జేబులో నువ్వెప్పుడూ కొంత అహాన్ని అట్టేపెట్టుకో. అది ఇతరులను గాయపరచడానికి కాదు, నీ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి! ‘నాక్కొంచెం నమ్మకివ్వు’ – అన్నాడు కవి ఆలూరి బైరాగి. ఇక్కడ నమ్మకం ఆత్మవిశ్వాసానికి పర్యయపదం – మూఢనమ్మకానికి కాదు.
నమ్మకం, విశ్వాసం అనేవి చాలా బలమైనవి. మనిషి అన్నవాడికి తన మీద తనకు నమ్మకముండాలి. తోటివాడిమీద నమ్మకముండాలి. ప్రేమ, దయ, జాలి, గౌరవం, మర్యాద లాంటి వాటిపై నమ్మకముండాలి. వెరసి మానవత్వంపై నమ్మకముండాలి. అంతే గాని, భ్రమల మీద, ఊహల మీద, కనిపించని శక్తులమీద, నిజనిర్ధారణకు నిలబడని పిట్టకథలమీద, పురాణగాథలమీద, దైవలీలలమీద నమ్మకం పెంచుకుని అసంబద్ధమైన జీవితం గడపడం వృథా! మనకు హేతుబద్ధమైన నమ్మకం ఉండాలి. అవి ఎంత బలంగా ఉంటే మన జీవితమంత ఆరోగ్యంగా ఉంటుంది. మన చుట్టూ జరుగుతున్న సంఘటనల నుండే మనం స్ఫూర్తిని పొందొచ్చు.
Also read: ‘‘మేం చదువుకోవాలి’’ అంటూ నినదించిన కమలా భాసిన్
అరుణిమా సిన్హా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక సాధారణమైన అమ్మాయి. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ ప్రకటించింది. అందులోని విశేషమేమీ లేదు. ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో తెలుసుకుంటే అందులోని విశేషం అర్థమవుతుంది. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ అమ్మాయి రాత్రి వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలో ఆమె దుండగుల్ని ప్రతిఘటించింది. ఫలితంగా దుండగులు ఆమెను రైల్లోనుంచి తోసేశారు. ఆమె కాలు విరిగింది. కొంతసేపు స్పృహ కోల్పోయి…మేల్కొంది. కదలేని స్థితి. ఇటు నుండి అటూ, అటు నుండి ఇటూ రాత్రంతా రైళ్ళు పరుగెడుతూనే ఉన్నాయి. రెండు ట్రాక్ ల మధ్య పడి ఉన్న ఆ అమ్మాయిని ఎవరూ చూడలేదు. అడవి ప్రాంతం గకన, చీకట్లో కీటకాలు, పురుగులు వంటి నిండా పాకి, పీకి పెడుతున్నాయి…. ఆమెది నిస్సహాయ స్థితి. తెల్లవారిన తర్వాత గానీ, సహయమందలేదు. అసుపత్రిలో డాక్టర్లు పరీక్షించిన తర్వాత, తేల్చిందేమంటే కాలు మాత్రమే కాదు, వెన్నుపూస కూడా నుజ్జునుజ్జయ్యిందని! దీర్ఘకాలంపాటు చికిత్స అవసరమయ్యింది. ఆమె . కోలుకున్నాక, అధైర్యపడలేదు. ఓటమిని ఒప్పుకోలేదు. తను అవయవం కోల్పోయింది కానీ, ఆత్మవిశ్వాసాన్ని కాదు. ఆ ఆత్మవిశ్వాసాన్ని పదింతలు పెంచుకుంది. కృత్రిమంగా అమర్చిన కాలుతో నడవడం ప్రారంభించింది. తను ఒక వికలాంగురాలినని ఏమాత్రం అనుకోలేదు. చరిత్రలో ఎవరూ చేయని సాహసానికి పూనుకుంది….అరుణిమా సిన్హా!
Also read: నిజం బతికే రోజు రావాలి!
జీవిత ఎవరెస్టు ఎక్కేశావు
ఎవరెస్టు శిఖరం ఎక్కాలన్న ధ్యేయంతో అందుకు సంబంధించిన బచ్ఛేంద్రపాల్ ను కలిసింది. ఆమె ఆశ్చర్యపోయి అంది కదా..‘‘కాలు, వెన్నుపూస విరిగిన ఈ దశలో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు నిజంగానే జీవిత ఎవరెస్టు ఎక్కేశావు’’ అని! ఆమె ఆధ్వర్యంలోనే కొంత శిక్షణ పూర్తి చేసుకొని, అరుణిమా సిన్హా ఎవరెస్ట శిఖరారోహణకు పూనుకుని, విజయం సాధించింది. ఆ సందర్భంలోనే మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది. ఈ సంఘటన గుర్తు చేసుకోవడమెందుకంటే, మానసిక స్థైర్యం ఉంటే, శారీరక బలహీనతల్ని అధిగమించొచ్చు. కానీ, మనం సాధారణ జనంలో చూస్తున్నదేమంటే శారీరకంగా బలంగా ఉన్నా, మానసికంగా బలహీనులుగా ఉంటున్నారు. వాస్తవాల్ని అర్థం చేసుకుని, ఎదుర్కునే ధైర్యం ఉండదు. తమలోని విచక్షణని, ఆత్మవిశ్వాసాన్ని బయటికి తీయరు. పాపం,పుణ్యం, దేవుడూ, దయ్యం అంటూ, ఏవో శక్తుల్ని నమ్ముతూ, ఎవరి దయవల్లనో తాము ఊపిరి పీల్చుకుంటామనుకుంటూ ఉంటారు. కానీ, అరుణిమా సిన్హా అలా అనుకోలేదు. ఇందంతా విధిరాత. దేవుడు తనకు ఈ శిక్ష విధించాడు. ఇది పూర్వజన్మ పాలఫలితం అని మెట్టవేదాంతం వల్లించలేదు. ఇక తన బతుకు ఇంతేనని అనుకోలేదు. వాస్తవాల్ని అర్థం చేసుకుంది. విధిని ఎదుర్కొంది. తన తలరాతను తానే మార్చుకుంది. అందుకు గల కారణం ఆమె ఆత్మవిశ్వాసం! అలాంటి సమయంలోనే మనమేమిటో మనం నిరూపించుకోవాల్సి వస్తుంది. మెంటల్ అయిపోవడమా? మెంటల్లీ స్ట్రాంగ్ అవడమా? హోప్ లెస్ ఎండ్ అనుకోవడమా? లేక ఎండ్ లెస్ హోప్ లోకి ప్రయాణించడమా? మనమే తేల్చుకోవాలి.
అరుణిమా సిన్హాలాగా ప్రతివారికీ అలాంటి దురవస్థ రాకపోవచ్చు. మామూలు జీవన క్రియలకు, కుటుంబ సమస్యలకూ బెంబేలెత్తి దేవుణ్ణీ, దయ్యాన్నీ, శక్తిని,మహిమల్నీ ఆశ్రయించడం ఏం సబబూ అనేది మాత్రం గట్టిగా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఇతర శక్తుల్ని నమ్ముకునే ‘విశ్వాస వ్యవస్థ’లోంచి ఎంత సత్వరం బయటపడితే అంత మంచిది. భారత దేశంలోని హిందూమత ఔన్నత్యాన్ని దశదిశలా వ్యాపింపజేసిన స్వామి వివేకానందుడే ఏమన్నాడొ పరిశీలించండి. ‘‘జ్ఞానం మేధావిని వినయవంతుణ్ణి చేస్తే, సామాన్యుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. అవివేకిని గర్వితుణ్ణి చేస్తుంది,’’అని! మనం ఇలాంటి అవివేకుల ప్రభావంలో పడకుండా జాగ్రత్త పడాలన్న మాట!
Also read: వైజ్ఞానిక స్పృహకోసం ఒక రోజు – 20 ఆగస్టు
ఏనుగు మనస్తత్వం
ఇక్కడ మరో విషయం చూద్దాం. ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెచ్చి, మావటివాడు ఇనుపగొలుసుతో చెట్టుకు కట్టేస్తాడు. పిల్లచేష్ట – అది అటు లాక్కుని, ఇటు లాక్కుని మెడంతా రక్తం చేసుకుంటుంది. కొంచె నెమ్మదించిన తర్వాత మావటి ఏనుగుపిల్ల కాలుకి గొలుసువేస్తాడు. క్రమంగా దాని మెదడులో ఒక నమ్మకం ఏర్పడుతుంది. తాను ఎటూ వెళ్ళకుండా అక్కడ కట్టేశారని, మావటి వచ్చి కట్టు విప్పేదాకా తను ఎటూ వెళ్ళలేదని నిశ్చయించుకుంటుంది. అలాగే ఏనుగు పెద్దదయిపోతుంది. అయినా అదే భావం దాని మెదడులో ఉంటుంది. అప్పుడు కూడా మావటి ఏనుగు కాలుకు తాడు కట్టి, చిన్న గుంజకు కట్టేస్తాడు. తననను కట్టేశారన్ని భావనతో ఏనుగు అక్కడే నిలబడుతుంది. నిజంగా అది తలచుకుంటే తాడు, గుంజ ఏదీ ఆగదు. చుట్టూ ఉన్న ఇళ్ళని, మనుషుల్ని ధ్వంసం చేయగల సత్తా దానికి ఉంది. కాని, దానికి ఆ విషయం తెలియదు. తానేమిటో తను తెలుసుకునే తెలివి ఏనుగుకు లేదు. కట్టేస్తే కదలకుండా అక్కడే ఉండడమన్నది దానికి చిన్నప్పటి నుండి అలవాటయిన విషయం. ఇది మనం చూస్తున్న వాస్తవం. ఏ జంతు ప్రదర్శనశాలలోనైనా మనమీ దృశ్యం చూడొచ్చు. విశ్వాస వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో మనం గమనించొచ్చు. మనం మనుషులం కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాం. మన శక్తిని మనం గ్రహించం. విశ్వాసమనే తాడుతో మన పూర్వీకులు దేవుడనే చిన్న గుంజకు కట్టిపడేశారు. మనం అలాగే కళ్ళుమూసుకుని అనుసరిస్తున్నాం. అసలీ తాడు బలమెంత, ఈ గుంజ బలమెంత అన్న విషయం మనం ఆలోచించం. ఆలోచన రాకుండా ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు, మతగురువులు, పండితులు, ప్రవచనాలు వల్లించే వారు పనిగట్టుకుని మనల్ని ఆ విశ్వాస వ్యవస్థలో కట్టి ఉంచుతున్నారు. మనిషిని ఒక నీచుడిగా చిత్రించడం పునర్జన్మలెత్తే హీనుడిగా చూపించడం వీరి పని! ఈ పునర్జన్మల గురించి చెప్పేవాడేమైనా పునర్జన్మలెత్తి అందులోని సాధకబాధకాలు తెలుసుకుని మనకు చెపుతున్నాడా? లేదే? దేవుణ్ణి, స్వర్గాన్ని, నరకాన్ని చూసి వచ్చినవాడా? అతను కూడా మనందరిలాగే ‘తుచ్ఛమానవుడు’ కదా? విషయమేమంటూ మనమెంత అమాయకంగా నమ్ముతూ ఉంటే, అతని పూట అంత బాగా గడుస్తుందన్న మాట! ఈ తాడేమిటి? ఈ గుంజేమిటి? అని ప్రశ్నించుకోకుండా ‘విశ్వాసవ్యవస్థ’లో భాగమైపొయ్యాం! మా ముత్తాత ఈ ఆచారాలు పాటించాడు. మా తాత ఈ పూజలు చేశాడు. మా తండ్రి ఇన్ని తీర్థయాత్రలు చేశాడు అనుకుంటూ ఉంటాం. వాటివల్ల వారికి ఏం లభించింది అని హేతుబద్ధంగా ఆలోచించం. వడ్ల గింజలో బియ్యపు గింజలాగా, అవే విషయాలు బట్టీయం వేసి వల్లించే పండితుల, స్వాముల, బాబాల మాటలు విని మోసపోకుండా ఉన్నప్పుడే – మనకు మనం విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకుంటామన్న మాట!
సమాచారం అంతా జ్ఞానం కాదు
‘‘మన మెదళ్లలో లక్ష విషయాలు ఎక్కించుకున్న తర్వాత కూడా మనం నిరక్షరాస్యులుగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే సమాచారమంతా జ్ఞానం కాదు,’’ అన్నాడు అలెక్ బోర్న్ (88) అనే బ్రిటిష్ వైద్యుడు, రచయిత. మనకు గ్రామాల్లో కూడా కొన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఏడెనిమిది అడుగుల ఎత్తున్న బలిష్టమైన కోడెల్ని పగ్గంతో మూడు,నాలుగు అడుగులున్న ఐదారేళ్ళ కుర్రాడు పట్టుకుని పోతుందటాడు. తమని ఎటు తీసుకువెళితే, అటు వెళ్ళడం ఎద్దులకు అలవాటయిన విషయం. తమనిఎంత బలహీనుడు తీసుకువెళుతున్నాడన్నది వాటికి పట్టదు. చిన్నప్పటి నుండి అలవాటైన విశ్వాసవ్యవస్థలో అవి బతుకుతూ ఉంటాయి. తనకంటే పదింతల పెద్ద సైజులో ఉన్న ఎద్దులు తననేమీ చేయవని ఆ కుర్రాడి నమ్మకం. ఎంతో ఆత్మవిశ్వాసంతో వాటిని తిప్పుతూ ఉంటాడు. ఇక్కడ కూడా మనం అవలోకించాల్సిన విషయమేమంటే – మనకంటే పరమ దరిద్రులు, బలహీనులు మనమీద ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న విషయం మనం గ్రహించాలి. మనం పశువులం కాదు గదా? విజ్ఞత గల మనుషులం గదా? ఏ స్థామత లేని బలహీనులంతా చెప్పే అధారం లేని దైవభక్తి భావనకి కట్టివేయబడి మారు మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నాం? ఎటుపోతున్నాం? ఆలోచించుకోవాలికదా? ‘‘మన భవిష్యత్తును నిర్ణయించేది మన నక్షత్రాలు కాదు. మనమే’’ అన్న ఇంగ్లీషు మహాకవి షేక్సిపియర్ మరో మాట కూడా అన్నాడు. ‘‘నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారీ విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారీ నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది! చివరకు నాకర్థమయ్యింది – స్వశక్తిని మించిన ఆస్థి లేదని!! ‘‘ఇక్కడ జరుగుతున్న విషయమేమిటో ఆలోచించండి. దేవుడు ఎలాగూ కనబడడు కాబట్టి, దేవుడి పేరు చెప్పే దేవదూత, పూజారి, ముల్లా, ఫాదర్ లను జనం నమ్ముతున్నారు. ఓ మత గ్రంథం మాత్రమే చదివి, పరిమిత జ్ఞానంతో బతుకులు వెళ్ళబోస్తున్న వాళ్ళను నమ్ముదామా? అపూర్వమేధాసంపత్తితో విశ్వజనుల్ని ప్రభావితం చేసినవారిని నమ్ముదామా? ఆలోచించుకోవాలి.
Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!
లైఫ్ సేవింగ్ డ్రగ్
ధనికవర్గాలు, అగ్రవర్ణాలు, రాజకీయ నాయకులు ప్రజల దృక్పథాల్లో మార్పు రావాలని ఏ మాత్రం ఆశించరు. జనం చైతన్యవంతులయితే, వారిలో మార్పువస్తే, వ్యవస్థ మారితే, వారి ఆటలు సాగవని, వారి ఉనికికే ప్రమాదమని వారికి తెలుసు. అందుకని ఈ జనం ఇట్లాగే తమని నమ్ముతూ, తాము చెప్పిందానికి బుర్రలూపుతూ కాలం వెళ్ళదీయాలని వారు కోరుకుంటూ ఉంటారు. అందువల్ల అలాంటివారు చెప్పేది తప్పకుండా పక్కకు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎవరికి వారు స్వంతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అప్పుడిక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలరు. ఒక్కోసారి ఈ విశ్వాస వ్యవస్థను మంచి పనుల కోసం కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి బాగా గాయపడ్డాడు. రక్తం విపరీతంగా పోయింది. తను చనిపోవడం ఖాయం అని అనుకుంటున్న సమయంలో ఒక యువకుడు దగ్గరికొచ్చి ‘‘భయపడకండి. మీకేంకాదు! నేను డాక్టర్ని. ఇదిగో ఈ బిళ్ళ నోట్లో పెట్టుకోండి. ఇది లైఫ్ సేవింగ్ టాబ్లెట్. గాలి బాగా పీల్చుకుంటూ, కళ్ళుమూసుకుని పడుకోండి’’- అన్నాడు. కొద్ది సేపటి తర్వాత, గాయపడ్డ వ్యక్తికి ఆసుపత్రిలో మంచి వైద్యం లభించింది. ఆ సాయంత్రం కళ్లు తెరవగానే, సహాయపడ్డ యువకుడు కనబడ్డాడు. గాయపడ్డ వ్యక్తి నమస్కరించి ‘‘డాక్టర్ గారూ! మీరే నన్ను కాపాడారు. లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇచ్చారు’’ అని చెబుతుంటే ఆ యువకుడు వారించాడు. ‘‘క్షమించాలి. నేను డాక్టర్ను కాను. మీ నోట్లో పెట్టింది నా షర్ట్ బటన్! మీకు ధైర్యం చెప్పడానికీ, ఆత్మవిశ్వాసం పెంచడానికీ అలా చేశాను’’ అని అన్నాడు. దీన్నే ‘‘ప్లాసిబో ఎఫెక్ట్’’ అంటారు. ఏది ఏమైనా, మనిషిని, మానవత్వాన్ని బతికించుకోవడం మన లక్ష్యం కావాలి!!
Also read: శాస్త్రజ్ఞులూ, నాస్తికులూ మానవతావాదులే!
Very useful article this is the story of time
Excellent . Describe humans mentality.