గాంధీయే మార్గం-16
మీరాబెన్ గా మనకు తెలిసిన మ్యాడలిన్ స్లేడ్ (Madeleine Slade) గురించి చెప్పాలంటే జర్మనీ సంగీతవేత్త బీథోవెన్, ఫ్రెంచి సాహితీవేత్త రోమన్ రోలా, భారత జాతిపిత మహాత్మాగాంధీల గురించి పేర్కోవాల్సి ఉంటుంది! తనకు నచ్చినట్టు జీవించిన మీరాబెన్ జీవన పోకడలు గమనిస్తే అవి ఒక మహాయోగిని ని స్ఫురింపచేస్తాయి. జీవితంలో ప్రతి మలుపు అనుకోకుండా సంభవించినా, ఆమె చాలా పరిపూర్ణంగా జీవన మాధుర్యాన్ని చవిచూశారు, జీవన సౌందర్యాన్ని స్పృశించారు!
Also read: అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా!
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ మీరాబెన్ ను మన దేశపు తొలి ‘ఎకో ఫెమినిస్ట్’ (Eco feminist)గా పరిగణించాలంటారు. 1925 నుంచి 1944 దాకా గాంధీజీకి తోడుగా ఉండి భారతదేశ చరిత్రలో కీలకఘట్టాలైన సైమన్ కమిషన్ ప్రతిఘటన, సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం, దండి సత్యాగ్రహం, శాసనోల్లంఘన; గాంధీ-ఇర్విన్ ఒడంబడిక; రౌండ్ టేబుల్ సమావేశాలలో గాంధీజీకి తోడు ఉండటం, జపాన్ దురాక్రమణ చర్యలను అహింసాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో ఒరియా ప్రజలకు నేర్పడం; ఆగాఖాన్ భవనంలో బందీగా ఉంటూ మహదేవదేశాయ్, కస్తూరిబాయి అంతిమ ఘడియలు చూడటం – ఇలా చాలా భారత స్వాతంత్ర్య, చారిత్రక సన్నివేశాలలో ప్రత్యక్ష సాక్షి మీరాబెన్.
1944 నుంచి 1959 దాకా హిమాలయ దాపున అక్కడి ప్రజలకు ఎన్నో రకాలుగా దోహదపడుతూ; పంటలు, పశువులు, పర్యావరణం గురించి శ్రమించారు. తొలుత ప్రకృతితో, సంగీతంతో 33 సంవత్సరాలు గడిపిన మ్యాడలిన్ స్లేడ్ తర్వాత 34 సంవత్సరాలు భారతదేశంలో గాంధీజీ అనుచరులైన శిష్యురాలిగా చాలా కార్యక్రమాలలో భాగస్వామి అయ్యారు. పిమ్మట 23 సంవత్సరాలు మళ్ళీ సంగీతం చెంతకు జరిగిపోయారు!
Also read: గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?
ఇంగ్లాండులో ఉన్నత కుటుంబంలో 1892 నవంబరు 22న మ్యాడలిన్ స్లేడ్ జన్మించారు. తండ్రి సర్ ఎడ్మండ్ స్లేడ్ రాయల్ ఆర్మీలో కీలక అధికారి. మ్యాడలిన్ జన్మించిన కొన్ని రోజులకే తండ్రి పదవిలో ఉన్నతి పొంది, పిమ్మట నేవల్ ఇంటలిజెన్స్ డివిజన్ కు డైరెక్టరు అయ్యారు. అందువల్ల ఆయన ఎక్కువ కాలం ఇంటికి దూరంగా సముద్రాల మీదనే ఉండేవారు. కనుక తల్లి ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళేది. మ్యాడలిన్ మాతామహులకు పెద్ద పొలం ఉండేది. దానిలోనే ఇల్లు. పర్వతాలు, పచ్చికబయళ్ళు, ప్రకృతి, పక్షులు, పశువులు, పంటలుగా మ్యాడలిన్ బాల్యం గడిచింది.
Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?
వయసు పెరిగేకొద్దీ రంపం, సుత్తి, స్క్రూడ్రైవర్ మొదలైన పనిముట్ల వాడకమే కాదు; పశువుల పెంపకం, గుర్రపు స్వారీ, గుర్రాలను మచ్చిక చేసుకోవడంలో కూడా ప్రావీణ్యం గడించారు. పాటలు అంటే ఇష్టం. తన గొంతు ప్రత్యేకంగా ఉన్నా. బెంబేలు పడకుండా సంగీతంలో తన్మయత్వం పొందేవారు. తండ్రికి బదిలీ అయ్యింది. అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. మరింత హాయిగా అనిపించింది. దానికితోడు తండ్రి బహూకరించిన సంగీత వాయిద్యం! బీథోవెన్ సంగీతాన్ని చవిచూసి, అందులో పదేపదే మునిగిపోయేది.
Also read: వందశాతం రైతు పక్షపాతి
సంగీతం పై మక్కువ, బీథోవెన్ సంగీతంపై మోజు కలగలిసి మరింతగా తెలుసుకోవాలని మ్యాడలిన్, ఆమె అక్క రోనా ఇరువురు కలసి ఫ్రెంచి సాహితీవేత్త, ఆధ్యాత్మికవాది, నోబెల్ బహుమతి గ్రహీత రోమన్ రోలా (1866-1944)ను కలిశారు. ఇది పెద్ద మలుపు. మాటల మధ్యలో భారతదేశం గురించి చెప్పి, తను రాసిన ‘మహాత్మాగాంధీ ది మ్యాన్ హు బికమ్ ఒన్ విత్ ది యూనివర్సల్ బీయింగ్’ (Mahatma Gandhi! The man who become one with the universal being) (1924) పుస్తకం గురించి వివరిస్తూ ‘గాంధీ మరో క్రీస్తు’ అని పేర్కొన్నారు.
Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప
అప్పటికి మ్యాడలిన్ భారతదేశం గురించి కానీ, గాంధీజీ గురించి కానీ వినలేదు. ఈ పుస్తకం ప్రచురణ కాగానే కొని, ఒక్క రోజులో చదివేశారు. అంతే – గాంధీజీని కలవాలని, ఆయన శిష్యులుగా జీవించాలని నిర్ణయించుకున్నారు. లండన్ రాగానే తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పారు. వారు ఎంతో ఉదారహృదయులు కనుక మారు మాటాడక కూతురి అభీష్టాన్ని మన్నించారు. లేకపోతే, గాంధీజీకి ప్రత్యర్థులైన బ్రిటీషు సైన్యపు ఇంటలిజెన్స్ డైరెక్టరు కుమార్తె గాంధీజీకి శిష్యురాలుగా మారడం ఏమిటి?
Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు
మ్యాడలిన్ జీవన శైలి మారింది. శాఖాహారిగా మారడం, నూలు వడకటం, ఉన్న అలవాట్లు మానడం, నేలపై పరుండటం, గాంధీజీ నడిపే ‘యంగ్ ఇండియా’ పత్రిక చదవడం, భగవద్గీతను, రుగ్వేదాన్ని అధ్యయనం చేయడం మొదలైంది. నిజానికి ఆమె వద్ద డబ్బు లేదు. సంగీత కచేరీలు చేసింది, తన పియానో అమ్మివేసింది! తన 21వ జన్మదినానికి తాత ఇచ్చిన వజ్రపుటుంగరం అమ్మి, బహుమతి కొని గాంధీజీకి తన కోరికను వ్యక్తపరుస్తు ఉత్తరం పంపింది.
Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?
(ముగింపు వచ్చే వారం)
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
మొబైల్: 9440732392
—–+————-+————-+——-+———+—–
Very informative.