అశ్వినీ కుమార్ ఈటూరు
చెన్నై: కళలూ, సినిమా రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా గంధర్వ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పద్మవిభూషణ్ మరణానంతరం ప్రకటించారు. కోవిద్ కారణంగా ఎస్ పీ బీ చైన్నైలో 25 సెప్టెంబర్ 2020న అంతిమశ్వాస విడిచారు. ఆయన పాడిన చివరి పాట తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాతే అన్నాతే కోసం. ఆ సినిమా గత వారం విడుదలైంది. 2021వ సంవత్సరానికి ఇస్తున్న పద్మఅవార్డులలో భాగంగా బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ ప్రకటించారు. బాలూ కుటుంబ సభ్యులకు మంగళవారంనాడు ఈ అవార్డును రాష్ట్రపతి బహుకరిస్తారు.
బాలూకు బతికి ఉన్న రోజుల్లోనే అనేక అవార్డులూ, రివార్డులూ లభించాయి. ఇదివరకే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు స్వీకరించాడు. ఇటీవలికాలంలో సినిమా పరిశ్రమ నుంచి పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే. బాలు సజీవంగా ఉండగానే ఆరుసార్లు జాతీయ ఫిలిం అవార్డులు స్వీకరించారు. తెలుగు సినిమాలలో పాడినందుకు 25 నంది అవార్డులు గ్రహించారు. రాష్ట్రపతి భవన్ లో సోమవారంనాడు 2020 సంవత్సరానికి చెందిన పద్మాఅవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశీయాంగమంత్రి అమిత్ షా, తదితరులు హాజరైనారు. బాలు తనయుడు చరణ్ ఈ అవార్డును ఫేస్ బుక్ ద్వారా స్పదించారు. ఇది తనకు సంతాపంలో తీయనైన సమయమని (స్వీట్ సారో) వ్యాఖ్యానించారు.
పద్మవిభూషణ మా మిత్రుడు బాలుకు ఇవ్వబోతున్నట్టు ప్రకటించగానే హృదయం సంతోషంతో నిండిపోయిందనీ, మరణానంతరం అని తోక తగిలించడం (పోస్ట్ హ్యూమస్) బాధకలిగించిందని టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి ట్వీట్ పెట్టారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కూడా ఆనందం వెలిబుచ్చారు.