గాంధీయే మార్గం-18
వేలాది సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని పశుబలమే పాలిస్తోంది. ఈ దుష్ఫలితాలను అనుభవించి, అనుభవించి మానవకోటికి రోత పుట్టింది. హింస వలన ప్రపంచానికి మేలు జరగదు. చీకటి నుండి వెలుతురు రాగలదా…? ఇటువంటి ఆలోచనలతో గాంధీజీ ప్రతిపాదించిన మహత్తరమైన ఆయుధం సత్యాగ్రహం. ఇది తొలుత దక్షిణాఫ్రికాలో, తరువాత భారతదేశంలో విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా లేక్ వలేసా, అంగసాకీ సూకీ మొదలైనవారు గాంధీజీ మార్గంలో పయనించి చరిత్ర సృష్టించారు. మరి మహాత్మాగాంధీ కరోనా సమయంలో వుండి వుంటే ఏమి జరిగి వుండేది? సత్యం, అహింసలే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అని భావించిన గాంధీజీ ఉండి ఉంటే ఈ 2020 సంవత్సరంలో ఏమి చేసి వుండేవారు? గాంధీజీ సిద్ధాంతాలనే కాదు, గాంధీజీని కూడా మరచిపోయిన వారికి ఇది తమాషాగా అనిపించవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా నేడు గాంధీజీని సరికొత్తగా పరిగణించి అధ్యయనం చేస్తున్నారు.
అభయ్ భంగ్ వ్యాసం అద్భుతం
ఈ సందర్భంగా ‘ది లన్సెట్’ (The Lancet) లో ప్రచురితమైన అభయ్ బంగ్ (Abhay Bang) వ్యాసం పరిశీలించాలి. మహరాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli)లో ఉండే సొసైటి ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్, అండ్ రీసర్చి ఇన్ కమ్యూనిటి హెల్త్ అనే సంస్థలో శ్రీ అభయ్ బంగ్ పని చేస్తారు. ‘ది లన్సెట్’ సంస్థ 1823 నుంచి వైద్యరంగానికి సంబంధించిన దాదాపు 20 పత్రికలను ప్రచురిస్తోంది. అప్పుడప్పుడు ఈ సంస్థ కథనాలు విమర్శలలో ఉన్నా, ఈ ప్రధాన పత్రికలో వ్యాసం రావడం అనేది చాలా ప్రతిష్ఠాత్మకమైన వ్యవహారం. అటువంటి పత్రికలో 2020 జూన్ మాసంలో ‘ఈ సమస్యకు గాంధీ ఏమి చేసి ఉండేవారు?’ అనే శీర్షికలో ఒకటిన్నర పేజీ వ్యాసం రాశారు అభయ్ బంగ్.
కోవిడ్-19 సమస్య ఒక రోగమే కాదు, అది ఆర్థిక సంక్షోభం కూడా. అంతకు మించి అంతర్జాతీయ రంగంలో, నైతిక నేతృత్వంలో పెద్ద స్థాయిలో శూన్యం ఆవరించి ఉంది. ఇటువంటి సంక్షోభంలో గాంధీజీ ఉండి ఉంటే ఏమి చేసి ఉండేవారు? అనే ప్రశ్నతో అభయ బంగ్ వ్యాసం మొదలవుతుంది. గాంధీజీ మాటల మనిషి కాదు, చేతల మనిషి కనుకనే నా జీవితమే నా సందేశం (my life is my message) అన్నారు. ఆయన ఒక ఇసుక రేణువును కూడా ప్రపంచానికి ప్రతినిధిగా పరిగణించగలరు. ప్రపంచం మారాలని ఆశించకుండా తనే తను ఉన్న చోటు నుంచే పని ప్రారంభిస్తారు. ఆయన తొలుత ప్రారంభించి నపుడు ఆ పనులు సిల్లీగా అనిపిస్తాయి.
కానీ ఫలితాలు రావడం మొదలైతే, అవి చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోతాయి. ఇటువంటి ‘గాంధీపద్ధతి’లో ఒక ఆలోచనా ప్రయోగం చేశారు అభయ్ బంగ్. దీనికి కొన్ని సూత్రాలలో గాంధీజీ కోవిడ్ సమస్యను పరిగణించి, ఎదుర్కొని ఉండేవారని భావన చేశారు. ఆ గాంధీజీ విధానం ఇలా ఉండి ఉండేది:
భయం నుండి విముక్తి
కరోనా వైరస్ కన్నాభయమే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది కనుక భయాన్ని పోగొట్టేవాడు గాంధీజీ. నిజానికి ఈ భయం అనేది అవాస్తవికమైంది, కనుక భయం సులువుగా కరిగిపోయి ప్రజలకు తమమీద తమకు నమ్మకం కలిగి ఉండేది.
రోగులను జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవాడు
చాలా సందర్భాలలో గాంధీజీ ప్రవర్తన మనకు తెలుసు కనుక, తొలుత రోగుల బాగోగులను కన్నతల్లిలా చూసి ఉండేవారు, మిగతా వారిని ఆ బాటలో నడిపి ఉండేవారు. ఆయనకు శుభ్రం చేయడం, రోగులకు సేవలు చేయడం చాలా ఇష్టం. అందులో ఆయన నిష్ణాతులు. పర్చూరి శాస్త్రి కుష్ఠురోగాన్ని ఎలా నయం చేశారో మనకు తెలుసు. కరోనా రోగానికి వైద్యం శాస్త్రం కూడా పూర్తి పరిష్కారం ఇవ్వడం లేదు కనుక అందుబాటులో ఉండే విధానాలు అమలు చేస్తూ నేచర్ క్యూర్ (ప్రకృతి వైద్యం) చేసి ఉండేవారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తమ చుట్టుపక్కల ఉండే పరిసరాలను, వ్యక్తులనూ కాపాడుకుని ఉండేలా గాంధీజీ ప్రేరేపించి ఉండేవారు.
నూతన దండి సత్యాగ్రహం
గుప్పెడు ఉప్పు తయారీ కోసం దండి మార్చ్ చేసిన గాంధీజీ మహాశయుడు వందలాది, వేలాది, లక్షలాది వలస కార్మికులు కాలిబాటన సాగుతూ ఉంటే ఏమి చేసి ఉండేవారు? వారికి ఆహారం, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు, అవసరమైన మందులు మాత్రమే కాక వారి విశ్వాసం, హుందాతనం దెబ్బ తినకుండా పరిరక్షించి ఉండేవారు. అంతేకాదు వారితో కలసి నడచి ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తన నడకతో ప్రశ్నించి ఉండేవారు.
పరస్పర విశ్వాసం, సమష్టి ఐక్యత
ఇది గాంధీజీక చాలా ఇష్టమైనది. మతాలమధ్య అఘాతాలు ఏర్పడినపుడు ధైర్యంగా నిలచి, నమ్మకం కలిగించిన వ్యక్తి కోవిడ్ సమయంలో పరస్పర అపనమ్మకం, వివక్షలను పారద్రోలడానికి ఖచ్చితంగా కృషి చేసి ఉండేవారు. దీనికోసం ఆయన మరోసారి హత్యకుగురైనా భయపడి ఉండేవారు కాదు.
నా పరిసరాలు నా బాధ్యత
పక్క ఇంటివారినీ, పరిసరాలనూ పట్టించుకోకుండా ఎవరికి వారు తలుపులు మూసుకునే లాక్ డౌన్ విధానాన్ని గాంధీజీ ఆమోదించక పోవడమే కాదు తిరస్కరించి ఉండేవారు. నా పరిసరాలను, నా తోటి వారిని సంరక్షించుకోవడం నా ‘స్వధర్మం’, నా బాధ్యత. మన పరిసరాల గురించి, మనతోటి వారి ఆరోగ్యం గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవాలి. దీనిని ఎవరు ఆపుతారు? ఇలా పొరపాటు నిర్ణయం తీసుకున్న సమయంలో ఆయన తనను తాను సవరించుకుని ఉండేవారు. జరిగిన పొరపాటును అంగీకరించి, సరిదిద్దుకునే లక్షణం ఆయనలో ఉంది. కానీ మన వ్యవస్థలలో బాగా అంతరించిపోయింది. దీని గురించి అవసరమైతే శాంతియుతంగా ఆయన ప్రతిఘటించి ఉండేవారు.
గ్రామస్వరాజ్యం
2008లో ఆర్థిక మాంద్యం, 2020లో కోవిడ్ దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా సున్నితమైనదీ, బలహీనమైనదని బోధపడింది. అమెరికాలోని రియల్ ఎస్టేట్ స్కామ్ అయినా, వూహాన్ వైరస్ అయినా దెబ్బతీయగలదని ధ్రువపడింది. అందువల్ల గాంధీజీ మనకు మానవీయత మాత్రమే కాక; స్థానికమైన, సుస్థిరమైన ఉత్పత్తి, ఎక్కడికక్కడ వినియోగించుకోవడం, స్థానిక ఆవాసాలలో సంబంధాలు చాలా బలంగా ఉండేట్టు చూడటం – అనే విషయాలమీద శ్రద్ధ పెట్టి ఉండేవారు. ఇటువంటి వికేంద్రీకరణనూ, గ్రామ స్వరాజ్యాన్ని కోరిన ఆయన రాజకీయ అధికారం కూడా గ్రామస్థాయికి వికేంద్రీకరింపబడి ఉండేలా చూసేవారు. ప్రపంచీకరణతో ఎక్కడికక్కడ అధికారం చలాయించగల నాయకులు ఏర్పడటాన్ని ఆయన విభేదించి ఉండేవారు. గాంధీజీకి నిజమైన ప్రజాస్వామ్యమంటే బాధ్యతతో స్థానికంగా సత్సంబంధాలు కలిగి ఉండటం.
అంతులేని కోర్కెలు
మన కోరికలకు అంతెక్కడ? కృత్రిమమైన, అసహజమైన కోరికలకు ప్రపంచస్థాయిలో బీజం పడింది. అదే స్థాయిలో మన బుర్రలు తయారయ్యాయి. నిజానికి మన కోరికలలో వాస్తవికమైనవి, అవసరమైనవి ఎన్ని? ఏవి? మన అత్యాశకు ఈ భూమాత జవాబు చెప్పజాలదు. స్వయం నియంత్రణతోపాటు మన అత్యాశలను నియంత్రించే రీతిలో మన సాంఘిక, ఆర్థిక వ్యవస్థ రూపొందాలి.
ముగింపు ఎక్కడ? ఒక అత్యాశలే కాదు, మితిమించిన ఉత్పత్తి, అనవసరమైన వినియోగం, భోగలాలసతగా మారిన ప్రయాణాలు, వేలం వెర్రి అయిన ప్రయాణ సౌకర్యాలు కూడా తగ్గితే మన మధ్య ఆవరించి ఉన్న పొగ, దుమ్ము సర్దుకుని పరిసరాలు తేట పడతాయి, జీవితం శాంతియుతంగా మారుతుంది. ఆకాశం మాత్రమే కాదు, నదులు కూడా తేటపడి శుభ్రమవుతాయి. దీనికి ఎన్నో దృష్టాంతాలు కరోనా తొలి రెండు నెలల్లో చాలా కనబడ్డాయి. ఇదే జరిగితే గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ కూడా కుదుటపడవచ్చు.
అహంకారం తగ్గించుకునేందుకు ప్రార్థన
ఎన్ని పనులు చేసినా, మన శక్తి ఎంత వ్యయం చేసినా ఆ భగవంతుడికి – అంటే జీవాత్మకూ, ప్రకృతికీ, సత్యసంధతకూ, చరిత్రకూ మనలను మనం సమర్పించుకుని స్వచ్ఛమవ్వాలి, అహంకారం విడనాడాలి. ప్రకృతి మీద మానవ మేధ అనే దృష్టి విడనాడి కృషి చేయాలి. ఇలా ప్రయత్నించినపుడు మన మీద ఒత్తిడి తగ్గి, మన మనసులు కుదుట పడతాయి.
ఇలా గాంధీజీ చేసి ఉండేవారు. అయితే, మనం నేడు గాంధీజీ రాకకోసం వేచి ఉండటం కాదు చేయాల్సింది; ఆయన ఏమి చేసి ఉండేవారో అదే మనం చెయ్యాలి, అలాగే ఆ పనులను ఎవరికి వారు ప్రారంభించాలి, కొనసాగించి పూర్తి చెయ్యాలి! – అని వివరిస్తారు అభయ్ బంగ్.
డా. నాగసూరి వేణుగోపాల్
మొబైల్: 9440732392