- 30 డిజైన్ల 20 రంగులు 819 రకాలతో బతుకమ్మచీరల పంపిణికి సిద్దం
- ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరిన బతుకమ్మ చీరలు
- 96,24,384 లక్షల మందిక మహిళలకు బతుకమ్మ చీరలు
- హుజురాబాద్ ఉపఎన్నికల దృష్ట్యా కోన్ని ప్రాంతాల్లో పంపిణీపై సందిగ్థత
- బతుకమ్మ చీరల కోసం రూ. 333.14 కోట్లు ఖర్చు చేస్తూన్న కేసీఆర్ సర్కార్
బ్రతుకమ్మ పండగ సందర్బంగా మహిళలకు పంపిణీ చేసే చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు చేరాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు సిద్ధం చేస్తూన్నారు. అక్టోబర్ 2 నుంచే చీరల పంపిణీకి సన్నాహాలు చేశారు. ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగుల తో అన్వయించి విస్తృత శ్రేణిలో మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ చీరలన్నీ జరీ అంచులతో తయారు చేయబడిన 100% పాలిస్టర్ ఫిలిమెంట్ / నూలు తో తయారు చేయించారు. 6.30 మీటర్ల పొడవుగల ఒక కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించారు. సదరు ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 333.14 కోట్లు కేటాయించడమైనది. మెప్మా(MEPMA), సెర్ప్ (SERP) క్రింద స్వయం సహాయక బృందాల మహిళా ప్రతినిధులు నుండి అభిప్రాయాలూ, సలహా సంప్రదింపుల ఆధారంగా, నిఫ్ట్ డిజైనరులతో సరైన డిజైన్ పాటర్న్ లతో మరియు ప్రామాణికములతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరల నూతనంగా డాబీ/జాకార్డ్లు డిజైనులతో ఉత్పత్తి చేశారు.
బతుకమ్మ చీరల పథకం 2017 సంవత్సరము నుండి రాష్ట్రంలోని 18 సంవత్సరములు పైబడి ఆహార భద్రత కార్డ్ క్రింద నమోదు కాబడిన మహిళలకు చీరలను బహుమతిగా పంపిణీ చేయుటకు తెలంగాణ ప్రభుత్వంనిర్ణయంచినది.
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం మరమగ్గాల నేత పని వారికి కూలీల పెంపుదల ద్వారా నిరంతరం పని కల్పిస్తూ వారి యొక్క జీవన స్థితిని, వారి నైపుణ్యమును మెరుగుపర్చుట తోపాటు తెలంగాణ అతిపెద్దయిన, మహిళలందరికీ ఇష్టమైన బతుకమ్మ పండుగ శుభదినాన, తెలంగాణ రాష్టంలోని మహిళలను ఒక బహుమతి ఇవ్వాలని సిఎం కేసీఆర్ భావించి ఈ పథకం ప్రవేశపెట్టారు. పథకం ప్రారంభమైన 2017 లో 95, 48,439 బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. 2018 లో 96,70,474 మందికి మహిళలకు 2019 లో 96,57,813 మహిళలకు 2020 లో 96,24,384 చీరలను ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా పంపిణి చేసింది. ఈ ఏడాది 96,24,384 లక్షల మందిక మహిళలకు బతుకమ్మ చీరలను బహుమతిగా అందించనుంది కేసీఆర్ సర్కార్.
సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాలలోని పేదరికం వల్ల ఆత్మహత్యలు జరిగేవి. వాటిని నివారించే విధంగా సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ లో గల 16,000 మంది నేత పనివారు, అనుబంధ కార్మికులకు నిరంతరంగా పని కల్పించుటకు గాను 20,000 పవర్లూమ్స్ మీద బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరము ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల కరీంనగర్, వరంగల్ జిల్లాలోని (373)మాక్స్ సంఘాలు / ఎస్.ఎస్.ఐ యూనిట్లలో 10,000 – 16,000 ఢాబీ/జకార్డు బిగించబడిన పవర్లూమ్స్ పైన ఈ చీరలు తయారు చేశారు.
చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా రూ. 300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండగా.. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది. దాదాపు 16 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి.
గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ.. పట్టణాలు, నగరాల్లో రేషన్ డీలర్, మున్సిపల్ బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకోవచ్చు. అయితే, చీరల పంపిణీ మీద 31 జిల్లాల్లో స్పష్టత వచ్చినా.. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక దృష్ట్యా కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది