Sunday, November 24, 2024

మాడభూషి వెలుగులో ‘రామానుజమార్గం’

ఎ.కృష్ణారావు

ప్రొ. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అంటే తెలుగు రాష్ట్రాలలోనూ, దేశంలో న్యాయకోవిదులలోనూ తెలీని వారు ఉండరు. ఆయన స్వయం ప్రకాశితులు కనుక ఢిల్లీలో ఉన్నా, మరే ప్రదేశంలో ఉన్నా తన ప్రతిభా, ప్రజ్ఞా పాటవాలతో అందరి దృష్టిని ఆకర్షించక మానరు. ఢిల్లీలో కేంద్ర సమాచార కమిషనర్ గా ఉన్న ఆరేళ్లలో గతంలో ఏ కమిషనర్ సాధించనంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. న్యాయ అధ్యాపకుడుగా, రచయితగా, వక్తగా, సాహితీ వేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు ఒక అదనపు విలువ సాధించి పెడతారనడంలో సందేహం లేదు. ఆయన నాకు జర్నలిజంలో సీనియర్ . ‘ఉదయం’ దిన పత్రికలో  ఆయన రాసిన వార్తలకు శీర్షికలు పెట్ట్టి ప్రచురించే అవకాశం నాకు లభించింది. వారి తండ్రి గారు నిర్వహించిన ‘జనధర్మ’ పత్రికలో నేను కవితలు రాసేవాడిని. వారి సోదరుడు నాకు వరంగల్ లో ఆంగ్ల  సాహిత్యంలో అధ్యాపకులు. ఇప్పుడు ఆయన రచించిన ‘రామానుజ మార్గం’ పుస్తకం చదివిన తర్వాత కొన్ని వాక్యాలు రాయాలనుకున్నాను.

రామానుజుడు అంటే ఎవరు?

రామానుజుడు అంటే ఎవరు? మాడభూషి మాటల్లో జ్ఞానమే యజ్ఞంగా భావించిన వారు. గాలి, వెలుతురూ, జ్ఞానం అందరికీ సమానమే అన్న  భావనను ప్రచారం చేసిన వారు. లింగం, కులం, మతం అనే అడ్డుగోడలను కూల్చి అందరూ పరమాత్మని అందుకునే అవకాశాలు పొందాలని తపించిన సమతా మూర్తి. విద్య అందరిదీ అని చెప్పినవారు. అన్నానికి కులభేదం లేదన్న వారు. సంవాదమే సమస్యలకు పరిష్కారం అని భావించిన వారు. ఊళ్లో చెరువుల నీరు అందరిదీ అని చెప్పినవారు. ఆలయ ప్రవేశానికి అందరికీ అర్హత ఉన్నదని ప్రకటించిన వారు. ముక్తి మార్గం, భక్తి సాధనం, మంత్రోపదేశం, విజ్ఞాన సమాచారం అందరిదీ అన్నవారు. సమాచార హక్కుకు కూడా రామానుజుడే ఆద్యుడు అని మాడభూషి వెల్లడించారు.  రామానుజుడి జీవితంలో ఘట్టాల ద్వారా ఆయన రామానుజుడి ఆశయాలను, సాధించిన విజయాలను తన పుస్తకంలో మనోజ్ఞంగా వివరించడమే కాక ఆయనను సంస్కర్తగా నిరూపించడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు. పనిలో పనిగా ఆళ్వార్ల గురించి ప్రధానంగా రామానుజుడికి నాలుగు వేల సంవత్సరాల ముందే  ప్రజల భాషలో పాశురాలను రచించిన నమ్మళ్వార్ గురించి హృదయానికి హత్తుకునేలా రాశారు. రామానుజుడి భావన ను శ్రీధరాచార్య రామానుజుడు- గోష్టీపూర్ణుడి సంభాషణ ద్వారా తెలియజేసిన తీరు ఎవరినైనా హత్తుకుంటుంది. ‘కులం అర్హత కాదు’ అన్న శీర్షికతో రాసిన అధ్యాయంలో వైశ్యుడైన కాంచీపుర్ణుడికి తాను లేనప్పుడు తన ఇంట్లో జరిగిన అవమానం గురించి జరిగిన సన్నివేశాన్ని శ్రీధర్ ఆసక్తిదాయకంగా వివరించారు. మహాత్ములు సమాజంలో ఏ కులంలోనైనా జన్మించవచ్చు. పరాత్పరుడిని ముఖాముఖంగా చూడగలిగిన వారికి జన్మ, కులం చాలా స్వల్పమైన విషయాలు గా కనిపిస్తాయి.. అని రామానుజుడు కాంచీ పూర్ణుడితో అన్న గొప్ప వాక్యాన్ని మాడభూషి ఉటంకించడం మన దృష్టిని ఆకర్షించక మానదు.

రచయిత ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులుతో సమీక్షకుడు అప్పరుసు కృష్ణారావు

భక్తిమార్గం ఎప్పటిది?

మా పెద్ద సోదరుడు అప్పరుసు విజయరామారావు గారు  సంస్కృత పండితుడు. విష్ణు సహస్రనామానికి శంకర భాష్యాన్ని ఆంగ్లంలో అనువదించారు. బ్రహ్మసూత్రాలపై శంకర భాష్యానికి వ్యాఖ్యానం అందించారు. శంకరుడు,  రామానుజుడితో పాటు పలువురు దిగ్దంతులు చేసిన వ్యాఖ్యానాన్ని పోల్చి ఉద్గ్రంథాన్ని రాయడం ఇటీవలే పూర్తి చేశారు. ఆయన అభిప్రాయాలకూ, నా అభిప్రాయాలకూ చాలా విషయాల్లో పొంతన లేదు కాని ఇరువురి అభిప్రాయాలనూ పరస్పరం గౌరవించుకుంటాము.

మాడభూషి శ్రీధర్ రచించిన రామానుజ మార్గం పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు కొన్ని సందేహాలు తలెత్తాయి. మన దేశంలో భక్తి, భక్తి మార్గం ఎప్పటి నుంచి చలామణి అవుతున్నాయని నేను మా సోదరుడిని ప్రశ్నించాను.  “వేద సాహిత్యంలో కాని, బుద్దుడికి పూర్వం కానీ ఈ భక్తి అనే శబ్దం వాడుకలో ఉన్నట్లు అగుపించదు. శ్వేతాశ్వతరోపనిషత్తులో మనకు ‘యస్యదేవే పరాభక్తి’ అనే ప్రయోగం తొలిసారిగా కనిపిస్తుంది. ఇది పరమాత్మ తత్వం బోధించే సందర్భంలోనూ, ఇంద్రియ నిగ్రహ రూప తపస్సు గురించి వివరించేటప్పుడు వస్తుంది. అంతేకాని ఇది భక్తి మార్గాన్ని, భక్తి యోగాన్ని విశదీకరించదు..” అని విజయరామారావు  చెప్పారు. “ఉపాసన, ధ్యానం, ధారణ, జపం, తపస్సు – ఇవి వైదిక భావనలు. వీటితో పోలిస్తే భక్తి అనేది ఆధునిక కల్పన. వేద, అరణ్యక, వేదాంగ, ఉపవేద, దర్శన, ఉపనిషత్ పఠన పాఠాలు కనుమరగైపోయాయి. ఏదో ఒక విగ్రహానికి మొక్కితే చాలు, ఎవరో ఒక సాధువు కాళ్లు పట్టుకుంటే చాలు జన్మ పునీతం అవుతుంది- ఏ శ్రమా లేకుండా అనే భావన స్థిరపడిపోయింద”ని ఆయన చెప్పారు. ఒక దశను దాటి జీవితాంతం భక్తి మార్గాన్ని అనుసరించడం ఫలించదని, జ్ఞానయుక్త కర్మ మార్గ విచక్షణ, యోగ సాధన మనను ‘పెంజీకటి కవ్వలి’కి చేరుస్తాయని ఆయన అభిప్రాయం. “భక్తి యోగాన్ని గీత పరిచయం చేసినా భక్తి యోగమే ఏకైక మోక్ష సాధనమని ప్రకటించింది భాగవతమే” అని ఆయన అన్నారు. ఆయన చెప్పిన అంశాలపై విస్తృత చర్చ జరగాల్సి ఉన్నది.

చారిత్రక నేపథ్యం

సరే, భక్తి మార్గం ఎప్పుడు ప్రవేశించినా దాని కొక చారిత్రక నేపథ్యం ఉన్నదని నా అభిప్రాయం. భక్తి యుగం సాహిత్యంలో స్వర్ణ యుగాన్ని సృష్టించింది. సగుణ, నిర్గుణ ధారల మధ్య జరిగిన సంవాదం హిందీలో ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిందని పివి నరసింహారావు గారు ఒక సందర్భంలో చెప్పారు. ఉత్తర భారత దేశంలోని భక్తియుగ కవులపై దక్షిణ భారతంలోని భక్తి సంప్రదాయ ప్రభావం ఎక్కువ అనేది నిర్వివాదాంశం. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, నింబార్కా చార్యులు, రామానుజా చార్యులు, వల్లభాచార్యులు మొదలైన వారు తులసీదాస్, సూరదాస్, చైతన్య మహాప్రభు లాంటి వారిని ప్రభావితం చేశారు. భక్తి సామాన్య మానవ మాత్రులైన రాజులను, చక్రవర్తులను ధిక్కరించేందుకు కూడా తోడ్పడింది.

‘రామానుజ మార్గం’ ఒక అద్భుతమైన పుస్తకం. అయితే ఇందులో ఉన్న విశేషాలను న్యాయకోవిదుడుగా, సమాచార కమిషనర్ గా శ్రీధర్   చేసిన పనులను మిళితం చేసి చూడడానికి వీల్లేదు. న్యాయం భౌతిక వాస్తవాల ఆధారంగా ప్రశ్నించడంపై ఆధారపడి ఉంటుంది. సమాచార హక్కు చేసిన పనులు,తీసుకున్న నిర్ణయాలపై హేతుబద్దతను ప్రశ్నిస్తుంది. ఫలానా భగవంతుడు కలలో కనపడి ఫలానా కాంట్రాక్టర్ కు మేలు చేయమన్నాడని, ప్రజల ఆస్తులు కార్పోరేట్లకు కట్టబెట్టమన్నారని ఒక అధికారి కానీ, నాయకుడు కానీ చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. అశరీరవాణి కనపడి నిజాలు చెప్పే ఆస్కారం ఆధునిక కాలంలో లేదు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన డిగ్రీ సర్టిఫికెట్ ను దాచుకోవడానికి ప్రయత్నిస్తే బయటపెట్టాల్సిందే అని సమాచార కమిషనర్ గా శ్రీధర్ ఆదేశించారు. అదే శ్రీధర్ రామానుజుడిపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని అద్భుత ప్రసంగంగా అభివర్ణిస్తూ తన పుస్తకంలో వేసుకున్నారు. ఇదే భక్తి సృష్టించే అద్భుతం.

భక్తి ప్రచారానికి ఎవరి ప్రాపకం అక్కరలేదు

ఆధునిక కాలంలో భక్తి మార్గాన్ని ప్రచారం చేసేందుకు కూడా రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్న వారి  అండ కావాలి కనుక త్రిదండి చిన జీయర్ స్వామి గత వారం ‘మై హోమ్స్’ అధినేత జూపల్లి రామేశ్వరరావు తో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న సహస్రాబ్ది ఉత్సవాల సందర్బంగా రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించమని కోరారు. అందుకు ప్రధానమంత్రి సంతోషంగా అంగీకరించడం సహజ పరిణామం.

నిజానికి భక్తికి ప్రాపకం లభించడానికి రాజులు, జమీందారులు, సంపన్నులు అవసరం లేదు. భక్తి మార్గం పరిపుష్టం చేసేందుకు కృషి చేసిన నయనార్లు(3-10 శతా), ఆళ్వార్లు (6-9 శతా) నుంచి రామానుజులు, మధ్యాచార్యులు, కబీర్, అన్నమాచార్యులు, వల్లభాచార్యుల నుంచి రామకృష్ణ పరమహంస వరకు తమ సిద్దాంతాలు, ఆధ్యాత్మిక మార్గాల గురించి ప్రచారం చేసేందుకు ఏ రాజులు, సంపన్నులు వారికి తోడ్పడలేదు. శంకరుడు ఎవరి ప్రాపకం లేకుండా కేవలం 32 సంవత్సరాలు జీవించినప్పటికీ దేశ వ్యాప్తంగా పీఠాలు స్థాపించి, బ్రహ్మసూత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, విష్ణు సహస్రనామంపై భాష్యాలు రచించారు. రామానుజుడూ, మధ్వాచార్యులు  కూడా హిందూ తాత్విక దృక్పథంపై తమదైన ముద్ర వేశారు.  వారెవరూ రాజుల పోషణతోనే తమ ప్రచారం చేశారని చెప్పడానికి వీల్లేదు. తత్వవేత్తలైనా, సంస్కర్తలైనా సమాజంలో కాలానుగుణంగా నాటి పరిస్థితుల ప్రభావం వల్ల జనిస్తారు కాని రాచపిపీలికాలకూ వారు వెలుగు వెలగడానికీ సంబంధం లేదు. రామానుజుడు లాంటి  వారు హిందూమతంపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు కాని కుల వ్యవస్థ సృష్టించే దారుణాలు పూర్తిగా సమసిపోలేదు అది వారి తప్పు కాదు. పెన్ పిళ్లై అనే గొల్ల మహిళ రామానుజుడిని నాడు 81 ప్రశ్నలు ప్రశ్నించడంతో ఆయన చకితుడై సన్యాసి నియమాన్ని ప్రక్కన పెట్టి ఆ రోజు ఆమెకు వండిన అన్నాన్ని భుజించి తీర్థప్రసాదాలు స్వయంగా ఇచ్చిన ఘటనను శ్రీధరాచార్య పుస్తకం చివర్లో అసామాన్యమైన రీతిలో వివరించారు. ఇవాళ ప్రజల మనసుల్లో తలెత్తే వేలాది ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఎందరు రామానుజులు అవతరించాలి?

(రామానుజ మార్గం రచన ప్రొ. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు. ప్రచురణ కర్తలు శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, విజయవాడ వెల రూ. 450)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles