Thursday, November 21, 2024

అహంకార, కామ క్రోధాలే రాక్షసులు

గోదాదేవి తమిళ పాశురం
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు
ఎరుమై శిఱువీడు,
మెయ్‌వాన్ పరన్దనకాణ్
మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్
కాత్తు, ఉన్నై క్
క్కూవువాన్ వందు
నిన్ఱోమ్, కోదుకలముడైయ
పావాయ్! ఎழுన్దిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాది దేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆ వా వెన్ఱారాయ్‌న్దరుళేలో రెమ్బావాయ్!

కీழ் =తూర్పుదిక్కున, వానమ్ = ఆకాశం, వెళ్ళు = తెల్లబడ్డది, ఎన్ఱు =అని, ఎరుమై =గేదెలు, శిఱువీడు= చిన్నమేత, మేయ్‌వాన్= మేయుటకై, పరన్దనగాణ్ =వ్యాపించినవి, మిక్కుళ్ళ= మిగిలిన, పిళ్ళైగళుం= పిల్లలునూ, పోవాన్=పోవుటయే ప్రయోజనముగా, పోగిన్ఱారై = పోవుచుండగ, వారిని, ప్పోగామల్ =అలా వెళ్ళకుండా, కాత్తు=అడ్డి, ఉన్నై=నిన్ను, కూవువాన్ = పిలుచుటకై, వందు = వచ్చి (నీ యింటి ముందర), నిన్ఱోం =నిలిచితిమి, కోదుకలముడైయ=కృష్ణునికి కూడ కుతూహలము కలిగించు
పావాయ్! =యువతీ! ఎழுన్దిరాయ్! = లెమ్ము! పాడి = గానము చేయుచూ పఱై =పఱై అనెడి వాయిద్యమును, కొండు=అతడినుంచి స్వీకరించి, మా=అశ్వాసురుని యొక్క, వాయ్ =నోటిని, పిళన్దానై=చీల్చినవానిని, మల్లరై = చాణూరుడు, ముష్టికుడు అనే మల్లురను, మాట్టియ= మట్టి కరిపించిన, దేవాదిదేవనై= దేవతలందరికి ఆరాధ్యుడైన శ్రీకృష్ణుని, శెన్ఱు=దగ్గరకు వెళ్ళి, నామ్= మనము, శేవిత్తాల్ =నమస్కరించినట్లైతే, ఆవావెన్ఱు=అయ్యో! శ్రమపడ్డారా! యని, ఆరాయ్‌న్దు = పలుకరించి, అరుళ్ =అనుగ్రహించును, ఏల్+ఓర్+ఎం+పావాయ్=ఇదే మా గొప్ప వ్రతము.

మాడభూషి తెలుగు భావార్థ గీతిక
తూరుపుదెలవారు గోధూళివేళ గోవులు కదిలినాయి
దూడలవెంట ఉదయకిరణాల మెరయు గడ్డిమేయ
నీతోడ కలిసిపోవ నీయింటి వాకిట నిలిచినాము
భక్తిమణిదీపమా మావెంట రావమ్మ హరిని జేర
పఱై పరములగోరెడు నోము నోచుదామని చెప్పుదాము
కేశిరాకాసి నోరు జీల్చి. చాణూరముష్ఠుల గూల్చి
లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె
కృష్ణ సంస్పర్శస్నానాలుజేయ రావమ్మ కృష్ణవేణి.

తూర్పు దిక్కున ఆకాశమంతా తెల్లవారింది. ఉదయాన్నే లేత గడ్డి మేయడానికి గేదెలను నాలుగువైపులా విడిచిపెట్టారు. కృష్ణుడి కోసం వెళ్లడమే ఫలం అనీ అదే వ్రతమని మనతోటి గోపికలంతా మనస్ఫూర్తిగా తలస్తున్నారు. కాని విడివిడిగా పోవడం కన్న కలిమిడిగా పోవడం మంచిదని గోదమ్మ వారిని ఉద్బోధిస్తున్నారు. ఓ చిన్నదానా! నిన్ను కూడా పిలుచుకుని పోవడానికి వచ్చి నీవాకిట నిలబడ్డాం. శ్రీ కృష్ణుడిని చేరాలని నీకూ కుతూహలంగా ఉంది కదా మరి వెంటనే లేచి రావమ్మా. ఆతనిని కీర్తించి పఱై డక్క అనే వాద్యపరికరాన్ని (లేదా ముక్తిని) ఆయన్నుంచి స్వీకరిద్దాం.

రజస్తమోగుణాలసంకేతాలయిన రాత్రి గడచి, సత్వగుణప్రధానమైన లేత రవి కిరణాలు మెలమెల్లగా ఉదయించే సమయం. రజస్సు, తమస్సు అంత తొందరగా వదలవు, కాని తెలతెల్లవారుతుంటే క్రమంగా తగ్గుతాయి. చిన్నబీడు అంటే అప్పుడప్పుడే పెరుగుతున్న లేతగడ్డి. బాగా పెరిగిన బయళ్లకు బయలుదేరి గేదెలు కదిలిపోతూ ఉండడం అంటే రజోతమోగుణాలు తగ్గిపోతూ ఉండడమే అని కవయిత్రి భావం. పరమాత్ముడిని ప్రేమించేవారితో కలిసి వెళ్లడం లేదా వారిని వెంటతీసుకుని వెళ్లడం ఇక్కడ కీలకాంశం.  అందరం కలిసి చేద్దాం మంచిపనులు అనే గోద సందేశమే ఆ సమాజానికి నేటి సమాజానికి కూడా కావలసిందే. ఇది గోపికా పరమైన వ్యాఖ్యానం.

గోదమ్మ నమ్మాళ్వార్ ను, మూడో గోపికను, మేలుకొలుపుతున్నారు. ‘‘అస్మత్సర్వ గురుభ్యోన్నమః  అనే ఆచార్య నమస్కార మంత్రాక్షరాలు అంతర్లీనంగా వెలిగేపాట. సూర్యునికి ఉషస్సే కన్న తల్లి. ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు.  మమ్మల్ని మంచి మార్గాన నడపమని ప్రార్థించే పద్యాలు ఇవి. ఇది మన వేద సంప్రదాయం.

మూర్ఖుల నోళ్లు తెరిపించే మురళీ మనోహరుడు

ఈ రోజు  పాశురంలో కేశి రాక్షస సంహారం కథ ప్రస్తావిస్తారు గోదమ్మ వారు. గుఱ్ఱం రూపం లో ఉన్న కేశి అనే రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతులు పెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. కేశి రాక్షసుడిని చంపడానికి శ్రీకృష్ణుడు ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. కేవలం చేయిని ఉబ్బిస్తూపోయాడు.  ఉబ్బిన చేయి శరీరంలో ఇమడక, ఆ పరిమాణాన్ని భరించలేక ఆ అశ్వరూపాసురుడి నోరు పనిచేయదు. స్వార్థంతో మింగడానికి తప్ప,అజ్ఞానంతో నోరుమూసుకుని ఉండి, మూర్ఖంగా తెరవడానికి ఇష్టపడని, స్వామిని నుతించని వారి నోళ్లను తెరిపిస్తాడు. కేశవుడంటే క అనే పరబ్రహ్మ స్వరూపం, అ అంటే విష్ణు స్వరూపం, ఈశ అంటే రుద్ర రూపం. త్రిమూర్తుల సమ్మేళనం కేశవుడు. అయిదు ఇంద్రియాలు శరీరం అనే రథానికి కట్టిన గుఱ్ఱాలు మనను అయిదు వైపులా లాగుతుంటాయి. మనస్సు అనే కళ్లాన్ని బుద్ధి అనే సారథి చేతులో పెట్టగలిగితే రథం సక్రమంగా సాగుతుంది. లేకపోతే ముక్కలైపోతుందని ఉపనిషత్తులు హెచ్చరిస్తాయి. ఇంద్రియాలను చంపడు కాని అదుపులో పెట్టుకుని మారేట్టు చేయడం గురించి భగవంతుడు వివరిస్తాడు.

ఇంకా కౌమారం దాటక ముందే, బలరామ కృష్ణులు భయంకరులైన మల్ల విశారదులు చాణూర ముష్టికులను ఎదుర్కొని ఓడించారు.చాణూరుడు క్రోధానికి కోపానికి పాపానికి ప్రతీక. కామం కోపం పోవాలంటే గురువు అనుగ్రహం కావాలి. చాణూర ముష్టికులను అవలీలగా సంహరించిన వీరులు. మదజలం స్రవించే కువలయాపీడము అనే మత్తగజంతో పోరాడి, మావటిని చంపి  దాని రెండు దంతములు పెఱికి భుజాన మోస్తూ రామ కృష్ణులిద్దరూ కంసుని సభలో ప్రవేశించి మల్ల వీరులను మట్టి కరిపిస్తారు. మంచెల మీద ఉన్న రాజులు ఆశ్చర్యభయోపేతులవుతూ ఉంటే కంసుని సింహాసనం దగ్గరికి వెళ్లి, ఒక్క ఉదుటున కిందపడవేసి పిడి గుద్దులతో చంపేసిన కృష్ణుడు అప్పడికి ఇంకా యువకుడుకూడా కాదు. నూనుగు మీసాల కౌమార దశస్కుడు. ముష్టికాసురుడు అంటే ఎంత తిన్నా ఇంకా కావాలనే వాడు కామములు తీరని వాడు. చాణూరుడు క్రోధానికి ప్రతీక. కామక్రోధాలను జయించాలి. అందుకుభగవంతుడు  ఆచార్యుని ద్వారా అనుగ్రహించాలి.

మనకు అద్భుతాలగా కనిపించే ఈ లీలలన్నీ శ్రీకృష్ణుడికి గుర్తుండవు. తలచుకోడు. మనమే ఆ భయానక సంఘటనలు తలచి భీతిల్లి శ్రీకృష్ణలీలలు గా పాడి, మంగళాశాసనాలు చేస్తుంటాము.

ఆచార్యుని ఇంటి ముఖద్వారం ముందు నిలిచి వేచి ఉండడం శిష్యుడికి ముఖ్యప్రయోజనం. అశ్వము అహంకారానికి ప్రతీక. చాణూర ముష్ఠికులు కామక్రోధాలకు తార్కాణాలు. ఆచార్యుడు కటాక్షిస్తేనే కదా వీటి అడ్డు తొలగించుకోగలుగుతాం. ఆచార్యుడి దయద్వారా పరమాత్ముడే వీటిని తొలగిస్తాడు. ఈ పాశురం అంతరార్థంలో నమ్మాళ్వారులను మేల్కొలుపుతున్నారు. కోదుకులముడయ పావాయ్ అని సంబోధన. అంటే వ్యామోహము కల పిల్ల అని దీనికి అర్థం.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles