణుడు క్షీరాబ్దిలో ద్వారం తెరిచి దేవతలకు దర్శనం ఇచ్చి రాక్షసుల బాధలు తొలగిస్తానని అభయం ఇస్తారు.  ముక్కోటి దేవతలకు గరుడారూఢుడైన హరి కనిపించిన రోజుకనుక ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజు హరివాసరమనీ, హరి దినమని, శ్రీవైకుంఠ దినమనీ పిలుస్తారు.

ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో ఉపవాసవ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, అక్కడ తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది. వ్రతమంటే పూర్తిరోజు ఉపవాసం ఉండడం, విష్ణుఆలయాలను దర్శించడం, అసత్యమాడకపోవడం, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండడం, తప్పుడు ఆలోచనలు వదిలేయడం, రాత్రి జాగరణ చేయడం, అంతకుముందు రాత్రికూడా ఉపవాసం ఉండడం, అన్నదానం చేయడం వంటి మంచి పనులు జరపాలి.

ఇంద్రియాలను అణచుకుని బ్రహ్మజ్ఞానం పొందడాన్నే ఉత్తర ద్వారంనుంచి ప్రవేశించి దర్శనం అంటారు. ఆలయాల్లో ఉత్తరద్వారం నుంచి ప్రవేశించి ప్రదక్షిణలు చేయడాన్ని ముక్కోటి ప్రదక్షిణ అనీ అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు అష్టోత్తరము, శ్రీమన్నారాయణ స్తోత్రము, విష్ణుపురాణము, దశావతారములు భగవద్గీత పారాయణం చేయాలి.

ఏకాదశి సంకల్ప శ్లోకం:

ఏకాదశ్యాం నిరాహారో (or ఫలాహారో or నక్తాహారో)

భూత్వాహం అపరే హని

భోక్ష్యామి పుండరీకాక్ష

శరణం మే భవాచ్యుత

ద్వాదశి పారణ శ్లోకం:

అజ్ఞాన తిమిరాంధస్య

వ్రతేనానేన కేశవ

ప్రసీద సుముఖోనాధ

జ్ఞాన దృష్టి వ్రతోభవ

జయకృష్ణా ముకుందా మురారీ

శ్రీకృష్ణుడికి మురారి అని పేరు. పద్మపురాణం మురారి కథ వివరిస్తున్నది. కృతయుగంలోమురాసురుడనే రాక్షసుడిదురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడతారు. మురాసురుడిపై దాడిచేసి ఆతనిసైన్యాన్నిమొత్తం హరిస్తాడు హరి. కాని మురాసురుడు తప్పాంచుకుని సాగరగర్భలో దాక్కుంటాడు. అక్కడినుంచివిష్ణువు బయలుదేరి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి నిద్రిస్తాడు. మురాసురుడిని  స్త్రీ శక్తి ద్వారానే సంహరించడం సాద్యం అనుకుంటాడు. తననుంచి మహాతేజస్సుతో కూడినస్త్రీ రూపంలో ఒకశక్తిని  పక్షంలో పదకొండవరోజునఉద్భవింపజేస్తాడని ఒక కథనమైతే,  విశ్రమిస్తున్న హరిని చంపాలని ప్రయత్నించిన మురాసురుడిని శ్రీ మహాలక్ష్మి దుర్గయై విజృంభించి తన కంటి చూపు మంటలతో కాల్చి వేస్తుందని వివరిస్తున్నారు. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం వివరిస్తున్నది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ దుర్గుణాలను ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు.

అజ్ఞానాసురుడిని చంపే రోజు వైకుంఠ ఏకాదశి

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు మనసు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం అనేక పాపాలుచేస్తుంటాం. ఇవి అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానానికి ప్రతినిధి మురాసురుడు. ఈ ఏకాదశ పాపాలను హరించాలంటే ఏకాదశినాడు నిరాహారంగా ఉండి హరి సమీపంలో వసిస్తూ (దీనే ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే తిండితినకపోవడం తోపాటు హరికి సమీపంలో ఉండడం అని అర్థం) అజ్ఞానాసురుడైన మురాసురుడిని చంపడానికి ఏకాదశి అనువైన రోజు. అదే ఏకాదశీ వ్రతం.

పుత్రాద ఏకాదశి

యుథిష్టిరుడికి శ్రీకృష్ణుడు భవిష్యపురాణం నుంచి ఒక కథ వివరిస్తాడు. మహిష్మతి రాజు మహిజిత్ సంతానం కోసం ఎన్ని వ్రతాలుచేసినా ఫలితం ఉండదు. పూర్వజన్మలో బాగా దాహం వేసిన ఒక వ్యాపారి చెరువులో నీళ్లు తాగుతున్న ఒక ఆవుదూడల జంటను వెళ్లగోట్టి తన దాహం తీర్చుకుంటాడు. ఆ పాపం వల్ల సంతాన హీనుడవుతాడని లోమేషుడనే ముని తన దివ్యదృష్టితో తెలుసుకుంటాడు. పుణ్యకార్యాలవల్ల రాజుగా పుట్టినా ఈ పాపచర్యవల్ల సంతానం కలగదు. రాజుగారు ఆయన భార్య పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతం చేయాలని విష్ణును ఆరాధిస్తూ ఉపవాసం చేయాలని సలహా ఇస్తాడు.  శ్రద్ధగా ఏకాదశి పాటించి ఉపవాసం చేసి, రాత్రంతా నిద్రపోకుండా నామస్మరణం చేసిన రాజదంపతులు పుత్రవంతులవుతారు. అప్పడినుంచి ఇది పుత్రాద ఏకాదశి అనీ పవిత్రోపాన ఏకాదశి పేరు తెచ్చుకుంది.

పాపపురుషుడు ఉండే చోటు

హరి వరంతో ఏకాదశీ వ్రతం చేసిన వారంతో విముక్తి పొందుతూ ఉండడంతో పాపపురుషుడికి ఎక్కడ ఉండాలో తెలియక నా సంగతేమిటి నేనెక్కడ ఉండాలని శ్రీమహావిష్ణువును అడుగుతాడు.  ఏకాదశి రాత్రి చంద్రోదయంలో మూడు గ్రహాల కలయిక జరుగుతుందని ఆరోజు రాత్రి ఎవరైతే ధాన్యాలు తింటారో వారిని నీవు ఆశ్రయించవచ్చు అని విష్ణువు పాపపురుషుడికి ధాన్యాహారం స్వీకరించే మనుషుల్లో స్థానం కల్పిస్తాడు. ఏకాదశి రోజున బియ్యం, గోధుమ పప్పుధాన్యాలు తిన్నవ్యక్తికి పాపపరిహారం ఉండదు. ఆత్మోన్నతికి ప్రయత్నించే వారికి పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకునే వారికి హరి నామస్మరణతో కాలం గడిపే వారికి విష్ణు అనుగ్రహంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది. కేవలం తులసీ తీర్థంతో రోజంతా ఉపవసించడం మంచిదనీ అంటారు. దశమి రాత్రి బియ్యపు అన్నం తినకుండా, నిద్రపోకుండా తెల్లవారుఝామునే బ్రహ్మముహూర్తానికి ముందే లేచి స్నానాలు ముగించి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం ద్వారా విష్ణు దర్శనం చేసుకోవాలి.

దామోదర సహిత తులసీ పూజ

ఏడాదిలో మొత్తం 24 లేదా 26 (అధికమాసం వస్తే) ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఇవే నియమాలు పాటించడమే వ్రతం. కాని ముక్కోటి ఏకాదశినాడైనా ఈనియమాలు పాటిస్తూ 26 ఏకాదశులూ వ్రతం చేసినట్టవుతుంది లేదా 3 కోట్ల ఏకాదశి వ్రతాలు చేసినట్టవుతుందని ఏకాదశీ వ్రతమహాత్మ్యం చెబుతున్నది.  ఈ రోజు దామోదర సహిత తులసీ మాతను కల్పోక్త ప్రకారం పూజించాలని పెద్దలు ప్రబోధిస్తున్నారు.

శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. మొదటి పదిరోజులు పగల్ పత్తు (ఉదయం పూజలు) తరువాత పదిరోజులు (ఇరై పత్తు రాత్రి పదిరోజులు) రాత్రి పూజలు జరుపుతారు. వైకుంఠ ఏకాదశి రోజున రంగనాథుడు వజ్రాలు లేదా ముత్యాల వస్త్రం ధరించి వేయిస్తంభాల గుడిద్వారా ఉత్తర ద్వారంచేరి ఆ ద్వారం తెరచి దర్శనం ఇస్తారు.

తిరుపతిలో బంగారు వాకిలి దర్శనం ఉండదు

తిరుపతిలో ఈ రోజు బంగారు వాకిలి ద్వారా కాకుండా దానికి ఎడమ పక్కన గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ఒక ప్రత్యేక ప్రదక్షిణ మార్గం తలుపులు తెరిచి, ఆ మార్గం ద్వారా చుట్టు తిరిగి, హుండీ దగ్గర నుంచి ఆనంద నిలయంలో ప్రవేశించి స్వామి దర్శనం చేసుకుంటారు. దీన్ని ముక్కోటి ప్రదక్షిణ మార్గం అంటారు.

ఈరోజు విష్ణు సహస్ర నామ పారాయణం ఒక్కసారి చేస్తే మూడుకోట్ల సార్లు చేసినంత ఫలితం లభిస్తుందని తెలిసిన వారు వివరిస్తున్నారు.

బెజ్జూర్ రంగనాథుడు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలకేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామి క్షేత్రం విశేషమయింది.  శేషతల్పంపైన శయనించి, నాభిమద్యమున బ్రాహ్మ కలిగి అనంత దేవతామూర్తులతో విరాజిల్లే మూల విరాట్టు మనకు మరెక్కడా కనిపించదు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 3 రోజుల పాటు జాతరఘనంగా జరుగుతుంది. ఉత్తర ద్వారం నుంచి ఈ రోజు రంగనాథుడు దర్శనమిస్తాడు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles