హైదరాబాద్: పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్లు (పీఐఓలు) సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ముందు ఉన్నతాధికారుల దగ్గర అనుమతి తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అక్టోబర్ 13న జారీ చేసిన సర్క్యులర్ పైన తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సంబంధిత కార్యదర్శుల దగ్గర, ముఖ్యకార్యదర్శుల దగ్గర అనుమతి తీసుకున్న తర్వాతే సమాచారం అందించాలంటూ సర్క్యులర్ స్పష్టంగా పేర్కొన్నది. పీఐఓలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు ఉన్నతాధికారుల సాయం తీసుకోవచ్చునని చట్టంలోనే ఉన్నదనీ, సాయం తీసుకోవడం వేరు, అనుమతి తీసుకోవడం వేరని గుర్తించాలనీ న్యాయస్థానం చెప్పింది.
ప్రజల చేతిలో పాశుపతాస్త్రం మాదిరి సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 16 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పౌరసమాజం సంబరం జరుపుకున్న మర్నాడే సోమేశ్ కుమార్ ఈ సర్క్యలర్ జారీ చేయించారు. ఈ సర్క్యులర్ ను సవాలు చేస్తూ న్యాయవిద్యార్థిని చిత్రపు శ్రీధృతి, సమాచార హక్కు కార్యకర్త గంజి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ లను పరిశీలించింది. సమాచార హక్కు చట్టం స్పూర్తికి విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేశారని పిటిషనర్లు వాదించారు. ఆర్టీఐ వ్యవస్థలో ఉన్న అమరికకు విరుద్ధంగా అనుమతి పొందాలంటూ చీఫ్ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేయడంతో సమాచారం అందించడంలో జాప్యం జరిగే ప్రమాదం ఉన్నదని పిటిషనర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. సమాచార వ్యవస్థ మరిత సమర్థంగా పని చేయడానికే సీఎస్ సర్క్యులర్ జారీ చేయించారంటూ ఆయన వాదించారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 5(4) ప్రకారం సమాచారం ఇచ్చేముందు పీఐవోలు ఇతర అధికారుల సహాయం తీసుకోవచ్చుననే వెసులుబాటు ఉన్నదని పిటీషనర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేశారు.