Thursday, November 21, 2024

పరికరాలు కాదు పరమాత్ముడే కావాలి

26.తిరుప్పావై

మాలే మణివణ్ణా మార్-గళి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్

 తెలుగు భావార్థ గీతిక

ప్రళయ కాలమున సాగరమ్ముప్పొంగి ముంచువేళ

నిశ్చింతగా  మఱ్ఱాకుమీద తేలు నీలి మణివర్ణుడా

మార్గళి స్నాన వ్రతానుష్టాన పరికరాలకై వచ్చినాము

జగముగుండెలదరగొట్ట గర్జించుపాంచజన్యము వంటి

ధవళ వర్ణపు శంఖములెన్నొ మాకు కావలయు

పెద్ద ఢక్కివాద్యము, పల్లాండు సెప్పెడి దీపపు సెమ్మెలు

సన్నిధి కోలలున్ ధ్వజ వితానములు ఎన్నో మేలికట్లు

నెలనోము పూర్తికి వలయు వస్తు సంచయమెల్ల నిమ్ము.

మాలే =భక్తులను కాపాడే, మణివణ్ణా= నీలమణివర్ణుడా, మార్-గళి నీరాడువాన్= మార్గళి స్నానం చేయడం కోసం, మేలైయార్ =పెద్దలు, శేయ్-వనగళ్ = చేసే అనుష్టానాలకోసం, వేండువన=కావలసిన ఉపకరణాలు, కేట్టియేల్=మీరు వింటే చెబుతాము,
ఞాలత్తై యెల్లాం = ప్రపంచమంతా, నడుంగ= వణికేట్టు, మురల్వన =ధ్వనిచేసే,
పాలన్న వణ్ణత్తు = పాలరంగును బోలిన, ఉన్-పాంచజన్నియమే =నీపాంచజన్యానికి

తోడైన, పోల్వనశంగంగళ్ =శంఖాలను, పోయ్ ప్పాడుడైయనవే =చాలా విశాలమైన,
శాలప్పెరుం= చాలా పెద్దవయిన, పఱైయే=డక్కాలు, పల్లాండు ఇశైప్పారే= తిరుపల్లాండు పాడే వారు, కోలవిళక్కే=మంగళ దీపాలను, కొడియే=ధ్వజాలను, వితానమే=మేలకట్లను, ఆలిన్-ఇలైయాయ్= ప్రళయకాలంలో మఱ్ఱి ఆకు మీద పవళించినవాడా, యరుళ్ = మాకు అనుగ్రహించండి, ఏలోర్ ఎంబావాయ్ = మా వ్రతపూర్తికోసం. 

ఏమిటా పరికరాలు?

మార్గళి స్నాన వ్రతానికి కావలసిన పరికరాలు ఇవ్వండి అన్నారు. సరే ఏంకావాలి? వేండువన కేట్టియేల్.. కావలసినవేమిటో చెబుతాం కాని మీరు వింటున్నారా? అన్నారు. అయిదులక్షలమంది ఆశ్రితులై రావడంతో ఉప్పొంగిపోయిన స్వామి ఆ ప్రేమలో వింటున్నారో లేదో అనుకుని గోపికలు ‘‘వింటున్నారా’’ అన్నారట.

“ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ధ్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన” నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం అనే అసాదారణ ఆయుధాలు ఉంటాయికదా. శంఖ చక్రాలను ఆ పరమాత్ముడు మాత్రమే ధరించి భరించ ప్రయోగించగల శక్తమంతుడు. మరెవరికీ అవి అమరవు.

నన్ను కావాలనుకున్న వారు పఱై (ఢక్కా వాద్య పరికరం) కావాలని ఎందుకు అడుగుతున్నారు? అవి ఎన్నికావాలని శ్రీ కృష్ణుడు గోపికలను అడిగాడు. ఈ పఱై గానీ వ్రతంగానీ, వర్షంకోసం వ్రతం చేయాలనడం కోసం కేవలం సాకులు మాత్రమే. నిజానికి నిన్ను చూడడమే ఈ వ్రతం లక్ష్యం. ఈ వ్రతానికి మార్గళి స్నానం అనుష్టానం అని పెద్దలు అంటున్నారు. శంఖాలు, పఱై వాయిద్యాలు, మంగళాశాసనం చేసేవారు, దీపాలు, కేతనాలు, గొడుగులు మొదలైనవి మాకు ఇమ్మని గోపికలు ప్రార్థిస్తున్నారు.పైకి పెద్దలకోసం చేసిన వ్రతానికి కావలసిన పరికరాలు, కాని ఆంతరముగా భగవదనుభూతికి కావలసిన సామగ్రిని వారు అడుగుతున్నారు కాని నీతో సంశ్లేషమే స్నానం అని గోపికలు వివరించారు.

గోపికలు అడిగినవి ఇచ్చిన శ్రీకృష్ణుడు

గోపికలు పాంచజన్యం అడిగితే దాన్ని వదిలి ఉండలేక పరమత్ముడూ తమతో ఉంటాడని వారి వ్యూహం. శాలపెరుమ్బత్తియే చాలా పెద్ద మద్దెల కూడా శంఖానికి తోడు కావాలన్నారు. పల్లాండు శెప్పార్ కోల విళక్కే కొడియే వితానమే… మార్గళి స్నానానికి వెళ్తున్నప్పుడు పల్లాండుచెప్పేవారు (మంగళం పాడే వారు), చీకటి లో నడుస్తారు కనుక మంగళ దీపం, చలిలో మంచు పడకుండా తలమీద ఆచ్ఛాదన వస్త్రం కావాలని అడిగారు. ఇవన్నీ ఇంతమందికి నేనివ్వగలనా నాదగ్గర ఉన్నాయా అని పరమాత్మ అన్నారట. లోకాలన్నీ కడుపులో దాచుకుని ఏ ఆధారమూ లేకుండా చిన్న మఱ్ఱి ఆకు మీద పవళించి ఈ ప్రపంచాన్నంటినీ ఉద్ధరించిన నీకు ఆలినిలైయాయ్ అసాధ్యం ఏదైనా ఉందా? అని గోపికలు అన్నారు.ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. వాయిద్యం అంటే తను వెన్న తినేప్పుడు  ఘట నృత్యం చేసేప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కనక, తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు.తనను ఆశ్రయించే జనులమీద ఎంత వాత్సల్యం లేకపోతే వైకుంఠం వదిలి సౌలభ్య గుణాన్ని ప్రకటిస్తూ రేపల్లెలో శ్రీకృష్ణుడు వెలుస్తాడు? సర్వాధికుడైనా సర్వసులభుడాయన.

శ్రీకృష్ణుడు ఇంద్రనీలమణి, (కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణుడు)

శ్రీకృష్ణుడిని ఇంద్రనీలమణితో పోల్చి, ఆ మణి ఉన్నవాడే సంపన్నుడు అంటున్నారు గోదమ్మ.  ఇక్కడ స్నానమంటే క్రిష్ణయ్య గుణగానం చేయడమే. శంఖం అంటే ప్రణవం. ప్రణవం భగవచ్ఛేషత్వమును బోధిస్తుందని కందాడై రామానుజాచార్యులు వివరించారు. గోపికలు ప్రణవ శబ్ద కైంకర్యం అడుగుతున్నారు. చాలా పెద్ద పఱ కావాలట.  ఆ పఱ అష్టాక్షరిలో ‘నమః’. పురుషార్థములో దోషమును పోగొట్టే పదం నమః.  అనన్యార్హ శేషత్వ జ్ఞానమును, పారతంత్ర్య జ్ఞానము, భాగవత సహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము భగవత్ కైంకర్యము, కైంకర్యమున భోక్తృత్వ బుద్ధి నివృత్తి కావాలని గోపికలు క్రిష్ణయ్యను అడుగుతున్నారని గోదాదేవి మనకు తెలియజేస్తున్నారు ఈ పాశురంలో.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles