Sunday, December 22, 2024

ఒరిగిన బాల్ బాడ్మింటన్ శిఖరం పిచ్చయ్య

  • 104వ ఏట హనుమకొండలో కన్నుమూత
  • బాల్ బాడ్మింటన్ దిగ్గజం
  • 9 విడతల జాతీయ చాంపియన్ షిప్ గెలుచుకున్న యోధుడు

బాల్ బాడ్మింటన్ క్రీడలో అర్జున్ అవార్డు అందుకున్న ప్రథమ క్రీడాకారుడు పిచ్చయ్య ఆదివారంనాడు కన్నుమూశారు. జమ్మలమడక పిచ్చయ్య ఎందరో క్రీడాకారులకు గురువు. ఇటీవలనే 104వ జన్మదినం వేడుకగా జరుపుకున్న పిచ్చయ్య తెలంగాణ క్రీడాకారులలో శిఖరసమానులు. అనధికార బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

మేము చిన్నతనంలో ఖమ్మంజిల్లా తల్లాడ గ్రామంలో బ్యాండ్మింటన్ ఆడేవారం. విద్యార్థి దశలోనూ, ఆ తర్వాత నేను మా స్వగ్రామం తల్లాడలో ఉపాధ్యాయుడిగా పని చేసిన రెండేళ్ళ కాలంలోనూ దాదాపు ప్రతి సాయంత్రం బాల్ బాడ్మింటన్ ఆడేవాళ్ళం. నేను లెఫ్ట్ ఫ్రంట్ కానీ సెంబర్ పొజిషన్ లో కానీ ఆడేవాణ్ణి. మాకు ఆ రోజుల్లో పిచ్చయ్య ద్రోణాచార్యుడి వంటి గురువు. అంకులయ్య అనే క్రీడాకారుడు కూడా ఉండేవారు. పిచ్చయ్య, భావనారాయణ అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుల పేర్లమీద బ్యాట్స్ తయారయ్యేవి. మేమందరం పిచ్చయ్య బ్యాట్ తోనే ఆడేవాళ్ళం. ఒక సారి వరంగల్లు వెళ్ళి పిచ్చయ్యను కలిసి పిచ్చాపాటీ మాట్లాడిన సందర్భం గుర్తుకు వస్తున్నది. యువకులను ప్రోత్సహించే విధంగా మాట్లాడేవారు.

మరణానికి అయిదు రోజుల ముందు 104వ పుట్టినరోజు జరుపుకున్న బాల్ బాడ్మింటన్ మాంత్రికుడు జమ్మలమడక పిచ్చయ్య

అటువంటి క్రీడాదిగ్గజం పిచ్చయ్య హనుమకొండ జిల్లా మడికొండలో తన మనుమడి నివాసంతో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతోనే ఆయన మరణించారు. పిచ్చయ్యకు ఇద్దరు కుమార్తెలు – సుశీల, జానకీదేవి. భార్య సత్యవతి 2007లో ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచీ పిచ్చయ్య మనుమడి దగ్గరే ఉంటున్నారు. పిచ్చయ్య కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో 21 డిసెంబర్ 1918న జన్మించారు. బందరులో ఎస్ఎస్ఎల్ సీ వరకూ చదివారు. పదో తరగతి పరీక్ష తప్పారు. బందరులోనే మినర్వాక్లబ్, మోహనక్లబ్ లో బాల్ బాడ్మింటన్ ఆడటం సరదాకోసం మొదలు పెట్టారు. జాతీయస్థాయిలో బాల్ బాడ్మింటన్ క్రీడలో రాణించారు. 1945లొ ఆజంజాహి మిల్స్ లో ఉద్యోగంలో చేరారు. 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బాల్ బాడ్మింటన్ పోటీలలో ప్రథమ స్థానం పొందడంతో పిచ్చయ్య జైత్రయాత్ర ఆరంభమైంది. 1954లో హైదరాబాద్ లో జరిగిన జాతీయ పోటీలలో తన జట్టును విజయపథంలో నడిపించారు. అనంతరం 1956, 1957లలోమద్రాసు, పుదుచ్ఛేరి లో జరిగిన జాతీయ పోటీల్లోపిచ్చయ్య నాయకత్వంలోని జట్టు విజయాలు సాధించింది. 1970లో బాల్ బాడ్మింటన్ లో తొలి అర్జున అవార్డును భారత సర్కార్ పిచ్చయ్యకు బహూకరించింది. నాటి రాష్ట్రపతి వివి గిరి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని 1972లో అందుకున్నారు. 1955 నుంచి 1970 వరకూ పిచ్చయ్య జాతీయ బాల్ బాడ్మింటన్ క్రీడోత్సవాలలో పాల్గొన్నారు. తొమ్మదిసార్లు ప్రథమ స్థానంలోనూ, మూడు సార్లు ద్వితీయ స్థానంలోనూ నిలిచారు. 1970లో తన 53వ ఏట జాతీయ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని విజయం సాధించారు. 1958లో ఆయనకు బాల్ బాడ్మింటన్ మాత్రికుడు అనే బిరుదుతో సత్కరించారు. 1966లో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదుతో గౌరవించారు.  అదే ఆయన పాల్గొన్న చివరి చాంపియన్ షిప్. కానీ తన 91వ ఏట వరకూ ఆయన బాల్ బాడ్మింటన్ ఆడుతూనే ఉన్నారు. 1978లో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పిచ్చయ్యను రవీంద్రభారతిలో ఘనంగా సత్కరించారు. 1997లో ఎన్టీఆర్ క్రీడాపురస్కారాన్ని నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.

పిచ్చయ్య బాల్ బాడ్మింటన్ తో పాటు ఫుట్ బాల్ లోనూ, వాలీబాల్ లోనూ ప్రతిభ కనబరిచారు. ఆ తర్వాత బాల్ బాడ్మింటన్ పైనే దృష్టి నిలిపి శిక్షణ పొందారు.

పిచ్చయ్య కరీంతో కలసి డబుల్స్ ఆటలో దశాబ్దంపాటు ఆధిక్యం ప్రదర్శించారు. 1944 నుంచి వారిద్దరూ చాలా టోర్నమెంట్లు గెలుచుకున్నారు. తనకు ఎదురుగా కోర్టులో రూపాయి బిళ్ల పెడితే దానిని బాల్ తో కొట్టేవారు. అంత గురి చూసి షాట్లు కొట్టడంలో ఆయన దిట్ట. చెప్పులు కానీ బూట్లు కానీ లేకుండా కోర్టులో ఆడేవారు. మొత్తం 1400 టోర్నమెంట్లలో పాల్గొని, తొమ్మదిసార్లు జాతీయ చాంపియన్ షిన్ గెలుచుకున్న ఘనత పిచ్చయ్యది. శరసంధానం శిక్షకుడు పి శంకరయ్య (కొత్తగూడెం), తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, మరో మంత్రి సత్యవతి రాథోడ్,  రాజ్యసభ మాజీ సభ్యుడు ఆనందభాస్కర్, తదితరులు పిచ్చయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles