జాన్ రస్కిన్, మహాత్మాగాంధీ
గాంధీయే మార్గం-27
సంపద అంటూ వేరే ఏమీ లేదు, ఉన్నది కేవలం జీవితం మాత్రమే!
ఇది గాంధీజీ గౌరవించిన జాన్ రస్కిన్ భావన!
రస్కిన్ అన్న మాటలు ఇవి: దేర్ ఈజ్ నో వెల్త్ బట్ లైఫ్!
అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ శాంతి – అంటూ 2020 సంవత్సరం దృష్టిగా చాలా ఏళ్ళుగా మనం ఎన్నో కలలు కన్నాం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి చాలా ప్రణాళికలూ, పథకాలూ రచించుకుని, అమలు చేసుకున్నాం. అయితే జరిగింది ఏమిటి? గ్రామీణ భారతం వివరిస్తున్నది ఏమిటి? మరీ ముఖ్యంగా 2019 సంవత్సరం వెడుతూ మొత్తం ప్రపంచానికీ, భారతదేశానికీ ఇచ్చినదేమిటి? ఆ కోవిడ్-19గా పిలువబడే కరోనా వైరస్ తెలియజేసిన చేదు వాస్తవం ఏమిటి? కరోనా అనుభవాలు లేకుండా ప్రపంచంలో దేని గురించి చర్చించే పరిస్థితి లేదు. దానికి భారతదేశం మినహాయింపు కాదు!
Also read: గాంధీజీని అనుసరించిన మహనీయులు
2011 జనాభా గణింపుల ప్రకారం దేశంలో 68.8 శాతం మంది గ్రామాలలో ఉంటున్నారు! నిజమా? ఇది నమ్మలేని వాస్తవం అంటారా? కాదు కాదు – మనం గ్రామాలను పట్టించుకోవడం మానివేశాం కనుక ఆశ్చర్యంగా కనబడుతోంది. 2012-13 సంవత్సరానికి ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎమ్‌ఐఇ) లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో సగటున ఒక ఇంటి ఆదాయం పట్టణ ఆదాయాలతో పోలిస్తే దాదాపు సగమే!
గ్రామీణ ప్రాంతాలలో ఆదాయం తక్కువ
అంతేకాదు. సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ (ఎన్.ఈ.సి.సి.) అంచనాల ప్రకారం 2011లో 56 శాతం గ్రామీణ ప్రజలకు ఏమాత్రం భూవసతి లేదు, ఇలాంటి వారిలో 51 శాతం మందికి ప్రధాన ఆదాయం క్యాజువల్ లేబర్ పని ద్వారా మాత్రమే! గ్రామీణ ప్రజలలో కేవలం 30 శాతం మందికే వ్యవసాయం సొంతంగా ఉంది. ఇంకా గ్రామీణ జనాభాలో 9.7 శాతం మంది మాత్రం నెలసరి జీతం మీద జీవనం సాగిస్తున్నారు. ఈ వివరాలు పరిశోధన ఆధారంగా నిగ్గు తేలిన విషయాలు. అంటే వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టర్ రంగాలను మించిన ప్రణాళిక – పట్టణ ఆదాయ వనరులకు సాటిరాగల ప్రణాళిక మన గ్రామీణ భారతానికి అవసరం!
Also read: శ్రమజీవిగా బహురూపి
ఇక 2020 సంవత్సరం కరోనా కారణంగా సంబంధించిన కార్మికుల రివర్స్ మైగ్రేషన్ వ్యథ ఈ శతాబ్దపు విషాదం. దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలసలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు, వాటి శివార్ల దగ్గరకు వలసలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండగా మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో – వలసలు జరుగుతున్న రాష్ట్రాలుగా ఉన్నాయి. వీరంతా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఏపీ, కేరళ రాష్ట్రాలకు వెళ్తున్నారు.
అంటే స్థూలంగా రెండు దిశలకు – దక్షిణానికి, తూర్పుకు జరుగుతున్నాయని పరిగణించాలి. 2011 జనాభా లెక్క ప్రకారం దేశంలో ఇలా ఉపాధి కోసం వలసపోయేవారు 45 కోట్లమంది దాకా ఉన్నారు. ఈ సంఖ్య 2001తో పోలిస్తే 30 శాతం పెరిగిందట. 2017-2018 సంవత్సరం లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 23 కోట్ల 80 లక్షల మంది కార్మికులు స్వయం ఉపాధి విభాగంలో ఉన్నారు. మరో 11 కోట్ల 20 లక్షల మంది తాత్కాలిక కార్మికుల విభాగంలో పనిచేశారు. కాంట్రాక్టు పద్ధతి ఒక కోటి 90 లక్షల మంది ఉన్నారని అంచనా.
Also read: హింస… అహింస
రివర్స్ మైగ్రేషన్
ఉన్నపళంగా కోవిడ్ ప్రభంజనంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ మొదలైంది. వీధులు, పట్టణాలు, నగరాలు స్తంభించిపోయాయి. బస్సులు, రైళ్ళు, విమానాలు ఆగిపోయాయి. దుకాణాలు, ఫ్యాక్టరీలు, మాల్స్ – ఇలా ప్రతిదీ మూతబడింది. అప్పుడు మన దేశానికి బోధపడిరది కోట్లాదిమంది కాలినడకన తమ సొంత ఊరికి పయనమయ్యారని. ఎంతకాలం సాగుతుందో తెలియదు, భార్యాపిల్లలు ఎలా ఉన్నారో తెలియడం లేదు, ఉపాధిపోయి భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యింది. దాన్తో ఎవరికి వారు కాలినడకనా ఉన్న మూటాముల్లె చేత దీసుకుని కన్యాకుమారి, మద్రాసు, హైదరాబాదు వైపు నుంచీ బయలుదేరారు. అలాగే బొంబాయి, గాంధీనగర్, అహమ్మదాబాదు వైపుల నుంచీ బయలుదేరారు. తిండిలేక, డబ్బు లేక కాలినడకన కోట్లాది మంది నడవడం ఈ శతాబ్దపు విషాదం! అంటే మనం పాటించిన విధానాల అవకతవకలను ఈ కరోనా పరిస్థితి ఎత్తి చూపింది. టెక్నాలజి, ధనం, వసతులు, సౌకర్యాలున్న వారే వాటిని వినియోగించుకోలేక పోవడం కాస్త ఉన్నవారికి ఇబ్బంది కాగా, ఇవేమీ లేని వలస కార్మికుల దుస్థితి ఎంతో దుర్భరమయ్యింది.
Also read: గాంధీ సినిమా అజ్ఞాత తపస్వి మోతీలాల్ కొఠారీ
నిజానికి ఈ వలస కార్మికుల సంఖ్యకు సంబంధించి అంచనాలన్నీ కాగితం మీద లెక్కింపులే కానీ నిజమైన గణింపులు కాదు. సిసలైన లెక్కింపు సాధ్యం కూడా కాదేమో. ముందు ముందు దీని గురించి లోతయిన, సమగ్రమైన అధ్యయనాలు వస్తాయి. ఇలా వలస కార్మికులు సొంత ఊళ్ళకు రావడాన్ని రివర్స్ మైగ్రేషన్ (ప్రతి వలస) అని పిలుస్తున్నారు. దీన్తో గ్రామీణ భారతం జనాభా ఇపుడు మరింత పెరిగింది. ఇపుడు మనం చెయ్యాల్సిన శోధనం వీరితో కూడిన గ్రామీణ ప్రాంతాన్ని ఎలా తృప్తిగా ఉంచడం అనే విషయం గురించి!
Also read: మానవ లోకానికే ధ్రువతార
(తరువాయి వచ్చే వారం)
—డా నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392