Saturday, November 23, 2024

ప్రజాసేవలో మూడోతరం ద్రోణంరాజు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ద్రోణంరాజు సత్యనారాయణ జగమెరిగిన బ్రాహ్మణుడు. రాజకీయ దురంధరుడు. జాతీయ స్థాయిలో పేరు కలిగిన అగ్రశ్రేణి నాయకుడు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే కులపతి. ఆ పాఠశాలలో ఎందరో రాజకీయ పాఠాలు నేర్చుకొని, మంత్రులుగా, విజయవంతమైన నాయకులుగా ఎదిగారు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ద్రోణంరాజు శిష్యులు కీలక నేతలుగా కొనసాగుతున్నారు.

తండ్రి అడుగులో అడుగువేసిన శ్రీనివాస్

సత్యనారాయణ వారసుడిగా శ్రీనివాస్ తండ్రితోనే నడిచారు. పాఠాలు నేర్చుకున్నారు. మెళుకువలు వంటపట్టించుకున్నారు.తండ్రి దివంగతులైన తర్వాత,  ఆ వారసత్వాన్ని మరింత అందిపుచ్చుకొని ముందుకు సాగారు. శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్ గా, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రాష్ట్ర విభజన తర్వాత, 2019లో  ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైఎస్ ఆర్ పార్టీ నుండి బలమైన హామీలు, ఆహ్వానం రావడం, కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నంగా ఉన్న నేపథ్యంలో, శ్రీనివాస్ వైఎస్ జగన్ సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుండి శాసనసభ అభ్యర్థిగా ఎన్నికల్లో నిల్చొని, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2019లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. వై సి పి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఎంతో కీలకమైన వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు.

నిజాయతీపరుడు, సౌమ్యుడు

విశాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలనే ఆలోచనలు ముఖ్యమంత్రికి బహుశా అప్పటికే వచ్చి ఉంటాయి. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు, ఎన్నో నిర్మాణాలు, ప్రాజెక్టులు, ప్రజలతో ముడిపడి ఉన్న వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ పదవి కోసం ముఖ్యమంత్రిపై ఎన్నో వత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ, నిజాయితీ పరుడు, సౌమ్యుడుగా పేరున్న ద్రోణంరాజు శ్రీనివాస్ ను వై ఎస్ జగన్ ఆ పదవికి ఎంపిక చేశారు. ఎన్నో మెగా ప్రాజెక్టులు పురుడుపోసుకుంటున్న తరుణంలో శ్రీనివాస్ కరోనా కాటుతో అర్ధాంతరంగా ఈ లోకం వీడి వెళ్లిపోయారు. ఇది జరిగిన కొన్ని రోజుల ముందే శ్రీనివాస్ కు కేటాయించిన సంవత్సర పదవీకాలం కూడా ముగిసింది.అయన జీవించి ఉంటే, వారినే ఈ పదవిలో కొనసాగించి వుండేవారు. పదవిలో ఉన్నది తక్కువ కాలమే అయినప్పటికీ, రవ్వంత మచ్చ లేకుండా శ్రీనివాస్ తన బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా పూర్తి చేశారు. ఆయన అకాల మరణంతో, రాజకీయాల్లో ద్రోణంరాజు వారసత్వం ముగిసినట్లేనని కొందరు భావించారు. కానీ అలా జరుగలేదు.

ద్రోణంరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్

శ్రీనివాస్ జీవించి వున్నప్పుడు కార్యకర్తలు, ప్రజలు ఎలా వచ్చేవారో, అదే విధంగా ప్రతిరోజూ శ్రీనివాస్ ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను కలుస్తూనే వున్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్ శిష్యులు, అభిమానులు,అనునూయులు మొదలు సామాన్య ప్రజలు కూడా రాజకీయ వారసత్వం కొనసాగాలని ద్రోణంరాజు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తూనే వున్నారు. శ్రీనివాస్ మరణించిన సందర్భంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్రోణంరాజు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి తన సంతాపం వ్యక్తం చెయ్యడమే కాక, ఆ కుటుంబానికి తన అండదండలు సంపూర్ణంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ దిశగా వై సి పి కీలకనేత విజయసాయిరెడ్డి కూడా ద్రోణంరాజు కుటుంబానికి బాసటగా నిలిచారు. తాజాగా విశాఖపట్నంలో ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా విజయసాయిరెడ్డి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు మొదలైన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని రోజుల ముందు జరిగిన శ్రీనివాస్ అంత్యక్రియల్లో, కరోనా భయాన్ని కూడా లెక్కచెయ్యకుండా విశాఖపట్నం ప్రజలు  స్వయం ప్రకటితంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీవాత్సవకు విజయసాయిరెడ్డి హామీ

