మేరీకోమ్ కు పద్మవిభూషణ్
వెంకటరెడ్డికి, శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీ
తెలుగు తేజం, ప్రపంచ షటీల్ బ్యాట్ మెంటెన్ చాంపియన్ పీవీ సింధు సోమవారంనాడు రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్ చేతులమీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షా తదితరులు తిలకించారు. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ అవార్డులను ఇప్పుడు ప్రదానం చేశారు. పద్మవిభూషణ్ అవార్డును దివంగత గంధర్వగాయకుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం ప్రదానం చేశారు. మహిళల బాక్సింగ్ లో రాణించిన మేరీకోమ్ కు (ఒలంపిక్స్ విజేత) కూడా పద్మవిభూషణ్ ప్రదానం చేశారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు. పండిట్ చన్నూలాల్ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 122 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన విషయం విదితమే. కేంద్రమంత్రులుగా దేశానికి సేవలందించిన జార్జి ఫెర్నాండెస్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ లకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులు అవార్డులు అందుకున్నారు. మారిషస్ ప్రధానిగా సేవలు అందించిన అనిరుథ్ జగన్నాథ్ కు, ఉడిపి అష్టమఠాలలో ఒకటైన పేజావర్ పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామికి కూడా మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు.
గోవా ముఖ్యమంత్రిగా, రక్షణమంత్రిగా పని చేసిన మనోహర్ పారీకర్ కు పద్మభూషణ్ అవార్డు మరణానంతరం ప్రకటించారు. గాయని బాంబే జయశ్రీ, నటీమణి కంగనా రనౌత్, నిర్మాతలు ఏక్తాకపూర్, కరణ్ జోహార్, గాయకుడు అద్నాన్ సమీ కూడా పద్మశ్రీ పురస్కారాలు గ్రహించారు. తెలంగాణ కరీంనగర్ జిల్లాకు చెందిన కవి శ్రీభాష్యం విజయసారథి, హైదరాబాద్ శివార్లలోఅల్వాల్ కు చెందిన చింతల శివారెడ్డి పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ వెంకటరెడ్డి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు.
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ
దివంగత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు 2021 సంవత్సరానికి పద్మవిభూషణ ప్రకటించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బాలూ కుటుంబ సభ్యులను మంగళవారంనాడు ఆ అవార్డును ప్రదానం చేస్తారు. 2021 సంవత్సరానికి ఏడుగురు పద్మవిభూషణ్, 10 మంది పద్మభూషణ్, 102 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన విషయం విదితమే. పద్మవిభూషణ్ అందుకోనున్నవారిలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఒడిశా శిల్పి సుదర్శన్ సాహూ, హృద్రోగవైద్యుడు డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే, ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు, భారతీయ అమెరికన్ నరేందర్ సింగ్ కాపాని, ఉరుదూ పండితుడు మౌలానా వహీదుద్దీన్ ఖాన్, పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ ఉన్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, గాయని కేఎస్ చిత్ర, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికైనవారిలో ఉన్నారు.