Sunday, December 22, 2024

పెనంపై నుంచి పొయ్యిలో పడుతున్న పంజాబ్ కాంగ్రెస్

  • ఎన్నికలు సమీపిస్తున్నా దారికి రాని సిద్ధూ
  • పీసీసీ అధ్యక్ష పదవికి దూరంగా ఉంటూ బెదిరింపులూ, షరతులూ
  • సిద్ధూకు లొంగేది లేదని అంటున్న ముఖ్యమంత్రి చన్నీ
  • అధిష్ఠానం మెతక వైఖరితో రెచ్చిపోతున్న సిద్ధూ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పంజాబ్ లో గతంలో ఎన్నడూ లేనంత యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు శృతి మించుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సాగనంపినా కాంగ్రెస్ కు తలనొప్పులు తగ్గక పోగా మరింతగా పెరుగుతున్నాయి. ఆ పార్టీతో పాటు  రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అలజడులు రేగుతున్నాయి. పంజాబ్ లో ఈ పరిణామాలు ఏర్పడడానికి మూలకారకుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అని సర్వత్రా వినిపిస్తోంది. 2017 ఎన్నికల ముందు బిజెపిలో అలజడి సృష్టించి కాంగ్రెస్ లో చేరారు. ఈసారి (2022) ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో అలజడులు సృష్టిస్తున్నారు.  బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అడ్రస్ గా మారారు. శక్తివంతమైన సీనియర్ నేత,ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత సిద్ధూ బెదిరింపు ధోరణులు మరింతగా పెరుగుతున్నాయి. అప్పుడు కెప్టెన్ ను పదవి నుంచి  దించెయ్యండని పట్టుపట్టారు. అదే సమయంలో తన వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం జీ హుజూర్ అంటూ సిద్ధూ  మాటలకు తోక ఊపింది. సిద్ధూ వర్గానికే చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. అది జరిగి పట్టుమని నాలుగురోజులు కాకముందే, చన్నీ తీరును నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణ, కొత్త డిజిపి, అడ్వకేట్ జనరల్ నియామకాల్లో కొత్త ముఖ్యమంత్రి చన్నీ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో అధ్యక్ష పదవిని వదులుకుంటున్నానంటూ సిద్ధూ బహిరంగంగానే ప్రకటించారు. సీనియర్ ఐ పీ ఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ ను డిజిపిగా నియమించడం ససేమిరా ఆయనకు ఇష్టం లేదు. రాణా గుర్జీత్ సింగ్  కు మంత్రి పదవి ఇవ్వడమూ ఇష్టం లేదు. అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ దేవోల్ పైనా అదే అసంతృప్తిని వెళ్ళగక్కారు.

Also read: ఒకే గూటిలోకి (ఇందిరా)గాంధీ పరివార్!

సిద్ధూ మొండిపట్టు

చివరకు రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా, తను వ్యతిరేకిస్తున్న వారందరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేంత వరకూ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టేది లేదని ప్రస్తుతం సిద్ధూ మొండికేస్తున్నారు.  అడ్వకేట్ జనరల్ కార్యాలయ విధులకు కూడా మాటిమాటికీ ఆయన అడ్డుపడుతున్నారని అడ్వకేట్ జనరల్ దేవోల్ ఆరోపిస్తున్నారు. సిద్ధూ వ్యవహారశైలి విషయంలో అధిష్టానం మౌనం పాటిస్తున్నా, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ గట్టిగానే బదులిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో సిద్ధూ జోక్యాన్ని చన్నీ ఏమాత్రం సహించడం లేదు. ‘నేను పేదవాడిని, బలహీన వర్గాలకు చెందినవాడినే కావచ్చు, బలహీనుడిని మాత్రం కాను’ అంటూ చరణ్ జిత్ సింగ్ ప్రతిదాడి చేస్తున్నారు. సిద్ధూతో తాడో పేడో తేల్చుకోటానికే కొత్త ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. జాట్ వర్గానికి చెందిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ దళితులకు వ్యతిరేకమనే ప్రచారం ఆ రాష్ట్రంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళిత నేతను ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు వచ్చింది. కాంగ్రెస్ కు అభినందనలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో ఎన్నికల తర్వాత  ఈ ముఖ్యమంత్రిని ఎంత వరకూ కొనసాగిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్ లో జాట్ లు, దళితులు అధికంగా ఉన్నారు. ఇంచుమించు రెండు సామాజిక వర్గాల సంఖ్య సమానంగానే ఉంటుంది. రాజకీయంగా జాట్ ల ప్రాబల్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఓటు బ్యాంక్ ప్రకారం దళిత సామాజిక వర్గం చాలా కీలకమైంది. జాట్ వర్గానికి చెందిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూను అధ్యక్షుడుగా, దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల పార్టీకి బహుళ ప్రయోజనం దక్కుతుందని కాంగ్రెస్ వ్యూహ రచన చేసింది. మూడోసారి కూడా అధికారం దక్కించుకొని హ్యాట్రిక్ సాధించ వచ్చని విశ్వసించింది. పంజాబ్ విషయంలో, కాంగ్రెస్ అధిష్టానం తెలివైన వ్యూహన్నే పన్నిందని రాజకీయ విశ్లేషకులు మంచి కితాబును కూడా ఇచ్చారు.

Also read: దీపోత్సవం

దళితులలో పెరుగుతున్న అనుమానాలు

కానీ తదనంతర పరిణామాలు పూర్తి విరుద్ధంగా మారిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీని స్థాపించి బరిలో దిగనున్నారు. దీని వల్ల కాంగ్రెస్ ఓటుబ్యాంక్ చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. దళిత ముఖ్యమంత్రి విషయంలో సిద్ధూ చేస్తున్న రసాభాస వల్ల కాంగ్రెస్ పై దళితులకు అనుమానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిని తోలుబొమ్మగా మార్చి, అంతా తానే చక్రం తిప్పాలనే ఆలోచనలో సిద్ధూ ఉన్నట్లు అందరికీ అర్థమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ విషయంలో మెతకవైఖరిని అవలింబిస్తోంది. దీని వల్ల దళితులతో పాటు పార్టీ శ్రేణుల్లోనూ అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చన్నీ – రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ మధ్య విబేధాలు బాహటంగానే ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవే. పార్టీలో ముసలం రాకపోతే ఈసారి కూడా కాంగ్రెస్ తప్పకుండా గెలిచేదని,  ఇప్పటి వాతావరణం మునుపు ఉన్నంత అనుకూలంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. కాంగ్రెస్ లో జరుగుతున్న కుమ్ములాటల వల్ల కేజ్రీవాల్ నాయకత్వంలో నడుస్తున్న ‘అప్’ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఫలితాల తర్వాత కెప్టెన్ కొత్త పార్టీ,బిజెపి కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజెపి అన్ని పార్టీల కంటే బలహీనంగా ఉంది. అకాళీదళ్, బి ఎస్ పి కలిసి సాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం,అకాళీదళ్ మూడో స్థానంలో ఉంది.గత ఎన్నికల్లో దక్కించుకున్న ఓటింగ్ శాతం ప్రకారం రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ బిల్లుల విషయంలో వ్యతిరేకించి ఎన్ డి ఏ నుంచి బయటకు వెళ్లిపోయిన అకాళీ దళ్ ను తిరిగి తమ వైపు తిప్పుకోడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోందని వినపడుతోంది. ఎన్నికల ఫలితాలను బట్టి సమీకరణలు మారిపోతాయి. కనీసం ఎన్నికలయ్యేంత వరకూ ఈ సిద్ధూతో వేగేది ఎట్టా? అని కాంగ్రెస్ అంతర్గతంగా కొట్టుమిట్టాడుతోంది. మొత్తంమీద, కాంగ్రెస్ పరిస్థితి పొయ్యిలో నుంచి పెనంపైన పడినట్లయింది.

Also read: హుజూరాబాద్ లో ఈటల విజయ పతాక

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles