Thursday, November 21, 2024

రైతులను జంపుకుంటార్ర ఎవరన్న?

కాళోజీ తో నా గొడవ

వ్యంగ్య రచన

డైరీ తెరిచి, కళ్లద్దాలు సవరించి కాళన్న తన గొడవ తాను రాసుకుంటున్నడు.  నా గొడవ నాది కద. నేను ఇంట్లోకి బోయి ఎదురుబొదురు గూచున్న.

కాళోజీ: ఎప్పడొస్తివిరా సిరీశం. దసరా సరదాలు తీరెనా. బతుకమ్మ సంబరాలు అయిపాయెనా. భద్రకాళిచెరువుకు బతకమ్మలు సాగంనంపబోతివాలేదా.

సిరీశం: పోయిన, చూసిన, రాసిన.  కొత్తగా నా గొడవ కైత ఏదన్నా రాస్తున్నవా కాళన్నా?

కా: చుట్టుముట్టు సంగతులు జూస్తున్న .. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నాహృదిని ఇన్ని ఆవేదనలు… అనిపిస్తుంటది. తట్టుకోలేకపోతున్నర.  మనం ఎక్కడికి బోతున్నం, ఇవన్ని ఏం కతలు?

సి: ఏమైంది కాళన్నా దేనికింత ఆవేదన?

కాళోజీ: రైతుల గురించి రా. పదకొండు నెల్లనుంచి ఉద్యమం చేస్తుంటె అదేం బట్టనట్టు సర్కారోళ్లు కాలం వెళ్లదీస్తున్నరుగదరా.  ఇదివరకు నేను నాగొడవలో రాసిన వాక్యాలు జదువుకుంటున్న.

నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదకుని వాద్యాలు

శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు,

కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు,

కర్షకా నీ కఱ్ఱు కదిలినన్నాళ్లె.

వర్తకుని వాజ్యాలు, వకీళ్ల వాదాలు,

సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు,

యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు

కర్షకా నీ కఱ్ఱు కదిలినన్నాళ్లె.

అంతే గదర. నువ్వు నేను గిట్ల ఉన్నమంటే వాడు బెట్టె అన్నం తినబట్టెగద. కరువు మీద అలిగి మబ్బు మీద మండిపడి, హలం బట్టుకున్నోడు సమ్మెజేస్తె మనకు తిండి ఎక్కడ్నుంచొస్తదిర. అటువంటోడు రా కిసాన్.  వాడిమీద ఎందుకింత పగ? వాడు పండిస్తె బతికెటోళ్లకు వాడిని బతికించే బాధ్యత లేదా? కంపినీ దొంగలకు లక్షలకోట్ల రుణాలు మాఫ్ చేసే సర్కారు రైతు పంటకు మద్దతు ధర ఇవ్వకపోవుడేంది. మనకసలు బుద్ధి ఉన్నదంటవా? ఎక్కడన్న ఉన్నదా ఇంత అన్యాయం? ఒక్కడన్న కాదనకపాయె?

అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒక చోట…

హంసతూలికలొక చోట అలసిన దేహాలొకచోట..

అన్నపు రాసులు పండించెటోడికి ఆకలి మంటలు బెడుతున్నం గద అని బాధపడుతున్న.

సి: అవును కాళన్నా. ఇది దారుణమే. పదిపదకొండు నెల్లనుంచి ఉద్యమం నడుస్తున్నది. ఊరేగింపులు దీస్తున్నరు. జెండాలు బట్టుకుని రైతు చట్టాలు వద్దని గొంతెత్తి మొత్తుకుంటుంటె వినెటొడే లేడు. ఇంకో  ఘోరం జరిగింది కాళన్నా. నీకు దెలుసో లేదొ.

Also read: లాల్ బహదూర్, లోహియా దమ్మున్నోళ్లురా…

కా: ఇప్పుడేమాయె. ఇంకే ఘోరమాయె.

సి. రైతుల ఊరేగింపు నడుస్తుంటె వెనుకనుంచి పెద్ద కారేసుకుని ఒకడు గుద్దిండు. నలుగురి ప్రాణాలు బోయినయ్.

కా: అవునవును. మీ నాయిన జెప్పిండు. ఏం మనుషుల్రా వాండ్లు. రైతన్నలను వెనుకనుంచి గొట్టి చంపెటోళ్లు పాలకులా, ఏలికలా, మనుషులా, పశువులా? అన్నదాతలను ఆకలి మంటల్లో దోసుడే గాక. వాడిని కనీసం బతకనియ్యడం లేదు గద. ఇప్పడికి 636 మంది జనిపోయిన్రట.ఈ నలుగురు అందులో ఉన్నరో లేదో. అయినామీ పేపరోళ్లకు రైతు చచ్చిపోతె ఒక స్కోర్ అయిపాయె. మనుషుల ప్రాణాలు మీకు నెంబర్లురా. కొన్నాళ్లు బోతె వెయ్యి మంది బోయిన్రంటరు. మనుషులురా వాండ్లు మనుషులు. నెంబర్లు కాదు. టేబుళ్లు కుర్చీలు కాదు.

సి: అవునన్నా…

కాళోజీ: సర్కారే గిటువంటి పనులు జేస్తె ఇహ కాపాడేదెవర్రా? జనాన్నిచంపే అధికారం వీండ్లకు ఎవరిచ్చిన్రు? అప్పుడు, ఎమర్జన్జీలో నేను ఖమ్మంలో వెంగళరావుతో పోటీ జేస్తి గద. టీనేజ్ పిల్లగాళ్లను చెట్లకు గట్టేసి చంపిరి. నేనడిగిన. ప్రజలను చంపే అధికారం ఎవడిచ్చాడ్రా వెంగళ్రావ్ అని. ఊరూరు దిరిగితి, కలిసినోళ్లకల్లజెప్పితి. ఎన్నికల ప్రచారం సాగినంత సేపు ఈప్రశ్న అడుగుతనే బోతి. అప్పుడు వినెటోడెవడు. ఇప్పుడు వినెటోడెవడు.  నేను గెలవనని నాకు దెల్సు. ఎప్పుడో స్వతంత్రం తెచ్చిందని కాంగ్రెస్ కే వోటేస్తరని దెల్సు. ముఖ్యమంత్రితో పోటీ జేసిన కాళోజీని గెలిపించే ప్రజాస్వామ్యం ఉన్నదని నేను కూడా అనుకోలే. నా బాధ ఓడిబోయినందుకు కాదు. చెట్టకు కట్టేసి జనాలను జంపితె జనాలు వాడికే ఓట్లేసిరి. ఇప్పుడు రైతుల ప్రాణాలు దీస్తుంటే పట్టించుకోరు. ఎద్దు ఏడ్శిన ఎవుసం రైతు ఏడ్శిన రాజ్యం రాశికి రావన్న సంగతి సర్కారుకు ఎర్కేనా,  ఎనకట పెద్దలు జెప్పిన మాట. ఇదేం కాలమొచ్చెరా. వీండ్లేం మనుషులురా. ఎంత ఘోరం… రైతులను జంపుకుంటార్ర ఎవరన్న?

సిరీశం: సుప్రీంకోర్టు అందుకే కొంచెం గట్టిగనే అడిగింది. గది మంచిదె గదనే.

కాళోజీ: నేనేమన్న గాదన్నాన్రా. నీకో కథ చెప్పనా. అర్థరాత్రి ఓ దోభీ ఇంట్లో దొంగలు బడ్డరు. కుక్క చూసికూడ మొరగకుండ బండుకున్నది. గాడిద తట్టుకోలేకపాయె. బాగ బాధపడె. ‘‘హయ్యో యజమాని కష్టపడి ఉతికి పెట్టిన బట్టలు దొంగలెత్తుకు బోతె, బట్టలోండ్లు అడిగితె వాడేం జవాబు చెప్పుకుంటడు. కుక్క తన డ్యూటీ జెయ్యకపాయె. అని బాధపడి ‘‘నేనన్న యజమానిని నిద్రలేపుత’’ అనుకుని గట్టిగ ఓండ్ర బెట్టిందట. తన నిద్ర పాడుచేసిండని యజమాని గాడిదను గొడ్డునుబాదినట్టు బాదిండట. కుక్కపని కుక్క జెయ్యాలె, గాడిదపని గాడిద జెయ్యాలె. ఇది ప్రకృతి ధర్మంరా. ‘‘దొంగలు పడితె అరవని కుక్క అదేంకుక్క’’ అని మన పేర్వారం జగన్నాథం రాసిన కవిత యాదికొస్తున్నది. ఎంత బాగ రాసిండుర, జగన్నాథం.. ఆ ఊళ్లో పోలీసు ఇన్సెపెక్టర్ జెయ్యాల్రా ఆ పని. ఆ ఊరి మెజిస్ట్రేట్ అడగాల్రా, పోనీ కనీసం ఎస్పీ అడగాలె. వాడు గూడ నోరుమూసుకుంటె డిజిపి అడగాలె. వాడిగ్గూడ దోచకపోతే హోం మంత్రి ఏం జేస్తడ్రా గడ్డిబీకుతున్నడా. మంత్రిగ్గూడ చేతగాకపోతే ముఖ్యమంత్రి అడగాలె. పొద్దుగాల పేపర్ల జూసి వాడ్ని పట్టుకో వీడ్ని విడిచిబెట్టు అని చెప్పుడు పని అదాలత్ కిచ్చినాదిర మన రాజ్యాంగం. ఎవ్వడడగకపోతె సుప్రీంకోర్టు అడిగిందన్నవు బాగనె ఉన్నది.  కాని వీండ్లెందుకు అడగలేదని నిలదియ్యాలె గదరా.

సి: అవునవును. ఇంక ఈ సిస్టం ఎందుకు, వీడ్లంత సర్కార్ వెలగబెట్టుడెందుకు.

కా: అందుకే వెనకనుంచి కావాల్నని కారుతోకొట్టి చంపిన మంత్రి కొడుకు, సిగ్గుపడి రాజీనామా చేసే పని వదిలేసి కుర్చీ బట్టుకుని వేళ్లాడుతున్నమంత్రి, వాడిని ఇంకా మంత్రికుర్చీలో ఉండనిచ్చిన ప్రధాని ఎంత గొపోళ్లు రా వీండ్లు. చంపినోడికన్న వీండ్లేమన్న తక్కువోండ్లా.

 పరుల కష్టముజూచి కఱగిపోవును గుండె

 మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు

 పతిత మానవుజూచి చితికి పోవును మనసు

తప్పు దిద్దగ లేను వారిజూపగ లేను

తప్పు చేసిన వాని దండింపగా లేను

కష్టపడు వారలను కాపాడగా లేను

 ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు

అనుకుంటున్న. ఇంతలో నువ్వొచ్చినవు.

సి: నాజీవృత్తుల నగ్న నృత్యమని ఇంకో కవిత కూడా ఉన్నది గద,

కా:       నవయుగంబున నాజీవృత్తుల నగ్ననృత్యమింకెన్నాళ్లు?

పోలీసు అండను దౌర్జన్యాలు పోషణం బొందేదెన్నాళ్లు?

సి. అదే నాకు యాదికొచ్చింది. ఇంక చాలా ఉండొచ్చుగద కాళన్నా?

కాళోజి: లేకేమిరా.

కలము పోటున కదపజాలని కావ్యగాన మింకెన్నాళ్లు?

కాళోజీ కవికైతలు వినియు కదలకుందురింకెన్నాళ్లు?

కాలము వ్యర్థము జేయగ కళయని వ్రాసే కైతలు చాలింక,

కైతచేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక

కాళన్న ఆవేదన జూస్తె నాకు కూడా ఆవేదన రాబట్టె. దండం బెట్టి బయటికొస్తున్న. కాళన్న శూన్యంలోకి చూసుకుంటు కన్నీళ్లు బెట్టుకుంటున్నడు. కళ్లుదుడిచె ధైర్యం నాకు లేకపాయె.

Also read: కాళన్నతో కాకతీయం

మాడభూషి శ్రీధర్ (సిరీశం)24.10.2021

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles