నిజనిర్థారణ సంఘం సభ్యులు
వి. సంధ్య
- దళిత కుటుంబం వేదన
- బాధితులనే నేరస్థులుగా చూపించడానికి పోలీసుల యత్నం
- తామే చంపినట్టు ఒప్పుకోవాలని పాప తల్లిదండ్రులపైన ఒత్తిడి
- మియాపూర్ పోలీసుల బూతుల బాగోతం
హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా ఉంది. మద్యం తాగిన మత్తులో చిన్నారులపై హత్యాచారాలు జరుగుతున్నాయి. నగరంలోని ఓంకార్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న దళిత కుటుంబానికి చెందిన పదమూడు మాసాల బాలిక అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందింది. తల్లిదండ్రలు ఎవరినైతే నేరస్తుడిగా అనుమానిస్తున్నాడో అతడినే పోలీసులు సమర్థిస్తున్నట్టు నిజనిర్ధారణ సంఘం దర్యాప్తులో తేలింది. బాధితులనే నేరస్థులుగా మార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టూ, ఇందులో భాగంగా చిన్నారి తల్లిదండ్రులనూ, వారి బంధువలనూ దుర్భాషలాడుతూ పోలీసులు చట్టాలను ఉల్లంఘించారని నిజనిర్థారణ సంఘం సభ్యులు చెబుతున్నారు. నిజనిర్థారణ బృందంలో హక్కుల కార్యకర్తలూ, సంపాదకురాలూ, స్వతంత్ర జర్నలిస్టూ, మహిళాహక్కుల నాయకురాలూ, తదితరులు ఉన్నారు. నిజనిర్థారణ సంఘం ఇచ్చిన నివేదికను ఉన్నది ఉన్నట్టు ఇక్కడ ప్రచురిస్తున్నాం.
ఓంకార్ నగర్ లోని 13 నెలల పసిపాప అనుమానాస్పద మృతిపై తెలంగాణ మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్యకార్యాచరణ సభ్యులు అక్టోబర్ 3 వ తేదీన ఆ బస్తీకి వెళ్లి బాధితుల్ని, ఆ బస్తీ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి సమాచారం సేకరించారు. అలాగే సంబంధిత మియాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సిఐని, ఈ కేసు విచారణ చేస్తున్న ఐవోని కలిసి మాట్లాడాలని వెళ్లగా ఇద్దరూ అందుబాటులో లేరు. అక్కడ వున్న సిబ్బంది లింగ్యా నాయక్ తో మాట్లాడి కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకున్నాం.
సంఘటన పూర్వాపరాలు:
హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ 606 పిల్లర్ ఎదురుగా ఓంకార్ బస్తి ఉంది. ఈ బస్తీ లో దాదాపు ఎనిమిది వందల కుటుంబాలు ఉంటాయి. ఇందులో కర్నూల్ నుంచి వలస వచ్చిన వారే రెండు వందల కుటుంబాలు. కొంతమంది చెత్త ఏరే పనిచేస్తే కొంతమంది జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పనిచేసే వర్కర్లు. కర్నూల్ జిల్లా దళిత మాదిగ సమూహానికి చెందిన సుమలత, రంగస్వామి భార్య భర్తలు. చెత్త యేరుతూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లి అయిన ఆరేళ్ల తరువాత ఒక పాప జన్మించింది. పాప వయసు ఇప్పుడు పదమూడు నెలలు. 2021 సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం ఇంటిముందు పాప ఆడుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత పాప తల్లి వచ్చి చూడగా పాప జాడలేదు. భార్య భర్తలు రోదిస్తూ పాప కొరకు చుట్టుపక్కల ఎంతో వెతికారు. స్థానికంగా వుండే బస్తీ లీడర్ల సహాయంతో పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కూడా వచ్చి వెతికి పాప ఆచూకీ దొరకక పోవటంతో తిరిగి వెళ్లిపోయారు. మర్నాడు అంటే 13వ తేదీ ఉదయాన్నే తెల్లవారు జామున 5.15 కి ఎదురింటి రాజు కుటుంబం (ఎల్లమ్మ బండలో ఉంటారు) వచ్చినపుడు ఎర్రమ్మ తమ ఇంటి మూలన నిలబడి పాప కనిపించటం లేదనే విషయాన్ని వారికి చెప్పింది. కాసేపటికి గం. 5.30 కి వారి ఇంటిపక్కన ఖాళీ స్థలంలో రేకు చాటున పాప పడి వుండటం చూసి అరుపులతో పిలిచారు. వెంటనే పాప అమ్మమ్మ అక్కడికి వెళ్లి చిన్నారిని తన చేతిలోకి తీసుకుని ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే పాప చనిపోయి వుంది. వెంటనే బస్తీ లీడర్లు పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు పంపించారు.
నేర నిర్ధారణలో భాగంగా పోలీసు కుక్కలు పెద్ద రామాంజనేయులు అనే అతని ఇంటి దగ్గరకు వచ్చి చాలా సేపు వున్నాయి. అతని ఇంటి పంచలో వున్న మంచం చుట్టూ తిరిగాయి. ముందటిరోజు రాత్రి అతడు మద్యం తాగి వున్నాడు. ఇంట్లో అతని భార్య పిల్లలు లేరు. అతని పై అనుమానంతో పాప తండ్రి ఫిర్యాదు చేయగా పెద్ద రామాంజనేయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వెంటనే వదిలి వేశారు. ఇతని తమ్ముడు కూడా ప్రక్కనే ఆనుకొని ఉన్న ఇంట్లో ఉంటాడు. అతని పై కూడా బస్తి వాసులకు అనుమానాలు ఉన్నాయి.
అనుమానాలకు తావిస్తున్న పోలీసుల వైఖరి:
మియాపూర్ లో ఈ సంఘటన జరిగే నాటికి హైదరాబాద్ లోని సింగరేణి కాలనిలో చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రం అట్టుడుగిపోతోంది. నిందితుడిని పట్టించిన వారికి పది లక్షలు ఇస్తామని పోలీసుల నుండి ప్రకటన ఇదే సమయంలో వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది కూడా మళ్లీ అలాంటి సంఘటనే అయితే బస్తీలో ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని ఊహించిన పోలీసులు, పాప భౌతికకాయానికి పోస్టుమార్టం జరిగిన వెంటనే పాప తలిదండ్రుల దగ్గరి బంధువులందరూ ఇక్కడే వున్నా గానీ శవాన్ని తీసుకుని తిరిగి బస్తీకి రానివ్వకుండా, అంత్యక్రియలు కర్నూల్ లోనే చేయించమని డబ్బులిచ్చి మరీ బలవంతంగా పంపించి వేశారు. అలాగే, పాప శవాన్ని పరిశీలించగా ఒక కన్ను పైన గాయం వుందని, మరో కనురెప్పను కత్తిరించినట్లు అనిపించింది అని కుటుంబీకులు చెప్పారు. పాప చేతి ముని వేళ్ళ చివర్లో చర్మం చిట్లిపోయినట్లుగా వుంది అని కూడా తల్లి, అమ్మమ్మ చెప్పారు.
మూడు రోజుల తర్వాత, పాప తల్లీ తండ్రి సుమలత రంగస్వామి ఇతర బంధువులు అంత్యక్రియలు ముగించుకుని కర్నూల్ నుండి తిరిగి వచ్చిన వెంటనే వారిని స్టేషన్ కి తీసుకెళ్లి భార్య సుమలత, అక్క అనిత ఎదుట రంగస్వామి బట్టలు ఊడదీసి కొట్టి పాపను చంపినట్లు నేరాన్ని ఒప్పుకోవాలని వత్తిడి చేశారు. పాప అమ్మమ్మ ఎర్రమ్మ కాళ్ళు, చేతులు కట్టి వేసి రెండు రోజులు విపరీతంగా కొట్టినారు. ఆడ, మగ పోలీసులు ఇద్దరూ దీనిలో పాల్గొన్నారు. ‘నీకు, నీ అల్లుడికి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది. గొడవలు ఉన్నాయి. నువ్వే పాపను చంపావు’ అని బూతులు తిడుతూ నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తామని, పచ్చిమిరపకాయలు దంచి లోపల కూరతామని, పాపను అందరూ కలిసి చంపినట్లు ఒప్పుకోమని కాళ్ళు చేతులు రక్తం వచ్చేటట్లు కొట్టినారు. మా పాపని మేమెందుకు చంపుకుంటాము అని అడిగిన అనితని అయితే మరీ ఘోరంగా తిట్టారు…‘ఫాల్తూ ముండా, లంజ ముండా’ అంటూ, ‘పెద్ద పెద్ద నేరాలు చేసిన మగోళ్ళనే వంగదీస్తాం, నీకేందే నోరు గట్టిగా లేస్తోంది, నీ గురించి అందరూ చాలా చెప్పినారు, పచ్చి మిరపకాయలు దంచి పెడితే ఉచ్చ పోసేచోట రక్తమే వస్తుంది ఇంక’ అంటూ అవమానకరంగా ప్రవర్తించారు. సుమలత చేతులు కట్టివేసి కొడతామని బెదిరించారు. రంగస్వామితో ‘నీవు ఫాల్తు నా కొడుకువి, మీ అక్కతో, అత్తతో సంబంధం పెట్టుకుని పాపని నువ్వే చంపినావు’ అని బండ బూతులు తిట్టినారు. పాప అమ్మమ్మను 4 రోజులు, అనితను 6 రోజులు, మైనర్ అయిన అనిత కూతురును 2 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టి నేరాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు.
బాలల మీద పోలీసుల చట్ట ఉల్లంఘనలు:
పాప మేనత్త అనిత కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. పెద్దమ్మాయి పదో క్లాసు చదువుతున్నది. రెండో పాప ఏడు, బాబు మూడవ తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు పిల్లలతో పాటు రంగస్వామి బంధువులైన మరో నలుగురు మైనర్లను స్టేషన్ కు తీసుకెళ్ళి రాత్రంతా ఉంచి ‘మీ అత్త, మామ, అమ్మ, అమ్మమ్మ కలిసి పాపను చంపినట్లు ఒప్పుకోమని బెదిరించారు. డబ్బులు కూడా ఇస్తామని ఆశ పెట్టారు. అనిత పెద్ద కూతురుని ‘లంజా’ అంటూ బూతులు తిట్టి, పచ్చి మిరపకాయలు చేతినిండా పట్టుకుని చూపిస్తూ ఇవి పెడితే భవిష్యత్ లో సంసారానికి పనికి రాకుండా పోతావని బెదిరిస్తూ వంగదీసి వీపు మీద గుద్దటంతో ఆమె భయంతో అక్కడే మూత్రం కూడా పోసేసుకుంది. ‘మీరు ఈ బస్తీ లో ఉండొద్దు, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలి’ అని బెదిరించారు. మైనర్ అయిన ఈ పాపను కూడా 2 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
బాధితులనే నిందితులుగా ఎందుకు ముద్ర వేయాలని చూస్తున్నారు?
ఇక్కడ బిడ్డను కోల్పోయిన బాధితులనే నిందితులు గా చూపించే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న. పోలీసు కుక్కలు పెద్దరామాంజనేయులు ఇంట్లో మంచం దగ్గరకు వచ్చి చాలా సేపు నిలబడ్డాయి. నీళ్ల సంప్ దగ్గర పదే పదే తిరిగినా గానీ, అది మూత తీసి చూడాలనే అనుమానం ఎందుకు రాలేదు? పెద్దరామాంజనేయులు మీద అనుమానం లేకపోగా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రామాంజనేయులు బావ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉంటాడని బస్తీ లోని అనేకమంది చెప్పారు. ఇందులోని నిజానిజాలు పోలీసులు తేల్చాల్సి వుంది.
చిన్న పిల్లల మృతిపై ప్రజలనుండి పెద్ద ఎత్తున వత్తిడి వస్తుండటంతో కేసుకు సంబంధం లేని అనామకులను, అతి పేద వారిని పట్టుకుని కేసు పెట్టడం అనేది అనేక సంఘటనల్లో జరిగింది. వీటి మీద ప్రజా సంఘాలు, మహిళా, హక్కుల సంఘాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. పదకొండేళ్ల క్రితం విజయవాడలో జరిగిన అయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు అనే యువకుడిని నిందితుదుగా చూపించి అరెస్టు చేసి జైలుకి పంపించారు. ఎనిమిదేళ్ల తరువాత ఆ సంఘటనతో అతనికి ఏ సంబంధం లేదని తేలడంతో నిర్దోషిగా హైకోర్ట్ తీర్పు ఇవ్వడంతో విడుదల చేశారు. గత సంవత్సరం అమీన్పూర్ లో అనుమానాస్పదంగా ఒక పన్నెండు సంవత్సరాల పాప చనిపోతే అక్కడ కూడా ముందు కుటుంబ సభ్యులను అవమానించి స్టేషన్ కి లాక్కెల్లారు.
ఇప్పుడు ఈ సంఘటనలో కూడా కుటుంబ సభ్యులనే నిందితులు గా ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన అత్యాచార కేసులో బాధితుల మీదే నెపం మోపి వారితోనే ఒప్పించి కేసు మూసివేశారు. అలాంటి ప్రయత్నమే ఇక్కడ కూడా చేయాలని నిరుపేద దళితులైన వీరిని ఒప్పించి కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రయత్నం మాని, పాప అనుమానాస్పద మృతికి కారణమైన అసలైన దోషులను పట్టుకుని, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
1. ఈ పాప సంఘటనను ఎస్ సీ ఎస్ టీ ప్రొటెక్షన్ యాక్ట్ క్రింద నమోదు చేయాలి.
2. జరిగిన సంఘటన పై ప్రత్యామ్నాయ పోలీసు శాఖ (సీబీసీఐడీ), మహిళా శిశు సంక్షేమ కమిటీ లేదా మేజిస్టీరియల్ విచారణ చేయాలి. జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం, ఏదైనా సంఘటనలో పిల్లల్ని ప్రశ్నించవలసి వస్తే పోలీస్ డ్రెస్ లో వెళ్లకూడదని, స్టేషన్ కి అస్సలు తీసుకెల్లకూడదని, పిల్లల్ని కొట్టకూడదని, మహిళా అధికారులు లేకుండా ఆడపిల్లల్ని ప్రశ్నించకూడదనే విషయాలు పోలీసులకు తెలియనివి కావు. కానీ, ఇక్కడ అనుమానం పేరుతో మైనర్లను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లటం, అనేక గంటలపాటు తమ అధీనంలో ఉంచుకుని వారిని బెదిరిస్తూ బూతులు తిడుతూ, అవమానపరచడం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యులు లేకుండా పిల్లల్ని ప్రశ్నించడం, మైనర్ ఆడపిల్లల మీద మగ పోలీసులు చేయి చేసుకోవటం ఇవన్నీ పిల్లల హక్కులపై జరిగిన తీవ్ర ఉల్లంఘనలే. ఇక్కడ మియాపూర్ పోలీసు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించడం, బాలల, మహిళ హక్కులకు బిన్నంగా వ్యవహరించడం పట్ల ప్రైమఫసీ ఉన్నది కాబట్టి వెంటనే సంబంధిత పోలీసులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి.
3. మహిళా కమిషన్ తక్షణమే ఓంకార్ నగర్ బస్తీని సందర్శించి, బాధిత కుటుంబాన్ని కలిసి ఈ సంఘటనపై సమగ్ర నివేదిక రూపొందించాలి. తదనుగుణంగా న్యాయపరమైన, చట్టపరమైన చర్యలకు, నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి.
4. ఈ ఘటనలో పెద్ద రామాంజనేయులు, అతని తమ్ముడు పాత్ర అనుమానాస్పదంగా వుందని మొదటి నుంచీ బాధితులు చెబుతున్నారు. అతని ఇంటిని పోలీసు కుక్కలు పసిగట్టాయి. విచారణకు వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పెద్ద రామాంజనేయులు కూడా కూడా తిరుగుతూ పాప తల్లిదండ్రుల గురించి, కుటుంబం గురించి చెడుగా చెప్పడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. అంతే కాకుండా ఒక బంధువు ద్వారా రంగస్వామి వాళ్ళే చంపుకున్నామని ఒప్పుకొని లొంగిపోతే , తర్వాత సిఐ తో మాట్లాడి తాను విడిపిస్తా అని పెద్ద రామాంజనేయులు చెప్పిస్తున్నాడని, లేకపోతే నా గుడిసె పీకేయిస్తాను అని బెదిస్తున్నాడని రంగస్వామి వివరించాడు. బస్తీలోని అన్ని సంపుల్లోని నీళ్లను పరీక్షించటానికి ఫోరెన్సిక్ లాబ్ కు పంపారు. కానీ ఈరోజు వరకు పెద్ద రామాంజనేయులు ఇంటి ముందు వున్న సంప్ లోని నీళ్లను పరీక్షకు పోలీసులు తీసుకుని వెళ్ళలేదు. ఈ అంశాలన్నీ కూడా జరిగిన నేరంలో పెద్ద రామాంజనేయులి పాత్ర మీద బలమైన అనుమానాల్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద పెద్ద రామాంజనేయుల్ని, అతని తమ్ముడిని వెంటనే అదుపులోకి తీసుకొని నిష్పక్షపాతంగా విచారించాలి.
5. సంఘటన దగ్గర ఒక మొబైల్ ఫోన్ దొరికినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆ మొబైల్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకుని వారిని విచారించాలి.
6. తప్పిపోయిన పిల్లలు శవాలుగా మారేంతవరకు వేచి చూడకుండా, పిల్లల మిస్సింగ్ కంప్లయింట్ అoదగానే మొదట్లోనే డాగ్ స్క్వాడ్ ను పోలీస్ లు విచారణలో భాగంగా తప్పక ప్రవేశ పెట్టాలి.
7. ఈ బస్తిలో ఎంతమంది చిన్నపిల్లలున్నారనే సర్వే చేయించి, ప్రతి 200 ఇండ్లకు ఒకటి చొప్పున, పిల్లల ‘డే కేర్’ సెంటర్స్ లేదా అంగన్వాడీ సెంటర్లను GHMC, WCD ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి.
8. బడి బయట ఉన్న యుక్తవయసు పిల్లల ఆహార భద్రత, చదువుకొనసాగింపు తదితర ప్రభుత్వపథకాల అమలును చేపట్టాలి.
9. ఈ బస్తీ లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. బస్తీలో మురుగునీటి వ్యవస్థను క్రమబద్ధం చేయటం ద్వారా పిల్లల ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దాలి. ఇంటింటికీ మరుగుదొడ్ల సదుపాయాన్ని, మంచినీటి సౌకర్యాన్ని, రహదారిని ఏర్పరచాలి.
10. పేద, బలహీనవర్గాల కుటుంబాలలో మితిమీరిన మద్యపానం అలవాటుతో జరుగుతున్న అనర్ధాలు, తాగినమత్తులో చేస్తున్న నేరాల నమోదు చాలా ఎక్కువగా ఉందనే విషయం ప్రతి సంఘటనలోనూ రుజువవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల మీద కఠిన నియంత్రణ వుండేలా తమ విధానాన్ని రూపొందించాలి. మత్తు పదార్థాలు, గుడుంబాలను నిషేదించి ఆ నిర్ణయాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు రూపొందించాలి.
11. బాధితులనే నిందితులుగా వొప్పించే కుటిల యత్నాలు కాకుండా స్త్రీలు, ఆడపిల్లల మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్య పరిచే వ్యవస్థా పూర్వకమైన చర్యల వైపు ప్రభుత్వ, పోలీసుల కార్యాచరణ వుండాలి.
అక్టోబర్ 3 న జరిగిన నిజనిర్ధారణ లో పాల్గొన్నవారు:
1.దీప్తి, దళిత్ ఉమెన్స్ కలెక్టివ్ 2. రత్న కుమారి, దలీప్ (దళిత్ ఆదివాసీ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఏపి) 3. సాహితి, చైతన్య మహిళా సంఘం 4. వరలక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం. 5. సుమిత్ర, అంకురం 6. జ్యోతి, చైతన్య మహిళా సంఘం 7. భండారు విజయ, రచయిత. 7. వి.సంధ్య POW 8. కొండవీటి సత్యవతి, ఎడిటర్, భూమిక 9. కె.సజయ, స్వతంత్ర జర్నలిస్ట్