Thursday, November 21, 2024

భద్రతా లోపం, ప్రచార పటాటోపం

  • ఎన్నికల ప్రచారాస్త్రంగా మలచుకున్న బీజేపీ, కాంగ్రెస్
  • పంజాబీ ఆత్మగౌరవ ప్రస్తావన తెచ్చిన ముఖ్యమంత్రి చన్నీ
  • ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిజం నిగ్గు తేల్చాల్సిన అవసరం
  • అంతర్జాతీయంగా అపహాస్యం కాకుండా చర్యలు చేపట్టాలి

ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం  తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విచారణా చర్యలు ప్రారంభమైనాయి. అసలేం జరిగిందో రేపో మాపో ఏదో ఒకరోజు తేలకపోదు. ఈ లోపు దీని చుట్టూ రాజకీయ దుమారం చెలరేగిపోతోంది. పంజాబ్ సహా పలు రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ప్రతి సంఘటనా రాజకీయమయమై పోతోంది. ఎన్నికల లబ్ధి కోసం ఎవరి తరహా విన్యాసాలు వారు మొదలుపెట్టారు. ఈ ఓట్ల ఆట ఎట్లా ఉన్నా,దేశాధినేత రక్షణ విషయంలో జరిగిన ఈ వైఫల్యాన్ని నిగ్గు తేల్చాల్సిందే. ఇది అసాధారణ మైన అంశం కాబట్టి అత్యంత త్వరిత గతిన విచారణ ముగించి, బాధ్యులను వెల్లడించాలి. స్వీయ రక్షకభటులే దేశప్రధానమంత్రిని మట్టుపెట్టిన అత్యంత ఘోరమైన ఘటన మన దేశంలోనే జరిగింది. శ్రీ పెరంబుదూర్ లో జరిగిన మానవబాంబు దాడికి మరో మాజీ  ప్రధానిని కోల్పోయాం. బలైపోయిన ఇద్దరు ప్రధానులు తల్లి, కొడుకులే కావడం మరో విషాదం. వారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అనే విషయం అందరికీ తెలిసిందే. జాతిపితగా భావించే మహాత్మాగాంధీ కూడా హత్యకు గురైన దుర్ఘటన కూడా మన దగ్గరే జరిగింది. ఈ ఘోరాలకు కారకులు ఎవరైనా కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. రక్షణ వైఫల్యం ఉందన్నది ఒప్పుకొని తీరాలి.

Also read: నవ వసంతానికి స్వాగతం

డొల్లతనం బయటపడింది

Punjab CM Charanjit Singh Channi threatens to sit on dharna outside Raj  Bhawan over 'delay' in clearing Bills | Cities News,The Indian Express
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ

ప్రపంచ దేశాల ముందు మనం చెడ్డపేరు మూటగట్టుకున్నాం కూడా. ఎన్నికల ప్రచార సమయంలో దేశంలోని ముఖ్యనేతలెందరికో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాడులు కూడా జరిగాయి.వాటిన్నటి నుంచి ఏమి పాఠాలను నేర్చుకున్నాం? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా వ్యవస్థలలోని డొల్లతనం బయటపడుతోందనే విమర్శలకు మన దగ్గర సహేతుకమైన సమాధానాలు ఉన్నాయా? దేశాధినేతల భద్రతా వ్యవస్థ ఇలా ఉంటే, దేశ భద్రత ప్రశ్నార్ధకమే అనే అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు కోట్లాది మెదళ్లను తొలుస్తున్నాయి. పంజాబ్ తాజా సంఘటనను గమనిస్తే, కేంద్ర – రాష్ట్ర రక్షణ వ్యవస్థల మధ్య సమన్వయం కూడా అనుమానం రేకెత్తిస్తోంది. నిజంగా  ఆలా జరిగిఉంటే, కారకులెవరైనా అది క్షమార్హం కాదు. ఘటన జరిగిన పంజాబ్ రాష్ట్రం కాంగ్రెస్ ఏలుబడిలో ఉండడంతో రాజకీయ రంగులు చకచకా మారిపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపేందుకు కాంగ్రెస్ అధినేతలు, పంజాబ్ ప్రభుత్వం కుట్ర పన్నారని బిజెపి ఎంపీలు నిరసనలకు దిగారు. ప్రధానమంత్రి సభకు ఆశించిన స్థాయిలో జనం లేకపోవడం వల్ల వెనుతిరిగి వెళ్లిపోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి,ఈ ఘటనను సెంటిమెంట్ గా మలిచి, భావోద్వేగాలను రెచ్చగొట్టి,పంజాబ్ సహా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవడానికి బిజెపి అల్లిన పెద్ద రాజకీయ వ్యూహంగా విపక్షాలు ప్రతిదాడి చేస్తున్నాయి.

Also read: పుస్తక మహోత్సవం

PM Modi's SPG Protection Now Has A Budget Of Around Rs 600 Crore
ప్రధానికి రక్షణగా నిలిచిన ఎస్ పీజీ యోదులు

ఆందోళనలు చేస్తున్న రైతుల దగ్గరకు వెళ్లి రక్షణ అధికారులు సంప్రదించి ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోయేవారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. జరిగిన ఘటనపై విచారించే కమిటీలో ఎవరినైనా నియమించుకోవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి అంటున్నారు. దేశ రక్షణలో మొదటి నుంచీ అంకితమవుతున్నది పంజాబీలేనని, వారిపై మచ్చ వేస్తే సహించేది లేదంటూ పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎదురుదాడికి దిగుతున్నారు. పంజాబీల ఆత్మగౌరవాన్ని ఎన్నికలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మలిచి, తన రాజకీయ చతురతను చాటుకొనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు.

Also read: యథావిధిగా ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పరీక్ష

ఎస్ పీజీ పాత్ర కీలకం

ప్రధానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ ఆషామాషీగా ఉండదు. పర్యటనలు జరిగే సమయంలో ఇంకా కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన భద్రతలో సీక్రెట్ సర్వీస్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ( ఎస్ పీ జి ) ప్రధాని భద్రతను చూసుకుంటుంది. ప్రధాని భద్రతకు 3000 మందితో కూడిన మెరికాల్లాంటి సిబ్బంది ఎస్ పీ జి లో ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘ బ్లూ బుక్’ లోని అంశాలను అందరూ అనుసరించాల్సి ఉంటుంది. పర్యటనకు ముందుగానే ఎస్పీజి అధికారులు, పర్యటన జరిగే రాష్ట్రాల పోలీసులు, ఇంటలిజెన్స్ బ్యూరో మధ్య సమీక్షాసమావేశాలు జరుగుతాయి. డ్రిల్ కూడా నిర్వహిస్తారు. ప్రధాని ఏ మార్గంలో పర్యటించినా, కేంద్ర, స్థానిక ఇంటలిజెన్స్ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పర్యటనలో హటాత్తుగా వచ్చే మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందిస్తారు. ఎస్పీజి భద్రత వ్యవహారాలు చూసుకున్నా, రోడ్ క్లియరెన్స్, ఇంటలిజెన్స్ సేకరణ, ట్రాఫిక్ కంట్రోల్ మొదలైన వాటిని రాష్ట్ర పోలీసులు చూసుకుంటారు. ప్రధానమంత్రి భద్రతా వ్యవస్థ ఎంతో పటిష్ఠమైంది. పంజాబ్ తాజా ఘటన విషయం చుట్టూ రాజకీయ దుమారాలు అలుముకుంటున్నవేళ,ఈ అంశం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.

Also read: స్వర్గానికి నిచ్చెనలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles