————————-
At the Fair
(From ‘The Wanderer ‘ by KAHLIL GIBRAN)
అనువాదం: డా: సి. బి. చంద్ర మోహన్
10. సంచారి తత్వాలు
—————————-
ఒక అందమైన పల్లెటూరి యువతి సంతకు
వస్తుంది. ఆమెముఖం కలువ, గులాబీల మృదుత్వాన్ని సంతరించుకుంది. నల్లటి మేఘాలలాంటి కురులు. పెదవులపై ఉషోదయం లాంటి హాసం.
ఆ అందమైన యువతి వారి దృష్టిలో పడగానే, సంతలోని యువకులు కోరికతో ఆమెను చుట్టుముట్టారు. ఒకడు ఆమెతో నాట్యం చేయడానికి తయారైతే, ఇంకొకడు ఆమె కోసం కేకు తీసుకు వచ్చాడు. అందరి కోరికా ఆమెను ముద్దాడాలనే! సంత కదా!
ఆ యువతి కంగారు పడింది. ఆశ్చర్య పోయింది ! వాళ్ళను చెడుగా అనుకుంది. మంద లించింది. ఒకరిద్దరిని ముఖంమీద కొట్టింది కూడా!
తరవాత వాళ్లనుండి దూరంగా పరిగెత్తింది.
ఇంటికి వెళుతూ తనలో తాను ఇట్లా నుకుంది. ” నాకు అసంతృప్తి గానూ, చిరాగ్గాను ఉంది. వాళ్ళు ఎంత అసభ్యంగా, కుసంస్కారంగా ప్రవర్తించారు ! వారి ప్రవర్తనతో నా సహనం నశించింది.”
ఏడాది గడిచింది. ఆ ఏడాదిలో ఆమె మనుషుల ప్రవర్తన గురించి, సంతల గురించీ చాలా ఆలోచించింది. అదే నాజూకైన ముఖంతో, నల్లటి కురులతో, ఉషోదయ హాసంతో ఆమె మరలా సంతకు వచ్చింది.
ఈసారి యువకులు ఆమెను చూసి ముఖం తిప్పుకున్నారు. పలకరించే వారు కరువై , రోజంతా ఆమె ఒంటరిగానే తిరిగింది.
ఆ సాయంత్రం ఇంటికి వెళుతూ మనసులో దుఃఖంతో ఇట్లా అనుకుంది. ” నాకు అసంతృప్తి గానూ, చిరాగ్గాను ఉంది. వాళ్ళెంత అసభ్యం గాను, కుసంస్కారులు గానూ ఉన్నారు . నా సహనం నశించింది!”
Also read: సంచారి తత్త్వాలు
Also read: సందేహం – సంకల్పం – సందేశం
Also read: ఇద్దరు రాకుమార్తెలు