Sunday, December 22, 2024

రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

  • సచిన్ విధేయులు అయిదుగురికి చోటు
  • ఓంప్రథమంగా ఒకే కేబినెట్ లో నలుగురు దళితులు
  • మహిళలకూ, దళితులకూ, ఆదివాసీలకూ పెద్దపీట
  • మంత్రివర్గ నిర్మాణం పట్ల సచిన్ సంతృప్తి

జైపూర్: రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పట్ల సచిన్ పైలట్ సంతృప్తి వెలిబుచ్చారు. ఆయన విధేయులలో అయిదుగురిని మంత్రులుగా ఆదివారం మధ్యాహ్నం ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన కేబినెట్ లో మార్పులూచేర్పులూ చేయడానికి వీలుగా మంత్రులందరి దగ్గరా రాజీనామాలు తీసుకొని పెట్టుకున్నారు. సచిన్ నిరుడు తిరుగుబాటు చేశారు. మధ్యప్రదేశ్ లో సింథియా తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన కొద్ది మాసాలకే సచిన్ తిరుగుబాటు చేశారు. కానీ అప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ జోక్యం చేసుకొని సచిన్ ని పార్టీలో కొనసాగడానికి ఒప్పించారు. సంధి కుదిరి సంవత్సరం పూర్తయినా తన విధేయులకు మంత్రి పదవులు రాకపోవడంతో సచిన్ ఆందోళనకు గురైనారు. ఇటీవల ప్రియాంకాగాంధీ రాజస్థాన్ వెళ్ళి గెహ్లాట్ తో చర్చలు జరిపి మంత్రివర్గం పునర్వ్వవస్థీకరణకు ఒప్పించారు. ఆ విధంగా రాజస్థాన్ పంజాబ్ కాకుండా గెహ్లాట్, ప్రియాంక, సచిన్ లు పరస్పరం సహకరించుకున్నారు.

సంతోషంగా కనిపిస్తున్న సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్

కొత్తగా చేరిన 15 మంది మంత్రులలో 11మంది కేబినెట్ ర్యాంక్ వారుకాగా తక్కిన నలుగురూ సహాయ మంత్రులు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపైన సచిన్ పైలట్, ఆయన అనుయాయులూ తిరుగుబాటు చేసిన తర్వాత 16 మాసాలకు మంత్రివర్గంలో సచిన్ విధేయులకు చోటు దక్కింది. ముగ్గులు మహిళలు మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. మొదటి సారి రాజస్థాన్ లో నలుగురు దళితులు మంత్రులుగా ఉంటారు. వారు: మమతా భూపేష్, భజన్ లాల్ జాతవ్, తికారామం జూలీ, గోవింద్ మెఘ్వాల్. ప్రమాణం చేసిన మంత్రులంతా చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నానంటూ గెహ్లాట్ హిందీలో ట్వీట్ చేశారు. కొత్త కేబినెట్ లో దళితులకూ,ఆదివాసీలకూ, మహిళలకూ తగిన ప్రాతినిథ్యం లభించిందని సచిన్ పైలట్ సంతృప్తి వెలిబుచ్చారు. ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ లో ముఠాలు లేనేలేవని సచిన్ వ్యాఖ్యానించారు.

సచిన్ పైలట్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జాతీయ స్థాయిలో ప్రముఖమైన బాధ్యత అప్పగించనున్నది. పైలట్ ను రాజస్థాన్ నుంచి బయటికి తీసుకొని వేరే బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ నాయకత్వం అంగీకరిస్తేనే తాను మంత్రివర్గాన్ని విస్తరిస్తానని గెహ్లాట్ షరతు విధించినట్టు సమాచారం. సరిగ్గా రెండేళ్ళ తర్వాత నవంబర్-డిసెంబర్ 2023లో రాజస్థాన్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది సమస్య. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కేసీ వేణుగోపాల్, అజయ్ మకన్, తదితరుల మధ్య 48 గంటలు చర్చలు జరిగిన మీదట మంత్రివర్గ విస్తరణపైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఇరు పక్షాలూ విజేతలమని  చెప్పుకునే విధంగా సమస్యను తనదైన శైలిలో సోనియాగాంధీ పరిష్కరించారు. రాహుల్ గాంధీ విదేశాలలో ఉండటం ఒక్కటే విశేషం. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles