- తెలుగు వెలుగుల వారసుల సత్కారం
- కవిత్రయ వేదికపై తెలుగు సంబరాలు
- తెలుగు భాషాప్రేమికులకు మహదానందం
- భీమవరంలో తెలుగు పండుగ
‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలుగు మహోత్సవాలు మహోన్నతంగా జరుగనున్నాయి.భీమవరం వేదికగా ఈ నెల 6 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకూ జరిగే ఈ తిరునాళ్లకు ‘అంతర్జాతీయ తెలుగు సంబరాలు’ అని నామకరణం చేశారు. ఆంధ్ర సారస్వత వికాసానికి ప్రతీకగా నిలిచే రంగాలన్నింటినీ రంగరిస్తూ ఈ ఉత్సవాన్ని రూపకల్పన చేయడం తెలుగు భాషా సాంస్కృతిక ప్రేమికులందరికీ మహదానందాన్ని కలిగించే అంశం. ఈ సంబరాలు నిర్వహించే ప్రాంగణానికి ‘కవిత్రయ వేదిక’ అని పేరు పెట్టడం కడు ముచ్చటగా ఉంది. దశ దిశల నుంచి ప్రముఖులెందరో తరలి వస్తున్నారు.
Also read: మాయరోగం కరోనా మటుమాయం అవుతుందా?
అవధానం నుంచి కూచిపూడి వరకూ
ఇది మనదేనని సగర్వంగా చెప్పాల్సిన ‘అవధానం’ మొదలు కూచిపూడి వరకూ శోభాయమానంగా విలసిల్లుతున్న సారస్వతమయమైన ప్రక్రియలన్నింటినీ మరోమారు గుర్తుచేసుకొనే సౌభాగ్యం దక్కబోతోంది. ‘అవధానం’ మన సంతకమైతే, ‘పద్యం’ మన సొమ్ము. పండిత పామరులందరినీ దశాబ్దాల నుంచి ఊర్రూతలూగిస్తున్న విశిష్ట ప్రక్రియ పద్య ‘నాటకం’. బుర్రకథలు, కోలన్నలు, భజనలు ఇప్పటికీ పల్లెల్లో సందడి చేస్తూనే ఉన్నాయి. ఎన్నో రూపకాలకు ఆదిగా నిలిచే జానపదాల విశేషాల గురించి చెప్పాలంటే ఎన్నో పదాలను ప్రోది చేసుకోవాల్సిందే. ఆధునిక ప్రపంచ సాహిత్య చరిత్రలో మన నవలలు, కథలు, కథానికల స్థానం తక్కువది కాదు. భారతదేశంలో ఎన్ని రకాల నృత్య ప్రక్రియలు ఉన్నా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాట్య విధానం పుట్టి పెరిగినా, మన ‘కూచిపూడి’ నడక తీరే వేరు. ‘యక్షగానాలు’ దక్షిణాదిలో, ముఖ్యంగా కర్ణాటకలో ప్రాముఖ్యతను సంతరించుకున్నా, పురుడు పోసుకుంది మన దగ్గరే అనే విషయం మిగిలినవారు మర్చిపోయినా, మనం మరవ రాదు. ‘అవధానం’ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తెలుగువాడి ఏకాగ్రతకు, జ్ఞాపకశక్తికి, ఆత్మవిశ్వాసానికి సద్యఃస్ఫురణకు, పద్యస్ఫురణకు, ఆశుకవితా నిర్మాణ నిపుణతకు, చతురతకు ‘అవధానం’ పతాకమై ప్రతీకగా నిలుస్తుంది. యావత్తు దక్షిణాది సంగీతానికి రాజభాష వంటిది మన శాస్త్రీయ సంగీతం. కర్ణాట సంగీత సామ్రాజ్యానికి సార్వభౌములు మన వాగ్గేయకారులు. యక్షగాన, భజన సంప్రదాయానికి నారాయణతీర్ధుడు గురుశేఖరుడు. సంగీత త్రిమూర్తులలో ఇద్దరు మూర్తులు మనవాళ్లే. త్యాగాయ్య, శ్యామశాస్త్రిని విడిచి కర్ణాట సంగీతం గురించి మాట్లాడడం సాధ్యమా? పదకవితకు అన్నమయ్య పితామహుడు. రామునికి ఎంతమంది దాసులు ఉన్నా, మన రామదాసు తర్వాతే నిలబడతారు.
Also read: నవ వసంతానికి స్వాగతం
తెలుగు వాగ్గేయకారులు శిఖరాయమానం
భారత వాగ్గేయకార చరిత్రలో తెలుగు వాగ్గేయకారుల స్థానం శిఖరాయమానం. ‘హరికథ’ను అందలమెక్కించిన ఘనత మన ఆదిభట్ల నారాయణదాసుది. ‘బుర్రకథ’కు ప్రపంచాన్ని దాసోహం చేసిన చరిత మన నాజర్ ది. మాండొలిన్ ను మార్మోగించిన మహత మన శ్రీనివాస్ ది. ఇంగ్లిష్ జర్నలిజాన్ని మలుపు తిప్పిన కోటంరాజు రామారావు,కోటంరాజు పున్నయ్య,ఎం.చలపతిరావు, కుందుర్తి ఈశ్వరదత్, ఖాసా సుబ్బారావు,సీ వై చింతామణి వంటి మహనీయులెందరో మన తెలుగువారే. తెలుగు సారస్వాత వైభవానికి దివిటీలు పట్టిన ప్రక్రియలను గుర్తుచేస్తూ, ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క శకటాన్ని తీర్చిదిద్ది ఈ వేడుకలలో ప్రదర్శనకు నిలపడం రమణీయం. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవుల వంటి మహాకవులు, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు వంటి మహా వాగ్గేయకారులు, ఆదిభట్ల నారాయణదాసు వంటి మహా కళాస్వరూపులు ఎలా ఉండేవారో మనకు తెలియదు. మొన్నటి తిరుపతి కవులు, కొప్పరపు కవులు, ఆదిభట్ల, గురజాడ, గిడుగు వంటి మహనీయులను చూసిన తరం కూడా నేడు కనుమరుగై పోయింది. వారి వారసులందరినీ ఆహ్వానించి పూర్ణకుంభ స్వాగతంతో సత్కరించే వినూత్న కార్యక్రమానికి ఈ వేడుక శ్రీకారం చుట్టడం కమనీయం. వారితో పాటు వివిధ రాజ్యాధిపతులు, సంస్థానాధీశుల వారసులను కూడా చూసే అదృష్టాన్ని ఈ వేదిక కలుగజేస్తోంది. సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంబరాలు హోరెక్కనున్నాయి.ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయిలో జరుగుతున్న తెలుగు మహోత్సవం ఇదే. ‘ఎక్కడ చూచినన్ కవులే, ఎక్కడ చూడ శతావధానులే, మరెక్కడ చూచిన ప్రబంధకర్తలే’ అన్నట్లు ఈ సంబరాల నిర్మాణం కనిపిస్తోంది. ఎందరో కవులు, కళాకారులు, ప్రముఖులు, ప్రతిభామూర్తులు ఒక్కదరి చేరుతున్న ఈ తెలుగు తిరునాళ్ళు నభూతో నభవిష్యతిగా నిలుచుగాక. తెలుగువెలుగులు ఎల్లకాలం విరజిమ్ముతూ ఉండుగాక. ‘దేశభాషలందు తెలుగు లెస్స’గా కలకాలం మనుచుగాక.ఆంధ్రమేవ జయతే… అనే నినాదంతో ముందుకు సాగుతున్న ‘ ఆంధ్ర సారస్వత పరిషత్’ మరిన్ని తెలుగు పండుగలను కన్నుల పండువగా నిర్వహించుగాక. కరోనా మళ్ళీ ముసురుకుంటున్న ఈ తరుణంలో, ఇంత జనసందోహం మధ్య వేడుకలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తూ, స్వయం క్రమశిక్షణతో ప్రవర్తించడం అత్యంత ముఖ్యం. జయహో! తెలుగుభాష – జయజయహో! తెలుగుజాతి!
Also read: పుస్తక మహోత్సవం