Monday, November 25, 2024

ఇంటర్ విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోండి: ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

విషయం : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు – ప్రభుత్వ నిర్లక్ష్యం- బోర్డు తప్పిదాలు – విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన

గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు – తదుపరి పరిణామాలు చూస్తుంటే మీలో ఆ విజ్ఞత లోపించిందని అర్థమవుతోంది. 2019 ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు పోవడానికి నాడు మీ ప్రభుత్వం కారణమైంది. ఆ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుని, ఇంటర్మీడియట్ బోర్డును సంస్కరిస్తారని ఆశించాం. ఫలితం శూన్యం అని నేటి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. మీ వ్యవహార శైలి చూస్తుంటే తెలంగాణలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేయాలన్న దురుద్దేశం ఉందేమో అనిపిస్తోంది. పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. విద్యకు దూరం చేసి అంధకారంలో ఉంచితే ప్రశ్నించే తత్వం నశిస్తుంది. అందుకే చాపకింద నీరులా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందేమోననిపిస్తోంది.

ఇంటర్మీడియట్ ఫలితాలు – ప్రభుత్వ వైఫల్యాలు

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ క్లాసుల విధానం తెర మీదకు వచ్చింది. ఆన్ లైన్ విద్యాబోధనకు మౌలిక సదుపాయాల కల్పన అన్నది అత్యంత ప్రధానం. ఇంటర్ నెట్, కంప్యూటర్లు – లాప్ టాప్ లాంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ – గురుకుల కళాశాలల్లో చదువు కునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇవి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్నార్థకం. ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత ఉండి, ఇంటర్ నెట్ సదుపాయం కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు కష్టమో – నష్టమో భరించి వారి పిల్లలకు ఈ సదుపాయాలు కల్పించుకోగలిగారు. ఇంటర్ నెట్ సదుపాయం లేని, మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక ఈ సదుపాయాలకు దూరమై ఆన్ లైన్ పాఠాలకు హాజరుకాలేకపోయారు. వీరిలో మెజారిటీ ప్రభుత్వ కళాశాలల్లో చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులే ఉన్నారు. వీరికి ఆన్ లైన్ పాఠాలు అందించే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. వారి విద్యపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. రెక్కాడితే తప్ప డొక్కాడని తల్లిదండ్రులకు వారి పిల్లలకు ఇంటర్ నెట్ సదుపాయం, ల్యాప్ టాప్ లాంటివి కొనిచ్చే స్థోమత ఉంటుందా? ఉపాధి కూలీకి వెళితే తప్ప పూటగడవని కుటుంబాల ఇళ్లల్లో ఇంటర్ నెట్ సదుపాయాన్ని ఆశించగలమా? స్కాలర్ షిప్ వస్తే తప్ప చదవుకోలేని కడుపేద పిల్లల చేతుల్లో లాప్ టాప్ లాంటి ఖరీదైన వస్తువులు ఎలా సాధ్యం? ఇలాంటి సందర్భంలోనే కదా ప్రభుత్వాలు బాధ్యతగా మెలగాల్సింది.

డబ్బున్నోడి పిల్లలకు ఒక విద్య, లేనివాడి పిల్లలకు మరోరకమైన విద్య లభిస్తే అది సమాజంలో అసమానతలకు దారితీయదా? ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం బాధ్యతగా మెగాల్సిన అవసరం లేదా? ప్రైవేటు విద్యకు సరిసమానమైన సదుపాయాలను ప్రభుత్వ కళాశాలల్లో చదవే విద్యార్థులకు కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిదే. ఆ విషయంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నెలకొన్న గందరగోళానికి, విద్యార్థులు – తల్లిదండ్రుల్లో ఆందోళనకు మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ఇటు కరోనా కాటు, అటు ఆన్ లైన్ సదుపాయాలు లేని లోటు

కరోనా కారణగా విద్యార్థులు ఇటు ఫిజికల్ క్లాసులకు హాజరైంది లేదు. అటు ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యే మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేదు. సదుపాయాలను స్వయంగా కల్పించుకునే ఆర్థిక స్థోమత వారికి లేదు. మోడల్ పేపర్లు లేవు… ఇన్ని గందరగోళాల మధ్య ఇంటర్మీడియట్ బోర్డు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించింది. 4,59,242 మంది పిల్లలు పరీక్ష రాస్తే… చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2,35,230 మంది విద్యార్థులు పరీక్ష ఫెయిల్ అయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన వారిలో అత్యధికులు ప్రభుత్వ కళాశాలలు, గురుకులాల్లో చదువుకుంటోన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులే.

కరోనా కారణంగా మేలో జరగాల్సిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా వేశారు. ఆ పరీక్షలు నిర్వహించకుండానే జూలై నుంచి రెండో సంవత్సరం తరగతులు ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు కూడా ప్రారంభమైయ్యాయి. విద్యార్థులు రెండో సంవత్సరం పాఠాల పై దృష్టి సారిస్తోన్న సమయంలో హడావుడిగా మొదటి సంవత్సరం పరీక్షలు పెడుతున్నట్టు ప్రకటించారు. కేవలం నెల రోజుల వ్యవధితో షెడ్యూల్ ఇచ్చారు. ప్రస్తుతం తరగతులు జరుగుతోన్న రెండో సంవత్సరం సిలబస్ పై దృష్టి పెట్టాలా… లేక మొదటి సంవత్సరం పరీక్షలపై దృష్టి పెట్టాలా అన్నది అర్థం కాని విద్యార్థులు అయోమయానికి లోనయ్యారు. వెబ్ సైట్ లో మోడల్ పేపర్లు, బిట్ బ్యాంకు పెడతామని ప్రకటించారు… తీరా పరీక్షలు ప్రారంభమయ్యాక కానీ వాటిని వెబ్ సైట్ లో పెట్టలేదు. ఆన్సర్ షీట్ల వాల్యూవేషన్ పై కూడా విద్యార్థులు – తల్లి దండ్రులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక అధ్యాపకుడు రోజుకు 30 పేపర్లు మాత్రమే వాల్యూవేషన్ చేయాలి. కానీ, చాలా క్యాంపులలో 45 – 50 పేపర్లు వాల్యూవేషన్ చేయించారు. ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్స్ పరీక్షలు కూడా ఉంటాయి. ఫిజికల్ క్లాసులు లేని నేపథ్యంలో ప్రాక్టికల్స్ పెట్టడం కూడా అర్థరహితం అవుతుంది. కానీ, బోర్డు అధికారులు రిజల్ట్స్ కు ముందు హడావుడిగా ప్రాక్టికల్స్ పరీక్ష డిసెంబర్ 3 -7 తేదీల మధ్య పెట్టారు. వాస్తవానికి ప్రాక్టికల్స్ ని పరీక్షలకు ముందే పెట్టాలి. అలాంటిది రిజల్ట్స్ కు ముందు పెట్టారు. చాలా మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ పై సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు

ఇంటర్మీడియట్ బోర్డులో ఇంత అస్థవ్యస్థ పరిస్థితులు ఉంటే సరిదిద్దాల్సిన మీరు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఫెయిల్ అయిన విద్యార్థులు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నా మీలో చలనం కనిపించడం లేదు. అవకతవకలపై మా పార్టీ విద్యార్థి సంఘం ఎన్ ఎస్యూఐ తో పాటు, పలు విద్యార్థి సంఘాలు నిత్యం ఇంటర్మీడియట్ బోర్డు ముందు విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేస్తుంటే మీకు కనిపించడం లేదా? విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా?  మీరు మనిషేనా… మీలో మానవత్వం ఉందా అని అనుమానం వస్తోంది. కూలీనాలీ చేసి పిల్లలను ఉన్నత చదువులు చదివించి, ఉన్నతమైన స్థితిలో చూసుకోవాలని కలలు కనే తల్లి దండ్రుల ఆశలను చిదిమేసేలా మీ వైఖరి ఉంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరవండి. విద్యావ్యవస్థను సంస్కరించే బాధ్యత తీసుకోండి. ప్రస్తుత పరిణామాలకు పరిష్కార మార్గాలు అన్వేషించండి. ఫెయిల్ అయిన పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయించండి. మెజారిటీ పిల్లలు ఫెయిల్ కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకమే కారణం కాబట్టి వారికి తగిన న్యాయం చేయండి. విద్యారంగంలో మేథావులను ఆహ్వానించి సలహాలు తీసుకోండి. తాత్కాలిక సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్ లో విద్యావ్యవస్థను పటిష్ఠపరిచే దీర్ఘకాలిక ప్రణాళిక పై దృష్టి పెట్టండి. ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను విద్యకు దూరం చేసి అంధకారంలోకి నెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. మీ స్పందనను బట్టి మా భవిష్యత్ కార్యచరణ ఉంటుంది.

ఎ. రేవంత్ రెడ్డి,

ఎంపీ – టీపీసీసీ అధ్యక్షుడు

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles