Thursday, November 21, 2024

రాష్ట్ర విభజన నేపథ్యంలో… వొక దార్శనిక దృష్టిలో నుండి విజయవాడ

జాన్ సన్ చోరగుడి

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు అనుబంధ సంస్థ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్’ రాష్ట్ర విభజన తర్వాత ‘ఆంధ్రాస్ త్రూ ది ఏజేస్’  అంశంతో సదస్సు నిర్వహిస్తూ, అందులో నాకు ఇటువంటి కీలకమైన అంశంపై పత్ర సమర్పణ చేసే అవకాశం ఇచ్చిన- స్థానిక ‘విజయవాడ కల్చర్ సెంటర్’ వారికి ముందుగా నా ధన్యవాదాలు. 

కృష్ణాజిల్లాకు చెందినవాడిగా ఈ నగరంతో విద్యార్ధి దశ నుంచి అనుబంధం వున్న నాకు, ఇక్కడే ఎక్కువకాలం, రాష్ట్ర పౌరసంబంధాల శాఖలో సీనియర్ అధికారిగా పనిచేసే అవకాశం వచ్చింది. అలా ‘మన విజయవాడ’ అనే నా రచన ధారావాహికగా 1999 లో ‘ఆకాశవాణి’ ద్వారా కొన్నివారాలు పాటు ప్రసారమయింది. అదే, పేరుతో 2000 జనవరి నాటికి ‘విజయవాడ బుక్ ఫెస్టివల్’ లో పుస్తకంగా విడుదల అయింది, ఇప్పటికి రెండు ముద్రణలు కూడా జరిగాయి. 

చూడగలగడం…

‘విజన్-2020’ ‘డాక్యుమెంట్’ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చొరవతో జనవరి 1999 లో విడుదల అయింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ శ్రీ రంగరాజన్ దానికి ముందుమాట రాసారు. ఆ తర్వాత దానికి జరిగిన విస్తృత ప్రచారం వల్ల- ‘విజన్’ అనే పదం మొదటిసారి పత్రికలు, టీవి. వంటి ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ పరిచయం అయింది.

‘విజన్’ అంటే ‘వెబ్ స్టర్ డిక్షనరీ’ ప్రకారం, ‘చూడగలగడం’ అంటే, మనం ‘డాక్యుమెంట్’ విడుదల చేసిన 1999 లో ఉంటూ- 2020 నాటికి 21 ఏళ్ళ తర్వాత జరిగేది చూడగలగడం! అలా చూడబోయేదానికి ముందుగా ఒక ‘రోడ్ మ్యాప్’ తయారు చేసుకోవడం. అప్పట్లో ఈ ‘డాక్యుమెంట్’ ను మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలతో, అమెరికాకు చెందిన ‘మెకెన్సీ బిజినెస్ కన్సల్టెన్సీ’ రూపొందించింది.  

సరే, ఇప్పుడు 2018  ఫిబ్రవరి 9-10 తేదీల్లో మనం ఈ సదస్సు జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కణ్ణించి ఇరవై ఏళ్ళ క్రితం మనం రాసుకున్న- ‘విజన్-2020’ డాక్యుమెంట్ ఎంతమేర ఈ నగరం విషయంలో సాకారం అయింది? అనే దృష్టి నుంచి చూస్తే, ‘విజన్-2020’ రచన సమయంలో మనం ‘చూడలేకపోయిన’ అతి కీలకమైన పరిణామం, ఆరేళ్ళ ముందే జరిగింది. అంటే, 15 ఏళ్ళకే మన “విజన్” తొలి వైఫల్యం రాష్ట్ర చరిత్రలో నమోదు అయింది!    

జరిగింది ఏమిటి?

ఇరు ప్రాంతాల అభివృద్ధి దగ్గర నుంచి, మాట –మంచి, పండగలు ఆచారాలు, ఇలా అన్ని విషయాల్లోనూ ఆంధ్రులు – తెలంగాణ వారి మధ్య తేడా ఉందని, కనుక ఇద్దరు మర్యాదగా విడిపోవడమే దీనికి పరిష్కారమని, తెలంగాణ నుంచి ‘డిమాండ్’ వచ్చింది. దాంతో 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చిన, భారత ప్రభుత్వ- ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014’ మేరకు, తెలుగు ప్రజలు ‘తెలంగాణ’-‘ఆంధ్రప్రదేశ్’ అనే రెండు రాష్ట్రాలుగా వేర్వేరుగా విడిపోయాయి. ఒకప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అలా రెండు అయింది. ‘విజన్-2020’ రూపకర్తల విషయంగా, ఇది చరిత్రలో నమోదు అయ్యే మేధో వైఫల్యం!

విభజిత ఆంధ్రప్రదేశ్

అధ్యయనం ఏదీ?

అయితే, ఎందుకు ఇలా జరిగింది? అనే ఒక లోతైన అధ్యయనం ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఇప్పటివరకు జరగలేదు. విభజన వల్ల నష్టపోయింది మనం కనుక, అటువంటి కసరత్తు కనీసం ఇప్పుడు మొదలయినా ప్రాంతాల మధ్య జరిగే అసమతుల్యతలకు అతీతంగా ఇప్పటి నుంచి అయినా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవడం మొదలవుతుంది. ఏదేమైనా…

అలా ‘విజయవాడ’ తో పాటు ‘విజన్’ మరియు ‘విభజన’ ఈ మూడు కూడా ఈ సదస్సు అంశంలో ఒక్కటయ్యాయి.

చరిత్రలో- దక్షణాది మీద యుద్దాలకు వచ్చిన సుల్తానుల సైనిక పటాలాలకు, వొకప్పటి ‘బెజవాడ’ ప్రాంతం మజిలీ స్థావరంగా ఉండేది. బందరు ఓడరేవు సరుకులు ఎగుమతి దిగుమతులకు ఇక్కడ కృష్ణానది ‘ఫెర్రీ’ గా ఉండేది. నైసర్గికంగా తూర్పు-పశ్చమ భారత్ లకు ఇది దక్షణాది ముఖద్వారం. ఇవన్నీ ఈ పట్టణానికి భౌగోళికంగా కలిసొచ్చిన లేదా కలిసి రాని అంశాలు! అందుకే, తర్వాతి కాలంలో ఇది రైల్వే జంక్షన్ అయింది. అలా ఉత్తరాది వారితో ఏర్పడ్డ ‘మార్కెట్’ సంబంధాలతో, ఇది ‘ఆటోమొబైల్’ వ్యాపారానికి కేంద్రమయింది.

సర్దార్ జీల ఊరేగింపు

తొలి విజయాలు

70’ దశకంలో విజయవాడ సమీప గ్రామాల్లో అంటే, ప్రధానంగా తూర్పు కృష్ణాజిల్లా రైతు కుటుంబాలు నుంచి, వారి వద్ద వున్న ‘మిగులు’ ధనంతో పట్టణంలో ఏదైనా వ్యాపారం చేద్దామనే లక్ష్యంతో వచ్చినవారితో ఈ నగర సంస్కృతి కొత్తదశకు మళ్ళింది. పట్టణ సంప్రదాయ వ్యాపారం 60’ దశకం వరకు ప్రధానంగా- స్థానిక బ్రాహ్మణ వైశ్య కుటుంబాల అంశంగా ఉండేది. కోస్తా జిల్లాల్లో ఒకప్పుడు సంపన్న కుటుంబాల్లో శుభకార్యాలు అంటే, వారు వెతుక్కుంటూ వచ్చేది, విజయవాడ గవర్నర్ పేటలో బీసెంట్ రోడ్డులో- బ్రాహ్మణుల యాజమాన్యంలో వున్న లక్ష్మీ జనరల్ స్టోర్స్ కు!

జనంతో నిండిన బీసెంట్ రోడ్డు

అయితే, ఈ పట్టణం వైఖరిలో- 60’ దశకం తర్వాత వచ్చిన మార్పును, ఒకే ఒక్క అంశంతో సూటిగా చెప్పవచ్చు. సాంప్రదాయ రైతు కుటుంబాల నుంచి వచ్చిన కమ్మకులస్తులు- తొలుత ఇక్కడ ‘పాపులర్’ చెప్పులు తయారీ, ‘వైట్స్’ బట్టలు ఉతికే (డ్రై క్లీన్) వ్యాపారాలు మొదలుపెట్టి, తొలి విజయాలను నమోదు చేసారు. ఆ వరస హోటల్, ట్రాన్స్ పోర్ట్ ఇలా సాగింది. అలా గ్రామీణ సాంప్రదాయ కులవృత్తులకు వీరు తమ ‘పెట్టుబడి’ జతచేసి, అప్పటివరకు గౌరవం తక్కువ సేవలుగా వున్న వాటికి వాణిజ్య విలువ జోడించారు.

అయితే, ‘బెజవాడ’ అంటే సినిమా కేంద్రం అనే ప్రసిద్ది వున్నప్పటికీ, సినిమా నిర్మాణంలో  పెట్టే పెట్టుబడులకు మాత్రం వీరు మెడ్రాస్ వెళ్లారు తప్ప, ఆంధ్ర ప్రాంతానికి ఒక సినిమా స్టూడియో ఇక్కడ నిర్మించే యోచన వీరు చేయలేదు. ఇక్కడి సొమ్ము మొదట మెడ్రాస్ తరలినా… ఆ తర్వాత అది హైదరాబాద్ వెళ్ళినా, స్వంత ప్రాంతం అభివృద్ధి విషయంలో మొదటి నుంచి వీరిది ఇదే ధోరణి! అయితే, ఈ మాట అనగానే, “ఇక్కడి కమ్యూనిస్టులకు భయపడి …” అనేమాట కూడా లేకపోలేదు!

సినిమా హోర్డింగ్ పెయింటింగ్

గుంపగుత్త వోట్లు కోసం…

ఇందుకు కారణం, వీరి రాజకీయ-ఆర్ధిక మూలాల ఉనికి గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లోనూ అక్కడ పనిచేసే వ్యవసాయ కూలీల ఓట్లలోనూ వున్నాయి. వాళ్ళు ఊళ్ళను వొదిలిపెట్టి మెరుగైన ఉపాధి కోసం పట్టణాలకు వలసలు వెళితే, పొలం పనులకు, గ్రామాల్లో జరిగే- ‘గ్రూప్ ఓటింగ్’ కు అది హాని! ఆ కారణంతో విజయవాడ పరిసరాల్లో చెప్పుకోదగ్గ తయారీ రంగ పరిశ్రమ గడచిన 50 ఏళ్ళలో మచ్చుకు ఒక్కటి కూడా కనిపించదు.    

అయితే, గత మూడు నాలుగు దశాబ్దాలుగా సమీప గ్రామాల నుంచి వచ్చిన రైతు కుటుంబాలు, తమ పిల్లలను విజయవాడలో పట్టభద్రులను చేసి, వారి తదుపరి వ్యాపార విస్తరణకు- ‘మెట్రో’ నగరాల్లో వ్యాపారాలకు పంపే ‘నర్సరీ’గా మాత్రం ఇది మారింది. వీరు ఇక్కడ ‘డిగ్రీల’ తో పాటుగా వ్యాపార మెళకువలు, ‘కమ్యూనికేషన్’ అవసరం మేరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, “విజయవాడ యాటిట్యూడ్” ఈ మూడింటితో ఇక్కణ్ణించి బయటకు వెళ్ళేవారు. కాలక్రమంలో అమెరికాకు కూడా ఇది భద్రంగా బట్వాడా అయింది. ఈ మూడింటిలో మొదటి రెండూ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కానీ మూడవది, ఈ నగర ప్రత్యేకం!

సినిమా పోస్టర్

 ‘టీనేజ్’ దశలో స్కూళ్ళు జూనియర్ కాలేజీల్లో తమ ఫేవరేట్ సినిమా ‘హీరో వర్షిప్’ పేరుతో మొదలవుతున్న కులవిభజన, ఇక్కడ ఎదిగే వయస్సుతో పాటుగా పెరగడం ప్రత్యేకమైన అంశం. ‘సినిమా’ ద్వారా జరిగే కులవిభజన, దాంతో జరిగే ‘ఓటు బ్యాంకు’ రాజకీయాలు అది మరో కోణం!

24 క్రాఫ్ట్స్’

పోనీ ఈ సినిమా రంగం ఇక్కడ ఉపాధికి ఉపయోగపడిందా అంటే, అదీ లేదు. స్థానికంగా సినిమా నిర్మాణం లేకపోవడం వల్ల, ఇక్కడ వారికి ’24 క్రాఫ్ట్స్’ లో సృజనాత్మకత ఉన్నప్పటికీ ఈ ప్రాంతంవారు ఇక్కడే రాణించి, విస్తరించలేదు. అలా వీరి వలసల కారణంగా ఈ ప్రాంతం వట్టి పోయింది. పత్రికలు తమ కార్యాలయాల్ని ఇక్కణ్ణించి హైదరాబాద్ కు తరలించాయి. ఇక్కడివారే తమ పెట్టుబడులు అక్కడ పెట్టి, ఆధునిక యంత్రాలతో- ‘ఆఫ్ సెట్ ప్రెస్’ లు పెట్టడంతో, ఇక్కడి ప్రచురణ రంగం బక్కచిక్కి అదీ చివరికి అక్కడికే చేరింది. బెజవాడ ‘ఎంట్రప్రేన్యూర్ల’- సుఖవంతమైన రాకపోకల కోసం 24X7 ప్రైవేట్ బస్ సర్వీసులు నడిపి తమవంతు సేవలు అందించింది కూడా ఇక్కడివారే!

చివరికి విభజన జరిగి, 2015 నాటికి అకస్మాత్తుగా రాజధాని ఇక్కడికి తరలించే నాటికి జరిగింది ఏమిటి? మాకూ చరిత్ర – సంస్కృతికి కొదువలేదు, అని అప్పటికప్పుడు ఇక్కడ ప్రదర్శన అవసరమయింది. అందుకు వెంటనే ఏదో ఒకటి చేయాలి! ఏమిచేయగలం? ఖర్చులేని పని, అవతల వాళ్ళ కుటుంబీకులు ఎవరూ ‘అదేంటి మా పేరు తీసేశారు?’ అని అడిగేవాళ్ళు లేరు, కనుక బందరు రోడ్డులో సబ్ కలక్టర్ ఆఫీస్ పక్కన వున్న ‘విక్టోరియా జూబ్లీ మ్యూజియం’ పేరు ‘బాపు మ్యూజియం’ అని బోర్డు మార్చారు. అలా కొత్త తరాలకు ఒకప్పుడు, కోస్తాంధ్ర బ్రిటిష్ వారి పాలన క్రింద వుండేది అని తెలిసే చరిత్ర గుర్తులు చెరిపేసినట్టు అయింది. బాపుగారి స్మృతి కోసం మరొకటి ఏదో చేయాలి గానీ అటువంటి ఆపద్ధర్మ చర్యలు వారికి మాత్రం గౌరవం అవుతాయా?!

విక్టోరియా మ్యూజియం

రాజధాని అయితే…

అలా చారిత్రిక, భౌగోళిక, కారణాల వల్ల- ‘రౌడిజం’, పైన చెప్పుకున్న అంశాలుతో ‘క్యాస్టిజం’ ఈ రెండు విజయవాడ ‘ఆత్మ’లో విడదీయడం కష్టమైన స్థాయిలో కలిసిపోయాయి. అయినప్పటికీ రాజ్య వ్యవస్థలో ‘లా ఆర్డర్’ పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ వుంటుంది కనుక, ఇక్కడి ‘రౌడిజం’ వేర్వేరు రూపాలు తీసుకుంటూ, ఇక్కడ దాని తీవ్రత తగ్గుతూ వుంది. ఇక, రాష్ట్ర విభజన తర్వాత, కుల రాజకీయాలకు పుట్టిల్లు అయిన ఈ నగరం ప్రస్తుతం రాజధాని కార్యకలాపాలకు కేంద్రమయింది.

ఇప్పటికి నాలుగేళ్ల క్రితం 11 మే 2014న శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు విజయవాడలో ప్రధాన ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంత ఎంపిక కోసం భారత ప్రభుత్వ హోంశాఖ ఈ కమిటీని నియమించింది. ఆ రోజు జరిగిన సమావేశానికి అధికారిక విధుల్లో భాగంగా నేను హాజరయ్యాను. వేర్వేరు అంశాల నిపుణులు ఆ కమిటీలో వున్నారు.

వారు, నగర భౌగోళిక అంశాలతో పాటు నగరం ‘ఆత్మ’ను అర్ధం చేసుకోవడానికి అవసరమైన వివరాలు, గణాంకాలు సేకరించారు. “ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమిటి? పారిశ్రామిక అశాంతి ఉందా? ఇక్కడ కులాల కుమ్ములాటలు వున్నవా? ఇక్కడ మాదక ద్రవ్యాల లభ్యత వున్నదా? ఇక్కడ మురికివాడల జనాభా ఎంత? వంటి పలు ప్రశ్నలు కమీషన్ సభ్యులు జిల్లా కలెక్టర్, సిటీ పోలీస్ కమీషనర్లను అడిగి తెలుసుకున్నారు. క్లుప్తంగా ఇటువంటి ‘నగరం ఆత్మ’ను పట్టిచ్చే గణాంక సమాచారంతో వారు తమ తుది నివేదికను రూపొందించారు!

శివరామకృష్ణన్ (బ్లూరంగు చొక్కాలో కుడి చివర) కమిటీ సమావేశం

‘విజన్’ అన్నప్పుడు, భౌగోళికంగా విజయవాడ నగరం దక్షణాన కృష్ణానది ఒడ్డుకు అనుకొనివున్న నగరం కావడంతో, ఇది మిగిలిన మూడు దిక్కులవైపు విస్తరించడం ఒక్కటే దీనికి మిగిలిన పరిష్కారం. ఈ నగరానికి ఉత్తరాన విమానాశ్రయం, తూర్పున బందరు పోర్టు, ఉన్నందున; విజయవాడ- ఏలూరు – బందరు వరకు వేగంగా నగరీకరణతో విస్తరించడానికి  ఆస్కారం కనిపిస్తున్నది. అయితే, పశ్చమ దిశలోని మెట్ట ప్రాంతం వైపు నగరం విస్తరించడానికి వున్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. ఎందుకంటే, తూర్పు కృష్ణా కంటే, పశ్చమ కృష్ణాలో వెనకబాటుతనం ఎక్కువ.

ఇరుకు తగ్గాలి

ప్రస్తుతం వున్న పండిట్ నెహ్రు బస్ స్టేషన్ కృష్ణాజిల్లా వాసులకంటే, అది గుంటూరు జిల్లా వారికి దగ్గరగా వుంటుంది. పైగా దాని కారణంగా ప్రకాశం బ్యారేజి, కృష్ణా ఈస్ట్రన్ డెల్టా సిస్టం మీద నిరంతర ట్రాఫిక్ ఒత్తిడి ఉంటున్నది. కనుక మరింత ఆధునికమైన బస్ స్టేషన్ సముదాయాన్ని నిడమానూరు-కేసరపల్లి మధ్య నేషనల్ హైవేకి ఎడమ వైపుకు మార్చాలి. అప్పుడు రామవరప్పాడు రైల్వే స్టేషన్ శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తే, బస్ స్టేషన్- రోడ్డు, రైల్వే, కెనాల్, రవాణాకు నగరం అనుసంధానమై విమానాశ్రయానికి బాగా దగ్గర అవుతుంది. ప్రస్తుత నగరానికి బయట కేంద్రం నిర్మిస్తున్న అవుటర్ రింగ్ రోడ్డుల ప్రయోజనం కూడా అప్పుడు స్థానిక ప్రజలకు గరిష్ట స్థాయిలో అందుతుంది.

ప్రస్తుతం అన్ని రకాల ప్రదర్శనలకు, బహిరంగ సభలకు వేదికగా వున్న ‘స్వరాజ్య మైదానం’ (పి.డబ్ల్యు.డి, గ్రౌండ్స్) అంబేడ్కర్ స్మృతి వనంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది కనుక, దానికి అనుకూలమైన ప్రత్యామ్నాయం అవసరం. అందుకోసం- ప్రస్తుత బస్ స్టేషన్ ముందు కృష్ణా నదికి అభిముఖంగా వున్న స్థలాన్ని పరిశీలించవచ్చు. భవన సముదాయాన్ని ప్రభుత్వం వినియోగించుకోవచ్చు.

అంబేడ్కర్ వనం

ప్రణాళిక, ఇంజనీరింగ్ అంశాల్లో నాకు ప్రవేశం లేకపోయినప్పటికీ, మూడు దశాబ్దాలుగా అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాతగా- సమాచార, పత్రికా రచనలో వున్న స్థానికుడిగా ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇప్పుడు మనం చూస్తున్న బందరు రోడ్డు ఏలూరు రోడ్డు విస్తరణను ఆపమని 2002-2004 మధ్య అప్పటి కలక్టర్, ‘వుడా’ వైస్ చైర్మన్, మున్సిపల్ కమీషనర్లకు స్థానిక వ్యాపారులు చుక్కలు చూపించారు! ఇప్పటికైనా ‘విజయవాడ యాటిట్యూడ్’ లో వున్న చిక్కదనం వీలైనంత వేగంగా పల్చబడాలి. అందుకు ఈ ఊరికి వున్న ఇరుకు తగ్గాలి! దానికి నగర ప్రణాళికలో మార్పులు కూడా అవసరం. అది కనుక, అసమానతలు లేని జిల్లా సమగ్ర అభివృద్దికి దోహదం చేస్తే, మంచిదే కదా!     

‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్’ – ‘కల్చర్ సెంటర్ ఆఫ్ విజయవాడ ’ సంయుక్త అధ్వర్యంలో 2018  ఫిబ్రవరి 9-10 తేదీల్లో ‘ఆంధ్రాస్ త్రూ ది ఏజేస్’  అంశంతో నిర్వహించిన సదస్సులో A ‘VISION’ FOR VIJAYAWADA IN THE POST BIFURCATION SCENARIO  శీర్షికతో తెలుగులో సమర్పించిన పత్రం

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles