Saturday, November 23, 2024

ఆఫ్ఘాన్ యుద్ధం – విట్ లాక్ వెల్లడించిన భయానకమైన వాస్తవాలు

యుద్ధంలో మొదట చచ్చిపోయేది సత్యం. ‘ది ఆఫ్ఘానిస్తాన్ పేపర్స్-ఎ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది వార్’ పుస్తకం చదివేటప్పుడు అక్షరాలా ఇది నిజం అని మరోసారి తేలింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ క్రెయిగ్ విట్ లాక్ ఈ క్రమాన్ని అక్షర సత్యాలుగా పాఠకుల ముందు ఉంచిన వైనం ఎంత ప్రశంసనీయంగా ఉందో, దాన్ని అంతర్జాతీయ సమాజం ముందు తేవడానికి అతను పడ్డ కష్టం అంతకన్నా గొప్పగా ఉంది. 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆఫ్ఘాన్ యుద్ధానికి సంబంధించి అమెరికాకు చెందిన ముగ్గురు అధ్యక్షుల పాలనా యంత్రాంగాలు, మిలిటరీ కమాండర్లు వరుసగా దేశ ప్రజలనే కాదు, ప్రపంచ ప్రజలను సంవత్సరాలుగా ‘అంతా సవ్యంగా సాగుతోంది. ఆఫ్ఘానిస్తాన్లో ప్రగతి సాధిస్తున్నాం’ అంటూ అబద్ధాల ముల్లెలతో మోసం చేసిన తీరు అవమానకరం. ప్రజలకు ఉన్న సమాచార హక్కును మింగేయడమే అది. యుద్ధ వాస్తవ దృశ్యాలను తెరమరుగుచేసిన ప్రయత్నం ఎంతో అమానుషం. చివరకు ఈనాడు ఏమైంది? ఆఫ్ఘానిస్తాన్ తాలిబాన్ హస్తగతమై అక్కడి ప్రజలు భూమిపైనే నరకం అంటే ఏమిటో చవిచూస్తున్నారు. చిన్నా, పెద్దా, స్త్రీలూ, యువతులూ, పెద్దవాళ్లూ, కళాకారులూ, క్రీడాకారులూ, ఉద్యోగినులూ, మహిళా పాలనాధికారులూ, మహిళా రాజకీయనేతలూ, చిన్నారులూ అందరి మానప్రాణాలనూ మతోన్మాదులైన తాలిబాన్ పాలకులు రక్తధారాలలో ఏరులై పారిస్తూ వారిని బలిగొంటున్నారు. ఆడవాళ్లు ఆటలు ఆడితే తప్పు. పాట పాడితే తప్పు, ఉద్యోగాలు చేస్తే తప్పు, మాట్లాడితే తప్పు. 20 సంవత్సరాలుగా ఆఫ్ఘానిస్తాన్ యుద్ధంలో సత్యాలను దాచడంవల్ల నేడు ఆ దేశంలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు. డబ్బులు చేతుల్లో లేవు. చివరకు ఆకలి, దరిద్రాలతో చిన్నారులైన ఆడపిల్లలను పెళ్లి మాటున అమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న దుస్తుతి ఆఫ్ఘానిస్తాన్లో నేడు కనిపిస్తోంది.

కాబూల్ కి గుడ్ బై చెప్పిన అమెరికా సైన్యం

అమెరికా సైన్యం ఈ ఏడాది ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ ని విడిచి స్వదేశం చేరుకుంది. కానీ నేటి పరిస్థితులు ఎవరి పుణ్యం? ఆఫ్ఘానిస్తాన్ లోని యుద్ధ పరిణామాల గురించి ప్రతిసారీ అబద్దాలు చెప్పుకుంటూ రావడం వల్ల ఆ దేశం ఎంతటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ పతనానికి దారితీసిందో తెలుస్తుంది. విట్ లాక్ పరిశోధక రచన ‘ఆఫ్ఘానిస్తాన్ పేపర్స్’లో వాటి గురించి చెప్పిన వైనం చదివితే అమెరికా పాలకులు, మిలటరీ గ్రౌండ్ రియాలటీను పాతరేసి అర్థసత్యాలు కూడా కాదు మింగుడుపడని అబద్ధాలతో తమ చర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో విస్పష్టంగా మనకళ్లముందు నిలుస్తాయి. వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షులు, వారి యంత్రాంగాలు ఆఫ్ఘాన్ యుద్ధపరంగా తమ తప్పులను సమాధికట్టేయడానికి ఆఫ్ఘానిస్తాన్ లోని వాస్తవ యుద్ధపరిస్థితులను తప్పులు తడకలతో అమెరికా ప్రజలతోపాటు గ్లోబల్ సమాజాన్ని కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇది చూస్తుంటే ప్రజల సంక్షేమం పట్ల పాలకులు ఇంత విపరీత నిర్లక్ష్యధోరణి ఎలా ప్రదర్శించారన్నది పాఠకులకు మింగుడుపడదు.

భయానక వైఫల్యం

ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఒక భయంకరమైన వైఫల్యం. చాలా సంవత్సరాల క్రితమే ఈ వైఫల్యం నీడలు దట్టంగా అక్కడ పరుచుకుపోయాయి. ఈ వైఫల్య కారణాలు చాలా పకడ్బందీగా రచయుత తన పుస్తకంలో డాక్యుమెంట్ చేశారు. అమెరికా రాజకీయ, సైనిక వ్యవస్థలకు చెందిన వ్యక్తులు సంవత్సరాలు గడిచేకొద్దీ యుద్ధ పరంగా తప్పులుతడకల సమాచారంతో, అంచనాలతో, వ్యూహాలతో నాశనం పట్టించి, చివరకు ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులు ఎవరూ ఉద్ధరించలేనంతంగా పతనం చేశారన్నది విట్ లాక్ పలు డాక్యుమెంటెడ్ ఇంటర్వ్యూలను ముందు పెట్టి బయట ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఆ ఇంటర్వ్యూలు చదువుతుంటే ఈ సత్యాలను తవ్వితీయడంలో ఆయన ఎంతగా ఆ నెట్ వర్కులోకి చొచ్చుకుపోయి నిజాలను నిగ్గుతేల్చడానికి ప్రయత్నించారో అర్థమవుతుంది. ప్రపంచాన్ని అబద్ధాలతో అమెరికా అధికారులు, రాజకీయ, మిలటరీ వ్యవస్థలు ఎంత తప్పుదోవ పట్టించాయో తెలిపే కోట్స్ చదువుతుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. రచయిత ప్రస్తావించిన ఇంటర్నల్ డిఫెన్స్ డిపార్ట్ మెంట్ ఓరల్ ఇంటర్వ్యూలు, మెమోలు చదువుతుంటే తలతిరిగిపోతుంది. ఇంత ఘోరసత్యాలను రాజకీయపాలకులు, అధికారులు, సైన్యం

అంత తేలిగ్గా ఎలా తీసుకోగలిగింది? పకడ్బందీ వ్యూహమే లేకుండా, ఆఫ్ఘానిస్థాన్ యుద్ధపరంగా గానీ, దాని ప్రగతి పరంగా గానీ అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిం చారన్నది, ఏ ధైర్యంతో అలా ప్రవర్తించారన్నది కూడా అర్థం కాదు. అమెరికా, నాటో కూటమిలకు ఆఫ్ఘానిస్తాన్ మూలాలు, సంస్కృతి, అక్కడి ప్రజల జీవనశైలి, వారి విశ్వాసాలు, భాష, అక్కడ జాతుల గురించి, వాటి మధ్య తేడాలు, ఘర్షణల గురించి తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పాలకులు, వ్యూహకర్తలు అర్ధం చేసుకోకపోవడం విట్ లాక్ విపులంగా ఇందులో చర్చించారు. ఆఫ్ఘానిస్తాన్ లో యుద్ధం నిర్మూలన అసాధ్యం కావడానికి ఇది ఒక ముఖ్యకారణమని విట్ లాక్ సేకరించిన సమాచారంలో కొందరు వ్యక్తంచేశారు.

తాలిబాన్, ఆల్ ఖాయిదా, వాళ్ళ ప్రాధాన్యతలు, ఎవరు ఆఫ్ఘాన్ యుద్ధం తలెత్తడానికి కారణమో గుర్తించడంలో, ‘బ్యాడ్ గైస్’ ఎవరో గ్రహించడంలో అమెరికా రాజకీయ వ్యవస్థ, మిలటరీ కమాండర్లు తప్పటడుగులు వేసిన వైనం, వైఫల్యం చెందిన పరిస్థితులను ఇంటర్వ్యూలలో ఆమెరికా సైనిక అధికారులు కళ్లకు కట్టినట్టు వ్యక్తం చేశారు. యుద్ధ భూమిలో చోటుచేసుకుంటున్న వాస్తవాలను దాస్తూ, యుద్ధానికి సంబంధించి రకరకాల అబద్ధాలను అల్లుతూ వ్యూహాత్మక వైఫల్యాలతో వరుసగా అధికారం చేపట్టిన ముగ్గురు అధ్యక్షుల ప్రభుత్వ యంత్రాంగాలు నేడు చరిత్రలో నిలిచిపోయాయి. పకడ్బందీ వ్యూహాల లోపంతో అమెరికా కోట్ల కొద్దీ ధనాన్ని సహాయంగా ఆఫ్ఘానిస్తాన్ దేశ పునరుద్ధరణకు వెచ్చిస్తూ వచ్చింది. వాటి నుంచి పొందిన సత్ఫలితాలు మాత్రం శూన్యం. చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అయింది. స్థానిక ఆఫ్ఘన్ సైన్యాలు, పోలీసు దళాల అసమర్థత, టాక్సులంటే కూడా వారికి తెలియని పరిస్థితులు లాంటి అమాయకస్థితి ఇలా ఎన్నో కారణాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన యుద్ధంగా ఆఫ్ఘాన్ పోరాటం రికార్డు నెలకొల్పింది. ఆఫ్ఘానిస్తాన్ పతనం అయిన తర్వాత చేతులు ఎత్తేసినట్టు బిన్ లాడన్ చనిపోయిన తర్వాత అల్ ఖైదాను అంతమైందనీ, అప్పుడే ఆఫ్ఘాన్ యుద్ధం పరిసమాప్తమైందనీ నేటి అమెరికా అధ్యక్షుడు బైడన్ ప్రకటించడం ఈ యుద్ధంలోని మరో మలుపు.

ట్రంప్ ప్రభుత్వ నిగూఢ వ్యూహం

ట్రంప్ అధ్యక్షపాలనలో ఆఫ్ఘానిస్తాన్ లో అమెరికా సైనికులను తగ్గించడంపరంగా చెప్పిన గొప్పలు, చివరకు అదెలా పరిణమించింది, ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం అనుసరించిన సీక్రెసీ వ్యూహం…ఎలా పరిణమించాయో పుస్తకం చదువుతుంటే స్పష్టంగా అవగతమవుతుంది. తమది సరికొత్త వ్యూహంగా ఉంటుందని చెప్తూ వచ్చిన ట్రంప్ ప్రభుత్వం అదెలాంటి కొత్త వ్యూహమో నిరూపించలేకపోయింది. ఆఫ్ఘానిస్తాన్ యుద్ధంలో అమెరికా పాల్పడ్డ ఘోరమైన వైఫల్యాలకు ట్రంప్ పాలన కూడా అద్దం పడుతుంది. పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందంటూ ట్రంప్ తప్పుపట్టారు. పాకిస్తాన్ కనుక తన విధానాలను మార్చుకోనట్టయితే దానికి అందించే సహాయం ఆపేస్తామని హెచ్చరించారు. ఆఫ్ఘానిస్తాన్లో యుద్ధం ముగింపు పలకడమే కాదు విజయం కూడా సాధిస్తామని, అందుకోసం పోరాడతామని ట్రంప్ డాబులు పలికారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంతో శాంతిచర్చల పరంగా కూడా తాలిబాన్ చర్చల్లో చేర్చడం విషయంలో అమెరికా ప్రదర్శించిన వ్యతిరేక వైఖరి ఆఫ్ఘానిస్తాన్ సమస్యను, అక్కడి యుద్ధపరిస్థితులను, దేశాభివృద్ధిని మరింత క్షీణింపచేశాయనే చెప్పాలి. అంతేకాదు, ఆఫ్ఘాన్ రాజకీయ భవిష్యత్తు పరంగా కొత్త సమస్యలను అమెరికాకు సృష్టించాయి.

అమెరికాకు అతి పెద్ద సమస్య అల్ ఖైదానా? తాలిబానా? ఈ విషయంలో అమెరికా తప్పటడుగు వేసిందనే వారు కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేపట్టిన అభివృద్ధి పరంగా కూడా కొన్ని లోటుపాట్లు ఉండడం, ఓపియం, రాజకీయాలు, ప్రభుత్వంలోని పైస్థాయి నుంచి కింది స్థాయివరకూ ఉన్న అవినీతి వ్యవస్థ వంటివి ఆఫ్ఘాన్ ప్రగతి పరంగా అమెరికాకు పెనుసవాళ్లుగా నిలిచిన వైనాన్ని క్రెయిగ్ విట్ లాక్ ‘లెసెన్స్ లర్న్’ ఇంటర్యూలు ముందుంచాయి. అవి చదువుతుంటే వాటి తీవ్రత ఆఫ్ఘన్ లో ఎంతలా విస్తరించాయో అర్థమవుతుంది.

ఏకు మేకైన కార్జాయ్

ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి అధ్యక్షుడుగా ఆమెరికా కూర్చోబెట్టిన హమిద్ కర్జాయ్ తొలుత అమెరికాకు మంచి మి త్రుడు. అమెరికా మాటలకు తలూపే తోలుబొమ్మ అన్న పేరు కూడా ఆఫ్ఘాన్లో ఆయన తెచ్చుకున్నారు. అతని పట్ల శత్రుత్వాన్ని కూడా ప్రజలు, తాలిబాన్ పెంచుకున్నారు. ఏకు మేకై కూర్చునట్టు పష్తూన్ తెగకు చెందిన కర్జాయ్ చర్యలు, చేష్టలు, మాటలు తర్వాత తర్వాత అమెరికాకు మింగుడుపడలేదు. స్థానిక వార్ లార్డ్స్ తో పడకపోవడం ఒక సవాలుగా నిలిచిన వైనాన్ని రచయుత విట్ లాక్ కళ్ల ముందుంచారు. ఆఫ్ఘాన్లు వార్ లార్డ్స్ అవినీతి సరళిని, వాళ్ల స్థానిక రాజకీయ తీరుతెన్నులను భరించలేక పోవడం, పలు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలకు స్థానిక వార్ లార్డ్స్ ఎలా కారణమో ఈ పుస్తకం పాఠకుల ముందుంచుతుంది. అక్కడ మానవహక్కుల పతనం ప్రజలను పలు కష్టాల్లోకి తోసింది. తాలిబాన్ పరమ క్రూరులుగా వ్యవహరించడం వారి పాలనలో ప్రజలు ముఖ్యంగా మహిళలు అనుభవిస్తున్న కష్టాలు, ఇపుడు కూడా అవి కొనసాగుతున్న వైనం మర్చిపోలేం. తాలిబాన్ పాలనలో స్త్రీలను ఎంతగా హింసించారో, చంపేసారో చూస్తున్నాం. నిత్యం అక్కడ బాంబు పేలుళ్లు వందల కొద్దీ అమాయక ప్రజల, చిన్నారుల, స్త్రీల, వృద్ధుల ప్రాణాలను బలిగొంటున్నాయి నేటి తాలిబాన్ల పాలనలో. ఇవన్నీ ఒక ఎత్తయితే అమెరికా ఇరాక్ యుద్ధంపై ఫోకస్ పెట్టడం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం బలహీనపడ్డంలో మరో చారిత్రక తప్పిదనంగా రచయత పేర్కొంటారు.

అమెరికన్ల కళ్ళు కప్పిన ముగ్గురు అధ్యక్షలు

ఆఫ్ఘానిస్తాన్ లో యుద్ధం 9/11 దాడులతో ప్రారంభమైంది. జార్జిబుష్ (జూ)తో మొదలై 2021 బైడెన్ తో ముగింపు పలికింది. ఆఫ్ఘానిస్తాన్లో అల్ ఖైదా తీవ్రవాదులను నాశనం పట్టించే లక్ష్యంతో మొదలైంది. ఈ క్రమంలోనే ఎక్కడ తప్పు జరిగింది, వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షుల ప్రభుత్వ యంత్రాంగాలు నిజాలు నిగ్గు తేల్చడంలో ఎలా వైఫల్యం చెందారో వి లాక్ ఇంటర్వ్యూల డాక్యుమెంటేషన్ ద్వారా ముందు పెట్టారు. ఆఫ్ఘానిస్తాన్ పేపర్స్ ఆ యుద్ధం-అసలు నిజాలను ముందు పెట్టడంలో విజయవంతమైంది. అంతేకాదు, బుష్, ఒబామా, ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగాలు ఆఫ్ఘాన్ యుద్ధంలోని డెవలెప్ మెంట్స్ ను ప్రజలకు వెల్లడించడంలో ఎలా ఘోరంగా వైఫల్యమయ్యాయో విట్ లాక్ ఆఫ్ఘన్ పేపర్స్ వెల్లడిస్తుంది. యుద్ధం ఎలాంటి వాస్తవిక ప్రయోజనం లేకుండా ఒక ప్రతిష్ఠంభనగా ఎలా ముగిసింది అన్నదానిని విట్ లాక్ విస్పష్టగా…సాక్షీభూతంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఆఫ్ఘానిస్తాన్లో అమెరికా యుద్ధంలో ప్రత్యక్ష్యంగా పాలుపంచుకున్న ఎందరో అధికారుల ఇంటర్వ్యూల ద్వారా రూపొందించిన యుఎస్ పబ్లిక్ డాక్యుమెంట్లు, నోట్స్ తో పాటు ముందరే ప్రస్తావించినట్టు వందలకొద్దీ డిఫెన్స్ మెమోస్, స్టేట్ డిపార్ట్ మెంట్ కేబుల్స్, ఇతర ప్రభుత్వ నివేదికల ద్వారా అమెరికా యంత్రాంగం వ్యూహాత్మక వైఫల్యాలను రచయిత విస్పష్టమైన సాక్ష్యాలతో ముందుపెట్టారు. ఇవి కాకుండా వాషింగ్టన్ పోస్ట్ ‘స్పెషల్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఫర్ ఆఫ్ఘానిస్తాన్ రీకనస్ట్రక్షన్’ (‘సిగార్’) నుంచి ‘లెసెన్స్ లర్న్’ శీర్షికన ఉన్న సమాచారాన్ని సేకరించి పుస్తకంలో అందించారు. ‘లెసెన్స్ లర్న్’లో 600 మంది యుద్ధంలో ఫస్ట్ హాండ్ సమాచారాన్ని అందించారు. ‘వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా ఎలా ప్రవర్తించిందో అలాగే ఆఫ్ఘాన్ యుద్ధంలో కూడా యుద్ధభూమిలో ఏం జరుగుతోందన్న విషయంలో అమెరికా అధికారులు ప్రజలకు తరచూ అబద్ధాలు చెబుతూ వచ్చారు’ అని రచయిత చెప్పుకొచ్చారు.

నేర్చుకున్న గుణపాఠాలు

‘ది లెసెన్స్ లర్న్ట్’ ఇంటర్వ్యూలలో అమెరికా నాయకులు తమ యుద్ధ వ్యూహం సరిగా పనిచేయదని భావించడమే కాదు తమ లక్ష్యాలను సైతం సాధించలేమని వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డారు. తెరవెనుక ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నా సంవత్సరం సంవత్సరం తాము ఆఫ్ఘానిస్తాన్ యుద్ధంలో ప్రగతి సాధిస్తున్నామని ప్రజలతో అధికారులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పడమే కాకుండా విజయం ఎంతో దగ్గరలో ఉందని బుకాయిస్తూ వచ్చారు. మిలిటరీ ఇనిస్టిట్యూషన్లు, రీసెర్చ్ సెంటర్లు రూపొందించిన ‘సిగార్ ఫైల్స్,’ ఇతర ఇంటర్వ్యూలలో అన్ని ర్యాంకులకు సంబంధించిన సైనికులు, పౌరులకు సంబంధించిన వ్యక్తులు తమ అనుభవాలను చాలా ‘ఓపెన్’గా పంచుకున్నారని విట్ లాక్ పేర్కొన్నారు. ‘మిలిటరీ, రాజకీయ నాయకులు మౌనంగా ఉన్నారు. బాధ్యత వహించలేదు. తాము చేసిన తప్పులను భూస్థాపితం చేయాలనుకున్నారు. యుద్ధం విజయం వైపే వెడుతుందంటూ ఉత్తుత్తి మాటలతో దృష్టి మళ్లించారు’ అని విట్ లాక్ రాశారు. మొదటి నుంచీ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి సరైన స్పష్టత లేదన్నారు. పైగా ఎవరితో తమ పోరాటమన్న విషయంలో సైతం అమెరికాకు స్పష్టత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ ప్రాథమిక తప్పుతో ఎప్పటికీ కోలుకోలేని విధంగా సమస్య తయారైం ది’ అని విట్ లాక్ వ్యాఖ్యానించారు. తాలిబాన్, ఆల్ ఖాయిదాల విషయంలో మొదటిది స్థానికంగా పుట్టుకొచ్చిన బృందాలైతే, రెండవది అంతర్జాతీయ లక్ష్యాలతో కూడిన ఆరబ్ నెట్ వర్కు. 2001, డిసెంబరులో జరిగిన చర్చల్లో తాలిబాన్ నాయకులు కొందరు లొంగుబాటు చర్చలకు అనుకూలం వ్యక్తంచేసినా, ఆఫ్ఘాన్ దేశ భవిష్యత్తుకు సంబంధించిన చర్చలకు వారిని అమెరికా అనుమతించలేదు. అప్పుడు ఐక్యరాజ్యసమితి రాయబారి లఖ్ దర్ బ్రాహిమి ‘ఒరిజినల్ సిన్ ఆఫ్ ది వార్’ అంటూ ఈ నిర్ణయాన్ని వ్యాఖ్యానించారు. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రమ్స్ ఫీల్డ్ దీనిపై స్పందిస్తూ ‘దేర్ వాస్ నో పాయి ట్ నెగోషియేటింగ్’ అని తప్పుపట్టారు. 2002లో దీనిపై వ్యాఖ్యానిస్తూ ‘చేయాల్సిన ఒకే ఒక పని బాంబులు వేసి తాలిబాన్ ను చంపాలి’ అన్నారు. మొత్తానికి ఆఫ్ఘన్ లో యుద్ధానికి సంబంధించి అమెరికా మిలటరీ కమాండర్లు, దౌత్యవేత్తలు పొరబాట్లను ఒప్పుకోవడం కష్టంగా భావించారు. అంతేకాదు అక్కడి యుద్ధ పరిణామాలు, తలెత్తిన సమస్యల గురించి నిజాయితీ అయిన అంచనాలను ముందు పెట్టలేదు.

అలసిపోయిన అమెరికా

నిర్దిష్టమైన కారణంతో మొదలైన యుద్ధం పట్టుజారిపోయిందనే విషయాన్ని అంగీకరించడానికి వారి మనసు అంగీకరించలేదు. వాషింగ్టన్ నుంచి కాబూల్ దాకా బయటకు అంతర్గత కుట్ర అసలు సత్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా కప్పేసింది. బరాక్ ఒబామా కూడా యుద్ధానికి ముగింపు చెప్తామని, ఆఫ్ఘానిస్తాన్లో ఉంచిన అమెరికా సైన్యాన్ని స్వదేశానికి రప్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కానీ ఒబామా రెండవ పర్యాయం తన పదవీకాలం ముగిసే సమయం దగ్గరపడడంతో ఆ మాటను నిలబెట్టుకోలేని పరిస్థితి ఎదురైంది. అమెరికన్లు మటుకు విదేశీ గడ్డపై జరుగుతున్న ఈ యుద్ధంతో అలసిపోయారు. చివరకు అక్కడి పరిస్థితులు అర్థంగాక తీవ్ర గందరగోళానికి లోనై పట్టించుకోవడం మానేసే పరిస్థితి ఏర్పడింది. వాషింగ్టన్ పోస్టు విదేశీ కరస్పాండెంట్ గా ఉంటూ ఈ రచయిత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, యూరప్ లలో ఆల్ ఖైదా, దాని ఉగ్రవాద సంబంధాల గురించి ఎన్నో కథనాలు రిపోర్టు చేశారు కూడా. దీనిపై మాట్లాడుతూ ‘ఆఫ్ఘనిస్తాన్ గందరగోళంగా తయారైంది. మరోవైపు అమెరికా మిలటరీ అక్కడ అంతా సవ్యంగానే ఉందని, అక్కడ ప్రగతి సాధిస్తున్నామని శుష్క వచనాలు ప్రజల ముందు వల్లిస్తోంది. కానీ అనేక సంవత్సరాలుగా యుద్ధంలో చోటుచేసుకుంటున్న సమస్యలను వాషింగ్టన్ పోస్టుతో సహా పలు ఇతర వార్తా సంస్థలు బయట పెడుతూ వచ్చాయి’ అని విట్ లాక్ పేర్కొనడం గమనించాలి.

పలు డాక్యుమెంటెడ్ ఇంటర్వ్యూలలో వాషింగ్టన్ లో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయ యుద్ధం గురించి కూడా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ‘సిగార్ ‘లెసెన్స్ లర్న్’ ఇంటర్వ్యూలు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ పరంగా చోటుచేసుకున్న విధానపరమైన వైఫల్యాలను గుర్తించేందుకు చేపట్టారు. దీనివల్ల చేసిన పొరబాట్లను భవిష్యత్తులో పునరావృతం కాకుండా అమెరికా చూసుకోవచ్చన్నది ఉద్దేశం. ప్రభుత్వం ప్రజల ముందు దాస్తున్న సత్యాలను బయటకు తీసుకువచ్చే లక్ష్యంతో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ‘సిగార్ ఇంటర్వ్యూలు, ట్రాన్స్ స్క్రిప్టులు, నోట్స్, ఆడియో రికార్డింగ్స్ ను బయటకు తీసుకువచ్చానని విట్ లాక్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు, యుద్ధానికి సంబంధించి బయటకు చెప్పని సత్యాలను, ప్రభుత్వ అంతర్గత విమర్శల గురించీ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని విట్ లాక్ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సిగార్ ఎట్టకేలకు 2,000 పేజీల ప్రచరితం కానీ ఇంటర్యూ నోట్సులను బయట పెట్టారు.

428 మంది సాక్షుల కథనాలు

ఆఫ్ఘాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న దాదాపు 428 మంది ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. వీళ్లల్లో జనరల్స్, దౌత్యవేత్తలు, ఎయిడ్ వర్కర్ల నుంచి ఆఫ్ఘన్ అధికారుల వరకూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలలో చాలామంది సీనియర్ అమెరికా అధికారులు ఒకవైపు వ్యక్తిగతంగా ఆఫ్ఘన్‌ యుద్ధం పెద్ద విపత్తుగా పేర్కొంటూ, బహిరంగ ప్రకటనల్లో మాత్రం యుద్ధంలో రోజు రోజుకూ మంచి ప్రగతి సాధిస్తున్నట్టు వైట్ హౌస్, పెంటగన్, స్టేట్ డిపార్ట్ మెంట్స్ తప్పుడు సమాచారం ఇస్తుండడాన్ని తీవ్రంగా విభేదించారు. యుద్ధ ప్రణాళికలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. అంతేకాదు ఆఫ్ఘానిస్తాన్లో అత్యాధునిక దేశంగా మలచడానికి దేశానికి చెందిన బిలియన్ డాలర్లను వృథా చేసినట్టు అమెరికా అధికారులు విమర్శించారు. ఇంటర్వ్యూలలో నిరాటంకంగా అక్కడ సాగుతున్న అవినీతిని నిరోధిస్తున్నామంటూ అమెరికా చెప్తూ వచ్చిన వ్యర్థ ప్రయత్నాలు, అలాగే పటిష్టమైన ఆఫ్ఘాన్ సైన్యాన్ని, పోలీసు దళాల్ని ఏర్పాటుచేస్తున్నట్టు, ఆఫ్ఘానిస్తాన్లో విస్తృతంగా సాగుతున్న ఒపియం వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తున్నట్టు అమెరికా చెప్పుకుంటున్నవన్నీ వ్యర్థ పలుకులని ఇంటర్వ్యూలలో వెల్లడయ్యాయి. అన్నింటికన్నా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే నిర్దిష్టమైన కార్యాచరణ వ్యూహమంటూ లేకుండా ఆఫ్ఘన్ యుద్ధంలో పోరాడేందుకు ప్రయత్నించడాన్ని కమాండింగ్ జనరల్స్ తమ ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. సుదీర్ఘకాలపు వ్యూహం అంటూ లేనే లేదని బ్రిటిష్ జనరల్ డేవిడ్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. నిర్దిష్టమైన వ్యూహం లేదు దానికి బదులు టాక్టిక్స్ ప్రయోగించడం తప్ప. సరైన అంచనాలు లేకపోవడం, ఆపై తప్పుడు నిర్ణయాలకు రావడం ఇవన్నీ పొరబాట్లకు మరింత ఊతం ఇచ్చినట్టయింది. దక్షిణ, మధ్య ఆసియా అత్యున్నత దౌత్యవేత్తగా బుష్ ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసిన రిజర్డ్ బోషర్ మాట్లాడుతూ ‘ మేం ఏం చేస్తున్నామో మాకు తెలియదు’ అని వ్యాఖ్యానించడం గమనించాలి.

మేము ఏమి చేస్తున్నామో మాకే తెలియదు’

‘మేం ఏమి చేస్తున్నామో మాకే తెలియదు’ అని బుష్, ఒబామా ప్రభుత్వాలలో వైట్ హౌస్ వార్ జార్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డగ్లస్ ల్యూట్ వ్యాఖ్యానించారు. ఎందరో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ల్యూట్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘లెసెన్స్ లెర్న్’ ఇంటర్వ్యూలు పెంటగన్ పేపర్లును పోలి ఉంది. డిఫెన్స్ డిపార్ట్ మెంట్ టాప్ సీక్రెట్ వియత్నాం యుద్ధ చరిత్రకు సాక్ష్యం ఇది. 1971లో ఇవి బయటకు లీక్ అయినపుడు పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అప్పుడు ప్రజలకు యుద్ధానికి సంబంధించి తప్పుడు తడికలతో కూడిన సమాచారం ఇచ్చారు. నేడు ఆఫ్ఘానిస్తాన్ లోని తాలిబాన్ పాలనలో జరుగుతున్న అకృత్యాలు అంతర్జాతీయ సమాజాన్ని ఎంతో ఆందోళనకు గురిచేస్తుండడం ఎంత వాస్తవమో ఆఫ్ఘన్ యుద్ధం పరంగా అమెరికా వేసిన తప్పటడుగులు, సత్యాన్ని కప్పి ఉంచడం వల్ల సుదీర్ఘకాలంలో జరిగిన చేటు, అనర్ధాలు వంటివి కూడా నేటి ఆఫ్ఘాన్ ప్రజల నరకతుల్యమైన జీవన పరిణామాలకు బాధ్యత అని చెప్పక తప్పదు. దీనికి అమెరికా, మిలటరీ, రాజకీయ పాలకులు, విధాన నిర్ణేతలు నైతిక బాధ్యత వహించాల్సి ఉంది. తాము చేయని పాపానికి సాధారణ ప్రజలు నేడు ఆఫ్ఘన్ లో నిలువెత్తు నరహింసపాలనలో మగ్గుతున్నారన్నది కూడా అంతే వాస్తవం.

Nagasundari
Nagasundari
Nagasundari is a senior journalist. Previously worked in vernacular and English media. She was with HMTV as health reporter. Now a freelancer.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles