నూతన జోన ల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు.
వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు.
భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) వోకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని, సిఎం తెలిపారు.
దళితులు తలెత్తుకొని తిరిగడమే దళితబంధు లక్ష్యం
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే ‘దళిత బంధు పథకం ‘ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడి గా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం గా పటిష్టం చేయడం లో దోహద పడుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.
దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని,. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధు ను ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు.
దళితుల మేలు కోసం మీకు ఆకాశమే హద్ద: కలెక్టర్లకు సీఎం ఉద్బోధ
తాము ఎప్పుడు మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం వుందని, ” మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పని లో లేని తృప్తి దళిత బంధు పథకం అమలు లో పాల్గొనడంలో దొరుకుతుంద”ని కలెక్టర్లకు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితి ని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ది కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లకు సూచించారు.