Sunday, December 22, 2024

బీహార్ బాహాబాహీ: లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం: మహా కూటమి మేనిఫెస్టో

  • బీహార్ ప్రత్యేక హోదా ట్రంప్ ఇస్తాడా?
  • దిల్లీలోమోదీ, పట్నాలో నితీశ్ : నడ్డా
  • అన్ని మిల్లులూ మూతబడే ఉన్నాయి : తేజస్వి

పాలడుగు రాము

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి కూటములు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాక పుట్టిస్తున్నాయి. మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు  ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, నిరుద్యోగ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి హామీలనిచ్చింది.  ఈ సందర్భంగా మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. వరదలతో ప్రభావితమైన రాష్ట్ర ప్రజలను పరామర్శించేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బిహార్‌లో పర్యటించలేదని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి …అధికారాన్ని చేజిక్కించుకునుందకు బీజేపీ, జేడీయు తాపత్రయపడుతున్నాయని తేజస్వి దుయ్యబట్టారు. 15 సంవత్సరాలుగా బీహార్ ను పాలిస్తున్న నితీష్‌ సర్కార్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తాడా అంటూ ఎద్దేవా చేశారు.

మార్పుకోసం మీ తీర్పు: తేజస్వి

‘హమారా సంకల్పం బదలావ్ కా’ అంటూ బీహార్ ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడానికి  ఈ ఎన్నికల ప్రణాళికను తయారు చేశామని తేజస్వి యాదవ్ చెప్పారు. అదికార కూటమిలో  ఉన్న జేడీయూ, బీజేపీలు బీహార్ ను వెన్నుపోటు పొడిచాయని ఆయన విమర్శించారు. మోతీమహల్ మిల్లులో తయారైన చక్కెర వేసుకొని టీ తాగుతానంటూ ప్రధాని నరేంద్రమోదీ 2015లో చేసిన వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదనీ, మిల్లు ఇంకా మూతపడే ఉన్నదనీ తెజస్వి గుర్తు చేశారు. బీహార్ లో జవుళి మిల్లులూ, చక్కెర మిల్లులూ, కాగితం మిల్లులూ అన్నీ మూతబడి ఉన్నాయి.

మోదీ, నితీశ్ తోనే  సంభవం: నడ్డా

మోదీ దేశానికి ఏ విధంగా రక్షకుడో, నితీశ్ కుమార్ బీహార్ కి రక్షకుడనీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. ‘మొదీ హై తో ముమ్కిన్ హై ఔర్ నితీశ్ హై తో సంభవ్ హై (మోదీ, నితీశ్ వల్లనే సాధ్యం) అంటూ ఆయన నినదించారు. బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్ మొన్నటి వరకూ అడిగారనీ, ఇప్పుడు ఆ విషయం ఎత్తడం లేదనీ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ‘నా గుండె చీల్చుతే మీకు మోదీ కనిపిస్తారు. బీహార్ లో మోదీ మద్దతుతో ఎస్ జేపీ ప్రభుత్వం ఏర్పడాలని ప్రధాని ఆకాంక్ష అంటూ ఎల్ జేపీ నాయకుడు చిరాగ్ పాసవాన్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీహార్ బీజేపీ నాయకులందరూ ఎల్ జేపీకి దూరంగా జరిగి నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే, ఎన్ డీ ఏ నుంచి తప్పుకున్న చిరాగ్ పాసవాన్ మోదీ భజన చేయడం గందరగోళానికి దారితీస్తోంది.

లక్ష ఉద్యోగాలు ఎక్కడ నుంచి తెస్తారు?

మరోవైపు ఆర్జేడీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో 10 లక్షల ఉద్యోగాల కల్పనపై హామీ ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా దుయ్యబట్టింది. ఉద్యోగం చేసే అర్హత లేనివాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం గురించి మాట్లాడకూడదని  బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ విమర్శించారు. ఉద్యోగానికి అర్హులు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారని అన్నారు.  తేజస్వి యాదవ్ ముందు  ఉద్యోగం చేసే అర్హత  సంపాదించాలని, ఆ తర్వాత ఉద్యోగాల గురించి మాట్లాడాలని వ్యంగాస్త్రాలు సంధించారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles