ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
ఉపాధ్యాయ వృత్తిలో నుంచి విప్లవబాటకు
శాంతి చర్చల్లో కీలక పాత్ర
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కె గా పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల లో అర్కే కీలక పాత్ర పోషించారు. ఆర్ కె మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ. మావోయిస్టు పార్టీ ఆర్కే మృతిని ధృవీకరించింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన నక్సలైట్ నాయకులలో ఆర్ కె అత్యంత ప్రముఖుడు. నల్లమల అడవులలో ఆయుధాలు అప్పగించి హైదరాబాద్ రావడం, చర్చలు విఫలమైన తర్వాత మళ్ళీ అడవులలోకి వెళ్ళడం అంతా నాటకీయంగా, పద్ధతి ప్రకారం జరిగింది. చర్చల సమయంలో ఆర్ కె మీడియా ప్రతినిధులతో మాట్లాడేవారు. ప్రభుత్వం తరఫున నాటి హోంశాఖ మంత్రి కె. జానారెడ్డి మాట్లాడేవారు. ఐఏఎస్ అధికారి శంకరన్, కణ్ణబీరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ బి.ఎన్. రెడ్డి వంటి పౌరసమాజం ప్రముఖులతో ఏర్పడిన పౌరస్పందన వేదక, కన్సర్నడ్ సిటిజన్స్ చొరవ కారణంగా ఈ చర్చలు జరిగాయి. వీరు కాకుండా చుక్కారామయ్య వంటి పెద్దలు కూడా చర్చలకోసం ప్రయత్నించారు. ప్రభుత్వం, పౌరసమాజం పెద్దలు సుముఖంగా ఉన్నారని నక్సలైట్లు కూడా చర్చలకు సిద్ధపడి వచ్చారు. కానీ చర్చలు విఫలమైన తర్వాత చర్చలలో పాల్గొన్న నాయకులలో కొందరిని పోలీసులు ‘ఎన్ కౌంటర్’ చేశారు. నక్సలైట్ పార్టీ నాయకులుగా వచ్చినవారు మావోయిస్టు పార్టీ నాయకులుగా వెనక్కు వెళ్ళిపోయారు. వారు హైదరాబాద్ లో చర్చలలో ఉన్న సమయంలోనే నక్సలైట్ పార్టీని మావోయిస్టు పార్టీలో విలీనం చేసినట్టు పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది.
ఆ తర్వాత ఆర్ కె ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో (ఆర్ ఓబీ)లో చురుకుగా కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు చేపట్టిన గాలింపు కార్యక్రమంలో భాగంగా 2016 అక్టోబర్ లో రామగూడాలో జరిగిన కాల్పులలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మల్కాన్ గిరి-కోరాపుట్-వైజాగ్ (ఎంకెవీబీ)దళం యావత్తూ తుడిచిపెట్టుకొని పోయింది. ఆర్ కె అక్కడే ఉన్నారనీ, ఆయన పాతికేళ్ళ కొడుకు మున్నా అలియాస్ శివాజీ పోలీసుల చేతిలో మృతి చెందాడనీ వార్తలు వచ్చాయి. ఆ దాడిలో ఆర్ కె కూడా చనిపోయారని వదంతులు వ్యాపించాయి. అవి పుకార్లేనని తేలిన తర్వాత ఆర్ కె సాయుధ పోరాటంలో కొనసాగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదనే వార్తలు కూడా కొంతకాలం కిందట తెలిసింది.
కిషన్ జీ 2011లో పశ్చిమబెంగాల్ లోని జంగల్ మహల్ లో మరణించిన తర్వాత ఆయన తమ్ముడు వేణుగోపాల్ దండకారణ్యంలో మావోయిస్టు పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. అదంతా వాస్తవం కాదనీ హరగోపాల్ ఉరఫ్ రామకృష్ణ ఉరఫ్ ఆర్ కె నే మావోయిస్టులకు నాయకత్వం వహిస్తున్నారనీ ఏరియా కమిటీ సభ్యుడు (ఏసీఎం) వంతాల బాలకృష్ణ నాయుడు ధ్రువీకరించారు. రామకృష్ణకు ఉదయ్ సహకారం అందిస్తున్నారని 2018 మార్చిలో పోలీసులకు లొంగిపోయే ముందు నాయుడు తెలియజేశారు.