హైదరాబాద్ లో నరనస ప్రదర్శన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు
ఎవరు చరిత్రహీనులు – 6
బాధితులు పోలీసులను, న్యాయస్థానాలను, ఇతర సంబంధిత అధికారులను, ఇతర వేదికలను సంప్రదిస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తారు. చట్టప్రకారం న్యాయం చేయమని అడుగుతారు. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, సమూహాలు, సంస్థలు, సంఘాలవారు సత్వర న్యాయం కావాలని ఆశిస్తారు. ఆశించటం వారి తప్పు కాదు, అత్యాశ కూడా కాదు.
తమకు జరిగిన అన్యాయం గురించి న్యాయవాదుల మద్దతుతో “చట్ట పరిధిలో న్యాయం కోసం” న్యాయస్థానాలలో, ఆయా సంబంధిత అధికారుల ముందు, ఫోరంలలో కేసులు వేయటం జరుగుతుంది. ఇక్కడి నుండి కక్షిదారులు, న్యాయవాదులు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ చెప్పుకున్న సమయానికి ఎలాంటి న్యాయ సహాయం కక్షిదారునికి అందదు. అప్పుడు, కొంత కాలం తరువాత కక్షిదారులలో, న్యాయవాదులలో అసహనం మెల్లగా షురూ. ఈ అసహనం వల్ల అప్పటివరకు కక్షిదారికి – న్యాయవాదికి ఉన్న స్నేహపూర్వకమైన సంబంధం మెల్ల మెల్లగా శత్రుత్వానికి దారితీస్తుంది. ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గుతుంది, అపనమ్మకం పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి అనుమానం పెరుగుతుంది.
Also read: ఎవరు చరిత్ర హీనులు – 5
లాయర్లపై దాడులకు కారణాలు
ఈ మధ్య లాయర్లపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడులు జరగడానికి కారణాలు ఇవి:
(1) కోర్టులలో జరుగుతున్న జాప్యానికి కారణం తెలుసుకోలేక అందుబాటులో కనిపించే వ్యక్తి ‘న్యాయవాది’ కాబట్టి అతడు లేదా ఆమె దాడికి గురౌతున్నారు.
(2) న్యాయవాదుల కమ్యూనిటీ మధ్య గౌరవప్రదమైన, స్నేహప్రదమైన “సంబంధాలు ” క్షీణదశకు చేరటంతో కక్షిదారులను తమవైపు తిప్పుకునేందుకు “తోటి న్యాయవాది” గురించి అనవసరమైన, అసందర్భమైన చెడు మాటలను చెప్పటంతో కూడా ‘కక్షిదారికి – న్యాయవాదికి’ మధ్యన అప్పటి వరకూ ఉన్న మంచి సంబంధం బెడిసి కొడుతుంది. శత్రుత్వం పెంచుకోవటం షురూ అవుతుంది. చివరగా ఆ న్యాయవాది ఇబ్బందులను ఎదుర్కోవటం మొదలై కక్షిదారులు ఎప్పుడు దాడి చేస్తారోనని అభద్రతకు గురౌతాడు. ఆ న్యాయవాది రక్షణ కోసం సంబంధిత అధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. కక్షిదారులు సంబంధిత అధికారులనుండి, న్యాయవ్యవస్థ నుండి సరైన సహాయం, న్యాయ సహాయం, చట్ట సహాయం అందకపోవటంతో న్యాయవాది దగ్గరికి వెడుతున్నారు. న్యాయవాది కక్షిదారి తరఫు నుండి విషయాన్ని న్యాయవ్యవస్థ దృష్టికి తీసుకవెళ్లటం జరుగుతోంది. అయితే, కక్షిదారులు ప్రత్యక్షంగా న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయవాది కక్షిదారులకు ప్రాతినిధ్యం వహించి న్యాయం కోసం న్యాయవ్యవస్థ, న్యాయమూర్తి దృష్టికి తీసుక వెడితే కక్షిదారులకు న్యాయ సహాయం అందుతుందా? న్యాయవాది కోర్టుకూ, కక్షిదారుడికీ మధ్య ఒక సమన్వయ కర్తగానూ, కోర్టుకు సహాయకుడిగానూ పనిచేస్తాడు. బాధితుడికి న్యాయసహాయం కోసం న్యాయవాది కోర్టుకు చట్టం గురించి వివరిస్తాడు. రెండువైపులా వాదనలను విని జడ్జిగారు “తీర్పు” చెపుతారు. ఇంకా కొన్ని సందర్భాలలో జడ్జి “అసాధారణ అధికారాలను” వినియోగించి కూడా తీర్పు ఇవ్వవచ్చు.
కక్ష కట్టిన కక్షిదారుడు నుండి న్యాయవాది తనను తాను రక్షించుకొనేటందుకు “కక్షి దారుడికోసం ఎక్కడెక్కడ కేసులు న్యాయవాది పెట్టాడో” అదే ప్రాసెస్ న్యాయవాది కూడా చేసుకోవాలి. అంటే కొంచెం ఆలోచిస్తే న్యాయవాది కూడా కక్షిదారుడు అవుతాడు. కక్షిదారుడుగా రూపాంతరం చెందిన న్యాయవాది, తన వద్దకు వచ్చిన కక్షిదారుల నుండి దాడికి గురౌతున్నారు. ఇది కీలకమైన విషయం. సమస్య ఎక్కడ మొదలయ్యింది?
(3). న్యాయవాది న్యాయం జరిగేటట్లు “న్యాయమూర్తి” ముందు ఏ చట్టం ప్రకారం న్యాయం ఇవ్వాలో వివరిస్తాడు. న్యాయమూర్తి విన్నతరువాత ధృవీకరించుకొని “ఆ చట్ట ప్రకారం” నడవాలి. లేకపోతే న్యాయమూర్తి తన దృష్టికి వచ్చినప్పుడు, న్యాయవాది సరైన “చట్టం” గురించి చెప్పక పోయినప్పుడు న్యాయమూర్తి తనకున్న అసాధారణమైన అధికారంతో “సరైన చట్టం ప్రకారం” కక్షిదారులకు న్యాయం అందించాలి. కానీ ఇది జరగక పోవటం చేత సత్వర న్యాయం అనేది సరైన సమయంలో అందకపోవటం చేత, కక్షిదారుల దృష్టిలో ‘న్యాయవాది’ టార్గెట్ అవుతున్నాడు.
(4). కొంతమంది న్యాయవాదులు సామాజిక కార్యక్రమాలలో, సామాజిక సేవలలో, చెతన్యవంతమైన అవగాహన సదస్సులలో, సామాజిక రుగ్మతల నుండి ప్రజలను రక్షించే కార్యక్రమాలలో, అవినీతి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులు, సంస్థలు, అధికారులు, రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి న్యాయవాదులను టార్గెట్ చేస్తున్నారు.
Also read: ఎవరు చరిత్ర హీనులు-4?
ఈ సందర్భంలో టార్గెట్ అయిన న్యాయవాదులు సంబంధిత ప్రభుత్వ అధికారులకూ, పోలీసులకూ, న్యాయవ్యవస్థకూ తాము “టార్గెట్” అయిన సంగతి వివరించి సహాయం అడుగుతున్నారు. అయితే సకాలంలో సహాయం అందకపోవటం చేత టార్గెట్ అయిన న్యాయవాది బలి అవుతున్నాడు.
వీటికి ఉదాహరణగా (1 నుండి 3వ అంశం వరకు) ఇటీవల అనగా 25-09-2021 నాడు హైదరాబాద్ లో కుమ్మరివాడి నివాసి అయిన న్యాయవాది బాలాజీ నడికుడిపై ఆరుగురు వ్యక్తులు దాడిచేయడం. దాడిచేసినవాళ్లు ఇటీవలనే బెయిల్ పై జైలు నుండి వచ్చారు. మరొక మహిళా న్యాయవాది ఆశ్ఫక్ ఖాన్ హత్య ఇటీవలనే జరిగింది.
నాలుగో అంశానికి ఉదాహరణ న్యాయవాదులు గట్టు వామన్ రావు, భార్య పి. వి. నాగమణిల హత్యలు, ముత్యాల వెంకటేష్ ఆఫీస్ పని పైన పోస్ట్ ఆఫీసుకూ, సీనియర్ ఇంటికి వెళుతున్నప్పుడు మందమర్రి పోలీసులు అపహరించుకపోయి తప్పుడు కేసులో ముద్దాయిగా చూపించటం, బెతిని మహేందర్ రెడ్డిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణం నుండి కరీంనగర్ టౌన్ పోలీసులు అపహరించుకపోయి తప్పుడు కేసులో చూపించటం.
వ్యవస్థలో లోపాలే కారణం
న్యాయవాదులను టార్గెట్ చేయటానికి వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు సహకరిస్తున్నాయి. ఇంకొంచెం లోతుగా గమనిస్తే పూర్తిగా … విచారణ అధికారులు (ప్రోబింగ్ అథారిటిస్), దర్యాప్తు అధికారులు (ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్), న్యాయవ్యవస్థ (జూడీషరీ) ల మధ్య ఉన్న సమన్వయం లోపభూయిష్టంగా, అవినీతిమయంగా ఉండటంచేత “సత్వర న్యాయం” అనేది ఒక కలగానూ, భ్రమగానూ ఉంటున్నది. ప్రజలలో ఒక అపనమ్మకం, ఒక అసహనం, ఆక్రోశం పెరగటానికి ప్రధాన కారణం అవుతోంది. న్యాయవాదులు ఆ మూడు వ్యవస్థల మధ్య ఇరుక్కోవటం చేత “పునాదిలో ఉన్న సమస్యను” గమనంలోకి తీసుకోకపోవటం చేత తమపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పనుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపునిస్తున్నారు. ఒక రోజు లేక కొన్ని రోజులు పనులు బహిష్కరిస్తే దాడులు ఆగుతున్నాయా? ఇక్కడ ఒక కేసును ఉదహరిస్తాను.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మనిషి చనిపోయిన కేసు ఇది. ఈ కేసును పోలీసులు మొదట 174 సీఆర్ పీసీ (అనుమానాస్పదం) కింద నమోదు చేసారు. ఆరు నెలల తరువాత ఇద్దరిపై 304-II ఐపీసీ రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేశారు. దీనికి శిక్ష 10 ఏళ్ళు లేక 10 ఏళ్ళతో పాటు జరిమానా కూడా జడ్జిగారు వేయవచ్చు. పోలీసులు చార్జిషీట్ 60 రోజులలో Cr.P.C. 167(2)(a)(ii) సెక్షన్ ప్రకారం వేయాలని చట్టం చెపుతోంది. 60 రోజులలో చార్జిషీట్ పోలీసులు వేయకపోతే న్యాయమూర్తి జైలులో ఉన్న వారిని విడుదల చేయాలి. నిందితులు బెయిల్ పటిషన్ వేసినా, వేయకపోయినా బెయిల్ కు అర్హులు అవుతారు.
Also read: చరిత్ర హీనులు ఎవరు?
కోర్టు గుమాస్తాతో సమస్యలు
జైల్లో ఉన్నవారు ఈ విషయాన్ని న్యాయవాది ద్వారా జడ్జిగారి దృష్టికి తీసుకవెళ్లారు. అయితే, ఏ విషయమైనా జడ్జి గారి దృష్టికి తీసుకవెళ్లాలి అంటే మధ్యన వారధిగా గుమాస్తా ఉంటాడు. ఆయన ద్వారానే తీసుకవెళ్లాలి. ఆ జడ్జి తాలూకు గుమాస్తా (క్లర్క్) విషయాన్ని కనుక్కొనే ప్రయత్నం చేయక పోగా మర్డర్ కేసు 90 రోజులకే చార్జిషీట్ వేయాలి, 60 రోజులు కాదు అని ఒక మొండివాదన మొదలు పెట్టాడు. ఆ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు కూడా “గుమాస్తా” కు మద్దతుగా వచ్చారు. అప్పుడు ఆ పరిస్థితులు “గుమాస్తా” కు వ్యతిరేకంగా చెపితే వేరే కేసులలో మెలిక పెడుతాడు అనే భయంతోనో, లేక నిజంగానే 304-II ఐపీసీ గురించి తెలియకనో న్యాయవాదులు మాత్రం గుమాస్తాకే ‘జై’ అన్నారు. జడ్జిగారు ఇంకా అన్యాయంగా … కాదు కాదు 90 రోజుల తరువాతనే బెయిల్ కు అర్హులు అన్నారు. అయినా చూస్తాను అని మూడు రోజులు కాలయాపన చేశారు. మూడు రోజుల తరువాత కూడా జడ్జిగారికి జ్ఞానోదయం కలగలేదు, అప్పుడు .. ‘‘జైలులో ఉన్న వారి న్యాయవాదులు ఏమైనా సెక్షన్ ఆఫ్ లా గురించి న్యాయవాది తప్పు చెపితే మీరు సరిచేయాలి .. సరిచేయకుండా కాలయాపన చేస్తున్నారు .. ఇది ప్రాధమిక హక్కులకు వ్యతిరేకం’’ అని చెప్పారు. జడ్జి చెక్ చేస్తాను అని మిన్నకుండి పోయారు. ఆ తరువాత గుమాస్తానేమో జడ్జిగారు రెండు రోజుల తరువాత తీర్పు ఇస్తారు అని చెప్పారు. రెండు రోజుల వరకు ఎదురు చూడాలా అని న్యాయవాదులు అడిగారు. దీనికి గుమాస్తా, “మధ్యాహ్నం 2 గంటల నుండి జడ్జిగారికి ఆన్ లైన్ ట్రైనింగ్ ఉంటది. రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అభిప్రాయం తీసుకుంటారు, ఆ మరుసటి దినం జడ్జిమెంట్ ఇవ్వగలరు’’’ అని వివరించాడు.
ఇక్కడ గమనించవలసిన విషయం చట్టాలపై సరైన అవగాహన జడ్జీకి లేకపోవటం ఒకవైపు అయితే గుమాస్తా “సర్వాధికారాలూ తన చేతిలోనే” ఉన్నాయని భావిస్తున్నారు. అధికారాన్ని ఏ విధముగా దుర్వినియోగం చేయవచ్చునో “గుమాస్తా” చూపిస్తున్నారు. అంతా తనకు తెలుసు అని ప్రదర్శించటం మరో కోణం, అంతా తెలుసు అని భ్రమకు లోనై చుట్టూరా ఉన్న వాళ్లకు తన తెలివితేటలను ప్రదర్శించటం ఇంకో కోణం (ఇతరులు తమను గమనిస్తున్నారు అనేది గుమాస్తాలు గుర్తించక పోవటంతో ఇలాంటివి జరుగుతుంటాయి). లేకపోతే అందవలసిన (ఆశించిన) పైకం (లంచం) అందకపోవటం కూడా గుమాస్తాల అతి ప్రవర్తనకు కారణం.
న్యాయవ్యవస్థపైన తగ్గుతున్న నమ్మకం
ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితులు జైళ్లల్లో ఉండిపోవటంతో, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, వారికోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులు “విచారణ అధికారులు, దర్యాప్తు అధికారులు, న్యాయవ్యవస్థ” లపై నమ్మకం కోల్పోతున్నారు. ఎవరైనా ఒక న్యాయవాదినో న్యాయమూర్తితో వాదనకు దిగితే .. ఆ తరువాత కేసుల విషయంలో కక్ష సాధిస్తారు. లేకపోతే చివరికి “కోర్టు ధిక్కారం” కింద చర్య తీసుకుంటారు. కాకపోతే “బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ ” చేయమని జడ్జి సిఫార్స్ చేస్తారు. సో .. లోపం ఎక్కడ ఉన్నది ? సత్వర న్యాయం బాధితులకు అందించవచ్చు, అయితే వ్యవస్థ (సిస్టం) బాధితులకోసం కాకుండా “వారికోసం, వారి అనుయాయుల కోసం” మాత్రమే పనిచేస్తోంది. దీనికి ముఖ్యకారణం “సిస్టం” ను సరిచేసే వ్యవస్థ (ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం) కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉండకపోవటం. వీరు కూడా “వారి కోసం, వారి అనుయాయుల” కోసం మాత్రమే చాలా సందర్భాలలో స్పందిస్తున్నారు. ‘‘వడ్డించే వాడు మనోడే అయినప్పుడు ఎక్కడైన కూర్చోవచ్చు’’ అనే సామెత, ‘అందరూ బాగుండాలి – అందులో నేనుండాలి’ అనే సామెతలు వచ్చినవి “వారి కోసం, వారి అనుయాయుల కోసం” అనే సందర్భంలో నుండి వచ్చినవే. సత్వర న్యాయం కొందరికి మాత్రమే అందుతుంది, ” హేయమైన నేరం (హీనస్ క్రైమ్) ” జరిగినప్పుడు ప్రజల నుండి బలమైన ఆందోళనలు వచ్చినప్పుడు “ఫాస్ట్ ట్రాక్ కోర్టు”లను ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు కూడా అన్ని కేసులకు “సత్వర న్యాయం “అందటం లేదు. సో … ఇక్కడ కూడా న్యాయవాదులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. అప్పుడు బాధితుల నుండి, బాధిత కుటుంబాల నుండి న్యాయవాదులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
Also read: ఎవరు చరిత్ర హీనులు?
కోర్టు ధిక్కారంపైన అవగాహనా రాహిత్యం
న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారం అవుతుంది అనేది ఒక అజ్ఞానం నుండి వచ్చింది అనే చెప్పాలి. చట్టాలపై అవగాహనను కలిగి ఉండక పోవటంతో, రాజ్యాంగం గురించి సరైన అవగాహన లేకపోవటం, ఆయా జడ్జీల చైతన్యం, నడవడిక, వ్యక్తిత్వం మొదలైనవి అన్నీ “పరిస్థితులపై” ప్రభావం చూపుతాయి(పరిస్థితులు అంటే “నేరానికి” సంబంధించినవని అర్ధం చేసుకోవాలి). కోర్టు ధిక్కారం అనే పదం ఒక ఊతపదంగా మారింది. ఎందుకంటే కొంత మంది జడ్జీల గురించి అడపా -దడపా “ఆ జడ్జి గారు సబ్జెక్ట్ కలిగివున్న వారుగాను, జ్ఞానవంతుడు (knowledgeable)” గాను వింటుంటాము. ఇలాంటి జడ్జీలు న్యాయవ్యవస్థలో తగ్గుతూ పోవటం చేత కూడా “కోర్టు ధిక్కారం” అనే ఒక ఫోబియా మెజారిటీ న్యాయవాదులలోనూ, క్రియాశీలులలోనూ నెలకొన్నది. అందుచేత న్యాయవాదులు “జడ్జీల ముందు కిమ్మనకుండా” నిలబడుతున్నారు, ఇలాంటి ప్రవర్తన వల్ల కూడా న్యాయవాదులకు నష్టం జరుగుతోంది. కారణం “జడ్జీలు” న్యాయవాదుల నుండే పుట్టుకవస్తారు. ఒక న్యాయవాది జడ్జిగా ఎదిగిన తరువాత న్యాయవాది స్వభావం కోల్పోయి “న్యాయమూర్తి స్వభావం” అలవర్చుకుంటున్నప్పుడు “న్యాయవ్యవస్థ యొక్క నిచ్చెనమెట్ల (హైరార్కీ)” లో బందీ కావటం చూస్తున్నాం. “సమాజం” చాలా తప్పులను చేస్తుంది. ఆ తప్పులను సరిచేయవలసిన “సిస్టం” బందీగా ఉంది. నేరాలు పెరగడానికి మూలం ఈ ‘‘బందీ”నే అని చెప్పక తప్పటం లేదు. సమాజం నుండి గౌరవం పొందవలసిన “సిస్టం” పొందలేక పోతోంది. అపనమ్మకాన్ని, కులాన్ని, మతాన్ని, అపవాదులనూ మోయవలసి వస్తోంది. స్వతంత్రంగా ఉండాల్సిన సిస్టం “బందీ” అవటం చేత “కోర్టు ధిక్కారం” అనే పేరుతో నోరు మూయించే ప్రయత్నం జరుగుతోంది.
Also read: ఎవరు చరిత్ర హీనులు?
ప్రజలు – బాధితులు – న్యాయవాదులు “బందీ”ని ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారం అవుతుందేమోనని ఒక భయంలో ఉన్నారు. బందీకి జ్ఞానం అందాలి. చట్టాలపై – రాజ్యాంగంపై సరైన చైతన్యంతో కూడిన అవగాహన కావాలి. బూజుపట్టిన మెదళ్లను దులపాలి. లేకపోతే న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. కోర్టు ధిక్కారం అనే బూచి భయపెడుతూనే ఉంటుంది.
గమనిక : న్యాయమూర్తులు ఇచ్చే ఆదేశాలను అమలుచేయని అధికారులు / ప్రభుత్వం / ప్రభత్వ యంత్రాంగాలు ఎదుర్కొనే “కోర్టు ధిక్కారం” దీని పరిధిలోకి రాదు.
జయ వింధ్యాల, అడ్వకేట్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్, @ 9440430263
Excellent explanation madam, you are God gift to the society madam.