వేలాదిమంది బారులు తీరి అంతిమనివాళి అర్పించారు. శనివారం జరిగిన జరిగిన సంస్మరణ సభలోనూ ద్రోణంరాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీనివాస్ వెళ్ళిపోయినా, సత్యనారాయణ వెళ్లిపోయి చాలాకాలమైనా ద్రోణంరాజు కుటుంబంపై విశాఖవాసులకు ఉన్న  ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదని ఈ సంఘటనలు చెబుతున్నాయి. సంస్మరణ సభలో శ్రీనివాస్ కుమారుడు శ్రీవత్సవ కూడా పాల్గొన్నాడు. ద్రోణంరాజు రాజకీయ వారసత్వం కొనసాగాలని, ఆ బాధ్యత శ్రీవత్సవ తీసుకోవాలని, వై ఎస్ ఆర్ పార్టీ అండదండలు పుష్కలంగా ఉంటాయని పార్టీ అగ్రనేత విజయసాయిరెడ్డి శ్రీవత్సవకు సభా ముఖంగా హామీ ఇచ్చారు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శ్రీవత్సవ కూడా ప్రకటించాడు. తనపై ఒత్తిడి తెస్తున్న కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు తాను వారివెంటే ఉంటానని హామీఇస్తూ శ్రీవత్సవ ఇప్పటికే ప్రకటించాడు కూడా. శ్రీవత్సవ తమ వారసుడుగా కొనసాగాలనే ఆలోచనలు తండ్రి శ్రీనివాస్ కు కూడా ఎప్పటి నుండో ఉండేవి. 2019 ఎన్నికల సమయంలోనూ కుమారుడు కొన్ని బాధ్యతలు పంచుకున్నాడు. కరోనా వ్యాధి సమయంలో ఆస్పత్రి మంచంపై ఉన్న దశలో శ్రీనివాస్ విజయసాయిరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. నేను మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి ఉంటుందో లేదో. నా కుమారుడు శ్రీవత్సవ బాగోగులు మీరే చూసుకోవాలని విజయసాయిరెడ్డికి విన్నవించినట్లుగా సంస్మరణ సభలో బహిరంగంగా విజయసాయిరెడ్డి స్వయంగా అందరితో పంచుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నుండి శ్రీవత్సవకు  ఆహ్వానం రావచ్చునని సమాచారం.

ఏ బాధ్యత అప్పగించినా సిద్ధం : శ్రీవాత్సవ

శ్రీవత్సవ

శ్రీవత్సవ రాజకీయాల్లో కొనసాగడానికి సంపూర్ణంగా సంసిద్ధుడుగా ఉన్నాడని తెలుస్తోంది. ఉన్నత విద్యాభ్యాసం కూడా చేశాడు. గతంలో సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనిచేశాడు. కొన్ని నెలల నుండి విశాఖపట్నంలో తండ్రితోనే ఉంటున్నాడు. తండ్రి అకాలంగా మరణించిన నేపథ్యంలో, ఇక పూర్తి సమయాన్ని రాజకీయాలకు వెచ్చించే ఆలోచనలోనే ఉన్నట్లు సమాచారం. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ బాధ్యతలు అప్పచెప్పినా, వాటిని నిర్వహించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని, పార్టీ పట్ల విధేయతతో, అంకితభావంతో ఉంటానని సంస్మరణ సభాముఖంగా శ్రీవత్సవ ప్రకటించాడు. శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఒక పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున, శ్రీనివాస్ కు పోటీగా నిల్చొని గెలిచి, ప్రస్తుత శాసనసభ్యుడుగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ ఇటీవలే విజయసాయిరెడ్డితో పాటు వెళ్లి,  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి, ఇక నుండి తాను టిడిపి వీడి, వైసిపితో ప్రయాణం చేస్తానని  తెలిపారు. తనతో పాటు తన ఇద్దరు కుమారులను కూడా వాసుపల్లి తీసుకెళ్లి జగన్ కు పరిచయం చేసుకున్నారు. తెలుగుదేశం ఎం ఎల్ ఏ లను ఒక్కొక్కరినీ ఖాళీ చేయించి, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా చేసే మిషన్ లో భాగమే ఈ పరిణామమని భావించాలి.

విశాఖ దక్షిణ సీటు వాసుపల్లికా, ద్రోణంరాజుకా?

ఈ పరిణామాల నేపథ్యంలో, రేపు రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సీటు వాసుపల్లికి కేటాయిస్తారా? ద్రోణంరాజు కుటుంబీకులకు కేటాయిస్తారా? అన్నది ప్రధానమైన ప్రశ్న. వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరపున ఈ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎం ఎల్ ఏ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ద్రోణంరాజు శ్రీనివాస్  నిన్నటి వరకూ నిర్వహించిన వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ పోస్ట్ ఇంకా ఖాళీగానే ఉంది. అది శ్రీవత్సవకు కేటాయిస్తారా? లేదా ఎం ఎల్ సి గా తీసుకుంటారా? తేలాల్సివుంది. మొన్నీ మధ్యనే, విజయనగరంకు చెందిన మరో అగ్రనేత  పెన్నెత్స సాంబశివరాజు మరణిస్తే, వారి కుమారుడికి ఎం ఎల్ సి పదవిని కేటాయించారు. అదే విధంగా,  శ్రీవత్సవకు కూడా కేటాయించవచ్చనే మాటలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. శ్రీవత్సవ బాగా చదువుకున్న యువకుడు. ద్రోణంరాజు కుటుంబ వారసుడు. ఉత్తరాంధ్ర భూమిపుత్రుడు. తల్లివైపు వారు కోనవారు. కోన ప్రభాకరరావుకు సొంత మనుమరాలే శ్రీవత్సవ తల్లి. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ద్రోణంరాజుకు సమీప బంధువు కూడా.

వైఎస్ కు దగ్గరి కుటుంబం

గతంలో,  వై ఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉత్తరాంధ్రవాసులకు పరిచయం చేసిన ఘనత ద్రోణంరాజు సత్యనారాయణకు ఉంది. రాజశేఖర్ రెడ్డికి ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్ తో మంచి అనుబంధం ఉంది. సత్యనారాయణ మరణించిన తర్వాత, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీనివాస్ ను చాలా బాగా చూసుకున్నారు. ఎంతో ప్రోత్సహించారు. నిన్న,  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్రోణంరాజు శ్రీనివాస్ ను ఏరికోరి వై సి పి లోకి ఆహ్వానించారు. నేడు, కుమారుడికి కూడా అదే ఆత్మీయహస్తం అందిస్తారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు బ్రాహ్మణులు రాజకీయంగా కీలక భూమిక పోషించేవారు. తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామమూర్తి, ద్రోణంరాజు సత్యనారాయణ మొదలైనవారు ఉత్తరాంధ్ర రాజకీయ క్షేత్రంలో ప్రధానమైన భూమిక పోషించారు.1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండీ వివిధ రంగాల్లో, ముఖ్యంగా రాజకీయాల్లో బ్రాహ్మణుల ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. చాలావరకూ కనుమరుగైందనే చెప్పాలి.

హక్కుగా కాకుండా బాధ్యతగా పరిగణించాలి

ఆంధ్రప్రదేశ్ లో కోన రఘుపతి, మల్లాది విష్ణు ఇద్దరే ఇద్దరు బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి శాసనసభకు వై సి పి సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ, ఇప్పుడూ తెలుగుదేశం పార్టీలో ఈ సామాజిక వర్గం నుండి ఒక్క సభ్యుడు కూడా లేడు. బ్రాహ్మణ వర్గానికి సామాజికంగా కొన్నేళ్ల నుండీ అన్యాయమే జరుగుతోంది. వీటన్నింటినీ సమీక్షిస్తూ, ద్రోణంరాజు కుటుంబానికి అండగా నిలబడి, రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ముఖ్యమంత్రి, వై సి పి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమయోచితమైన నిర్ణయమే తీసుకుంటారని కార్యకర్తలూ, ప్రజలూ అనుకుంటున్నారు. ద్రోణంరాజు కుటుంబం నుండి వారసుడుగా రాజకీయాల్లోకి వస్తున్న శ్రీవత్సవకు అభినందనలు తెలుపుదాం. అదే సమయంలో, తాత సత్యనారాయణ నుండి రాజకీయ దురంధరతను, తండ్రి శ్రీనివాస్ నుండి నిజాయితీ, నిబద్దతలను మేళవించుకొని శ్రీవత్సవ ముందుకు సాగుతాడని ఆశిద్దాం. మొత్తంమీద, రాజకీయాల్లోకి మరో వారసుడు వచ్చాడు. ఇది హక్కుగా కాక, బాధ్యతగా భావిస్తే పదికాలాలపాటు ఎవరైనా రాణిస్తారు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles