Sunday, December 22, 2024

ప్రముఖ అధ్యాపకుడు కొంపెల్ల కృష్ణమూర్తి అస్తమయం

హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త, అధ్యాపకుడు, తెలుగు పండితుడు, జ్యోతిషశాస్త్రంలో దిగ్గజం, వాస్తుశాస్త్ర ప్రవీణుడు డాక్టర్ కొంపెల్ల కృష్ణమూర్తి నవంబర్ 1, సోమవారం రాత్రి 8 గంటల 50 నిమిషాలకు కూకట్ పల్లిలో స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. రెండు వారాలుగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఒక మనుమడూ, ఇద్దరు మనుమరాళ్ళూ ఉన్నారు.  భార్య సీతామహాలక్ష్మి చాలా సంవత్సరాల కిందటే కాలం చేశారు. ఆమె కూడా ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ ఉండేవారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణమూర్తి 1930లో జన్మించారు. తన ఇరవైలలోనే ఖమ్మంజిల్లా తల్లాడ గ్రామంలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడే చాలాసంవత్సరాలు పని చేశారు. తర్వాత సూర్యాపేట దగ్గర సర్వేలులో పీవీ నరసింహారావు రాష్ట్ర విద్యామంత్రిగా ఉండగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులలో అత్యుత్తమమైనవారిగా భావించినవారిని ఆ స్కూల్ లో నియమించారు. ఈ ప్రక్రియలో భాగంగా కొంపెల్ల కృష్ణమూర్తిని సర్వేల్ స్కూలుకి పంపించారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో కొంతకాలం పనిచేసి ఉద్యోగవిరమణ తర్వాత జ్యోతిషం, వాస్తు శాస్త్రాలను అధ్యయనం చేస్తూ, ప్రజలకు సేవచేస్తూ ఖమ్మం పట్టణంలో స్థిరపడ్డారు. కొన్ని సంవత్సరాల కిందట హైదరాబాద్ వచ్చి కూకట్ పల్లి దగ్గర ప్రగతినగర్ సెంట్రల్ స్కూల్ దగ్గర ఆకర్ష్ బృందావన్ రెసిడెన్సీలో ఉంటున్నారు. కోవిద్ రోజులలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎవరినీ కలవలేదు.

కోవిద్ పరిస్థితుల కారణంగా ఎవరినీ కలుసుకోలేకపోవడం, ఎవరితోనూ మాట్లాడలేకపోవడం ఆయనకు ఇబ్బంది కలిగించింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నిత్యం ఆయనను ఎంతో మంది జ్యోతిషం కోసమో, వాస్తుకోసమో, పూజలు చేయించడం కోసమో కలుస్తూ ఉండేవారు. జలగం వెంగళరావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి రాజకీయ నాయకులకూ, రమేశ్ వంటి విద్యావేత్తలకూ ఆయన సన్నిహితులు. వందలాదిమంది శిష్యులు ఆయనకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

తెలుగు పద్యం సవ్యంగా, అర్థవంతంగా, రాగయుక్తంగా చదవడం, రాయడం విద్యార్థులకు పిన్న వయస్సులోనే నేర్పించేవారు. ఛందోబద్ధంగా వృత్తాలు రాయడం ఏడెనిమిది తరగతులలో ఉన్న విద్యార్థులకు బోధించేవారు. మొహంలో తేజస్సు ఉట్టిపడేది. సరస సంభాషణలో, ఛలోక్తులు విసరడంలో, పండితులతో సమాలోచనలో అందెవేసిన చేయి.

ఎర్రగడ్డలో అంత్యక్రియలు

కొంపెల్ల కృష్ణమూర్తికి ఎర్రగడ్డ శ్మశానవాటికలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన కుమారుడు చితికి నిప్పంటించారు. కృష్ణమూర్తి అల్లుడు శాస్త్రి, ఇంతర బంధువులు కొందరు అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆయన శిష్యుడూ, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి కూడా అంత్యక్రయలకు హాజరైనారు. 

Related Articles

2 COMMENTS

  1. ఒక గొప్ప అధ్యాపకుడిని కోల్పోవటం చాలా బాధాకరం వారికి నా ప్రగాఢమైన సంతాపం తెలియ చేస్తున్నాను

  2. 🌷వినమ్రశ్రద్ధాంజలి.🌷

    శ్రీ కొంపెల్ల వారు 1972 -75 మధ్య కాలం లో గురుకుల పాఠశాల సర్వేల్ లో మా తెలుగు ఉపాధ్యాయులు .అత్యంత ప్రతిభా శీలి .మేధావి . అంతకు ఫైన ఒక అద్భుతమైన ఉపాధ్యాయులు . ఛందస్సును అతి సులభంగా , మనసుకు హత్తుకునేలా బోధించేవారు . పాఠాలు చెప్పే క్రమంలో బోధించే ఎన్నో విషయాలు మా చిన్ని బుర్రలకు భవిష్యత్ మార్గ దర్శకాలుగా ఉండేవి .వారి ఛలోక్తులు, సరస సంభాషణా చాతుర్యం అమోఘం . మా పాఠశాల గీతం *అంబరాన చూడరా సంబరాన ఎగిరేటి గురుకుల విద్యా పీఠిక సర్వేలు యశో పతాక *
    వారు రాసి, బాణీ కట్టిందే ! అచ్చమైన తెలుగు తనం ఉట్టిపడే ఆహార్యం, మాట తీరు, జాజ్వల్యమానమైన ముఖ వర్చస్సు వారిని సదా ప్రత్యేకమైన స్థానం లో నిలపెట్టేవి . వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది . వారు మా గురువు కావడం మా అదృష్టం . అలాంటి బహుముఖ ప్రజ్ఞ్యాశాలి అరుదుగా కనిపిస్తారు . పూర్ణ జీవితాన్ని అనుభవించి ఎందరికో ఆదర్శ ప్రాయులైన శ్రీ కొంపెల్ల కృష్ణ మూర్తి గారు ధన్య జీవులు . వారి ఆత్మ కు కైవల్య ప్రాప్తి చేకుర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను .వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి .
    ఓం శాంతి .

    బోరంచ ప్రకాశ్ ,
    సర్వేల్ పూర్వ విద్యార్ధి .

    🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles