Sunday, November 24, 2024

పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?

అవును. కొన్నేళ్ళుగా రాజకీయ పార్టీల పతనాన్ని వేగిరం చేసినందుకు ప్రశాంత్ కిషోర్ (పీకే)కి ధన్యవాదాలు చెప్పాలి. ఒక దశాబ్దకాలంలోనే వివిధ రాష్ట్రాలలో ఆరు రాజకీయ పార్టీలకు పని చేయడం ద్వారా రాజకీయపార్టీల నాయకత్వంలో ఏదో లోపం ఉన్నదనీ, నాయకత్వ స్థానంలో ఏదో శూన్యత ఉన్నదనీ పీకే చాలా సమర్థంగా నిర్ధారించారు. ఇది నిజంగా చింతించవలసిన విషయం. పీకే సైతం ప్రధాని కావచ్చునంటూ కొందరు మాట్లాడుతున్నారంటే రాజకీయ నాయకత్వంలో శూన్యం ఎంత స్పష్టంగా  ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘంగా ప్రజలను వేధించిన కోవిడ్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ ప్రవీణుడి సేవలు ఉపయోగించుకోవాలని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే, గుజరాత్ లో పీకే చేసిన మొదటి పని పిల్లలకు బలవర్థక ఆహారం అందేవిధంగా చర్యలు తీసుకోవడం. ఆ తర్వాతనే ఎన్నికల నిర్వహణలో అతని ప్రావీణ్యం ఉపయోగించుకున్నారు.

Also read: పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది

పీకేకోసం వెంపరలాట

తమ తమ రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పీకే సేవలు వినియోగించుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏదో ఒక రాష్ట్ర రాజధాని నుంచి దిల్లీలో ఉన్న నాకు ఒక సంపాదకుడు ఫోన్ చేసి ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడి ఫలానా పార్టీకి పని చేయడానికి ఒప్పించగలరా అని నాలుగేళ్ళ కిందట అడిగినప్పుడు పీకే కి ఎంత గిరాకీ ఉందో అర్థమైంది. 2021 ఎన్నికలలో మమతాబెనర్జీ, ఎంకె స్టాలిన్ గెలుపొందడంతో పీకే కోసం ప్రయత్నిచేవారి క్యూ  మరింత పెరుగుతుంది. ఇక మీదట రాష్ట్రాల ఎన్నికలలో పని చేయబోనని పీకే నిర్ద్వంద్వంగా ప్రకటించినా సరే అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించేవారు ఉంటారు. తాను పోషించిన భూమికను రాజకీయ నాయకులు అతిగా ఊహించుకుంటున్నారని పీకే సైతం గ్రహించి ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమాలతో, విశిష్టమైన వైఖరితో, నిర్దిష్టమైన ఉనికితో, ఆదర్శవంతమైన నడవడికతో పార్టీని బలంగా నిర్మించుకునే బదులు పీకే కోసం, ఆయన నాయకత్వంలోని ఐ-ప్యాక్ (I-PAC-ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కోసం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు వెంపరలాడుతున్నారు. మౌలికమైన ప్రశ్న గురించి ఆలోచించడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ప్రజానాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నమమత, స్టాలిన్ ల ప్రతిష్ఠను ఏమాత్రమైన పీకే పెంచగలిగారా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 2019లో పీకే చేసి చూపించిన గారడీ ఎటువంటిదంటే అందులో ఉన్న ఇబ్బందులను మరచిపోవడం అసాధ్యం.

Also read: చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి

ఏమైనా తేడా కనిపించిందా?  

ఒక రాజకీయ వ్యూహకర్తకు ఎన్నికల ప్రణాళిక రచన, అమలు అప్పగించడం (భారీ ఫీజు వసూలు చేస్తారు, పూచీ మాత్రం బొత్తిగా ఉండదు) వల్ల ఏమైనా అదనపు ప్రయోజనం కలిగిందో లేదో పరిశీలించవలసిన సమయం ఇది. ఎన్నికల ప్రజాస్వామ్యంలోని కీలకమైన అంశాల ప్రాతిపదికగా చూస్తే 2019లో ఆంధ్రప్రదేశ్ కానీ 2017లో పంజాబ్ కానీ భిన్నమైన ఫలితాలు ఇచ్చేవి కావు. ఇప్పుడు 2021 సంగతి ఏమిటి? పశ్చిమబెంగాల్, పంజాబ్ లో జరిగిన కిందటి ఎన్నికల కంటే  పరిస్థితి దిగజారి పోయిందని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. విజేతలు చెప్పిన అంశాలనే ఉటంకించిన ఈ నివేదిక మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది.

Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?

ప్రజాప్రతినిధుల ప్రమాణాలు పెరిగాయా?

ఇప్పుడు విజేతలు భిన్నంగా ఉన్నారా? నేరస్థ నేపథ్యం కానీ నడమంత్రపు సిరి కలిగిన కుటుంబాల నుంచి రావడం కానీ చూస్తే ఇప్పటి విజేతలు మెరుగైన నాయకులని చెప్పజాలం. బయటి సంస్థకి ఎన్నికల వ్యూహాన్ని అప్పజెప్పడం వల్ల ఎన్నికల ప్రచారం ప్రమాణాలు ఏమైనా పెరిగాయా? ఏమీ లేదు. ఎన్నికల ప్రచారం లోగడ కంటే హోరాహోరీగా, పోటాపోటీగా, నేలబారుగా, నీచంగా సాగింది. పెక్కు విధాలుగా సమాజంలో ఇదివరకు లేని కొత్త చీలికలూ, విభేదాలూ తెచ్చింది. నిజానికి, ఎన్నికల ప్రచారం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. చెప్పిందే చెప్పడం, సోది ఎక్కువ అయింది. సంక్షేమ పథకాల పేరిట ఉచితాలూ, కానుకలూ శ్రుతిమించాయి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు ఇదివరకటి కంటే  న్యాయంగా, శాంతియుతంగా,స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా చెప్పగలరా? భారీ మెజారిటీతో గెలిచిన పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు లోగడ ప్రభుత్వాలకంటే మెరుగుగా ఉన్నాయా? లేదు. పాతకాలం నాటి చేదు అనుభవాలే కొనసాగుతున్నాయి. పైగా సమాజంలో చీలికలూ, ప్రతీకార రాజకీయాలూ వేళ్ళూనుకున్నాయి.

నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్

ఇరకాటంలో నితీష్ కుమార్

బిహార్ ఎన్నికలలో గెలుపొందడానికి సహాయం చేశారన్న కృతజ్ఞతాభావంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన పార్టీ జనతాదళ్ (యునైటెడ్)కి ఉపాధ్యక్షుడిగా నియమించారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నితీష్ కు రాజకీయ వారసుడుగా పీకే ఉండిపోతారేమోనని కొందరు అనుకున్నారు.  పార్టీలో సంవత్సరాల తరబడి ఉంటూ సేవలు చేస్తున్నవారు దీంతో మనస్తాపానికి గురైనారు. చేరిన తర్వాత కొద్ది రోజులకే ప్రశాంత్ కిషోర్ పార్టీని వీడి నితీష్ కుమార్ నాయకత్వానికి  ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించారు. అదంతా ఇప్పుడు మరచిపోయారనుకోండి.

Also read: ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?

రాజకీయ పార్టీలు ఈ విధంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతను బయటి సంస్థలకు అప్పగించుకుంటూ పోతే వచ్చే రోజుల్లో నాయకులు ఎక్కడినుంచి వస్తారని నేను నా పుస్తకం ‘‘రిజునవేటింగ్ ద రిపబ్లిక్ (Rejuvenating the Republic)’’లో చర్చించాను. ఎందుకంటే ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ ఉత్సాహపరచి, వారికి ప్రేరణ ఇచ్చి, పార్టీకి పేరుప్రతిష్ఠలు తెచ్చి, పార్టీకి ఫలానా కార్యక్రమం, సూత్రాలూ ఉంటాయని నమ్మకం కలిగించి, బలపరిచి, ప్రణాళికను తయారు చేసుకొని, అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఎన్నికల పోరాటానికి సిద్ధమయ్యేవారే నాయకులు. కానీ ఈ బాధ్యతలన్నిటినీ వెలుపలి సంస్థకు అప్పగిస్తే, పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేసే బాధ్యత సైతం బయటి సంస్థకే అప్పగిస్తే,  ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ జవాబుదారీ కాకుండా వ్యవహరిస్తే నాయకులు కేవలం బ్రాండ్ నేమ్ గా, నామమాత్రవశిష్టంగా మిగిలిపోతారు. కొన్ని పార్టీలలో ఈ తంతు జరిగిన మాట వాస్తవం కాదా?

Also read: మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?

వ్యూహకర్తే ముందుపీటీ ఆటగాడైతే…

వెనుక గదిలో అజ్ఞాతంగా ఉంటూ సాయం చేయవలసిన వ్యూహకర్త అగ్రశ్రేణి క్రీడాకారుడైతే , ఈ వ్యూహకర్త తమ పార్టీకి విజయం సాధించబోతున్నాడని ఆ  పార్టీ నాయకుడే కార్యకర్తలకు చెబితే, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యూహకర్తదే నిర్ణాయకపాత్ర అయితే, పార్టీలో చేరవలసిందిగా ఇతర పార్టీల నాయకులకు వ్యూహకర్తే చెబితే (గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలీరోని తృణమూల్ కాంగ్రెస్ లో చేరమని ప్రశాంత్ కిషోర్ అడిగినట్టు మాజీ ముఖ్యమంత్రి స్వయంగా విలేఖరుల గోష్ఠిలో చెప్పాడు), ఎన్నికల ప్రచారంలో సైతం ఆయనదే పెత్తనం అయితే, అదే విషయాన్ని పార్టీ నాయకుడు సగర్వంగా బహిరంగంగా చెబుతుంటే ఇక నాయకులు ఏమి చేస్తారు? వ్యూహకర్తే పార్టీ ఎన్నికల వ్యూహాన్నీ, ప్రచారవ్యూహాన్నీ నిర్ణయిస్తారు. ఏయే నినాదాలు చేయాలో, ఏ పాటలు ప్రచారరథం వెంట ఉండే వాహనాలలో వినిపించాలో, ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలో, ఎవరు ఎక్కడ ఉండాలో, ఏమి చేయాలో, బూత్ స్థాయిలో కార్యక్రమాలను చక్కబెట్టడం ఎట్లాగో, మీడియా ప్రతినిధులతో ఏమి మాట్లాడాలో, మీడియా యజమానులతో ఎట్లా వ్యవహరించాలో… సర్వం వ్యూహకర్త, ఆయన మనుషులే నిర్వహిస్తే పార్టీ నాయకులకూ, కార్యకర్తలకూ పని ఏముంటుంది?

ఫ్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ

వ్యూహకర్తే సర్వస్వం అయితే…?   

మరో పుస్తకంలో పీకే పని చేసిన రాష్ట్రంలో పరిస్థితిని చర్చించాను. గెలిచి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా కూడా ఆ పాలకపక్షం నాయకుడితో వ్యూహకర్త సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ సంగతి సదరు నాయకుడు బహిరంగంగానే సగర్వంగా చెబుతున్నారు. తన విజయంలో పీకే పాత్ర గురించి సభాముఖంగా విజేత చెప్పుకుంటున్నారు. ఆ రాష్ట్రం ఇదివరకటి కంటే (కులాలూ, మతాల పేరిట) ఎక్కువగా చీలిపోయింది. శాసనసభ్యులకు ప్రజల పట్ల, వారి అవసరాల పట్ల ఎటువంటి పూచీ లేదు. ఆ రాష్ట్రంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు నాయకుడి చెప్పుచేతల్లో ఉంటున్నాయి. పీకే అండగా ఉండగా చీకూచింతా ఎందుకు దండగ అని ఆ నాయకుడు భావిస్తున్నారు. నాయకత్వంలో వంకర దారులను సూచించినందుకు పీకేను విమర్శించడం కాకుండా అతడిని ధన్యవాదాలు చెప్పాలి.

ఇదే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ ఏమి కావాలి?

వచ్చే ఒకటి, రెండు దశాబ్దాలలోనూ ఈ ధోరణే కనుక కొనసాగితే మన ఎన్నికలూ, ప్రజాస్వామ్యం, ప్రజాప్రాతినిధ్యం ఏమవుతాయి? నాయకత్వ స్థాయిలో శూన్యం ఏర్పడలేదని ఎవరైనా చెప్పగలరా? దాని దుష్ఫలితాల గురించి కాదనగలరా? భారత రిపబ్లిక్ కు 2050లో వందేళ్లు వచ్చే సమయానికి ‘‘ప్రజలు అనే మేము…’’ అని చెప్పుకునే రిపబ్లిక్ గా బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి నేను కొద్ది వారాల కిందట విడుదల చేసిన మోనాగ్రాఫ్ ‘‘ప్రపోజిషన్స్ ఫర్ అవర్ రిపబ్లిక్ ఎట్ 100 ఇన్ 2050 (2050లో వందేళ్ళు నిండబోయే మన రిపబ్లిక్ కోసం కొన్ని ప్రతిపాదనలు)’’ లో సూచించాను. వీటిలో దేన్ని అమలు చేయాలన్నా రాజ్యాంగాన్ని సవరించవలసిన అగత్యం లేదు.

(డాక్టర్ భాస్కరరావు ప్రభుత్వ విధానాలపైన అధ్యయనం, పరిశోధన చేస్తూ 50 ఏళ్ళుగా విశ్లేషిస్తున్నారు. డజనుకుపైగా గ్రంథాలు రచించారు.)   

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

5 COMMENTS

  1. బాగా విస్లెషించారు. ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ అయినట్టే, పార్టీలు కూడా అవుతున్నాయి.

  2. Political leaders do not trust themselves .In political market,In trading of democracy they know their inefficiency and their malicious plans to win elections.so they approach political black magicians and MrPk is a good political occultist So morally weak politicians who are uncommitted to democratic values will invite such persons,He is not committed to any doctrine or party only a paid election Guru , by mistake an innocent may say it is political p ….,ping,let’s dream for good feature to experience clean poetics and criminal free legislators

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles