గోదా గోవింద గీతమ్ 17
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
అన్నజల వస్త్రంబులందరికిచ్చు నందగోపాల ఆచార్య
వ్రేపల్లె వేలుపా వేచి ఉన్నారు జనమెల్ల మేలుకొనవయ్య
ప్రబ్బలి ప్రమదల చిగురు యశోద మంత్ర మహిమ
గగనమ్ముచీల్చి లోకాల నిండిన నిత్యసూర నేత నిగమసార
యదు కుల కీర్తి పతాక యశోదానందన యమునావిహార
మెరుగుపసిడికడియాల భాగవతోత్తమ బలరామ దేవ
ద్వయమంత్రముల రూపు కదా మీ సోదర ద్వయము
నీవు నీతమ్ముడును లేచి మమ్మాదరించరయ్య.
అర్థాలు
అమ్బరమే = వస్త్రములు, తణ్ణీరే = చల్లని నీరు,శోఱే = అన్నము, అఱం = ధర్మం, శెయ్యుం= చేయునట్టి ఎమ్బెరుమాన్ = మాస్వామీ, నందగోపాలా! =నందగోపాలనాయకుడా, ఎరుందిరాయ్ =లేవయ్యా,కొన్బనార్కు ఎల్లాం= ప్రబ్బలి మొక్కవలె యున్న స్త్రీలందరికీ, కొళుందే! =చిగురువలె నుండే దానా, కుల విళక్కే= కులదీపమువంటి దానా, ఎమ్బెరుమాట్టి = మాస్వామినీ, యశోదా! =యశోదమ్మతల్లీ, అఱివుఱాయ్ = నిదురలేవమ్మా, అమ్బరం =ఆకాశమును, ఊడఱుత్తు =మధ్యగా భేదించి, ఓంగి = పెరిగి, ఉలగ = లోకములను, అళంద= కొలిచిన, ఉమ్బర్ కోమానే! = నిత్యసూరులకు రాజయినవాడా, ఉఱంగాదు-= నిదురించరాదు, ఎరుందిరాయ్= మేల్కొనుము. శెమ్ పోల్ కళల్ = ఎర్రని బంగారముతో చేసిన కడియము ధరించిన, అడి= పాదముగల, చ్చెల్వా బలదేవా!= బలరాముడా, ఉమ్బియుం = నీ తమ్ముడును, నీయుం =నీవును, ఉఱంగ్-ఏల్ = మేల్కొనండి.
Also read: నందుని భవనమే మంత్రము, నందుడే ఆచార్యుడు
గోదాదేవి గోపికలు నందగోపుని భవన ద్వారపాలకుల అనుమతి తీసుకుని లోనికి వచ్చిన తరువాత నందరాజును, బలరామ శ్రీకృష్ణ యశోదామాతలను నిద్రలేపుతున్న దృశ్యం ఈ పాశురంలో సాక్షాత్కరిస్తుంది. ఇందులో పరిపాలనా లక్షణాలను గోదాదేవి వివరిస్తారు.
రాజు తన ప్రజలను తల్లిదండ్రులవలె కాపాడుకోవాలి. వారి ఆకలి తెలిసి అన్నం పెట్టాలి. కట్టుబట్ట లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఇల్లూ వాకిలి లేని వారికి ఇళ్లు ఇవ్వాలి, దాహం తీరని వ్యక్తులకు భూములకు నీరు ఇవ్వాలి. ఆ విధంగా అపరిమితంగా నిస్వార్థంగా దానాలు చేసే రాజు నందరాజు. ఆ చిన్న రాజ్యానికి ఆయన ఉత్తమమైన ప్రభువు. నందగోపాలుడు వ్రేపల్లెలో జనప్రియమైన నాయకుడు. వస్త్రాలు కావలిసిన వాడికి వస్త్రాలు, త్రాగునీరు కావలసిన వారికి త్రాగునీరు, అన్నం అడిగే వారికి అన్నం, ధర్మబుద్ధితో, ప్రతిఫలాక్షలేకుండా ఇచ్చే ఉత్తముడు. అటువంటి మాస్వామీ మేలుకోవయ్యా అని శుభోదయం పలుకుతున్నారు.
Also read: విభీషణుడి చిత్తశుద్ధి, ద్రౌపది భావశుద్ధి
గోదమ్మ పాదాలకు శరణు శరణు
Also read: భాగవత సహవాసం వల్లనే గురుకృప
మాడభూషి శ్రీధర్
1.1.2022