తిరుప్పావై భావార్థ గీతిక 12
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
దూడల తలచి చేపునకు వచ్చి ఎనుములు పాలు స్రవించ
కుండలన్నియునిండి, పొంగి పొరలి సంపదలు వరదలెత్తు
సొంతపనులు వదిలి కృష్ణుసేవించు భాగ్యశాలి సోదరివీవు
మంచుకురియు సమయాన నీ గుమ్మాల వేలాడుతున్నాము
సతిని విడదీసిన దుష్టు దశకంఠు దునిమాడిన దాశరథి
పుంసాం మోహనరూపుని మిగుల కీర్తించి నిలిచినాము
వ్రేపల్లె వాడవాడలందు నీ నిదుర కీర్తి నిండార వ్యాపించె
ఇకనైన కలసి భజింతము రావమ్మ సిరినోము నోచవమ్మ
అర్థం
కనైత్తు= (పాలుపితికే వారు లేకపోవడం వల్ల) అరచి, ఇళం కన్ఱు ఎరుమై=లేగదూడలనుగల ఎనుములు, కన్ఱుక్కు ఇఱంగి= లేగలపైజాలిగొని, నినైత్తు = దూడ తనపొదుగులో మూతిపెట్టినట్టు తలచి, పాల్ శోర= పాలుకార్చుచుండగా, ఇల్లమ్ ననైత్తు= ఇల్లంతా తడిసి, శేఱు ఆక్కుమ్ = బురదఅవుతున్నట్టున్న, నర్ చెల్వన్= శ్రీకృష్ణకైంకర్యముచేత గొప్ప ఐశ్వర్యముకలిగిన వ్యక్తియొక్క, తంగాయ్=చెల్లెలా, తలైపనివీఝ= మాతలలపై మంచు పడుతుండగా, నిన్ వాశల్ కడైపట్రి = నీ ఇంటి గుమ్మాన్ని పట్టుకుని, తెన్ ఇలంగైకోమానై= సిరిసంపదలతో విరాజిల్లే లంకకు రాజైన రావణాసురుని, శినత్తినాల్ చ్చెట్ర= శ్రీదేవినుంచి ఎడబాటుచేసినాడన్న కోపంతో చంపిన, మనత్తుక్కు ఇనియాయై= మనసుకు హాయికలగించే (మనోహరుడైన) శ్రీరామచంద్రుని, ప్పాడవుమ్= మేము స్తుతించినప్పడికీ, నీవాయ్ తిఱవాయ్=నీనోరు తెరిచి మాట్లాడడం లేదే, ఇనిత్తాన్= ఇకనైనా, ఎఝుందిరాయ్= మేలుకో, ఈదు ఎన్న పేరురక్కమ్ = ఇదేమి పెద్ద నిద్ర, అనైత్తు ఇల్లత్తారుమ్= గోకులంలి ఇళ్లలో ఉన్నవారందరికీ, అఱిందు = నీ గాఢనిద్రగురించి తెలిసిపోయింది.
Also read: రామదర్శనంతో దశరథుడికి యవ్వనం
గేదెలకు పాల చేపులు వస్తున్నాయి. దగ్గర్లో దూడలు లేవు. యజమానులు పాలుపితకడం లేదు. దూడలు తమ పొదుగులను నోట్లో పెట్టుకున్నట్టు భావించి దయతో గేదెలే పాలను స్రవిస్తున్నాయి. దాంతో పాలు ఇల్లంతా నిండి బురదబురద అయింది. గేదెలకున్న దయాభావం నీకు మాయందులేదే. ఆశ్రితుల విషయంలో భగవంతుడు ఈ గేదెల వలె పరితపిస్తుంటాడట. మేఘాలు తెరపి ఇస్తూ కురుస్తాయి, కాని ఈ గేదెలు ఎడతెరిపి లేకుండా పాలు కురుస్తున్నాయి. నీ ఇంట్లో గేదెలు దూడలను తలచుకుని పాలిస్తున్నాయే, నీ కోసం మేము వచ్చినా నీవు ఓ మాటైనా పలకడం లేదే అని అడుగుతున్నారు గోపికలు.
Also read: శివుడు ప్రత్యక్షమైతే సూదిలో దారం ఎక్కించమన్న భక్తుడు
లక్ష్మణుడు అన్న కార్యంలో నిమగ్నమై ఉండి తన సొంత అగ్ని కార్యం, అనుష్టానం అన్నీ మరిచినట్టు, యాదవులు శ్రీకృష్ణకైంకర్యంలో పడి విద్యుక్తధర్మమైన పాలుపితికే పని వదిలేసారట. భగవంతుడి మీద ప్రేమతో అతన్ని విడిచి ఉండలేక, తన పనులు చేసుకోలేని దశలో స్వధర్మాన్ని మరిచిపోతే దోషమే కాదు. ఈ అంశాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఈ విధంగా వివరించారు:
‘‘ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తనురాముని సేవలో నిమగ్నమై తన దైనందిన బాధ్యతలను (నిత్య కర్మలు) పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, తన బాధ్యతలను నిత్య కర్మలను పాటించేవాడు. భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే’’.
కైక వరాల ప్రకారం దశరథుడి మాటపై అడవికి వెళ్లిన రాముడు, అయోధ్యనుఏలుకోవడానికి 14 ఏళ్ల దాకా రాడని భరతుడికి తెలుసు. కనుక వచ్చేటపుడే పాదుకలు తెచ్చుకుంటాడు. అన్న ఎంత బతిమాలినా రానంటాడు. అప్పుడు సరే ఈ పాదుకలమీద నీ పాదాలు ఉంచుసోదరా. వాటని నా నెత్తిన పెట్టుకుని పూజిస్తాను. సింహాసనం పైన ఉంచి పాలిస్తాను అంటాడు. రాముడికి సరేననక తప్పదు. భరతుడు తన పనులన్నీ చేసుకుంటూ అయోధ్యను పాలిస్తూ కూడా అన్న రాముడిని మరిచిపోలేదు. మౌనంగా రాముడిని ధ్యానిస్తూనే ఉన్నాడు. కనుక భరతుడు ముని. తను చేయవలసిన పనులన్నీ వదిలి రాముని పనులు మాత్రమే చేసే లక్ష్మణుడు యోగి. ఇరువురూ ఆదర్శ సోదరులే.
Also read: భగవంతుడిని తెలుసుకుంటే అన్ని నోములు నోచినట్టే
తన ఐశ్వర్యమంతా పాల వలె నేలపాలవుతున్నా, శ్రీ కృష్ణ కైంకర్యమే అక్షయమైన సంపద అని భావిస్తున్న భాగవతోత్తముని చెల్లెలు ఈనాటి గోపిక.కింద పాలప్రవాహం పారుతున్నది.మధ్యలో కృష్ణుని పట్ల మా ప్రేమ కూడా ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్నది. అందులో చిక్కుకు పోయి మీ వాకిలి గుమ్మాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. మా దీనావస్థ కాస్త గమనించు అంటున్నా ఇంకాస్సేపు చూద్దాం అనుకుని గోపిక మౌనంగా పడుకునే ఉందట. రాముడు మనోభిరాముడు, మనసుకు మలయమారుతం వలె తాకుతాడు, వెన్నెల వలె చల్లగా ఉంటాడు. చందనం వలె చల్లని సువాసనలు వెదజల్లుతాడు. ఆ మనోహరుడిని కీర్తించినా నీమనసు కరగడం లేదే, నోరు తెరవడం లేదే. అని బయటనున్న గోపికలు కోప్పడుతున్నారు.
Also read: అహంకార, కామ క్రోధాలే రాక్షసులు
దక్షిణాన ఉన్న లంక అంటే శరీరం. దక్షిణ దిక్కు మృత్యు స్థానం. రావణుడు మనసు. ఆ మనసును నిగ్రహించేది ఆచార్యోపదేశము. ఆచార్యుడు మౌనము దాల్చరాదు, జ్ఞాన బోధ చేయండి అని కోరుతున్నారు. ఈ పాశురంలో పోయిగై ఆళ్వారులను మేల్కొలుపుతున్నారు. తంగాయ్ అంటే లక్ష్మీ అమ్మవారు. ఆమె పద్మంనుంచి పుట్టిన తల్లి. పోయ్ గై ఆళ్వార్ కూడా తామర పూవునుంచి పుట్టారు. కనుక తంగా అంటే ఈయనను కూడా సంబోధించినట్టు. దూడల వలె అమాయకులైన అజ్ఞులకు ఈ మొదలియాళ్వాన్ సాయించిన తనియద్వారా జ్ఞానబోధ చేశారు.
Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే
మాడభూషి శ్రీధర్ 27.12.21