Sunday, December 22, 2024

ఉత్తరకుమారుల విన్యాసం, ఉత్తరాంధ్ర విషాదం

హక్కుగా వాసికెక్కిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విక్రయించడానికి అంతా సిద్ధమవుతోంది. న్యాయ సలహాదారుల ఎంపిక ప్రక్రియ ముగింపు దశకు వచ్చేసింది. అది పూర్తి కాగానే మిగిలిన లావాదేవీలన్నీ చకచకా జరిగిపోతాయి. 100శాతం వాటాలను అమ్మివేయడానికి ఆర్ధికశాఖ తదుపరి కార్యాచరణ చేపట్టడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే న్యాయ సలహాదారుల ఎంపికలో భాగంగా,  ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఐదు సంస్థలతో కూడిన తుది జాబితాను కేంద్రం రూపొందించింది. ఈ నెల 30వ తేదీన నివేదికను సమర్పించమని ( ప్రెజెంటేషన్) ఆ సంస్థలకు కేంద్రం సమాచారం అందించింది. దాని తదనంతరం విక్రయ ప్రక్రియలో అడుగులు వేగంగా కదులుతాయని మార్కెట్ సమాచారం. ఇవ్వన్నీ ఒకపక్క జరుగుతూ ఉండగా, ‘ఉత్త’ర ప్రగల్భాలు’ పలికే నాయకుల చిత్తశుద్ధిని ప్రశ్నించకుండా ఎలా ఉంటాము?

Also read: కీలకమైన మోదీ అమెరికా పర్యటన

ఊకదంపుడు ఉపన్యాసాలు వ్యర్థం

మొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, నిన్న జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే స్వరం వినిపిస్తున్నారు. రాజీనామా ఆమోదం అంటూ ఏదో సాంకేతికమైన సాకు చెప్పి ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నంలో పదేళ్లకు పైగా చక్రం తిప్పిన మాజీ మంత్రి, నేటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా సైడ్ అయిపోయారు. ప్రారంభంలో కాస్త గట్టిగా నోరు చేసుకున్న మరో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కొత్త అంశాలపై గొంతెత్తున్నారు. ఎమ్మెల్సీ మాధవ్ వంటి విశాఖ ప్రాంత బిజెపి నాయకులు సైతం సద్దుమణిగి ఉన్నారు.  ప్రధానమంత్రికి ఉత్తరాల విన్నపాలు చేయడం, స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రానికి వివరించే నివేదికలు పంపడం మొదలైనవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి జరిగాయి. కానీ, ఇంతవరకూ ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. కొన్నాళ్ల పాటు బిజెపి తప్ప అన్ని రాజకీయ పార్టీలు హడావిడి చేశాయి. ప్లాంట్ ఉద్యోగ సంఘాలు, పరిరక్షణ వేదిక, ఉద్యమ సంఘాలు యథాశక్తి పోరాటం చేస్తూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ వాటాలను పూర్తిగా అమ్మివేయాలనే దృఢచిత్తంతో ఉన్న కేంద్రాన్ని ఆపే శక్తి ఎవ్వరి చేతుల్లో లేనట్లే కనిపిస్తోంది. రాజకీయమైన అవసరమో, ప్రజలంటే /ఓటర్లంటే భయమో, ఆర్ధిక స్వార్ధమో లేకపోతే ఏవీ జరగవు, ఏవీ ఆగవు అని అర్ధమవుతోన్న పాలనా కాలంలో మనం ఉన్నాం. ఇటువంటి  వాతావరణం నడుమ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగక తప్పదనే అర్ధం చేసుకోవాలి. ఉక్కు పరిశ్రమను దక్కించుకోడానికి దశాబ్దాల పాటు జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణ, మాన, ధన, భూ త్యాగాలన్నీ వృధాఅయిపోయే సమయంలోకి మనం వచ్చేశాం. ప్రాణ త్యాగానికి సిద్ధమై నిరాహార దీక్ష చేపట్టిన అమృతరావు గుంటూరు జిల్లావాసి. ఉత్తరాంధ్రకు సర్వం తానై నడిచిన తెన్నేటి విశ్వనాథం కృష్ణాప్రాంతీయుడు. విశాఖపట్నంకు వెళ్లి, ఆ ప్రజల్లో మమేకమైన గొప్ప నాయకుడు తెన్నేటి విశ్వనాథం. అన్ని ప్రాంతాల నాయకులు, విద్యార్థులు ఏకమై మహా సంగ్రామం చేశారు. అటువంటి మహనీయుల ఆధ్వర్యంలో ఉక్కు ఉద్యమం నడిచింది. అప్పటి  పాలకులకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, యావత్తు ఆంధ్రప్రజా బలంతో, తెలుగువాడి దమ్ము చూపించి, పెద్దల మెడలు వంచి, స్టీల్ ప్లాంట్ స్థాపన సాధించారు నాటి మహోన్నత నాయకులు. దివిటీ వేసి వెతికినా అటువంటి వారు నేడు ఒక్కరూ దొరకరన్నది సత్యం.

Also read: అమరశిల్పి అక్కినేని

పెద్దనాయకుల నిష్క్రియాపరత్వం విషాదం

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోడానికి పెద్ద నాయకులు ముందుకు రాకపోవడం విషాదం. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ముందుండి ఉద్యమాన్ని నడిపించే ఉంటే  కనీసం భావి చరిత్రలో కొంత పేరైనా దక్కించుకొనేవాళ్ళు. ఆ అవకాశాన్నీ కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం దక్కకుండా బిజెపితో ప్రయాణం వల్ల జనసేనకు ఒరిగే లాభం ఏముంది? దిల్లీ పెద్దలతో ఉండే సంబంధాలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపవచ్చుకదా? అని వైసీపి నాయకులు వేసే ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పలేని స్థితిలోనే పవన్ కల్యాణ్ ఉన్నారు. కేంద్ర పెద్దలతో యుద్ధం పెట్టుకుంటే.. ఏ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో  గళం గట్టిగా విప్పలేక పోతున్నారని వచ్చే విమర్శలకు చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఈ వైఖరులు చూస్తుంటే, ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంత బలంగా ఉందో ఓటర్లకు అర్ధమవుతోంది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ మేలుకోవాలి. తన నాయకత్వ పటిమను చాటుకోవాలి. నిన్నటి ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన విశాఖ ప్రాంతం కోసం నడుం కట్టాలి. ఓడిన చోటే గెలిచి చూపించాలి. ఇది ఆయనకు గొప్ప అవకాశం. చంద్రబాబునాయుడు సైతం పునరాలోచించాలి. రాజకీయాలకు అతీతంగా తమిళుల వలె పోరాటం చేసే సంప్రదాయం మనకు ఎలాగూ లేదు.కనీసం రాజకీయ స్వార్ధంతోనైనా, రాష్ట్రానికి చెందిన బడా నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి లేదా దిల్లీ పెద్దలను ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా చూడాలి. లేకపోతే అందరూ చరిత్రహీనులుగా మిగిలిపోతారు.నిబద్ధతలేని ఉత్త వాక్కులకు, ఉత్తర ప్రగల్భాలకు ఏమాత్రం విలువండదని తెలుసుకోవాలి.

Also read: అమరేంద్రుడి నిష్క్రమణ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles