Sunday, December 22, 2024

ఆదివాసీలకు అనుకూలంగా పోడు సమస్య పరిష్కారం : అధికారులకు కేసీఆర్ ఆదేశం

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అటవీ, పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆశించిన విధంగా పని చేస్తున్న జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని సీఎం స్పష్టం చేశారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.

Also read: గంజాయి సాగుపై ఉక్కుపాదం:పోలీసు అధికారులకు కేసీఆర్ ఆదేశం

పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ – పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతీ రాథోడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు , సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్ , అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి , పీసీసీఎఫ్ శోభ , పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.

Also read: కేసీఆర్ యాదాద్రి సందర్శన

అటవీ భూములను రక్షించుకుని తీరాలి

సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను రక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారమవుతామని సీఎం పేర్కొన్నారు. దట్టంగా ఉన్న అడవులను రక్షించుకోవడం, ఫారెస్ట్ భూములను గుర్తించి, వాటిని అడవులుగా పునరుజ్జీవింపజేయడం, ఆక్రమణలు లేకుండా చేయడం, ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం ప్రాధాన్యంగా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు

అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుండి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల అడవి బిడ్డలు అడవికి నష్టం చేయరన్నారు. బయటి నుండి వచ్చే శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. అడవులను కాపాడుకునే అమాయకులు ఎవరు ? అడవులను నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరు అనేది గుర్తించడం ముఖ్యమన్నారు. ఫారెస్టు లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫారెస్టు భూములకు  శాశ్వత బౌండరీలను ఫిక్స్ చేసి సరిహద్దులకు ప్రొటెక్షన్ ట్రెంచ్ ఏర్పాటు చేసి, ట్రెంచ్ పైన గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ట్రెంచ్ ఏర్పాటు చేయడానికి అటవీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. 

Also read: ఈ సారి ముందస్తు ఎన్నుకలకు వెళ్లడం లేదు – కేసీఆర్

10 ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానం

సోషల్ ఫారెస్ట్ లో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని సీఎం అన్నారు. ఒక పది ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ లో అడవుల పునరుజ్జీవం చేపట్టినట్లుగానే అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అడవి లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ శాఖ భూముల్లో అడవులను అభివృద్ధి చేయాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి మంచి ఆలోచన అని సీఎం అధికారులను అభినందించారు.

జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలి

పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, ఆ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపిపిలు, జెడ్పీటిసిలు తదితర ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.  గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను ఒక బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

నవంబర్ 8 నుండి పోడు క్లెయిమ్స్ స్వీకరించాలి

నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నవంబర్ 8 లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రెండు, మూడు గ్రామాలకొక నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.  87 శాతం పోడు భూముల ఆక్రమణ భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి 12 జిల్లాల్లోనే ఉందని సీఎం అన్నారు.

గంజాయి సాగు చేస్తే అన్ని సౌకర్యాలు బంద్

గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతో పాటు, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Also read: లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్ల ఉత్తర్వుల జారీ

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles