భారత పౌరులపైన నిఘా ఉంచడానికి పెగసెస్ స్పైవేర్ ను వినియోగించారనే అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన డజను పిటిషన్లను పురస్కరించుకొని సుప్రీంకోర్టు అక్టోబర్ 27న ఒక ఉత్తర్వు జారీ చేసింది. పెగసస్ విషయం దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించినట్టు ఆ ఉత్తర్వులో సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కమిటీ పనిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. వి. రవీంద్రన్ పర్యవేక్షిస్తారు. దర్యాప్తు క్రమంలో ఈ కమిటీకి మరి ముగ్గురు వ్యక్తులు సహాయం చేస్తారు. ఈ కమిటీ పరిశీలనాంశాలు విస్తృతమైనవి, సమగ్రమైనవి. ఏడు అంశాలలను విచారించి, పరిశోధన చేసి, నిర్ధారంచవలసి ఉంటుంది. ఆరు అంశాల మీద సిఫార్సులు చేయవచ్చును. కమిటీ అవసరం అని భావిస్తే అనుబంధ అంశాలపైన కూడా సిఫార్సులు చేయవచ్చు. మీలో ఎవరైనా ఈ ఉత్తర్వును చదివి ఉండకపోతే తప్పకుండా చదవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. అంత సుదీర్ఘమైన ఉత్తర్వు ఏమీ కాదు. 46 పేజీలు మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని, చట్టపాలననూ సజీవంగా ఉంచాలని కోరుకునే మనబోటివాళ్ళం తప్పకుండా చదవవలసిన ఉత్తర్వు అది. ఈ ఉత్తర్వులోని విశిష్టత, నిగూడార్థం ఏమిటో, పౌరుల ఆంతరంగికత (ప్రివసీ) అనే ప్రాథమిక సూత్రం విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయం ఏమిటో, ఈ ప్రాథమిక సూత్రం విషయంలో తన జవాబుదారీతనం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నదో, ఈ రెండు వ్యవస్థల మధ్య గల భేదాభిప్రాయాలు రాబోయే మాసాలలో ఎటువంటి పరిణామాలకు దారి తీయనున్నాయో పరిశీలిద్దాం. ఈ భిన్నాభిప్రాయాలు ప్రభుత్వానికీ (ఎగ్జిక్యుటీవ్), న్యాయవ్యవస్థకీ (జుడీషియరీ) మధ్య ఘర్షణకు దారితీస్తే అది మన ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఎటువటి ప్రభావం వేస్తుందనే విషయాన్ని కూడా పరిశీలిస్తాను. అటువంటి సంఘర్షణ సంభవమేనని నా అభిప్రాయం.
Also read: టీకామహోత్సవంలో ఏమున్నది గర్వకారణం?
దేశం ఎదుట ప్రత్యామ్నాయాలు
పెగసస్ విషయం నిరుడు జులైలో రెండోసారి చర్చనీయాంశమై మీడియాలో ప్రధాన శీర్షికగా వచ్చినప్పుడు దానిపైన నా అభిప్రాయాలు చెప్పాను. ఈ వ్యవహారం అసలు 2019లో వెలుగులోకి వచ్చింది. దీనిపైన ‘ద హిందూ’ లో ఒక వ్యాసం రాశాను, మిడ్ వీక్ మ్యాటర్స్ ఎపిసోడ్ లో చెప్పాను. రెండు సందర్భాలలోనూ ఈ కింద మాటలతో ముగించాను:
‘‘ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయగల ఒకే ఒక వ్యవస్థ న్యాయవ్యవస్థ. మన జాతీయ జీవితంలో ప్రాముఖ్యం సంతరించుకున్న ప్రధానాంశాలలో సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలికాలంలో నడిచిన బాట మిశ్రమంగా ఉన్నదని మాత్రమే చెప్పగలం. అది ఏమి చేయాలని అనుకుంటున్నదో, ఏమి చేయరాదని అనుకుంటున్నదో అనేదాని ప్రభావం భారత్ పైన ఉంటుంది. దేశం ఎదుట ఉన్న ప్రత్యామ్నాయాలు స్పష్టమైనవి, కష్టతరమైనవి, గంభీరమైనవి. ఈ ప్రభుత్వాన్ని నిఘారాజ్యంగా మారడాన్ని అనుమతించడం ఒక పద్ధతి. ప్రభుత్వాన్ని నిలువరించడం, భారత రిపబ్లిక్ వ్యవస్థాపక నేతలు ప్రదానం చేసిన స్వేచ్ఛాస్వాతంత్ర్యాల విలువలను పునరుద్ధరించి ప్రజలకు దఖలు పరచడం మరో ప్రత్యామ్నాయం. దేశానికి ఎక్కువ వ్యవధి లేదు.’’
సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్న అంశాలు
ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో పనిచేసే సాంకేతిక కమిటీని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించే క్రమంలో పరిశీలించిన అంశాలూ, హేతుబద్ధత ఏమిటో చూద్దాం. కోర్టు తొదరపడలేదు. మనం గమనంలో పెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన అంశం ఇది. రిట్ పిటిషన్లు అన్నీ వార్తాపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగానే తయారైనాయి కనుక మొదట్లో అవి తమకు సంతృప్తి కలిగించలేదని బెంచ్ తన ఉత్తర్వులోనే పేర్కొన్నది. తర్వాత దాఖలైన పిటిషన్లు, ముఖ్యంగా పెగసస్ స్పైవేర్ తో నిఘాలో ఉన్న బాధితులు పిటిషన్లతో పాటు అదనపు సమాచారం, పత్రాలూ, ప్రఖ్యాత ప్రవీణులు ఇచ్చిన అఫిడవిట్లూ, విదేవీ ప్రభుత్వాల స్పందనలూ, సిటిజన్ ల్యాబ్ వంటి సంస్థల నివేదికలూ చూసిన తర్వాత ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే విషయం పరిశీలించ వచ్చునని అనిపించింది. న్యాయస్థానం జోక్యం చేసుకోవడంలో ఔచిత్యం ఉన్నదని భావించడానికి అవసరమైన సమాచారం తగు మోతాదులో అందిందని బెంచ్ తెలిపింది.
భారత ప్రభుత్వ స్పందన ఎట్లా ఉన్నదో చూద్దాం. పిటిషనర్ల నుంచి సమాచారం, పత్రాలూ అందిన తర్వాత ఈ విషయంలో సమాచారం ఇవ్వడానికీ, వివరణ ఇవ్వడానికీ న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి తగినంత వ్యవధి, అవకాశం ఇచ్చింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల గురించి ఎటువంటి సమాచారాన్నీ అడగబోమని కూడా కేంద్రప్రభుత్వానికి బెంచ్ స్పష్టం చేసింది. పదేపదే హామీలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన సొలిసిటర్ జనరల్ ఒక పరిమితమైన వాగ్మూలం (లిమిటెడ్ అఫిడవిట్) ను మాత్రమే దాఖలు చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు ప్రశ్నార్థకమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంబించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ భద్రత పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ప్రభుత్వం సవివరమైన వాగ్మూలాన్ని సమర్పించకపోవడాన్ని సమర్థించుకున్నది. అదే వైఖరిని పార్లమెంటులోనూ, బహిరంగ చర్చలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది. ఇక్కడే న్యాయస్థానం తన ఉత్తర్వులో విశేషమైన వ్యాఖ్య చేసింది. ఆ అంశాన్ని ఇక్కడ ఉటంకిస్తాను:
‘‘జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలలో న్యాయవ్యవస్థ సమీక్ష పరిమితంగా ఉంటుందన్నదే చట్టపరంగా అందరూ అంగీకరించిన అంశం. అంతమాత్రాన జాతీయ భద్రత పరిస్థితిని ప్రస్తావించిన ప్రతిసారీ ప్రభుత్వానికి ఉచిత అనుమతి (ఫ్రీపాస్) ఉంటుందని అర్థం కాదు. జాతీయ భద్రత గురించి ప్రస్తావించగానే అది న్యాయవ్యవస్థ తప్పుకోవలసినంత భయానకమైన విషయం కారాదు. జాతీయ భద్రత విషయంలో ఈ న్యాయస్థానం బహుజాగ్రత్తగా ఉండాలనే సంగతి గమనంలో పెట్టుకుంటూనే న్యాయసమీక్షను సంపూర్ణంగా నిషేధించవలసిన అవసరం లేదు.’’
న్యాయసమీక్ష లేకుండా చేయడం లక్ష్యం
జాతీయ భద్రత పేరు చెప్పి తన చర్యలపైన న్యాయసమీక్షకు అవకాశమే లేకుండా, న్యాయవ్యవస్థ ప్రేక్షకపాత్ర పోషించే విధంగా చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందని అర్థం చేసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను ఏ మాత్రం వెల్లడించకుండా ప్రభుత్వం మాటల్లోనే ‘లిమిటెడ్ అఫిడవిట్’ను దాఖలు చేయడం పట్ల ప్రభుత్వాన్ని కోర్టు తప్పుపట్టింది. పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయంలో ఈ విధమైన ప్రభుత్వ కార్యాచరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని కూడా న్యాయస్థానం చెప్పకనే చెప్పింది.
‘‘ఈ కేసులో రెస్పాండెంట్ అయిన భారత యూనియన్ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. మా (కోర్టు)పైన భారం వేరే విధంగా ఉండేది,’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో తన వైఖరిని వివరించకుండా ప్రభుత్వమే న్యాయస్థానం జోక్యాన్ని ఆహ్వానించిందని కోర్టు చెప్పిందని అనుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు కోర్టు ఉత్తర్వు జారీ చేసే విధంగా ఒత్తిడి చేశాయంటే…
‘‘రెస్పాండెంట్ అయిన యూనియన్ ఆఫ్ ఇండియా ఏయే చర్యలు తీసుకున్నదో స్పష్టంగా తెలియజేయలేదు.’’
ఆరోపణలపైన దర్యాప్తు చేయడానికి సాంకేతిక ప్రవీణులతో కమిటీని నియమిస్తానంటూ భారత ప్రభుత్వం వెలిబుచ్చిన సంసిద్ధతను కోర్టు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వపైన కానీ రాష్ట్ర ప్రభుత్వంపైన కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వమే దర్యాప్తు కమిటీని నియమించడం ‘‘న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలి’’ అనే సూత్రాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని తెలిపింది.
కోర్టు చేసిన మరో వ్యాఖ్యను ఇక్కడ గమనంలో పెట్టుకోవాలి. స్వతంత్రంగా, ఇష్టాయిష్టాలకు అతీతంగా, సమర్థంగా పని చేసే ప్రవీణులను గుర్తించం చాలా పెద్ద పని అయిందని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు కమిటీలో ఉండమని అడిగితే కొంతమంది చాలా మర్యాదగా వ్యక్తిగత కారణాలు చూపించి కుదరదని చెప్పారు. మరికొందరు ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఉంటుందని (క్లాష్ ఆఫ్ ఇంటరెస్ట్స్) చెప్పి తప్పుకున్నారు. విచారణ జరుగుతుండగా బహిరంగ న్యాయస్థానంలో కమిటీ వేస్తామని బెంచ్ ప్రకటించినప్పటికీ వారాల తరబడి జాప్యం కావడానికి కారణాలలో ఇది ఒకటి.
Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది
ప్రధానాంశాల పునశ్చరణ
ప్రధానాంశాలను ఒకసారి ప్రస్తావిస్తాను. మొదటిది, పిటిషన్లలో చేసిన ఆరోపణలపైన సమగ్రమైన వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. సమగ్రమైన వివరాలు ఇవ్వలేకపోవడానికి జాతీయ భద్రత పట్ల ఆందోళనే కారణమని చెప్పింది. రెండవది, తనపైన వచ్చిన ఆరోపణలను విచారించేందుకు తానే ఒక కమిటీని నియమిస్తానని ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. మూడోది, స్వతంత్రంగా వ్యవహరించే, ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండే, సామర్థ్యం కలిగిన సభ్యులను దర్యాప్తులో భాగస్తులు కావడానికి ఒప్పించడం చాలా కష్టమైనదని కోర్టు అన్నది.
ముందుగా మూడో అంశం: దేశంలో నెలకొన్న భయం, ఒత్తిడితో కూడిన వాతావరణం గురించి ఈ అంశం తెలియజేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే సిసలైన దర్యాప్తులో భాగం కావడానికి ప్రజలు భయపడుతున్నారు. మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకి ఇది పెద్ద చిక్కు.
రెండో అంశం: ఈ విషయం దర్యాప్తు చేయడానికి కమిటీని నియమించడానికి ప్రభుత్వ సంసిద్ధత. ఇటువంటి సూచనను సుప్రీంకోర్టుకు చేసే దుస్సాహసం ప్రభుత్వం చేస్తున్నదంటే దాని మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. దర్యాప్తు జరిగిపోయిందనీ, ప్రభుత్వం నిర్దోషి అంటూ యోగ్యతాపత్రం ఇచ్చిందనీ సుప్రీంకోర్టునూ, దేశ ప్రజలనూ మోసం చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవలి కాలంలో అలవాటైన పద్ధతిలోనే సుప్రీంకోర్టు డూడూ బసవన్నలాగా తన ఊపుతూ ఉంటుందని అంచనా వేస్తున్నది. అది కోరిన విధంగా నివేదిక రాసే ప్రవీణులు తేలికగానే దొరుకుతారని అనుకుంటున్నది. న్యాయమైన, పక్షపాతరహితమైన దర్యాప్తు జరగాలనే ఆకాంక్ష ఉన్నట్టు కనిపించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నించడం లేదు.
ఇక ఇప్పుడు మొదటి అంశం: వాస్తవాలు బయటపడకుండా ప్రభుత్వం అడ్డుగోడలాగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఏదో దాచేస్తోందనే అనుమానం ప్రజలలో బలపడుతోంది. ప్రభుత్వం నిర్దోషి అయితే పార్లమెంటులోనూ, బయట ప్రజలతోనూ ఈ రెండు విషయాలలో ఏదో ఒకటి చెబితే బాగుండేది. ఆ తర్వాత కోర్టులోకూడా చెప్పవచ్చు. ఒకటి, ప్రభుత్వం పెగసస్ సాఫ్ట్ వేర్ ను కొనలేదని స్పష్టం చేయడం. ప్రజల మీద నిఘా ఉంచారనే ఆరోపణపైన దర్యాప్తు జరిపితే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం. రెండు, పెగసస్ కొన్నాం కానీ దాన్ని నియమనిబంధనలకు అనుగుణంగానే నిఘాకి వినియోగించామని చెప్పడం. ఈ రెండింటిలో ఏ ఒక్కటీ చేయకుండా, జాతీయ భద్రత సాకుతో సమాచారం బయటికి పొక్కకుండా అడ్డుగోడలాగా నిలవడం వల్ల ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన అనుమానాలూ, భయాలూ తలెత్తుతున్నాయి. మన రిపబ్లిక్ ను నిఘారాజ్యంగా మార్చే క్రమంలో వెనక్కురాలేనంత దూరం వెళ్లిపోయిందని అనుకోవలసి వస్తోంది.
వాస్తవాలకు అడ్డుగోడలా ప్రభుత్వం
ఇటువంటి నిఘా మనస్తత్వం కలిగిన ప్రభుత్వం, సమాచారం బయటికి పొక్కకుండా అడ్డుగోడలా నిలిచే ధోరణి ప్రదర్శిస్తున్న ప్రభుత్వం, దాచవలసిన రహస్యాలు కలిగిన ఈ ప్రభుత్వం జస్టిస్ రవీంద్రన్ కమిటీతో సహకరించే అవకాశాలు ఏ మాత్రం లేవు. కమిటీ దర్యాప్తును భ్రష్టు పట్టించేందుకు చేయవలసిందంతా ప్రభుత్వం చేస్తుంది. రికార్డులు ఇవ్వమని అనడం మంచి పీఆర్ (ప్రజాసంబంధాలు) కాదు కాబట్టి రికార్డులు అందజేయడంలో సాధ్యమైనంత జాప్యం చేయవచ్చు. ఏది ఏమైనా వాస్తవాలను దాచాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి కమిటీ ఎనిమిది వారాలు లేదా పదహారు వారాలు పని చేయకుండా అవరోధాలు సృష్టించడం పెద్ద పని కాదు. నిజమైన దర్యాప్తు జయప్రదంగా జరిగితే అది ప్రభుత్వం పద్ధతి ప్రకారం వ్యవహరించలేదంటూ చిన్న పొరబాట్లూ, తప్పిదాలూ ఎత్తి చూపి ఊరుకోదు. ఈ సంగతి అందరికన్నా ప్రభుత్వానికి బాగా తెలుసు. పరిశీలనాంశాలను అనుసరిస్తూ దర్యాప్తు సక్రమంగా, నిజాయితీగా ముగింపు వరకూ తీసుకొని వెడితే రాజకీయంగా అజేయంగా ఉండటానికీ, అధికారంలో కొనసాగడానికీ, తన ఉనికికీ ఈ ప్రభుత్వం ఏ లోతైన నిఘావ్యవస్థపైన ఆధారపడి ఉన్నదో ఆ వ్యవస్థ తాలూకు రహస్య పేటికలను బదాబదలు చేయగలదు. దానికి చాలా పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఒక్క ప్రభుత్వమే కాదు మొత్తం ఆధిక్యతా భావన ప్రాతిపదికగా కలిగిన బృహత్ కార్యక్రమం యావత్తూ ప్రమాదంలో పడిపోతుంది.
Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్
రిపబ్లిక్ జీవితంలో కీలక మలుపు
కమిటీకీ, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉన్నది. కమిటీ ప్రక్రియను వెనక్కి నెట్టడానికి ప్రభుత్వం తన పూర్తి బలాన్ని వినియోగించినా ఆశ్చర్యం లేదు. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టుకూ మద్య ఘర్షణ అనివార్యం కావచ్చు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, మన ప్రజాతంత్ర రిపబ్లిక్ జీవితం మలుపు తిరిగే దశలో మనం ఉన్నాం. కుటిలమైన నిఘా వ్యవస్థ ఒకవైపూ, చట్టపాలనలో విశ్వాసం ఉన్న శక్తులు మరో వైపూ ఉండి గ్లౌస్ లేకుండా పిడికిళ్ళతో పోరాటం చేసే పరిస్థితులు దాపురించకపోతే మనం అదృష్టవంతులం. అదే జరిగితే, అటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పుడున్న చట్టపాలన సంస్థల బలం సరిపోదు. ఆ సంస్థలకు పౌరసమాజం నుంచి బలమైన దన్ను అవసరం అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం యజమాయిషీలో ఉన్న కుటిల నిఘావ్యవస్థ ధాటికి తట్టుకొని నిలబడాలంటే పౌరసమాజం నుంచి చట్టబద్ధమైన సంస్థలకు మద్దతు అవసరం. ఇటువంటి విపరీతం భారత్ లో జరగదనే నమ్మకంలో పడి ప్రమత్తతలోకి జారుకోకండి. ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. ఈ ఏడాది జనవరి 6న అమెరికా రాజధాని నగరంలో గూండా మూకలు స్వైరవిహారం చేయడం గుర్తున్నదా? అదృష్టం ఏమంటే అది తెగించిన, వ్యవస్థీకృతం కాని మూక. అటువంటి ఘటన ఏదైనా ఇండియాలో జరిగితే మనం అంత అదృష్టవంతులం కాదు. వ్యవస్థీకృతమైన, సుశిక్షితులైన, భావజాల ప్రభావంలో పడి కొట్టుకొని పోయేవారు, బలమైన లక్ష్యశుద్ధి కలిగినవారు, ఎంతో క్రమశిక్షణ కలిగినవారు ఏమి చేయగలరో మనం అయోధ్యలో చూసి ఎంతో కాలం కాలేదు.
నాకు ఒక ఆకాంక్ష, ఒక ఆశ ఉన్నాయి. నేను భయపడుతున్నవన్నీ నిరాధారమైనవనీ, నేను చేస్తున్న ఆలోచనంతా తప్పనీ నిరూపణ కావాలని నా ఆకాంక్ష. సుప్రీంకోర్టు తన వైఖరిని సడలించకుండా బలంగా నిలబడుతుందనీ, అంతిమంగా ప్రభుత్వమే తగ్గుతుందనీ, నిజం ఒప్పుకుంటుందనీ, చప్పుడు చేయకుండా ఎటువంటి పర్యవసానాలకైనా తలవొగ్గుతుందనీ ఆశ.
Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…
(MwM, మిడ్ వీక్ మ్యాటర్స్ – 36 ఎపిసోడ్ అనువాదం)