అశ్వినీకుమార్ ఈటూరు
అమరావతి: న్యాయస్థానం నుంచి దేవస్థానం (కోర్టు టు టెంపుల్) నినాదంతో అమరావతి రైతులు మహాపాదయాత్రకు తుళ్ళూరులో సోమవారంనాడు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు న్యాయదేవతకు పూజలు చేశారు. రైతులు ఇరవై కమిటీలు ఏర్పాటు చేసుకొని పాదయాత్ర సజావుగా జరిగేందుకు వీలుగా సన్నాహాలు చేసుకున్నారు. 503.3 కిలో మీటర్ల పాడవు యాత్ర ముందు 32 రోజులలో పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. తర్వాత దానిని 45 రోజులకు పొడిగించారు.
ఒకే ఒక రాజధానిగా అమరావతి
ఒకే ఒక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. రాజధానికోసం త్యాగం చేసిన రైతులకు పూర్తి న్యాయం చేయాలని రైతులు సంవత్సరన్నరకు పైగా ఉద్యమం కొసాగిస్తున్నారు. మొదటిరోజు మహాయాత్రలో తుళ్ళూరు నుంచి తాటికొండ వరకూ 12.9 కిలోమీటర్లు నడుస్తారు. ఆ తర్వాత గుంటూరు, అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఈటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, అలిపురి మీదుగా తిరుమల వెడతారు.
పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు సర్వమత ప్రార్థనలు జరిగాయి. రైతులు, మహిళలు, వైసీపీ మినహా అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ యాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని సుమారు 70 పెద్ద గ్రామాలు, పట్టణాలమీదుగా వెడుతుంది. ఇది తిరుపతిలో డిసెంబర్ 17 ముగుస్తుంది. మహాయాత్రకు డీజీపీ గౌతమ్ సావంగ్ అనుమతి నిరాకరించారు. రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
కోదండరామ్ మద్దతు
తెలంగాణ జాయంట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఈ మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఆయన ఏదో పనిమీద విజయవాడ వచ్చారు. రైతుల కార్యాచరణ సమితి నాయకులు ఆయనను కలుసుకున్నారు. ఏదో ఒక రోజు తాను కూడా రైతులతో కలిసి నడుస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులతో సంప్రదించకుండా రాజధానిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదనీ, రైతుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవాలనీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.