- మనిషి మారాలి, అతని బుద్ధిమారాలి
- ఉద్గారాలకు కళ్ళెం వేయాలి
- సముద్రమట్టాల స్థాయి పెరుగుతుంది
- కోట్లమంది నిరాశ్రయులు కానున్నారు
భూతాపంపై (గ్లోబల్ వార్మింగ్) శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. వాటిని లెక్కపెట్టే మానసిక స్థితిలో ఆధునిక మానవుడు లేడు. అందుకే, ప్రకృతి కన్నెర్ర చేస్తోంది,నానా తిప్పలు పెడుతోంది.అయినా మనిషి మారలేదు, బుధ్ధి రావడం లేదు. ఇదే తీరు కొనసాగితే ఊహించని పరిణామాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ మానవాళి మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రతాపం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. దానిని మించిన ఉత్పాతాలు పొంచి వున్నాయి. భూమి వేడెక్కడం ప్రారంభమై చాలా కాలమైనా, ఈ ఏడేళ్ళల్లో రికార్డు స్థాయిలో భూతాపం నమోదైందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా మారాయో, మారబోతున్నాయో తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. 2015 నుంచి 2021 వరకూ నమోదైన ఉష్ణోగ్రతలను బట్టి, వీటిని అత్యంత వేడి సంవత్సరాల జాబితాలోకి చేర్చారు.
Also read: ఉక్కు ఉద్యమానికి పవన్ ఊతం ఉపకారమే
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కాప్ -26 సదస్సు నేపథ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ ఎం ఓ ) తాజా నివేదికను విడుదల చేసింది. 2021 ముగిసే సరికి మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. లా నినా ప్రభావంతో ఈ ఏడాది మొదట్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనా, ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని ప్రపంచ వాతావరణ సంస్థ వ్యాఖ్యానిస్తోంది. పారిశ్రామిక యుగం ముందు ఉన్న వాతావరణానికి – ఇప్పటికీ అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంతో పోల్చుకుంటే 2021 సంవత్సరంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 1.09 డిగ్రీల సెల్సియస్ మేరకు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాల స్థాయి 2 మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దాని ఫలితంగా, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ముప్పు పొంచి వుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మనిషి మారకపోతే, అంతే సంగతులు. కరోనా ఆవిర్భావం వెనకాల భూతాపం ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు. 2002-2003 ప్రాంతంలో వచ్చిన సార్స్ విజృంభణకు కూడా వాతావరణంలో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల గబ్బిలాల విస్తృతి పెరిగింది. గబ్బిలాల ద్వారానే సార్స్ వైరస్ వ్యాప్తి చెందుతుందని సారాంశం.
పెరగనున్న వలసలు
వాతావరణంలో మార్పుల కారణంగా, 2050 నాటికి మానవాళి వలసలు బాగా పెరిగే అవకాశముందని ప్రపంచ బ్యాంక్ వ్యాఖ్యానిస్తోంది. ఆసియా, ఆఫ్రికా, తూర్పు యూరప్, లాటిన్ అమెరికా మధ్య అంతర్గతంగా వలసలు ఏర్పడనున్నాయి. ఈ ప్రక్రియ 2030 లో ప్రారంభమై, 2050నాటికి ఊపందుకుంటుందని తెలుస్తోంది. అంతర్గత వలసలు ప్రజల జీవనంపై, ఉపాధిపై ప్రభావాన్ని చూపిస్తాయి. నీటి కొరత, పంటల ఉత్పాదకత క్షీణించడం, సముద్రమట్టాలు పెరగడం మొదలైన దుష్పరిణామాలు ఉంటాయి. కాలుష్య ఉద్గారాలను తగ్గించడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా వలసలను నిరోధించ వచ్చు. అకాల వర్షాలు, వరదలు, తుపాన్లు, పిడుగుపాట్లు సంభవించడానికి కూడా వాతావరణంలో మార్పులే ప్రధాన కారణం. కార్బన్ డై ఆక్సైడ్, గ్రీన్ హౌస్ ఉద్గారాలను నియంత్రిస్తే మంచిమార్పులు వస్తాయి. జలవనరులు, వృక్ష సంపద తరిగి పోవడం వల్ల వాతావరణంలో సమతుల్యత లోపిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కు నగరాలు, పట్టణాలే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఇప్పటికే మన చేయిదాటిపోయినా, ఇప్పటికైనా మేలుకుంటే, భవిష్యత్తులో సంభవించే పెనుముప్పులకు అడ్డుకట్టలు వేయగలుగుతాం. ఇదంతా మనచేతిలోనే ఉంది. ప్రగతి – ప్రకృతి మధ్య సమతుల్యతను సాధిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. హరిత విప్లవం అటకెక్కింది. పారిశ్రామికీకరణ, ఆర్ధిక అభివృద్ధి, ఆధునిక జీవన విధానం మాటున అరాచకం ప్రబలింది. సహజవనరులను చాలా వరకూ పోగొట్టుకున్నాం. మానవవనరులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నాం. మానవ జీవన పరిణామక్రమంలో, వికాసంలో సహజత్వానికి దూరంగా జరిగాము. ప్రకృతికి బాగా దూర మయ్యాము. ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో ప్రకృతిని అందినకాడికి విధ్వంసం చేసుకుంటూ వచ్చాము. ఈ నేపథ్యంలో, ప్రకృతికి మనిషిపై కోపం పెరిగింది. పుడమితల్లికి ఒళ్లు మండింది.
ఆ ఫలితమే, నేటి ఆధునిక మానవుని అనారోగ్య జీవన విధానం. భూమాతను శాంతపరిస్తే ఆన్నీ సర్దుకుంటాయి. తీవ్ర వాతావరణం సద్దుమణగాలంటే, మనుషులు మారాలి.
Also read: గ్రామాలలో ఐటీ వెలుగులు!