Thursday, November 21, 2024

కృత్రిమ మేథదే భవిష్యత్తు!

  • ఈ రంగంలో ముందంజలో చైనా
  • వెనకబడుతున్న అమెరికా
  • భారత్ వేగం పుంజుకోవాలి

సృష్టికి ప్రతిసృష్టిగా భావించే ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ (ఏ ఐ )…  ఇప్పుడు ప్రపంచంలో బాగా వినపడుతున్న పేరు. ఇది చెయ్యలేని పని అంటూ ఉండదంటున్నారు. సహజాతమైన మెదడుకు ఇది తోబుట్టువు వంటిదనుకోవాలి. మెదడును, శరీర అవయవాలను మించి పనిచేసే ఈ ఆవిష్కరణ ఒక అద్భుతం! దీని భవిష్యత్ అపారంగా ఉంటుందని అందరి అంచనా.  ప్రపంచంలోని అనేక దేశాలు ఇందులో అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా – చైనా నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. ఈ పోరులో సమీప భవిష్యత్తులో అమెరికాను సైతం అధిగమించే దిశగా చైనా శరవేగంగా దూసుకెళ్తోందని సాంకేతిక వర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పెంటగాన్ మాజీ చీఫ్ సాఫ్ట్ వేర్ ఆఫీసర్ నికోలాస్ చైలాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి.

Also read: కల్లోల కశ్మీరం

ఐటీలో భారతీయులది వ్యక్తిగత ప్రతిభ

ఆమెరికా వంటి అగ్రరాజ్యమే వెనకబడనుందంటే  భారత్ వంటి దేశాలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పనక్కర్లేదు. సాఫ్ట్ వేర్, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో భారతీయులు ప్రపంచ దేశాల్లో అసమానమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆ మేధ విషయంలో సందేహం లేదు. అది వ్యక్తిగత ప్రతిభకు సంబంధించిన విషయం. వ్యవస్థాపరంగా ఇంకా పటిష్ఠమైన నిర్మాణం భారత్ లో జరగాలి. సాంకేతికతలోనూ అగ్రదేశాలతో పోటీపడేలా మనం తయారవ్వకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిణామాలు చెబుతున్నాయి. నిన్నటి వరకూ ఎక్కువ శాతం చైనా యాప్స్ నే మనం వాడుకున్నాం. వాటిని వదిలించుకొనే ప్రయత్నం చేశాం. ఇప్పటికీ పూర్తిగా బయటపడలేక పోతున్నాం. కృత్రిమ మేధతో పాటు జన్యుశాస్త్రం ( జెనెటిక్స్), సింథటిక్ బయాలజీ వంటి కీలక శాస్త్రసాంకేతిక రంగాల్లోనూ మనతనం చూపించుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత మనపైన ఉన్నాయి. పైన వ్యక్తపరచిన రంగాల్లో భవిష్యత్తులో చైనా అగ్రగామిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అనేక విదేశీ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ భవిష్యత్తుపై చైనా పెత్తనం చేసే పరిస్థితులు వస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది.

Also read: కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ

అమెరికా వెనుకంజ

ముఖ్యంగా కృత్రిమ మేధారంగంలో అగ్రగామిగా నిలబడాల్సిన అమెరికా నూత్న ఆవిష్కరణలు చేయడంలో వెనకబడుతోందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. గూగుల్ వంటి అమెరికా సంస్థలు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడడం లేదని నికోలస్ చైలాన్ వంటివారు చేస్తున్న వ్యాఖ్యలను తేలికగా తీసెయ్యరాదు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో సైతం సైబర్ రక్షణ వ్యవస్థలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయనే మాటలు వింటుంటే, మనం ఎక్కడున్నామన్నది ప్రశ్నార్ధకం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో ఉందో మనం అనుభవిస్తూనే ఉన్నాం. కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలు ప్రముఖంగా గుర్తించాలి. సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్ వంటి మన భారతీయ దిగ్గజాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. వారి నుంచి కీలకమైన సలహాలు, సంప్రదింపులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలి. స్వయంశక్తివంతులం కావడానికి ఏమేమి చెయ్యాలో గుర్తెరగాలి. సాంకేతిక అభివృద్ధి అత్యంత కీలకమని ఆచరణలో ప్రతిఫలించాలి. పిలిచిన వెంటనే పలికే వాయిస్ సహాయకులు, ఆరోగ్య సలహాలు, అనువాదాలు, విద్యలు నేర్పే వ్యవస్థలు, ఛాట్ బాట్ లు, ఈ – కామర్స్… ఇలా ఎన్నింటినో స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్నాయి. అబ్బో! కృత్రిమ మేధ… వింతలు, విశేషాలు తలచుకుంటేనే ఒళ్ళు పులకిస్తుంది, ఆశ్చర్యచకితులమవుతాం. ఈ రంగంపై మరింతగా దృష్టి సారించడం తక్షణ కర్తవ్యం.

Also read: రక్తసిక్తమైన రైతు ఉద్యమం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles