Thursday, November 21, 2024

దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేసిన నరేంద్రమోదీ!

  • కాశీ విశ్వనాథ్ నడవా ప్రారంభోత్సవంలో హిందూత్వ పరాకాష్ఠ
  • దిక్కుతోచని ప్రతిపక్షాలు, మైనారిటీ సంక్షేమం ప్రస్తావించాలంటే భయం
  • తామూ హిందువులమనేంటూ చాటుకుంటున్న మోదీ విరోధులు

నరేంద్రమోదీ రాజకీయంగా అఖండుడు. అవధ్యుడు. అసాధ్యుడు. భారత దేశ రాజకీయాలను సంపూర్ణంగా  మార్చివేసిన రాజకీయ నాయకుడు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ వంటి నేతలు చేసిన కృషిని, వేసిన బాటలను ధ్వంసం చేసి కొత్త బాటలు వేసిన వ్యక్తి. మోదీ ప్రవేశపెట్టిన నూతన రాజకీయ స్వరూపానికీ, స్వభావానికీ సోమవారంనాడు కాశీ విశ్వనాథ్ నడవా (కారిడార్) ను జాతికి అంకితం చేసిన కార్యక్రమాన్ని ప్రసారమాధ్యమాలలో చూసినవారికీ, అన్ని బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వినయవిధేయతలు కాంచినవారికీ, ‘‘హర్ హర్ మహాదేవ్’’ అంటూ భక్త్యావేశపూరిత చాటింపులు ఆలకించినవారికీ మోదీ ఎందుకు ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్నారో అర్థం అవుతుంది. దేశనాగరిక వారసత్వానికి కాశీ గొప్ప ప్రతీక అనీ, మహోన్నత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నదనీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించిస్తూ ప్రధాని అన్నారు. కాశీ నడవా భారత్ కు నిర్ణయాత్మక దిశను చూపుతుందనీ, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందనీ, కొత్త చరిత్రకు పురుడుపోసుకుంటున్నదనీ, ఈ చరిత్ర ఆవిష్కారానికి సాక్షులం కావడం మన అదృష్టమనీ మోదీ వ్యాఖ్యానించారు. కాశీ ఆలయం ఇంతవరకూ 3,000 అడుగులలోనే ఉండేది. ఇప్పుడు అయిదు లక్షల చదరపుటడుగులకు విస్తరించింది. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు దర్శించుకోవచ్చు. ‘‘ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ ఉద్భవిస్తాడు. సాలార్ మసూద్ మనదేశంలో అడుగుపెడితే రాజా సహుల్ దేవ్ అతడిని ఎదుర్కొంటాడు. మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడు. ఎన్నో కుతంత్రాలను తట్టుకొని కాశీ సగర్వంగా నిలిచింది. శివుడి రక్షణలోని కాశీ ఎన్నటికీ నాశనం కాబోదు,’’ అంటూ మోదీ ఉద్ఘాటించారు.  కాశీ విశ్వనాథ్  ప్రాజెక్టు మోదీ రూపొందించిన అనేక ప్రణాళికలలో ఒకటి. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మరో సారి గెలిచేందుకు మోదీ ఏమి చేయడానికైనా సిద్ధం. మరి మూడు దశాబ్దాలదాకా బీజేపీని నిలువరించడం అసాధ్యం అంటూ ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ ఏ లెక్కన చెప్పారో తెలియదు కానీ మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడించడం బహుకష్టసాధ్యం అని మాత్రం చెప్పవచ్చు.

కాశీ వీదులలో అర్ధరాత్రి పర్యటిస్తున్న మోదీ, యోగీ

మోదీది భిన్నమైన వ్యక్తిత్వం

నరేంద్రమోదీ ఇతర ప్రధానమంత్రుల కంటే భిన్నమైన వ్యక్తి. నెహ్రూ కానీ, ఇందిర కానీ, పీవీ నరసింహారావు కానీ, వాజపేయి కానీ ఒక కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చి, ఇంత హంగామా చేసి, గంగస్నానం చేసి, పూజలూ, యాగాలూ, యజ్ఞాలూ చేసి, ఇంతాగా దేశ ప్రజలలో భక్తి భావన ఉద్దీపనం చేసి, హిందూమతోద్ధారకులుగా విశ్వాసం కల్పించి,  రాబోయే ఎన్నికలలో ఓట్లు హిందూ ఓట్లను దోచుకునే ఎత్తుగడ వేయలేదు. అసలు ప్రభుత్వ కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికీ, ప్రతిపక్ష దూషణకు, మైనారిటీల పరాయీకరణకూ, నెహ్రూనిందకూ, ఆత్మస్తుతికీ మరే ప్రధానీ వాడుకోలేదు. కొన్నిపత్రికలు రాస్తున్నా, టెలివిజన్ వ్యాఖ్యాతలు అభ్యంతరం చెబుతున్నా మోదీ ఖాతరు చేయకుండా ప్రభుత్వ వేదికను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడాన్నియూపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముమ్మరం చేశారు. దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు ప్రతిపక్షాలనీ, ప్రశ్నించే మేధావులనీ, జర్నలిస్టులనూ.

అడ్వాణీ విధానం వేరు

లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేశారు. మతాన్ని బజారుకీడ్చారు. రాజకీయాలలో ప్రధానాంశం చేశారు. బీజేపీ ఓటు బ్యాంకు పెంచారు. వాజపేయిని ప్రధానమంత్రి పీఠంపైన కూర్చోబెట్టారు. కానీ అడ్వాణీకి కొంత బెరుకు ఉండేది. ప్రత్యక్షంగా ముస్లింలను నిందించే సామసం చేయలేదు. ముస్లింలనూ, క్రైస్తవులనూ రెండవ తరగతి పౌరులుగా స్థాయిని దించాలని ఊహించలేదు. ప్రజాస్వామ్యవాదిగానే ఉండాలని ప్రయత్నించారు. హిందూ హృదయ సమ్రాట్ అనే బిరుదు అడ్వాణీ పెట్టుకోవాలని సంకల్పిస్తే దాన్ని అడ్డుకునేవారు ఎవ్వరూ ఆ రోజుల్లో లేరు.  హిందూత్వ వాదాన్ని మోదీలాగా ఎన్నికలలో ఆయుధంగా వాడుకోవడంలో అడ్వాణీ కూడా దిగదుడుపే. ఇటువంటి విషయాలలో వాజపేయి అసలు పోటీలోనే లేరు. మోదీ ఎన్నికల భాషనూ, చర్చనూ, సంభాషణనూ, వ్యూహాన్నీ, ఎత్తుగడలనూ, ఇతివృత్తాన్నీ సమూలంగా మార్చివేశారు. ప్రతిపక్షాలు సైతం తన భాషనే మాట్లాడే విధంగా పరోక్షంగా కట్టడి చేశారు. తాము  కూడా హిందువులమేనంటూ ప్రతిపక్ష నాయకులు చాటుకోవలసిన అగత్యం వారికి కలిగింది. హిందూమతం అంతటికీ తామే కారకులమనీ, చోదకులమనీ,రక్షకులమనీ మోదీ, యోగీ, తదితరులు చాటుకుంటుంటే, హిందూత్వ పరిభాష మాట్లాడనివారిని ముస్లింలకు గులాములనీ, పాకిస్తాన్  కు సలాము చేసేవారనీ నిందిస్తుంటే ప్రతిపక్షాలకు హిందూ నేపథ్యాన్ని చాటుకోవడం అనివార్యమైంది.  

గంగా స్నానం చేస్తున్న నరేంద్రమోదీ

గాంధీజీ హిందువు, గాంధీ హంతకుడు గాడ్సే హిందూత్వవాది : రాహుల్

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ‘‘చివరి రోజుల్లో కాశీలో గడపడం మన హిందువులకు ఆనవాయితీ. రెండు రోజులు కాదు, రెండు, మూడు నెలలు అక్కడే ఉండండి,’’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యానం ఆయనకు మేలు చేయదు. బెడిసికొడుతుంది. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రతిపాదన తనదేననీ, తన హయాంలోనే దానికి ఆమోదం లభించిందనీ అఖిలేష్ చెప్పుకున్నారు. దాని వల్ల ఆయనకు నష్టమా, లాభమా, ఎంత శాతము? అంటే చెప్పడం కష్టం. జైపూర్ లో ఆదివారంనాడు పెద్ద బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వివరంగా మాట్లాడారు. హిందుత్వవాదికీ, హిందువుకీ మధ్య వ్యత్యాసం స్పష్టంగా చెప్పారు. గాంధీజీ హిందువు అనీ గాంధీని చంపిన గాడ్సే హిందూత్వవాది అనీ విడమరచి చెప్పారు. కానీ జైపూర్ సభలో పాల్గొన్న జనానికి ఈ తేడా అర్థం అవుతుందా? తాను హిందువునేనని రాహుల్ గాంధీ ప్రకటించడం వల్ల ఆయనను మోదీ కంటే ఎక్కువ హిందువు అని దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు విశ్వసిస్తారా? మోదీకి కాకుండా రాహుల్ కి ఓటు వేస్తారా? కష్టమే. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం తన హిందూ మూలాలను చాటుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకోవలసి వస్తోంది. బెంగాల్ మమతా దీదీ ఎన్నికల ప్రచారంలో హిందూభావజాలంలో తాను వెనకబడలేనని నిరూపించుకునేందుకు నానా తంటాలూ పడ్డారు. అదే బాటలో అంతిమ విజయం సాధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదాద్రి నిర్మాణంతో తన భక్తిప్రపత్తులను ప్రదర్శించారు. పనివేళా సోమవారంనాడు సకుటుంబంగా తమిళనాడు వెళ్ళి శ్రీరంగంలో రంగనాథస్వామి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను హిందూమతం పట్ల భక్తిశ్రద్ధలతో ఉన్నట్టు నిరూపించుకునేందుకు అందివచ్చిన ప్రతి సందర్భాన్నీ వినియోగించుకుంటున్నారు. విశాఖ శారదాపీఠం స్వామికి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇటువంటి వేషాల అవసరం లేకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాలుగు టరమ్ లు నెగ్గుకొచ్చారు.

ఒవైసీకి ప్రాధాన్యం పెరుగుతుందా?

హిందూమత ప్రచారం ఎక్కువైన కొద్దీ అతిపెద్ద మైనారిటీ (20కోట్ల మంది జనాభా) అయిన ముస్లింలలో ఇస్లామిక్ భావజాలం మరింతగా విస్తరిస్తుంది. మతం ఇంటికే పరిమితం కావాలన్న ప్రజాస్వామ్య సూత్రాన్ని పాటించనివారు ఎవ్వరైనా రాజ్యాంగాన్నిధిక్కరించినట్టే. ఎన్నికలు జరుపుకోవడం ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలనేది ఒక భాగమే. ప్రజాస్వామ్య  సంస్థలను బలోపేతం చేసుకోవడం, ప్రతిపక్షాలను గౌరవించడం, న్యాయవ్యవస్థను స్వంతంత్రంగా ఉండనివ్వడం, పౌర హక్కులను పరిరక్షించడం, ప్రాథమిక హక్కులకు ప్రత్యేకంగా రక్షణ కల్పించడం, ఆదేశిక సూత్రాలకు (డిరెక్టీవ్ ప్రిన్సిపుల్స్) అనుగుణంగా నడుచుకోవడం, ప్రజాభిప్రాయాన్ని మన్నించడం, జనహితంకోసం పని చేయడం వంటి అనేక కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేసినవారు మాత్రమే ప్రజాస్వామ్యవాదులు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రతి ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్షాలను దూషించడం, యోగీ వంటి బీజేపీ ముఖ్యమంత్రులను ఆకాశానికెత్తడం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన జరిగిన ప్రతిసందర్భాన్నీ ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం చూస్తూ ఉన్నాం. కాశీలో నిర్మాణ కార్మికులతో కలసి భోజనం చేయడం, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలసి సోమవారం అర్ధరాత్రి కాశీ వీధులలో తనిఖీ చేస్తూ పర్యటించడం ప్రజలను ఆకర్షించుకోవడానికి చేసిన కార్యక్రమాలు. యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రధానిది సారథ్యం కాగా యోగీ ఆదిత్యనాథ్ కు ప్రధాని మద్దతు సంపూర్ణంగా ఉన్నదని యోగీ ట్వీట్ చేసిన కాశీ పర్యటన చిత్రాలు నిరూపిస్తున్నాయి.  అందరు బీజేపీ ముఖ్యమంత్రులూ కాశీకి వెళ్ళి ప్రధానికి అండగా నిలబడటం బీజేపీ సమైక్యతను చాటడానికి చేసిన ప్రయత్నం.

నిర్మాణ కార్మికులతో సంఘీభావం

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ముందున్న దారులు  ఏమిటి?  

కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఒక సర్వే నిర్వహించింది. ప్రజలు పార్టీని ముస్లింలకు అనుకూలమైన పార్టీగా పరిగణిస్తున్నారనీ, హిందువులను పట్టించుకోని పార్టీగా చూస్తున్నారని సర్వే ఫలితాలు స్పష్టం చేసింది. కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమనే జనాభిప్రాయాన్నిమార్చడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు. నిజానికి బీజేపీ హిందూత్వ పరిభాష కారణంగా దిగులు చెందుతున్న ముస్లింలకు హామీ ఇవ్వడం, వారి పక్షాన కాంగ్రెస్ కానీ, ఇతర ప్రతిపక్షాలు గానీ నిలబడతాయనీ వాగ్దానం చేయడం అవసరం. ఆ పని చేయడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. తాము కూడా హిందువులమేనంటూ ప్రతిపక్షాలు చాటుకుంటున్నాయి.

హిందూత్వవాదం అంటే ముస్లింలనూ, క్రైస్తవులనూ ద్వేషించడంగా అర్థం అవుతోంది. ముస్లింలపైన దాడి చేయడం, చర్చిలోకి వెళ్ళి పాస్టర్ వెంటబడి తరమడం వంటి పనులు అటువంటి అవగాహన కల్పిస్తున్నాయి. సర్వమత సమానాత్వాన్ని పాటించమని చెబుతున్న రాజ్యాంగం నిరాదరణకు గురి అవుతోంది. ప్రతిపక్షాలు ముస్లిం, క్రైస్తవ సంక్షేమం గురించి మాట్లాడటానికి భయపడే పరిస్థితి దాపురించింది. అంటే 1980లలో జనరల్ జియా పాలనతో పాకిస్తాన్ లో  ఇస్లాంమత ప్రచారం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు హిందూత్వ మత ప్రచారం అదే స్థాయిలోనే జరుగుతోందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తర్వాత కొంతకాలానికి పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యంగా మారింది. భారత్ హిందూత్వ రాజ్యంగా మారుతుందా? అని ప్రశ్నిస్తున్నారు విదేశీయులు.

యూపీలో ముస్లింలకు ఒక్క టిక్కెట్టు కూడా ఇవ్వని బీజేపీ

2017 ఎన్నికలలో యూపీలో ఉన్న  403 స్థానాలలో ఒక్క స్థానానికి కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టలేదు బీజేపీ. యూపీ జనాభాలో 19.3 శాతం ముస్లింలు ఉన్నారు. అంటే ప్రతి అయిదుగురు వ్యక్తులలో ఒకరు ముస్లిం.  పశ్చిమయూపీలోని  కొన్ని నియోజకవర్గాలలో 40 శాతం ఓటర్లు ముస్లిలు ఉన్నారు. అయినా సరే, ఒక్క ముస్లింకి కూడా బీజేపీ టిక్కెట్టు ఇవ్వకపోవడం వ్యూహాత్మక నిర్ణయం. ముస్లింలను దూరం చేయడం ద్వారా హిందువులను బీజేపీ వెనుక సంఘటితం చేయడం అనేది బీజేపీ సూత్రం. బహుశా ఈ సారి కూడా (2022) ముస్లింలకు ఒక్క టిక్కెట్టు కూడా బీజేపీ ఇవ్వకపోవచ్చు. హిందూ-ముస్లిం సంబంధాలు ఎంత విచ్ఛిన్నమైతే బీజేపీ హిందూత్వవాదానికి అంత లాభం. రెండు వర్గాల మధ్య ద్వేషం రగిలినప్పుడు ఉదారహిందూవాదం పని చేయదు. హిందువులలోని సామరస్యవాదులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. హిందూ మత ఔదార్యం గురించీ, సామరస్యవాదం గురించీ, పరమత సహనం గురించీ మాట్లాడినవారంతా ఓడిపోతారు.

మోదీ ప్రభుత్వ విజయాలపై ఆధారపడి బీజేపీ ఎన్నికల ప్రచారం చేయడం లేదు. యోగీ ప్రభుత్వ విజయాలంటూ పెద్దగా లేవు. యూపీలో ఠాకూర్లకు పెద్దపీట వేయడం, పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి శాంతిభద్రతల విషయంగా కరకుగా ఉండటం మినహా అక్కడ జరిగింది ఏమీ లేదు. అందుకని పూర్తిగా హిందూత్వ విధానాన్నే నెత్తికెత్తుకోవాలని మోదీ, అమిత్ షాలు నిర్ణయించినట్టు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. హిందూత్వవాదం కొరకరాని కొయ్యగా వాటికి కనిపిస్తున్నది. వ్యతిరేకిస్తే హిందూ వ్యతిరేకులుగా ప్రతిపక్షీయులపైన ముద్ర వేస్తారు. ఇప్పటికే మోదీ సేన ఈ పని విజయవంతంగా చేసింది. తాము హిందువులమేననీ, హిందూత్వవాదులం మాత్రం కామనీ రాహుల్ గాంధీ తాజా విధానం అమలు చేసినా హిందూవాదానికీ, హిందూత్వవాదానికి మధ్య సన్నని విభజనరేఖను సామాన్య ప్రజలు గుర్తించడం కష్టం. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలాగా ఉన్నది ప్రతిపక్షాల పరిస్థితి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles